Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 90


    "మరి మా తోకలో?" అన్నాం మేము.
    "మీరూ మీ వెధవ తోకలూ, వెధవ మర్యాదలూనూ! నేను చెప్పినట్లు చెయ్యండి. వేలకొద్ది తోకలచేత విజయతాండవం చేయిస్తాను. నాదీ పూచీ."
    "పవిత్రమైన మా తోకల్ని కాపాడి, పరిణామం నుంచి మమ్మల్ని రక్షించగలిగితే నువ్వేం చెయ్యమంటే అది చెయ్యడానికి సిద్ధం" అన్నాం మేము.
    "మరేంలేదు. ముందుగా పళ్ళదోపిడిని ఇకమీదనుంచీ నిషేధిస్తున్నట్లు ప్రకటిద్దాం."
    "అసంభవం"
    "ప్రకటించడం ఎప్పుడూ అసంభవం కాదు. దేన్నైనా ప్రకటించవచ్చు. మళ్ళీ చెబుతున్నా. దోపిడీని నిషేధిస్తూ ఒక ప్రకటన చేద్దాం. నిమ్నజాతి కోతులకి ఉద్రేకం జాస్తీ. వాటితో వాదించి ఒక దారికి తీసుకురావడం కష్టం. వాదోపవాదాల ద్వారా యథార్థం బైటపడుతుంది అనే సూత్రం వాటికీ వర్తించదు. పైగా అది ప్రమాదంతో కూడుకున్న పని. నిమ్నజాతి కోతులు ఆకలిగొట్టు వెధవలు. ఆకలివల్ల మెదడుకీ, గోళ్ళకీ, వాడి పుడుతుంది. వాదనతో వాటి మెదడుని ఆకర్షించలేం. కాబట్టి వాళ్ళ ఉద్రేకాలని రెచ్చగొడదాం. ఉద్రేకాల విషయంలో వాటికి శిక్షణగాని, అనుభవంగాని లేవు. ఔనామరి! పళ్ళదోపిడిని అంతమొందించినట్లు ప్రకటించాక మన ఉద్దేశానికి చిహ్నప్రాయంగా ఇంకో చిన్నపనికూడా చెయ్యాలి. ఎంత చిన్నపనైనా చాలు. అది చాలా సులభం. కిందటిసారి యుద్ధం ప్రకటించిన రోజుకి బదులు యుద్ధం మిగిసిన రోజున వార్షికోత్సవం జరుపుదాం. వందలకొద్దీ తోకలు ఆ రోజున ఉత్సాహంతో గెంతకపోతే వంద దానిమ్మగింజలు నేను ఓడిపోయినట్టే" అది ముసలిది.
    సరే అంటే సరేనని అందరం ఒప్పుకున్నాం కాని ఓ జిత్తు పనిచేస్తుందని ఏమీ మాకు నమ్మకం లేకపోయింది. అంతేకాక ఇంకో రంగుకోతిని వురితియ్యలేకపోయాంకదా అని మాకెంతో అంత ఇదిగా వుంది. అయితే నిషేధ ప్రకటన జరిగిన తక్షణం కింది కోతులు చూపించిన వుత్సాహంతో మా ముసలిదాని తెలివితేటలకి మేం మురిసిపోయాం. పొట్టితోక కోతులు రోజంతా ఒళ్ళుమరిచి గెంతులు వేశాయి. "శాంతి! శాంతి!" "పళ్ళదోపిడి ముర్దాబాద్" "తినేవాళ్ళకే పళ్ళు!" అనే కేకలతో చెట్టంతా హోరెత్తిపోయింది. ఆ నిషా కొంచెం మాకూ తగిలింది. ఏమిటీ గొడవంతా అని గండభేరుండపక్షి చూడ్డానికి వస్తే దాని రెక్కలు పట్టుకొని ఆడించి, నోటినిండా దానిమ్మగింజలు కుక్కివేశాం. "ముసలిదాన్ని, నాతో మీకు సరసాలేమిటర్రా" అని అవ్వ మమ్మల్ని మందలించింది. "అవ్వా! నువ్వింకా భూలోకంనుంచి అంతర్ధానం కాలే"దన్నాం మేము. పరిణామవాదులను హేళనచేస్తూ.
    వార్షికోత్సవం జరిగింది. నియమితమైన రోజున సరిగా మిట్టమధ్యాహ్నం కాగానే ఎక్కడి కోతులక్కడ గప్ చుప్ గా తోకలు ముడుచుకు కూచున్నాయి. వేలకొద్ది కోతులు నిశ్చలంగా అలా వుండిపోవడం నిజంగా కన్నుల వైభవంగా వుంది. అన్నిటికన్నా చిటారు కొమ్మమీద మా ముసలికోతి కూర్చుంది. తర్వాత ఎవరి హోదాకి తగిన కొమ్మమీద వాళ్ళు కూర్చున్నారు. ఎవరూ కదలలేదు. ఎండలో కళ్ళు మిటకరించడం తప్పితే ఇంకేవిధమైన చలనమూ లేదు.
    ఇలా ఒక నిమిషం జరిగిందోలేదో ఇంతట్లో హఠాత్తుగా ఒక దుర్ణయం సంభవించింది. ద్రోహ బుద్ధికి మితి అంటూ వుండదని అప్పుడు మాకు బోధపడింది. ఎవ్వరూ కదలకుండా వున్న ఆ అవకాశం తీసుకుని ఒక కోతి గభీగభీమని ఎగురుతూ మీదిమీదికి వెళ్ళి బారులు తీరిన పెద్ద కుటుంబాలముందు నిలుచుంది. ఆ కోతి ఎవరో కాదు. పొట్టితోక కోతుల నాయకుడే.
    "ఇదంతా మోసం! శాంతిని ఆరాధిస్తున్నట్లు నటిస్తూ మీరంతా రహస్యంగా యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మీరు చప్పుడు చెయ్యకుండానైనా వుండలేకపోతున్నారు. చూడండి! మీరు కోరలెలా కొరుకుతున్నారో! గోళ్ళెలా గిల్లుకుంటున్నారో" అని ఆ నాయకుడు అరిచాడు.
    అదీ నిజమే. పళ్ళు కొరకడం, గోళ్ళు గిల్లుకోవడం మాకలవాటు. మాకు తెలియకుండానే మేమీ పనులు చేస్తాం.
    క్షణకాలం మాకు మతిపోయినట్లనిపించింది. ఏమి చెయ్యలేకపోయాం. ఎందుకో సందేహించాం. ఇంతట్లో : "చంపండి వాణ్ణి, బతికుండగానే పాతెయ్యండి" అని కింద కోతుల గుంపుల నుండి అరుపులు వినబడ్డాయి. మా సందేహం పటాపంచలై మాలో కొందరం వాడిమీద పడ్డాం. వాడితో పోరాటం సులభమనుకున్నారేమో? అబ్బో వాడు పెద్దపులి లాగ ప్రచండంగా విజృంభించాడు. మేం ఎన్నడూ ఎరగని చాకచక్యంతో, చిత్రమైన కుస్తీ పేచీలతో మాలో పదిమందిని విసిరేశాడు. అయితే వాణ్ణి కేవలం సంఖ్యాబలంతో అడమాయించగలిగాం. వాడిలో ఏదో విపరీత శక్తి వున్నట్టుంది. అదీ వాడి అనుచరులలో కూడా పంపకం అయిందని మా నమ్మకం. ఏమయితేనేం వాణ్ణి కింద కొమ్మల్లోకి కూలదోశాం. మా ముసిలికోతి వాణ్ణి చూడడానికి కిందికి వెళ్ళింది. మేమూ వెళ్ళాం-ఒచ్చే ప్రాణం పోయే ప్రాణంగా వుంది వాడికి. కష్టం మీద ఊపిరి తీస్తున్నాడు. వాణ్ణి చూసేసరికి మాకు విపరీతమైన వణుకు పుట్టింది. బోర్లా పడివున్నాడు. వీపుమీద వెంట్రుకలు లేవు. అంతేకాదు వాడికి తోకకూడా లేదు.
    'వీడుమానవుడు' అని ఒక్క గుక్కని అరిచాం మేము. మాకు కడుపుల్లో చెయ్యిపెట్టి కలచినట్లయింది.
    చంపడానికి అనుజ్ఞనిమ్మన్నట్లుగా మా ముసలికోతి వేపుచూశాం. ముసిల్ది మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వింది.
    "అందుకే వీడు మన దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుతో చేతుల వెనక్కి పెట్టుకున్నాడు. చంపకండి వీణ్ణి! చిత్రవస్తు ప్రదర్శనశాలలో దాచేద్దాం వీణ్ణి!" అంది మా ముసలికోతి.
    తర్వాత మేమంతా మామీదికొమ్మలకి వెళ్ళిపోయాం. మా ముసిల్ది టక్కరితనంగా నవ్వుతూ అడుగు కొమ్మల మీద కోతుల గుంపుని చూపించే అంది.
    "ఇక మనకి ఇబ్బంది తప్పింది. కోతుల ముఠా తన నాయకుణ్ణి తానే చంపుకుంది!"

                                    * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS