Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 92


    అతను శ్రీశ్రీగారిని  చూసి, "ఏవండీ, ఆ అమ్మాయి  అంటున్నది  నిజమేనా? నలుగురు పిల్లలని అంటోంది. చూస్తే అలా అనిపించటంలేదు" అని అడిగారు.
    "అవునండి. నా భార్యే. నాకన్నా ముప్పయ్యేళ్ళు చిన్న" అని అన్నారు, నవ్వుతూ  నన్ను చూసి.
    తరువాత నాతో మాట్లాడుతూ, "నీకింకో  విషయం  చెప్పేనా?" అని అడిగారు.
    "లేదే. ఏమిటి?" అని అడిగారు.
    ఒకసారి 'నేనూ, ముసల్దీ  కలిసి  రైల్లో  ప్రయాణం చేసేటప్పుడు  తోటి ప్రయాణీకులు నన్ను చూపించి, 'ఇతను మీ అబ్బాయా' అని అగేవారు. వాళ్ళు అలా అడగడం దానికి కష్టంగా వుండేది.
    నలభై ఏళ్ళకే  జుత్తు పూర్తిగా  నెరిసిపోయింది. రైలు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం  నా జుత్తుకి తెల్లరంగు వేసుకుంటానని  అంటే దానికి ఒళ్ళుమండేది. 'ఏమీ అక్కర్లేద'ని  ఒప్పుకొనేది కాదు. వీళ్ళు ఈ మాట అడిగితే నాకు ఆ మాట జ్ఞాపకం  వచ్చింద"ని  చెప్పారు.
    "అంటే ఇప్పుడు నేను మీకు నల్ల రంగు పూస్తానంటే  మీరు ఒప్పుకుంటారా" అని అడిగాను.
    "దేనికి? నా జుత్తు ముగ్గుబుట్టలా  తయారైపోయిందేమిటప్పుడే" అని అడిగారు.
    నేను నవ్వుతూ  "లేదండీ. అయినప్పుడు మాటే" అన్నాను.
    "నీకూ  అలాంటివి ఇష్టంలేదని  నాకు తెలుసులే" అన్నారు.
    "అవునూ_మనకీరోజు  జాగారమేనా?" అన్నాను.
    "పోన్లెద్దూ. అప్పుడే మూడు గంటలైపోయింది. తెల్లవారకుండా  ఇంటికి చేరుకుంటాము. ఏమైనా మాటలు చెప్పు" అన్నారు.
    "నేను చెప్పడం కాదు. అడుగుతాను. మీరు చెప్పండి" అన్నాను.
    "సిగరెట్ పేకట్లు  వున్నాయా?" అని అడిగారు.
    "ఆఁ వున్నాయి. చిన్నప్పుడు  హరికథా  కాలక్షేపం  నేర్పిన  గురువు శ్రీపాద సన్యాసరావుగారి  చుట్టల కట్టలు మోసేదాన్ని. ఇప్పుడు మీ సిగరెట్ పేకట్లు మోస్తున్నాను" అన్నాను.
    "వాటికన్నా  ఇవి కంపు  తక్కువే" అంటూ సిగరెట్ ముట్టించారు.
    ఆ రైలుపెట్టె  గుడ్డి  దీపంలో  కుడిచేతి చూపుడువేలు  పాము  మెలికలతో షంటింగ్  చేస్తోంది. కళ్ళు మూసుకొని కూర్చున్నారు.
    "ఏవండీ_ఏవండీ" అని పిలిచాను.
    ఉలకలేదు. పలకలేదు.
    'ఏమిటి' అన్నట్టు  కళ్ళు విప్పి చూశారు.
    "ఏం, మీకు నిద్ర వస్తోందా?".
    "లేదనుకో".
    "టైమెంతయ్యింది చెప్పండి" అనడిగాను.
    "చూసుకో" అని చేతికున్న వాచీ చూపించారు.
    "మూడున్నర అవుతోంది" అన్నాను.
    ఒక నిముషం  ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. నాకు ఏమీ తోచడంలేదు. 'మద్రాసు చేరుకుంటాం  ఇక' అనుకుంటూ, "ఏవండీ" అని పిలిచాను. "ఇక మరేమీ నన్నిప్పుడు అడగకు సరోజా! కాస్త జరుగు" అన్నారు. "దేనికి?" అన్నాను.
    "అబ్బ! చెప్పినపని చెయ్యి సరోజా! జరగమన్నాను_జరుగు" అన్నారు. జరిగాను.
    అంతే_ఆ కాస్త స్థలంలోనూ  కాళ్ళు  ముడుచుకొని, నా తొడ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నారు.    
    మేము ఇంటికి చేరుకొనేసరికి, ఉత్తరాలు పడివున్నాయి. బయట ఊరికి  వెళ్ళినా, ఉన్న ఊరులో వీధిలోకి వెళ్ళినా, రాగానే ముందు చేసే పని_పోస్ట్ చూసుకోవడం, అవసరాన్ని బట్టి వెంట వెంటనే  వాటికి రిప్లయ్ లు ఇచ్చేయడం.
    "కాస్త రెస్ట్ తీసుకొని, ఆ ఉత్తరాలు  పని చూస్తే, కాదుటండీ" అని నేనంటే...
    "నీకు తెలీదు ఊరుకో  సరోజా!" అన్నారు.
    ఆ రోజు చూసిన ఉత్తరాలో..."ప్రపంచం తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మీరు వెంటనే బయలుదేరి రావాల"ని ఒకటి, మరో ఉత్తరంలో మరికొన్ని విషయాలు...ఇలా  నాలుగయిదు ఉత్తరాలుదానికి  సంబంధించినవే వున్నాయి.
    వివరాలన్నీ ఇక్కడ అనవసరం. కొన్ని మాత్రం రాస్తాను.
    మా ఇద్దరి మధ్యా డిస్కషన్ ప్రారంభమయ్యింది. వారి మాటలవల్ల, వారిని  తప్పకుండా అరెస్ట్ చేస్తారని నేను అనుకున్నాను. దాంతో ఏడుపులూ  రాగాలూ ప్రారంభించాను.  
    "నేను నా ప్రజలు చెప్పినట్టు  నడుచుకుంటాను. నా ప్రజల  జీవన్మరణ పోరాటాన్నీ, వారి విజయాన్నీ గానం చేస్తున్న  విప్లవ రచయితల సంఘం తీర్మానించినట్టుగా  ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని  నేను బహిష్కరిస్తాను.
    నా జనం అవతల సాయుధ పోరాటం సాగిస్తున్నారు. విద్యార్ధులు విద్యాలయాల పునాదుల్ని పెకలిస్తున్నారు. యువతరం రాజీలేని అగ్నిపర్వతాన్ని  విరజిమ్ముతోంది. ఇదిగో...ఈ రెండు ఉత్తరాలు చదువు" అని నా చేతికిచ్చారు.
    చదివి నిర్ఘాంతపోయాను.
    
                            *    *    *
    
                     "గుండె ధైర్యం ఒక్కటే నా ఆస్తీ పాస్తీ!


    సభల సందర్భంగా  సన్మానం  జరపడానికి  అంగీకరించ వలసిందిగా  శ్రీ వెంగశ్రావు గారు రాసిన లేఖ ఒకటి, ఈ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రమ్మని మరో లేఖ! సన్మానానికి అంగీకరించనని  మొదటి ఉత్తరానికీ, బయలుదేరి వస్తున్నానని రెండవదానికీ జవాబురాసి వెంటనే పోస్టు చేయించేశారు  శ్రీశ్రీగారు.
    "హైదరాబాద్ కి టిక్కెట్ బుక్ చేస్తున్నాన"ని నాతో చెప్పారు.
    "నేనూ వస్తాను. మిమ్మల్నొక్కర్నే  వెళ్ళనివ్వను" అని పట్టుపట్టాను.
    "నువ్వు రావడానికిక  వీల్లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూవుండు.
    మనిద్దర్లో  ఎవరో ఒకళ్ళం  పిల్లల్ని  అంటిపెట్టుకు వుండాల"ని అన్నారు.
    "మరి ఇన్ని ఊర్లకి  మీతో వస్తున్నాను. అన్నిటికీ పిల్లల్ని వదిలేసేగా మీతో వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వదలడం ఏంవుంది? నేను రాకతప్పన"న్నాను.
    "నామాట విను సరోజా! నేనెందుకు చెప్తున్నానో అర్ధంచేసుకో" అన్నారు.
    నా సందేహం మరీ హెచ్చయ్యింది.
    "నన్ను మభ్యపెట్టడానికి  ప్రయత్నించకండి. అన్నిచోట్లకి నన్ను తీసుకొని వెళతారు. ఇక్కడికిమాత్రం ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏమిటి?" అని నిలదీశాను.
    "ఎందుకలా  భయపడతావు సరోజా! నాకేం ఫరవాలేదు. నేనొక్కడ్నని అనుకోకు. ఆంధ్రదేశం అంతా నాతోవుంటుంది. నా ప్రజలు, నా యువతరం అందరూ నన్ను వెయ్యికళ్ళతో  కాపాడుకుంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో  మనస్సెందుకు  పాడుచేసుకుంటావు?" అన్నారు.
    "అయినప్పుడు నన్ను తీసుకెళ్ళాడానికి  మీకేమిటి అభ్యంతరం?" అని అడిగాను.
    "మళ్ళీ చెప్తున్నాను. నువ్వు రావడానికి వీల్లేదు సరోజా! నీ అంత పెంకి ఘటాన్నే నేనుకూడా. నువ్వు ఉత్తమొండివైతే  నేను శతమొండిని. కారణం లేకుండా  ఏపని నిన్ను చెయ్యమనను.
    ఈసారి గొడవలు  జరుగుతాయి. నీదగ్గర దాచి ప్రయోజనం లేదు. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్కపెడతావు. నీతో నిజంచెప్పి నేను వెళ్ళడమేమంచిదనుకుంటాను.రచయితల్ని కొట్టి జైల్లోకి నెట్టిన ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని, ప్రజావ్యతిరేక పండుగని నేను ఖండిస్తాను.
    పేరేమో ప్రపంచ తెలుగు మహాసభలు. కానీ ఇంట్లోవున్న  కవుల్ని బంధిచేశారు. బయటనుండి వచ్చేవాళ్ళకి హారతులు పడుతున్నారు. అదీ తప్పని అనడంలేదు. అసూయ చెందడంలేదు. అయిష్టత  ప్రకటించడం లేదు. ఉడుకుమోర్తనం  అసలుకాదు.
    మనింటి పెళ్ళిది.మనవాళ్ళని ముందు విడిపించండి. తర్వాత సభలు చేసుకోండని  పోరాడుతాను.
    ఈ ప్రభుత్వం పిరికిది. అధికారులు నిరంకుశులు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు బహిష్కరించమని యువతను కోరుతాను. పత్రికలలో  ప్రకటిస్తాను. పోరాట ఘట్టాల్లోనే ప్రజలు పునర్జన్మ పొందుతారు.
    ప్రజల్ని  శక్తివంతుల్ని  చేసేది యువత. ఈ యువతను అణగద్రొక్కాలని  ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నిస్తోంది. ఎదుర్కొనిమట్టు పెట్టేందుకు కలిసికట్టుగా  పోరాడాలి" అన్నారు.
    "తప్పకుండా  మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు  సందేహంలేదు" అన్నాను.
    "అందుకనే  నిన్ను రావద్దనీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వుండమని అంటున్నాను" అన్నారు.
    "మీరిలా అనడం ఏమైనా బాగుందాండీ! మీరులేకుండా  నేనీ పిల్లల్ని పెట్టుకొని ఎలాగండీ వుండడం! మీమాటలు వింటేనే నాకు భయంగా వుంది. ఇదేవిధంగా  మీరు ప్రభుత్వాన్నెదిరించి పోరాటం సాగిస్తే  వాళ్ళు ఊరుకుంటారా? నిస్సందేహంగా జైల్లో  వెయ్యడమేకాదు. ఇంకా ఏం చేస్తారో? అప్పుడు మీరేం చేస్తారు?" అనడిగాను.
    "చెయ్యడానికేముంది సరోజా! జైల్లో తోసేస్తే తిండిసమస్య తీరిపోతుంది. ఉరితీసేస్తే జీవిత సమస్యే తీరిపోతుంది" అన్నారు.
    "చాలా బాగుందండీ మీ సమాధానం. మీ ఆలోచన ఎంతసేపూ  మీవరకు మీ ప్రజలవరకే. ఆ మాత్రందానికి నన్నెందుకు కట్టుకున్నారు? ఈ పిల్లల్నెందుకు__" అని ఇంకా అనబోతూ వుండగా_


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS