Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 92


                                42
    
    "వీళ్ళేనా? అన్ని గదులూ వెతికారా?" సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను చూసి అడిగాడు డి.యస్.పి.
    "ఎస్సార్! ఎస్సై ఏడీ?" అంటూ సి.ఐ.  హెడ్డు కేసి తిరిగాడు.
    "వస్తున్నారు సార్?" హెడ్ యస్సై కోసం పరుగుతీశాడు.
    "ఎన్నాళ్ళుగా సాగుతోంది ఇది?" సి.ఐ.ని చూసి అన్నాడు డి.యస్.పి.
    "ఈ మధ్యనే మొదలు పెట్టారు సార్! మొదట్లో డీసెంటుగానే నడిపారు." బిక్కమొహం వేసి అన్నాడు సి.ఐ.
    డి.యస్.పి. మోహన్ రావు ముఖం చిట్లించాడు.
    "ఎస్సార్!" అన్నాడు సి.ఐ. తన అధికారి మనోభావాలను చదవడానికి ప్రయత్నిస్తూ.
    డి.యస్.పి గోడవారగా వున్న ఆరుగురు ఆడవాళ్ళకేసి ఎగాదిగా చూశాడు.
    "స్టైలు చూడండి! ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారో?" సి.ఐ. అన్నాడు.
    పోలీసుల మధ్య నిలబడివున్న వాళ్ళలో ఒకతె నవ్వింది. ఇద్దరు తలలొంచుకొన్నారు. మిగతా ముగ్గురూ ఏ భావమూ లేకుండా డి.యస్.పి. కేసి చూస్తూ నిలబడ్డారు.
    "వీళ్ళను చూస్తుంటే వీళ్ళ వయసుకూడా తెలియడంలేదే?" పెదవి విరిచాడు డి,యస్.పి.
    "అంతా మేకప్ సార్. కాలేజీ గరల్స్ లా, సినిమా స్టార్సు లా ఉంటారు సార్ వీళ్ళు! లైట్ వెలుతుర్లో అసలు సరుకు తెలియదు. తెల్లార్తే లొటారం బయటపడ్తది!"
    "ఇమ్మోరల్ ట్రాఫిక్ పెరిగిపోయిందయ్యా మన టౌన్లో." కాస్త ఆగిమళ్ళీ అన్నాడు "మన టౌను అనే ఏముందిగాని స్టేట్ అంతా అట్లాగే ఏడ్చింది."
    "అవునుసార్! పెద్దపెద్ద కుటుంబాలనుంచే వస్తున్నారు కొంతమంది. ఈ మధ్య ఫామిలీ గరల్స్ కూడా దిగిపోతున్నారు సార్!"
    "వీళ్ళేనా వుంది? ప్రొప్రయిటర్ ను కూడా స్టేషన్ కు పట్టుకురండి." డి.యస్.పి. చేతిబెత్తం తిప్పుకొంటూ కదిలాడు.
    నడవాలో నుంచి యస్సై రొప్పుకొంటూ వచ్చి డి.యస్.పి ముందు నిలబడ్డాడు.
    "సార్.....ఆ కార్నర్ గదిలో.....ఇంకొక....ఉంది.....సార్!" అది అనాలో ఆమె అనాలో తట్టక వదిలేశాడు.
    డి.యస్.పి. ఆగి యస్సైకేసి ఉరిమి చూశాడు.
    "వాటర్యూ టాకింగ్? వై డోంట్ యూ బ్రింగ్ హర్?"
    "హైక్లాసుగా మాట్లాడుతోంది సార్!"
    "మాట్లాడితే వదిలేసి వచ్చావా? వాట్ ఏ స్టుపిడ్ యూ ఆర్?"
    "చాలా ఇన్ ఫ్లుయన్స్ ఉన్న మనిషిలా ఉంది సార్?"
    "ఇన్ ఫ్లుయన్స్! ఇన్ ఫ్లుయన్స్! రంకుతనానికి కూడా రికమండేషనా? ఏ మినిష్టరు దగ్గర్నుంచి తెప్పించిందటా?"
    "నా ఉద్యోగం పీకేయిస్తుందట. మహా పొగరుగా మాట్లాడుతోంది సార్!" నీళ్ళు నమిలినట్టు అన్నాడు యస్సై.
    "ఛప్! ముందా లంజను జుట్టుపట్టుకొని లాక్కురండి. సి.ఐ నువ్వెళ్ళు." డి.యస్.పి. గర్జించాడు.
    సి.ఐ.వెనకే యస్సై నడిచాడు.
    డి.యస్.పి. ఏమీ తోచక ఒకళ్ళనొకళ్ళు ఒరుసుకొని నిలబడ్డ వాళ్ళకేసి చూడసాగాడు.
    "ఏయ్! నిన్నే? నీ పేరూ?"
    "సావిత్రి!" గొంతు పెకలించుకొని చెప్పింది.
    "ఊరూ?"
    "బెజవాడదగ్గర."
    "ఏమాత్రం సంపాదిస్తావ్?"
    "సావిత్రి మాట్లాడలేదు."
    "మాట్లాడవేం?" డి.యస్.పి. గర్జించాడు. చేతిలో బెత్తం గాల్లో గుండ్రంగా తిరిగింది.
    "గది అద్దె, ఖర్చులూ పోను ఎక్కువేం మిగల్దు!" సావిత్రి పక్కన నిలబడ్డఅమ్మాయి చెప్పింది.
    "నీ పేరేంటి?"
    "అనసూయ మాది రాజమండ్రి?"
    "నువ్వో?" మూడో ఆమెకేసి చూశాడు.
    "చంద్రమతి. నెల్లూరు!"
    "నా పేరు దమయంతి. ఏలూరు." అడగందే చెప్పింది యాంత్రికంగా దమయంతి.
    "సావిత్రి! అనసూయ! చంద్రమతి! దమయంతి! మీకేం రోగం వచ్చిందే ముండల్లారా? అంతా పతివ్రతలపేర్లు పెట్టుకొన్నారు?"
    "మేం పెట్టుకొన్నామేంటి? మా అయ్యా అమ్మా పెట్టుకొన్నారు." సాగదీసింది సరస్వతి. డి.యస్.పి కేసి చూసి కిసుక్కున నవ్వింది.
    "అమ్మా! నీ యమ్మ.....పెద్ద కిలాడీలు గున్నావే? ఏ ఊరూ?"
    "కాకినాడ!"
    "ఏయ్! నువ్వేమిటి? అసలు మాట్లాడవేం?" ఆరోదానికేసి చూస్తూ అన్నాడు డి.యస్.పి.
    ఆ అమ్మాయి అందరికంటే చిన్నదిగా వుంది. పద్దెనిమిదేళ్ళకంటే దాటినట్టు లేవు. ముడుచుకుపోయి ముఖం గోడవైపుకు తిప్పుకొని నిలబడింది.
    "ఏం? నంగనాచీ? మాట్లాడవేం?" బెదిరిస్తున్నట్టు అన్నాడు డి.యస్.పి.
    కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. ముక్కులు చీదుకొని మళ్ళీ బావురుమంది.
    "లక్ష్మీ ప్రసూనాంబ. పాపం కొత్త! మొన్ననే వచ్చింది. బందరుదగ్గిర వాళ్ళ ఊరు," బెజవాడ సావిత్రి సర్ది చెప్పింది.
    "ఎక్కడోయ్ అదీ!" తనను సమీపిస్తున్న సి.ఐ.ని ఉద్దేశించి అడిగాడు డి.యస్.పి.
    "ఆవిడా.....?" ఆగిపోయాడు సి.ఐ.
    "పతివ్రతనంటుందా?" వెటకారంగా అన్నాడు డి.యస్.పి.
    "కాదు సార్!"
    "ఏమిటి కాదు? నీ కేమిటి అభ్యంతరం? నీ బంధువా? పాత కాతా? ఆ? ఏం?"
    "నాకేమీ కాదు సార్! మీ  బంధువేనంట!" అని సి.ఐ. గాలి బిగబట్టి ఆఫీసరుకేసి చూశాడు.
    "ఠాఠ్! ఎవతోయ్ అదీ? జుట్టు పట్టుకొని లాక్కురండి!" వళ్ళు తెలియని కోపంతో అన్నాడు డి.యస్.పి.
    "మీ తాలూకు మనిషినని చెప్తుంది సార్! మా డి.యస్.పి. గారితో చెప్పి మీ అంతు తేలుస్తానని బెదిరిస్తోంది సార్!" యస్సై అదును చూసుకొని అన్నాడు.
    డి.యస్.పి.కి అవమానంతో వళ్ళు దహించుకుపోసాగింది.
    "ఎక్కడా? ఏగదిలో?" డి.యస్.పి. నేలను బూట్లతో తంతూ ముందుకు నడిచాడు.
    "పదమూడో నంబరు గది. ఇటు సార్. హోటల్ రిజిష్టర్లో పేరులేదు. మహ తల బిరుసుగా మాట్లాడుతోంది." డి.యస్.పి వెనకే నడుస్తూ చెబుతున్నాడు సి.ఐ.
    డి.యస్.పి బూటు శబ్దం చేసుకొంటూ గది ముందు కొచ్చి తలుపులు 'ధబీ! ధబీ!' బాదాడు.
    కొద్ది క్షణాల్లో తలుపులు తెరుచుకొన్నాయి.
    డి.యస్.పి మోహనరావు స్తంభించిపోయాడు! స్థాణువులా నిలబడి పోయాడు. ప్రాణంలేని మట్టిబొమ్మలా నిలబడ్డ వరూథినికి మోహనరావు ను చూడగానే ప్రాణాలు తిరిగొచ్చాయి. ఆమె ముఖం ఆశల్తో వెలిగిపోయింది.
    "నువ్వా? ఇక్కడేం చేస్తున్నావ్?" మోహన్ రావు గొంతు పెకలించుకొని అన్నాడు.
    "మీ కోసమే వచ్చాను."
    సర్కిలూ, యస్సై వెనక్కు జరిగి వీలయినంత దూరంగా పోయి నిలబడ్డారు.
    "యూ ప్రొసీడ్ మీరు కానియ్యండి." వెనక్కు తిరిగి సి.ఐ.తో అన్నాడు మోహనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS