Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 91


                                     ఆశ

    నా హృదయం చెప్పరానంత ఒంటరిగా ఉంది.
    కాని నా హృదయం చాలా ప్రశాంతంగా ఉంది. ఇందులో
    ప్రేమ లేదు, ద్వేషం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు,
    చప్పుడు లేదు.
    బహుశా నేను ముసలివాణ్ణయిపోతున్నాను. నా జుత్తు
    తెల్లబడి పోతున్న మాట నిజం కాదా? నా చేతులు
    వణుకుతున్నాయన్న మాట నిజం కాదా? అయితే     నా ఆత్మ తాలూకు చేతులు కూడా వణుకుతున్నాయన్నమాట.
    అయితే ఇది చాలా కాలం నుంచీ జరుగుతున్నదే.
    అంతకు పూర్వం నా హృదయంలో ఉప్పొంగేవి ఉద్రిక్తరక్తగీతాలు, నెత్తురూ, ఇనుమూ, నిప్పులూ, విషం, పునర్జీవం, పగ తర్వాత హఠాత్తుగా నా హృదయం శూన్యమయింది. (అప్పుడప్పుడు నేను అనవసరమైన ఆశలతో దాన్ని పూరించక పోయినప్పుడు) ఆశ ఆశ. నేను ఆశ అనే కేడెం చీకటిరాత్రుల దండయాత్రని ఎదిరించడానికి ధరించేవాణ్ణి కాని, యీ దాడి వెనకాతల అదే చీకటి, అదే అంధకారం. అప్పుడు నేనలాగే నాయౌవనాన్ని అనవసరంగా వ్యర్ధం చేశాను.
    ఔను నాకు తెలుసు. నా యౌవనం నిష్క్రమించిందని! కాని, నా వెలువల మరో యౌవనం ఇంకా జీవిస్తున్నదని కూడా నాకు తెలుసు. నక్షత్రాలు, వెన్నెల, కుంటుకుంటూ పడిపోయిన సీతాకోకచిలుకలూ, చీకట్లో పువ్వులు, గుడ్లగూబ తాలూకు అంత్యక్రియల సూచనలు, కోకిలల రక్తాశ్రువులు, ఆనందపు అర్ధం కాని తన ప్రేమ చేసే నాట్యం. బహుశా ఆ యౌవనం దుఃఖానికీ, సందిగ్ధానికీ సంకేతం కావచ్చు. అయినా అది నిస్సందేహంగా యౌవనమే.
    కాని ఇప్పుడది యెందుకింత ఒంటరిగా వుంది? నా వెలుపలి లోకపు యువకులు కూడా ముసలివారైపోయారా?
    శూన్యంలోకి అంధకారంతో ఒంటరిగా పోరాడుతూ ఆశాకవచం అనే గీతాన్ని ఆవాహన చేస్తున్నారు. దీన్ని నేను రాయలేదు.
    పెటోఫీ (1823-49) రాశారు. 25 ఏళ్ళు బతికి చచ్చిన కవి. అతనిది హంగేరీ దేశం. వినండి ఆ గీతం.
    ఆశ అనగా ఏమిటి? ఒక వేశ్య
    అందరినీ ఆకర్షిస్తుంది.
    అందరికీ తన సమస్తం సమర్పిస్తుంది    
    అయితే ఒకటే షరతు -
    అమూల్యమైన నీ సంపదని బలికోరుతుంది.
    అదే నీ యౌవనం
    అది తీసుకుని నిన్ను విసర్జిస్తుంది.
    రష్యన్ కోజక్కుల (అశ్విక యోధులు) ఈటెలబారికి గురైన ఈ హంగేరియన్ కవి తన మాతృదేశం కోసం అసువులర్పించి ఇప్పటికి 75 సంవత్సరాలు అప్పుడే గడిచిపోయాయి.
    అతని మృత్యువుని దుఃఖించవలసిందేకాని, అతని కవిత్వం ఇంకా చచ్చిపోలేదని ఎంత ఎక్కువగా దుఃఖించాలి మనం.
    కాని - ఈ వెధవ బ్రతుకు. ఇంత సాహసికుడు, సత్సంకల్పుడు అయిన పెటోఫీ లాంటి కవి కూడా ఆఖరికి ఆ అంధకార నిశీధం ముందు ఆగిపోయి, సుదూర ప్రాచీన దిశవైపు వెనక్కి తిరిగి చూడవలసి వచ్చింది.
    అతనే అన్నాడు "ఆశలాగే నిరాశ కూడా స్వాతిశయమే" అని.
    ఈ స్వాతిశయంతోనే నేనింకా జీవించాలంటే, అప్పుడు నేను అంతర్ధానమై పోయిన అంధకారపు అసందిగ్ధపు యౌవనాన్నే వరించాలి. అది నా అందుబాటులో లేకుండా వెలుపలనే వుండిపోయిందని తెలిసికూడా. ఎంచేతనంటే నా వెలుపలి యౌవనం నాశనమైపోయినప్పుడు నా ముసలితనం కూడా నవసిపోతుంది.
    కాని ఇప్పుడు చుక్కలు లేవు. వెన్నెలా లేదు. కుటుంబంలో పడిపోయిన సీతాకోకచిలుకలూ లేవు. ఆనందపు అస్పష్టత లేదు - అనురాగపు నాట్యమూ లేదు. యువజనులంతా ప్రశాంతంగా జీవిస్తున్నారు.
    కాబట్టి నేను ఇక ఒంటరిగా శూన్యంలోని అంధకారపు నిశీధంతో పోరాడవలసిందే.
    నా వెలుపలి యౌవనాన్ని నేను చూడలేకపోయినా కనీసం నా సొంత ముసలితనంతోనే ఒక ఆఖరి జూదం ఆడవచ్చు. అయితే ఏదీ ఆ అంధకార నిశీధం? ఇప్పుడు తారకలూ లేవు, చంద్రికలూ లేవు. ఆనందపు అస్పష్టత లేదు. ప్రేమ చేసే నాట్యమూ లేదు. యువలోకం ప్రశాంతంగా వుంది. ఆఖరికి నా ఎదుట ఒక అంధకారపు నిశీధం కూడా లేదు.
    నిరాశ కూడా ఆశలాగే అంతా స్వాతిశయం.

                                    * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS