అంత సరదా అయినవాడు కుంగ్ ఇ-చీ! అయితే అతను లేనప్పుడు కూడా సజావుగానే కాలం గడిచిపోయేది.
ఒకరోజు ఆకురాలు పండుగ కొద్దినాళ్ళలో వస్తుందనగా, మద్యశాల యజమాని జాగ్రత్తగా జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. హఠాత్తుగా పలక కిందని పెట్టి, "కుంగ్ ఇ-చీ వచ్చి చాలా కాలమయింది. పందొమ్మిది నగదు ఇంకా బకాయి ఉన్నాడు!" అన్నాడు యజమాని.
"ఎలా రాగలడు? మొన్నటి దెబ్బలతో వాడి కాళ్ళు విరిగిపోయాయి." అని ఒక కాతాదారు.
"ఆహా!"
"మళ్ళీ దొంగతనానికి దిగాడు. ఈసారి తెలివితక్కువతనం కొద్దీ రాష్ట్ర విద్వాంసుడు టింగ్ వద్ద దొంగతనం చేశాడు. టింగ్ బారినుంచి ఎవరు తప్పించుకోగలరు?"
"అయితే మరి!"
"మరేముంది. నేరం ఒప్పుకుంటూ రాసిచ్చాడు మొదట. తర్వాత దేహశుద్ధి, రాత్రంతా బాదుతూనే ఉన్నారు. కాళ్ళు రెండూ విరిగిపోయేదాకా?
"తర్వాత!"
"అంతే కాళ్ళు విరిగాయి."
"ఔనులే. ఆ తర్వాత?"
"ఆ తర్వాత....ఎవరికి తెలుసు? బహుశా చచ్చిపోయుంటాడు.
ఇక ప్రశ్నించడం మాని యజమాని నింపాదిగా జమాఖర్చులు రాసుకుంటున్నాడు.
ఆకురాలు కాలపు పండుగ అయిపోయిన తర్వాత చలికాలం రావడంతో ఒకరోజుకన్నా ఒకరోజు గాలిలో చలి హెచ్చింది. కుంపటి దగ్గరనే కాలమంతా గడిపాను. అప్పుడప్పుడు దూది దట్టించిన చొక్కా వేసుకునేవాణ్ణి. ఒక సాయంత్రం కొట్లో ఎవరూ లేనప్పుడు, నేను కళ్ళు మూసుకుని కూర్చుని ఉండగా, "ఒక ముంత మద్యం వేడిచెయ్యి" అని ఎవరో అనగా విన్నాను.
గొంతుక తగ్గు శ్రతిలో ఉంది. కాని పరిచితమైనదే. అయితే నేను తలెత్తి చూసేసరికి అక్కడెవరూ లేరు. లేచి నిలబడి, తలుపువైపు చూస్తే కుంగ్ ఇ-చీ గుమ్మం దగ్గర కూర్చుని ఉండడం కనిపించింది. మొగం బలహీనంగా కుంచించుకుపోయి ఉంది. మనిషి నానా భీభత్సంగా ఉన్నాడు మాసిపోయిన చొక్కాని వేసుకుని ఒక చాపమీద కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాడు. నులకతాటితో కట్టి ఆ చాప అతని భుజాల నుంచి వేలాడుతుంది. నన్ను చూడగానే, "మద్యం వేడిచెయ్యి" అని మళ్ళీ అన్నాడు.
ఆ సమయానికి గల్లావేదిక నుంచి తొంగిచూసి యజమాని "ఎవరది? కుంగ్ ఇ-చీ? ఇంకా నువ్వు పందొమ్మిది నగదు బాకీ" అన్నాడు.
"అదా...ఈమారొచ్చినప్పుడు ఇచ్చేస్తాను." అని ఇబ్బందిగా చూస్తూ కుంగ్ ఇ-చీ అన్నాడు. "నగదు తెచ్చాను. మద్యం బాగుండితీరాలి" అన్నాడు.
యజమాని ఇదివరకులాగానే కిలకిల నవ్వి "కుంగ్ ఇ-చీ! మళ్ళీ దొంగతనమేనా!" అన్నాడు.
కుంగ్ గట్టిగా కాదనలేదు "నీకు తమాషాగానే ఉంటుంది" అన్నాడు.
"తమాషా యేమిటి? దొంగిలించకపోతే కాళ్లెందుకు విరగ్గొడతారు?"
"పడిపోయాను. కాలుజారి పడితే కాళ్ళు విరిగాయి." అన్నాడు కుంగ్ నీరసపు గొంతుతో. జాలిగా యజమానివైపు చూశాడు. ఇంతతో ఈవూసెత్తవొద్దన్నట్టు ఇంతలో చాలామంది అక్కడ పోగయి గొల్లుమని నవ్వుతున్నారు. నేను మద్యం వేడిచేసి, తీసుకువెళ్ళి గుమ్మం ముందుంచాను. చింపిరి కోటు జేబులోంచి నాలుగు నగదు తీసి నా చేతిలో ఉంచాడు. అప్పుడతని చేతులనిండా బురద ఉన్నట్టు కనిపెట్టాను. చేతులమీదనే పాకుతూ ఇక్కడ కొచ్చాడన్నమాట. ఇంతలో గటుక్కున మద్యం తాగేసి, అంతమందీ నవ్వుతూ అపహాస్యం చేస్తుండగా, చేతుల గాయంతోనే ఒళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయాడు కుంగ్.
ఆ తర్వాత చాలాకాలం గడిచింది. కుంగ్ మళ్ళీ కనబడలేదు. ఆ సంవత్సరం ముగిసీ, యజమాని బాకీల బల్లదించుతూ, "కుంగ్ ఇంకా పందిమ్మిది నగదు మనకివ్వాలి" అన్నాడు. మరుసటి సంవత్సరం డ్రాగన్ పడవ పండుగలో యజమాని ఇదేమాట అన్నాడు. కాని ఆకురాలు కాలపు పండుగ మళ్ళీ వచ్చినప్పుడు ఏమీ అనలేదు. ఇంకో ఉగాది వచ్చింది. కుంగ్ తనకు కనిపించనేలేదు.
నేను కూడా అతణ్ణి ఎప్పుడూ మళ్ళీ చూడలేదు. బహుశా కుంగ్ నిజంగానే మరణించాడు.
* సమాప్తం *
