Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 90


    వరూధిని మెదడు కుంచించుకుపోయింది. గుండె గొంతులోకి వచ్చి పడుతున్నట్టుగా అయిపోయింది.
    బండి రాజమండ్రి స్టేషన్ లో ఆగింది. వరూధిని కెదురుగా కూర్చున్న పెద్దమనిషి దిగుతూ ఆమెకేసి అదోలా చూసి దిగిపోయాడు. ఎడంగా కూర్చున్న స్టూడెంటొకడు జరిగి ఆపసోపాలు పడ్తూ ఖాళీ అయిన జాగాలో వయ్యారంగా జారిగిలపడ్డాడు. కిటికీలోనుంచి బయటకి చూసే నెపంతో ఆమెమీదకు వంగి కాసేపలానే నిలబడి మళ్ళీ తన చోట్లో కూర్చుంటూ గట్టిగా నిట్టూర్చాడు. వరూధిని పక్కకు జారిన పైటను సర్దుకొంది. వీడికేం పొయ్యేకాలం? నిండా పద్దెనిమిదేళ్ళులేవు చూస్తే! వీడు విశాఖపట్నం వరకూ వస్తాడు కాబోలు. ఖర్మ! అక్కడ వీడు చదివిచచ్చేదేమిటో? వరూధినికి కొడుకు రవి జ్ఞాపకం వచ్చాడు.
    బాబు ఎలా వున్నాడో ఏమో? ఈ గొడవల్లోపడి వాడి ఉత్తరానికి జవాబుకూడా రాయలేదు. ముద్దుముద్దుగా ఎంత బాగా రాస్తున్నాడో? చక్కని వ్రాత. ఎంత మంచి ఇంగ్లీషు రాస్తున్నాడు! తనకే కొన్ని మాటలు తెలియటంలేదు. ఆ స్కూలు కాబట్టి వాడు అంత త్వరగా పైకి వస్తున్నాడు. లేకపోతే వాడు యిదుగో ఈ పోలాయిలాగే తయారవుతాడు. తను చాలా మంచిపని చేసింది. రామనాథబాబు కూడా ఆ విషయంలో ఎంతో చేయూతనిచ్చాడు.
    బండి నిడదవోలులో ఆగటం వరూధిని గమనించలేదు. ఇద్దరమ్మాయిలు, ఒక ముసలమ్మతో, కంపార్ట్ మెంటులోకి ఎక్కి కూర్చున్నారు. ఆ ఆడపిల్లల్ని చూస్తే చదువుకొంటున్న వాళ్ళలాగే వున్నారు. పితలు భుజాలు దిగటంలేదు. క్షణంక్షణం పైటలు సర్దుకొంటూ వారపత్రికలు చదువుతున్నారు. మధ్య మధ్య తలెత్తి దిక్కులు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకొంటూ వచ్చీరాణి నవ్వులు నవ్వుతున్నారు. రాని నవ్వును తెచ్చుకొంటున్నట్టుగానూ, వచ్చే నవ్వును ఆపుకొంటున్నట్టుగానూ, వాళ్ళముఖాలు చూస్తున్న వరూధినికి అనిపించింది.
    వరూధిని ఎదురు సీట్లోకి చూసి "హమ్మయ్య! పీడా విరగడయింది!" అనుకొంది. ఆ కుర్రాడు తన చోటు ముసలమ్మ కిచ్చి ఆ పిల్లలకెదురుగా పోయి నిలబడ్డాడు. వాడు ఇక తనకేసి చూడడు. ఇంకెందుకు చూస్తాడూ? అక్కడ చట్కారీ పిల్లలు దొరికారుగా? నిట్టూర్చింది వరూధిని.
    వాడిప్పుడు తనవైపు చూడకపోతేనేం? ఛీ! ఛీ! ఏమిటి తనకు ఇలాంటి ఆలోచనలు?
    "అవును! ఎవర్ని గురించీ తను ఆలోచిస్తోంది ఇంతవరకు? మధ్యలో వీళ్ళగొడవతో తన ఆలోచన తెగిపోయింది"
    వరూధిని మళ్ళీ తెగిపోయిన అలోచనల్ని అతకటానికి ప్రయత్నించసాగింది.
    రామనాథబాబు గురించేనా? కాదే అసలు రామనాథబాబువల్లే గదా ఇంత అన్యాయం జరిగింది. ఏ గొడవాలేకుండా హాయిగా బతుకుతున్నదాన్ని ఇన్ని కష్టాలపాలు చేశాడు. తనను అన్యాయంచేసి అతను బాగుపడతాడా? అనుభవిస్తాడు. నమ్మిన మనిషికి ద్రోహం చేసినవాడు ఒక్కనాటికీ బాగుపడడు. అతని సంగతి కాదే తను ఆలోచిస్తోంది? ఆ గుర్నాథం గాడా? ఛ! ఛ! వాడిని తల్చుకొంటే తన వళ్ళు జలదరించిపోతోంది. మరెవరూ? ఆయన్ను గురించా? అయ్యో ఖర్మ! ఆయన్ను గురించి ఆలోచించడానికి కూడా ఏమన్నా ఉందా? ఉంటే తనకు కావలసిందేముంది? అసలు భర్త సమర్దుడయితే తన కిన్ని తిప్పలెందుకు? ఆ శంకర్రావుగాడ్ని అలా ఆడనిచ్చేవాడా?
    ఆ గుర్తొచ్చింది. శంకర్రావు గురించే తను అనుకొంటూ వున్నది. అతని విషయంలో తను పొరపాటు పడలేదు. ఆరోజు తను వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాడు? దులపరించుకుపోయాడు. అసలు ఈ కేసు ఒప్పుకోవటమే బుద్ది తక్కువయిందని అనలా? దొంగ రాస్కెల్. శ్యామలాంబదగ్గర బాగా తిని, చివరకు ఇట్టా అడ్డం తిరిగాడు. అటూ ఇటూ తిన్నాడు. ఆరోజు తనే అన్నాడుగా? ఏభైవేలవరకూ శ్యామలాంబ ఇవ్వడానికి సిద్దంగా ఉందని? ఇంకేం? ఇచ్చే ఉంటుంది? అందులో కొంత జడ్జీకిచ్చి, మిగతాదీ, తన దగ్గిర గుంజిందీ తను మింగేసి వుంటాడు. అన్నట్టు తనెంత పిచ్చి మొద్దు? తనుండగానే రామనాథబాబు శంకర్రావు దగ్గిర కొచ్చాడు? ఎంత నాటకం ఆడాడు? తనకేమీ పట్టనట్టు ఎంత తెలివిగా మాట్లాడాడు? రెండోనాడు రాత్రి రమ్మన్నాడు శంకర్రావు. అంటే రామనాథబాబు అప్పుడే డబ్బు తెచ్చి ఉండాలి. తనను చూసి అలా తప్పుకొన్నాడు. శంకర్రావు ఆశించినంత తను ఎప్పుదైతే ఇచ్చుకోలేకపోయిందో అప్పుడే అటు తిరిగిపోయాడు. తన దగ్గర వున్నదేదో ఇచ్చింది. ఇంకా తనెక్కడ తెస్తుంది ఏభైవేలు ఉన్న ఆస్తంతా ఆ హాలుకిందే తగలబడింది. బంగారంవంటి పొలాలను అయిన కాడికమ్మి ఆ రామనాథబాబు చేతుల్లోనే పోసింది. ఎంత ఆస్తి? కోర్టులో తను ఓడిపోతే? కట్టుబట్టలతో నడివీధిలో తను...
    వరూధిని కళ్ళు నిండాయి. చెంపలమీదుగా కన్నీరు కారిపోతూంది. వాన జల్లు వీచి వీచి కొడ్తూంది. తల, మొహం అంతా తడిసిపోయింది.
    "ఏమండోయ్! కిటికీ అద్దం వేయండి. జల్లు లోపలకొస్తంది."
    ఎదురు సీట్లోనుంచి ఎవరో అన్నారు. వరూధిని కిటికీ అద్దం దించటానికి ప్రయత్నించింది. ఎంత గుంజినా కిందకు రావటంలేదు. అంతదూరంలో ఉన్న కుర్రాడు వచ్చి ఆమె మీదుగా చేతులు పెట్టి అద్దం దించాడు. ఆమె చెయ్యి అతనికి అనింది. దివ్యానుభూతి పొందినవాడిలా అయిపోయాడు.
    "అయ్యో! బాగా తడిసిపోయారే?" అన్నాడు కుర్రాడు.
    ఇద్దరమ్మాయిలూ తనకేసి ఈర్ష్యగా చూస్తున్నట్టనిపించింది వరూథినికి.
    వరూధిని పైట చెంగుతో ముఖం తుడుచుకొంది. ముఖం అద్దానికి ఆనించి బయటకు చూడసాగింది. అద్దం మీద నీటి బిందువులు జారిపోతున్నాయి. అద్దం మసక మసకగా అయిపోయింది. దూరంగా చెట్లూ, కొండలూ మసక మసగ్గా కన్పించి గుండ్రంగా తిరిగిపోతున్నాయి. వరూధిని గుండెల్లో గుబులు ముసురుకొంది. ఉరుములూ మెరుపులూ....గత జీవిత స్మృతులు; మెరుపుల్లా వచ్చిపోతున్నాయి! భవిష్యత్తంతా పిడుగుల వర్షం?
    తనేమయిపోతుంది? తన బిడ్డ రవి ఏమైపోతాడు? తల రంపాలతో కోసి వేస్తున్నట్టుగా వుంది. పిచ్చి పిచ్చి ఊహలు బుర్రలో ముసురుకొంటున్నాయి. విశాఖపట్నం. పిచ్చాసుపత్రి. ఆయనేమన్నాడూ? తనను పిచ్చాసుపత్రిలో చేరమన్నాడు. కాదు తను చేరితే పిచ్చివాళ్ళకే పిచ్చి ఎక్కిస్తుందన్నాడు. పిచ్చివాళ్ళకు పిచ్చేమిటి? ఆ మనిషి పిచ్చికాకపోతే! తన భర్తకు పిచ్చా! ఆయనకు పిచ్చెక్కించింది తనేనా? తనకు పిచ్చి లేకపోతే మరొకళ్ళకు పిచ్చి ఎలా ఎక్కిస్తుంది?
    వరూధిని కళ్ళు తెరిచి చూసింది . వర్షం ఆగిపోయింది. బయట తెల్లని ఎండ పచ్చని చేలమీద మెరుస్తోంది. అందరూ కిటికీలు తెరిచారు. వరూధిని దించిన అద్దం అలాగే వుంది.
    అద్దం పైకెత్తింది. బండి బాదంపూడి ఫ్లాట్ ఫారం మీద కొచ్చేసింది. వరూధిని వాచీ చూసుకొంది. నాలుగూ ఇరవైఅయింది. ఇంత లేటుగా నడుస్తుందేం? "ఏవండీ? కాఫీ తీసుకోరా?" కలరు సర్దుకొని తల దువ్వుకొంటూ అడిగాడు స్టూడెంటు కుర్రాడు.
    ఎవర్ని ఉద్దేశించి అడిగాడు? అసలు అడిగిందెవర్నీ? తననా? లేక ఆ అమ్మాయిల్నా? వరూధిని తనను కానట్టే కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది.
    ఆరూ పదిహేను నిముషాల తర్వాత బండి సామర్లకోట స్టేషన్ వదిలింది. బండి వేగంతో పాటు ఆమె ఆలోచనలూ వేగాని అందుకొన్నాయి. మరో రెండు గంటల్లో విశాఖపట్నం వచ్చేస్తుంది. డి.యస్.పి. గారు ఊళ్ళో ఉన్నాడో లేడో? తనను చూసి ఆశ్చర్యపోతాడు. తనకు జరిగిన అన్యాయానికి బాధపడతాడు. తనకు తప్పకుండా సహాయం చేస్తాడు. తను కేసు గెలుస్తుంది. మళ్ళీ హాలు స్వాధీనం చేసుకొంటుంది. హాల్లో శ్యామలాంబ కాలు పెట్టిన చోటల్లా ఫినాయిల్ వేసి కడిగిస్తుంది. ఆ శివరాంగాడ్ని ముందు పీకేయాలి. అసలందర్నీ మార్చేయాలి. వాళ్ళ మేనేజ్ మెంట్ లో తీసేసిన వాళ్ళందర్నీ మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ తన జీవితం విరిసిన మల్లెపందిరి అవుతుంది.
    ఆకాశంలో ఇంద్రధనుస్సు రంగుల రేఖలు వొంగి వొంగి చూస్తున్నాయి. వరూధిని దృష్టి రంగుల కలయికమీద లగ్నమైంది. చూస్తుండగానే రూపురేఖలు దిద్దుకొని హరివిల్లు విరిసింది. దృఢంగా ఆకాశాన్ని ఆవరించింది. భూమిని చుంబిస్తోంది. వరూధిని హృదయాన్ని దివ్యలోకాల్లోకి విసిరేసుకొంది. ఆమె కళ్ళల్లో ఆశాజ్యోతులు వెలుగుతున్నాయి. హరివిల్లుకింద ఆజానుబావులతో గంభీరమైన చూపులతో కన్పిస్తున్నాడు....ఆనాడు ఇంటిముందు కారుపక్కగా నిలబడి తన హృదయాన్ని కలవరపరచిన ఆ మనిషి.....డి.యస్.పి. మోహన్ రావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS