బండి వైజాగ్ స్టేషన్ లోకి వచ్చి ఆగింది. రెండు గంటలకు పైగా లేటు. ఆరున్నరకు రావల్సింది ఎనిమిదిన్నర దాటింది. స్టేషన్ లో వెలుగుతున్న ట్యూబులైట్లకాంతి వరూధిని గుండెల్లోని చీకటిని ఇనుమడింప చేస్తోంది.
ఇంత పొద్దుపోయి ఎలా ఆయన్ను కలుసుకోవటం? ఆఫీసులో ఉండడు. ఇంటికిపోతే? బాగుండదు. తనెలా వెళ్తుంది? ఆయన భార్య ఎప్పుడో ఒకసారి క్లబ్బులో నలుగురుముందూ తనను తిట్టినట్టుకూడా విన్నది. ఆవిడ తనను చూస్తే ఇంకేమన్నా ఉందా? అసలు ఆయన ఆవిడకు దడిసే ఉత్తరాలు కూడా రాయలేదు. తను రాసిన ఉత్తరాలు దొంగతనంగా చదివిందేమో? కొత్తకొత్త అనుమానాలూ, భయాలూ వరూధిని మనసులో మెదిలాయి.
"అమ్మగార్దది! ముందే నే నడిగా?" లైసెన్స్ కూలీ చేతులో నుంచి సూట్ కేస్ లాక్కుంటూ, రెండోచేత్తో మరొకడ్ని తోసేస్తూ పోట్లాడుతున్నాడు.
కూలీ నిస్సహాయంగా వరూధినికేసి చూశాడు. ఆమె అంతకంటే అయోమయంగా చూసింది కూలీకేసి.
"అమ్మగార్ని ముందు నే చూశా! వదలహ! పెట్టె!"ఏందో రిక్షావాడు పెట్టి గుంజుతున్నాడు.
"ఏమిటీ న్యూసెన్స్! ముందు పెట్టె అక్కడ పెట్టండి!" ఇద్దర్నీ కసిరి కూలివాడికి డబ్బులిచ్చి పంపేసింది. పెట్టె అందుకొని పక్కగా వెళ్ళి నిలబడింది.
"ఒరేయ్! అమ్మగారికి కారొస్తుందేమోరా! ఉట్టినే తన్నుకొంటున్నాం!"
"అయ్యా! అయ్యా! రిక్షా!" మరొక ఆసామీ కేసి పరుగెత్తాడు రిక్షావాడు. వాడివెనకే రెండోవాడు పరుగుతీశాడు.
తను ఇంతవరకూ విశాఖపట్నం చూడలేదు. ఇదే మొదటిసారి! తెలిసినవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎవరన్నా ఉన్నా వాళ్ళక్కడ వున్నట్టు తనకు తెలియదు. ఇక్కడ మంచి హోటల్ ఏదో?
"అమ్మాయిగారూ! ఎక్కడకు పోతారూ?" వయసుమళ్ళిన రిక్షావాడు మీసాలకింద పళ్ళు బయటేస్తూ అడిగాడు. వాడికేసి చూసిందామె.
"అమ్మాయిగారూ!" చాలా మంచివాడులా వున్నాడనుకొంది! వాడన్నమాట గుర్తు చేసుకొని ముడతలుపడ్డ అతడి నొసలు చూస్తూ వరూధిని.
"దగ్గర్లో మంచి హోటలేదుందయ్యా?"
"మంచి హోటలా?" అంటూ వరూధినికేసి చూస్తున్నవాడు తల వంచుకొని ఆలోచించసాగాడు రిక్షావాడు.
"దూరంలో అయితే వుందమ్మా మంచి లాడ్జింగ్!"
"మంచి హోటలేనా?" నొక్కి అడిగింది.
"అమ్మోరమ హోటలుకంటే మంచిది యీ టౌను మొత్తంలో లేదమ్మాయి గారూ!"
"ఎంతివ్వమంటావు?"
"తమ దయ."
"ముప్పావలా ఇప్పించండి."
వరూధిని పెట్టే అందించింది.
"మంచి గదులు - ఖాళీ దొరుకుతాయా?" అడిగింది.
"ఓ మస్తుగా! చాలా పెద్దదిగదమ్మా అమ్మోరమహోటేలూ?"
"అమ్మోరమ ఏంటయ్యా?" రిక్షాలో కాలుపెట్టబోతూ ఆగి అడిగింది వరూధిని.
"అదేనమ్మాయిగారూ! అనోరమ్మో పనోరమ్మో అంటారు. నాబోటివాళ్ళు అట్టానే అంటారు నోరుతిరక్క " సీటు తుడుస్తూ అన్నాడు రిక్షావాడు.
"ఏవిటో అడివిమెళాం! ఇంతకీ హోటల్ మంచిదేగా?" రిక్షాలో కూర్చుంటూ అన్నది వరూధిని.
"క్లాసమ్మా క్లాసూ! క్లాసోళ్ళంతా ఆడనే దిగుతారు. తవరంటోళ్ళేనమ్మా అంతా ఆడ! దొరసాన్లూ దొరలేనమ్మా! ఉన్నోళ్ళుతప్ప లేనోళ్ళు భరించలేరమ్మా ఆడ!" గంటకొడుతూ ముందుకువంగి రిక్షా తోసుకొంటూ పోతూ అన్నాడు.
రిక్షా హోటల్ ముందు ఆగింది.
"ఇదేనమ్మా!" పెట్టె భుజాన పెట్టుకొంటూ అన్నాడు రిక్షావాడు.
"అప్పుడే వచ్చేసింది? దూరం అన్నావ్?" అన్నది వరూధిని రిక్షాదిగి.
ఓ పావలా ఎక్కువ అడగటంకోసం ముసలాడు అబద్దం ఆడేశాడు.
వరూధిని హోటల్ కు చేరుకొనేసరికి తొమ్మిది దాటింది.
రిస్పెప్షన్ కౌంటర్ దగ్గర పెట్టెదించి నిలబడ్డాడు రిక్షావాడు.
వాడికి డబ్బులిచ్చి రిసెప్షన్ బల్లదగ్గిర కొచ్చింది వరూధిని.
"సింగిలా! డబలా సార్?" అన్నాడు కౌంటరు దగ్గరున్నవాడు బోర్డులో ఖాళీ నంబర్లు వెతుక్కుంటూ.
"ఏమిటోయ్ అది? పదమూడో నంబరుకార్నరు గదియ్యి వారికి." వరూధిని వెనకనుంచి వచ్చాయి ఆ మాటలు.
వరూధిని తిరిగి చూసింది. మల్లెపువ్వులాంటి గ్లాస్కోపంచా, ఖాదీ సిల్కు లాల్చీ వేసుకొన్న ప్రొప్రయిటరు చిరునవ్వుతోనే పలకరించాడు వరూథిన్ని. కొద్దిగా వంచిన తలమీద ట్యూబ్ లైటు కాంతి తళుక్కున మెరిసింది.
"రేయ్! సామాను తీసుకెళ్ళి పదమూడో నంబరు గదిలో పెట్టు!" హోటలు కుర్రాడికి విసురుగా చెప్పి "మీరు పదండమ్మా" వరూథిన్ని చూసి మృదువుగా అన్నాడు హోటల్ ప్రొప్రయిటర్.
కౌంటర్ అసిస్టెంటు లాడ్జింగ్ రిజిష్టరు తెరిచి బాల్ పెన్సిల్ వరూథిని కిస్తూ "ఇక్కడ పేరు.....ఇక్కడ....." అంటూ చెప్పసాగాడు.
"ఏమిటోయ్! నీకేమన్నా తలకాయుందా? మీరు పదండీ! తర్వాత రాయొచ్చు. రిజిష్టరు గదిలోకి పంపించు."
కౌంటరు అసిస్టెంట్ గుండుదెబ్బ తగిలినవాడిలా అయిపోయాడు. రిజిష్టరు మూసి అవతల పెట్టి "రండమ్మా!" అతివినయంగా కౌంటరు దాటి బయటికి వచ్చి తలవంచుకొని పదమూడో నెంబరు గదికేసి దారితీశాడు.
హోటలు గదిలో కాలు పెట్టిన వరూధిని గాబరాపడింది! విశాలమైన గది. రెండు మంచాలు. డన్ లప్ బెడ్స్. అటాచ్ డ్ బాత్, చిన్న డ్రాయింగ్ రూం. అందులో సోఫాసెట్టూ. రెండుచోట్లా ఫాన్లూ, డ్రాయింగ్ రూం బెడ్ రూం మధ్య కర్టెన్. అంతా హంగామాగా ఉంది.
ఎంత ఛార్జీ చేస్తారో? ఇంత పెద్ద రూం తనకెందుకూ? ఏమిటో ప్రొప్రయిటర్ ఇలా చేశాడు? తనను చూసి ఏ మహరాణీయో అనుకొన్నట్టున్నాడు. ఎంత గౌరవం చూపించాడు? అవునా? ఆయన్నెక్కడో చూసినట్టుందే? ఎక్కడా? చెప్మా?
ప్రొప్రయిటర్ ముఖం గుర్తుచేసుకోవటానికి ప్రయత్నించింది. అవును! చూసినవాడే? అతను తనను గుర్తుపట్టి ఉండాలి. తనెవరో తెలిసుండాలి. లేకపోతే అంత మర్యాద ఎందుకు చూపిస్తాడూ? తన దగ్గర సింగిల్ రూం ఛార్జీయే తీసుకొంటాడేమో? అసలు డబ్బే పుచ్చుకోడేమో? ఛ! అదేమిటీ? తను ఊరుకుంటుందా? వద్దన్నా బలవంతాన డబ్బు ఇచ్చేస్తుంది. అసలీయన్ను ఎక్కడ చూసింది? హైదరాబాదులో చూసిందా? సినిమా డిస్ట్రిబ్యూషన్ లో లోగడ ఉన్నాడేమో? హాలు ఓపెనింగ్ అప్పుడు చాలా పెద్దపెద్దవాళ్ళొచ్చారు. అందులో వున్నాడేమో? రామనాథబాబుకు ఏమన్నా బంధువో, స్నేహితుడో ఏమో? అసలు తనకు తట్టనేలేదు ఇంతవరకు. తను డి.యస్.పి. తాలూకు అని ప్రొప్రయిటర్ కు తెలుసునేమో? అసలాయన మన ప్రాంతంవాడిలాగే వున్నాడు. ఆ మాటా ఆ తీరూనూ.
వరూధిని స్నానం చేసింది. గదిలోకే భోజనం తెప్పించుకొని తిన్నది. హోటల్ కుర్రాళ్ళు ఎదురెదురుగా వచ్చి హాజరవుతున్నారు. చాలారోజుల తర్వాత ఏదో విముక్తి దొరికినట్టుగా ఉంది.
ప్రయాణపు బడలికలో వున్న వరూధినికి పక్కమీద మేను వాల్చగానే నిద్ర ముంచుకొస్తూంది.
ఉదయాన్నే ఆయనకు కబురు చెయ్యొచ్చు, ప్రొప్రయిటరుగారికి చెప్తే ఆయనే కబురు పంపిస్తాడు. ఎందుకూ? తనే ఫోన్ చెయ్యొచ్చు.
డి.యస్.పి గురించిన ఊహాచిత్రాలు మరుగైపోతూండగా వరూధిని నిద్రలోకి జారిపోయింది.

