Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 92


                                        కుంగ్ ఇ-చీ

    లూచెన్ లోని మద్యశాలలు చైనాలోని ఇతర ప్రాంతాల
    మద్యశాలలు వంటివి కావు. వీథి కెదురుగా ఒక సమకోణపు
    వేదిక వీటి అన్నిటి ప్రత్యేక లక్షణం. అక్కడ ఎప్పుడూ
    మద్యాన్ని వేడి చెయ్యడానికి ఉడుకునీరు తయారుగా
    ఉంటుంది. మధ్యాహ్నంగాని, సాయంత్రంగాని తీరిక దొరికిన
    పనివాళ్ళు ఒక పాత్రనిండా మద్యం కొంటారు దాని
    ఖరీదు ఇరవైఏళ్ళ క్రితం నాలుగు నగదు. కాని ఇప్పుడది
    పది నగదు. వేదికకు పక్కగా నిల్చుండి వేడి వేడి
    మద్యాన్ని సేవిస్తూ సేదదేరుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు
    మరొక్క నగదుకి ఒక పళ్ళెం నిండా ఉప్పుతో ఉడికించిన
    వెదురు చిగుళ్ళుగాని, మసాలా చిక్కుళ్ళుగాని దొరుకుతాయి.
    మద్యానికి అనుపానంగా పన్నెండు నగదు పెడితే మాంసం
    కూర దొరుకుతుంది. అయితే ఈ వచ్చేవాళ్ళలో చాలామంది
    పొట్టికోట్ల తరగతికి చెందినవాళ్ళు. ఎక్కువ డబ్బున్నవాళ్ళు
    కారు. పొడుగు గౌన్ల వాళ్ళు మాత్రమే పక్క గదిలోకి వెళ్ళి
    సావకాశంగా కూర్చుండి మద్యమూ మాంసం కూడా
    తీసుకుంటారు.
    నా పన్నెండోయేట ఊరికి ప్రవేశ ద్వారం వద్దనున్న షియెన్ హెంగ్ మద్యశాలలో మద్యం అందించేవాడిగా పనికి కుదురుకున్నాను. పొడుగు గౌన్ల వాళ్ళకి సేవచేయగల తెలివితేటలు నాకు లేవని మద్యశాల యజమాని బయట గదిలోకి నన్ను బదలాయించాడు. పొట్టికోట్ల ఖాతాదార్లకు సంతృప్తి పరచడం చాలా సులభమేగాని వాళ్ళలో కూడా కొంతమంది పేచీ కోర్లుంటారు. అన్నీ తామే స్వయంగా తమ కళ్ళతో చూసి తీరాలంటారు. జాడీలోంచి పసుపు పచ్చని మద్యాన్ని కాడ గరిటెతో తియ్యడం మొదలు మద్యపు జాడీ అడుగున నీళ్లేమయినా ఉన్నాయేమో అని చూసి. మద్యపాత్రను వేడినీళ్ళలో ముంచేదాకా అన్నీ కనిపెడతారు. అటుంటి విషమ పరీక్షలో మద్యాన్ని పలచన చెయ్యడం అతికష్టం. అందుచేత కొన్నాళ్ళకి మా యజమాని నేనప్పుడు చేస్తున్న పనికి తగనని నిశ్చయించాడు. అదృష్టవశాత్తు నాకో పలుకుబడిగల వ్యక్తి సిఫారసు ఉంది కాబట్టి పనిలోంచి నన్ను బర్తరపు చెయ్యలేకపోయాడు. అందుకు బదులుగా మద్యాన్ని వేడిచేసే నిరుత్సాహపు పనిలోకి నన్ను బదలాయించాడు.  
    అప్పటినుంచీ నేను రోజు పొడుగునా వేదిక వెనుక నిలబడి పూర్తిగా నా కొత్త విధులలో నిమగ్నుడినయ్యాను. ఇది యజమానికి సంతృప్తి కలిగించినా నాకు మాత్రం విసుగుపుట్టించేది. నిష్ప్రయోజనం అనిపించేది. యజమాని భీకర స్వరూపుడూ, ఖాతాదార్లు మూడు మొగాల వాళ్లూ కావడంచేత సరదాగా ఉండడమనేది అసంభవమయింది. ఎప్పుడేనా కుంగ్ ఇ-చీ మద్యశాలకి వచ్చాడంటే అప్పుడు మాత్రమే నవ్వులేమయినా వినబడేవి. అందుకే అతనంటే ఇప్పటికీ నాకు జ్ఞాపకం.
    పొడుగు గౌన్ల ఖాతాదార్లలో కుంగ్ ఒక్కడే నిలుచుండి మద్యం సేవించేవాడు. మనిషి భారీగా ఉంటాడు. ముడతలు మొగంలో తరచుగా గంట్లు కనిపించేవి. గజిబిజిగా ఉన్న పొడుగాటి గడ్డంలో తెల్లచారలెక్కువ. పొడుగు గౌను ధరిస్తాడేగాని అది చింకిగా మురికిగా ఉండి పదేళ్ళ యీమధ్య చాకంటికి వేసినట్టుగాని మరమ్మత్తు చేసినట్టుగాని కనిపించదు. పాతకాలపు భాష మాట్లాడుతుంటాడు కాబట్టి అతడు చెప్పేదానిలో సగానికి సగం ఎవ్వరికీ అర్థంకాదు. అతడు కొట్టుకి వచ్చినప్పుడల్లా అందరూ అతణ్ని చూసి కిలకిల నవ్వుకుంటారు.
    ఒకడంటాడు కదా! "కుంగ్ ఇ-చీ? నీ మొగం మీద కొత్తగంట్లు కనబడుతున్నాయి" అని.
    నిర్లక్ష్యంగా కుంగ్ గల్లా వేదిక సమీపించి రెండు పాత్రల వేడిచేసిన మద్యమూ, ఒక ప్లేటు మసాలా చిక్కుళ్లూ కావాలంటాడు. తొమ్మిది నగదు బైటికి తీస్తాడు.
    "మళ్ళీ దొంగతనం చేశావన్నమాట." అని ఎవరో ఒకడు కావాలని గొంతు హెచ్చింది గట్టిగా అరుస్తాడు.
    కుంగ్, కళ్ళు పెద్దగా తెరిచి, "నిష్కారణంగా ఒక పెద్దమనిషి పేరు చెడగొట్టడం దేనికి?" అంటాడు.
    "ఏమిటా పేరు? నిన్నగాక మొన్న హోగారి యింట్లో పుస్తకాలు దొంగిలిస్తే నిన్ను నిలువునా వేలాడదీసి బాదుతుండడం నా కళ్ళతో చూశాను!"
    అప్పుడు కుంగ్ రెచ్చిపోతాడు. నుదుటిమీద రక్తనాళాలు పాటమరిస్తాయి. "ఒక పుస్తకం తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుంది? ...పుస్తకం తీసుకోవడం చదువుకున్నవాడి వ్యవహారం. అది దొంగతనం అనిపించుకోదు" అంటూ వాదిస్తాడు. అక్కడనుంచి ప్రారంభమవుతాయి. పాత గ్రంథాల లోంచి ఏరితీసిన పసిడి పలుకులు "పురుషోత్తముడికెప్పుడూ దారిద్ర్యంలోనే సంతృప్తి" వంటివి ఇంకా ఎన్నో ఎవరికీ అర్థంకాని కలగాపులగపుపటాటోపపు మాటలు. అంతలో అందరూ గొళ్ళున విరగబడి నవ్వుతారు. మద్యశాలంతా ఆనందమయమవుతుంది.
    ఇదివరలో నేను విన్నదాన్నిబట్టి కుంగ్ ఇ-చీ ప్రాచీన గ్రంథాలయితే చదివాడు గాని పరీక్షలో ఎన్నడూ ఉత్తీర్ణుడు కాలేదట అందుచేత బతుకుతెరువేమీ తోచడం లేదు. అలా అలా దరిద్రం పెరిగిపోయి ఆఖరికి దాదాపు బిచ్చమెత్తుకొనే స్థితికి దిగజారాడు. కాని, అతనికి మంచి దస్తూరీ ఉన్నందుచేత నకళ్ళు రాసుకుంటూ జీవనోపాధి చూసుకునేవాడు. దురదృష్టవశాత్తూ అతనో త్రాగుబోతు. సోమరిపోతు. ఈ దుర్వ్యసనాలపట్ల కొద్దిరోజుల్లోనే, దొరికిన పుస్తకాలు, కాగితాలు, కుంచెలు, సిరాకాయలు తీసుకొని ఊళ్లోంచి మాయమయిపోయేవాడు. ఇలా చాలాసార్లు జరిగేసరికి ఇకనెవరూ అతణ్ణి నకళ్ళు రాయడానికి పిలిపించలేదు. అంతలో అతను చిన్న చిన్న దొంగతనాలు చెయ్యక తప్పింది కాదు. మా కొట్టులో మాత్రం అతని ప్రవర్తన నిర్దుష్టంగా ఉండేది. చేసిన అప్పులన్నీ తీర్చేస్తుండేవాడు. అయితే అప్పుడప్పుడు చేతిలో సిద్ధంగా డబ్బుండకపోవడం వల్ల. బాకీదార్ల జాబితా బల్లమీది అతని పేరు కూడా ఎక్కేది. అయితే ఒక నెల తిరక్కుండానే అతను విధిగా ఎప్పుడూ బాకీ చెల్లించేవాడు. అప్పుడు బల్లమీద అతని పేరు తుడిచెయ్యటం జరిగేది.
    మద్యపాత్రలో సగందాకా సేవించేసరికి కుంగ్ మళ్ళీ స్థిమితపడతాడు. ఇంతట్లోనే ఎవరో అతణ్ణి, "కుంగ్ ఇ-చీ! నిజంగానే నీకు చదవడం వచ్చునా?" అని అడుగుతారు.
    అటువంటి ప్రశ్న కన్నా అవమానం ఏముంటుందన్నట్లు కుంగ్ చూస్తాడు. అయితే నువ్వు అట్టడుగు పరీక్షలో కూడా నెగ్గలేకపోవడానికి కారణమేమి"టని మరొకరు ప్రశ్నిస్తారు.
    దానితో కుంగ్ ఇబ్బంది పడిపోతాడు. నిస్త్రాణగా చూస్తాడు మొగం పాలిపోతుంది. పెదవులు కదిలిస్తాడు గాని అవి ఉచ్చరించే పాతపుస్తకాల మాటలెవరికి బోధపడవు. అప్పుడందరూ హాయిగా విరగబడి నవ్వుతారు. మద్యశాలలో మళ్ళీ అనందం వెల్లివిరుస్తుంది.
    అటువంటి సమయాలలో నేనూ కొందరితో కలిసి నవ్వుతారు. యజమాని అందుకు కోపగించుకోడు. నిజానికతడే కుంగ్ ను రెచ్చగొట్టే ప్రశ్నలు వేసి అందరిచేతా నవ్విస్తాడు. ఇక వాళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదని కుంగ్ మా కుర్రవాళ్ళతో కబుర్లకి దిగుతాడు. ఒక మారతను నన్ను "నువ్వెప్పుడైనా బడిలో చదువుకున్నావా?" అని అడిగాడు.
    ఔనన్నట్లు నేను తల ఊపితే "సరే ఇప్పుడు నిన్ను పరీక్షిస్తాను. మసాలా చిక్కుళ్ళలో మసాలా అనే అక్షరాలు రాసి చూపించు" అంటాడు కుంగ్.
    "ఈ బిచ్చగాడు నన్ను పరీక్షించడమా?" అనుకుంటాన్నేను. అతనివైపు చూడను నిర్లక్ష్యం చేస్తాను. కొంతసేపు ఆగి తర్వాత నా మంచితనంతో కోరుతున్న వాడిలాగ కుంగ్ "నువ్వు రాయలేవుకదూ? నేను చూపిస్తాను చూడు. బాగా గుర్తుపెట్టుకో. ఇలాంటి అక్షరాలను నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే, రేపొద్దుట నువ్వు సొంత కొట్టు తెరిచినప్పుడు వాటి అవసరం నీకు తెలుస్తుంది" అంటాడు.
    నాదంటూ ఒక సొంత కొట్టు ఇంకా చాలాదూరంలో ఉందనిపించింది నాకు. పైగా ఆ యజమాని ఖాతా పుస్తకంలో మసాలా చిక్కుళ్ళ నెప్పుడూ చేర్చాడు. అంచేత వేళాకోళంగా విసుగ్గా అన్నానతనితో. "ఎవడికి కావాలి నువ్వు చెప్పే చదువు? అయినా నువ్వు "హుయీ" అనే అక్షరం గడ్డిజాతి గుణితంలా ఉందిలే! అని.
    కుంగ్ పరమానందంతో పొడుగాటి రెండు చేతిగోళ్ళతో బల్లని తాటిస్తూ "అదే అదే! అంటాడు తన ఆడించి. 'ఎటొచ్చీ 'హూయీ అనే అక్షరాన్ని నాలుగు రకాలుగా రాయాలి. నీకవి తెలుసా?
    నాకు చిర్రెత్తుకొచ్చి అక్కడినుంచి పోతాను. కుంగ్ ఇ-చీ మాత్రం మద్యంలో వేలుముంచి, వేదికమీద అక్షరాలకు నకళ్లు దిద్దుతాడు. అయితే నేను లక్ష్యపెట్టలేదని తెలుసు కాని ఒక నిట్టూర్పు విడుస్తాడు. కళ్ళలో బాధ కనబడుతుంది.
    ఒక్కొక్కప్పుడు చుట్టుపక్కల పిల్లలు "నవ్వుల చప్పుడు విని సరదాగా మాతో కలిసి కుంగ్ ను చుట్టివేస్తారు. వాళ్ళకి తలా ఒక మసాలా చిక్కుడు గింజ ఇస్తాడు కుంగ్. అవి తినేసి యింకా అక్కడే తచ్చాడుతుంటారు. పిల్లలు ప్లేటువైపే చూస్తూ కుంగ్ గాభరాపడి ప్లేటును చేతితో మూసేస్తాడు. నడుం వంచి కొంచెం ముందుకు వంగి "అయిపోయింది. ఇవ్వడానికి మరేమీ లేదు" అంటాడు. తర్వాత నిటారుగా నిలబడి, చిక్కుళ్ళవేపు మరోసారి చూసి "ఇంకెన్నో లేవు. నిజం చెబుతున్నాను. ఎన్నో లేవు!" అంటాడు. అప్పుడు పిల్లలంతా గొల్లుమని అరుస్తూ చెల్లాచెదురయిపోతారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS