Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 89


    "మీ గూఢచారులు నన్ను నిర్భందించి ఇక్కడకు తీసుకురావడంవల్ల నా జీవితంలో మొదటిసారి ఉన్నత వర్గానికి చెందిన కోతుల సమక్షంలో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఇంతకు నా కృతజ్ఞత. దిగువ కొమ్మల్లో బతుకుతున్న కోతులు వందలకొద్ది సంవత్సరాలు ఏమాలోచించుకుంటున్నాయో మీకు తెలియకపోవచ్చు కాని నేను చెప్పదలచుకున్నాను. ప్రదేశాభిమానం పేరిట మీరు సాగిస్తున్న పళ్ళ దోపిళ్ళ కంటే ఘోరమైన పని మరోటిలేదని నా ఉద్దేశం. అయితే మన గోళ్ళూ కోరలూ వాడిగా ఉండడమే ఈ హత్యలకి కారణం. మనలో మనం పోరాడుకోకుండా ఉంటే మన కోరలూ గోళ్ళూ ఇంత వాడిగా ఉండకపోయేవి. మర్కటజాతి పరిణామంలో (ఈమాట మేము అదిరిపడి విన్నాము) ఈనాడొక సందిగ్ధసమయం ఏతెంచినట్లు మేము విశ్వసిస్తున్నాము. ఏ తోకలైతే మనలో రక్తపిపాసను అభివృద్ధిచేస్తూ మనల్ని ఒక కొమ్మనుంచి ఇంకొక కొమ్మకి ఉయ్యాల లూగించాయో ఆ తోకల పొడుగు తగ్గిపోతున్న సంగతి మీరు కాస్త గమనించండి. ఇవి ఎవ్వరూ బుద్ధిపూర్వకంగా తగ్గించుకొంటున్నవి కావు. మన కోతులందరం కలిపి ఒక కొత్త విధానంలో జీవించగలిగితే ఏ అంతర్యుద్ధాలూ ఉండవు. పళ్ళ దోపిళ్ళకి అవసరం ఉండదు. ఎవరికి కావలసినన్ని పళ్ళు వాళ్ళకుంటాయి. ఈ చెట్టుమీద ఎవరి జాగాలో వాళ్లు కూర్చుని ఎటువంటి అభ్యంతరమూ లేకుండా ఎవరిబతుకు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా బతకవచ్చును. ఉన్నత కుటుంబానికి చెందిన కోతుల్లారా! శ్రద్ధగా వినండి నేను చెబుతున్నది. మీకు కూడా ఈ యుద్ధాలేమి ఉపకారం కలిగించేవికావు. మీరు ప్రకటించే యుద్ధాలలో మీకు చాకిరీ చేసే వేలకొలది కోతులు చచ్చిపోతాయి. మీలోకూడా చాలామంది చచ్చిపోవడం వికలాంగులు కావడం సంభవిస్తుంది. మీ బతుకులను గురించి అప్పుడప్పుడు మాకు తెలిసే సంగతులనుబట్టి చూస్తే మీకోసం ప్రత్యేకంగా పెట్టుకున్న హక్కులేమీ మిమ్మల్ని సుఖపెడుతున్నట్లు తోచదు. ఆహార విహారాదుల్లో మీరు మాలాంటి వానరులే!"
    ఇంత ఛండాలపు ఉపన్యాసం వింటూఉంటే తక్షణం ఆ కోతిని చిత్రవధ చెయ్యాలనిపించింది మాకు. కాని మా అందర్లోకీ ముసలికోతి మమ్మల్ని వారించి తన దీర్ఘవయస్సుకి సహజమైన జ్ఞానంతోను, కపటత్వంతోను విప్లవ నాయకుణ్ణి ఇలా ప్రశ్నించింది. "ఔనయ్యా! నువ్వన్నది బాగానేవుంది కాని మన చెట్టుమీద పంట పండక గొప్పవాళ్ళూ బీదవాళ్ళూ ఒక్కలాగే అల్లాడితే అప్పుడో?" ఇంకో రంగుకోతి ఇలా జవాబిచ్చిందా ప్రశ్నకు. "మన గోళ్లూ కోరలూ వాడిగా లేకపోతే ఇతరులమీద దురాక్రమణ చెయ్యాలనే ఊహ మనకు పుట్టదు. ఎక్కువ పళ్ళున్న ఇంకో చెట్టు కోతుల దగ్గరకు వెళ్ళి కోరలతో జడిపించడానికి బదులు మాటలతో నచ్చజెప్పుతాము. మన మెత్తని చేతులతో వాటికి కితకితలు పెడితే మనతో పళ్ళని పంచుకోవడానికవి సమ్మతిస్తాయి. కోతులకి కితకితలంటే చాలా సరదా అని నేను వేరే చెప్పనక్కరలేదు."
    "ఓ, మొనగాడు బయల్దేరాడండీ! యుద్ధాలు లేకుండా మంత్రిస్తున్నాడు" అని మాలో కొన్ని కోతులు వెక్కిరించాయి. కాని వీడికి కింది వర్గాలలో విపరీతమైన పలుకుబడి ఉందనడానికి నిదర్శనంగా కిందనించి వీడిపేరుతో జయజయధ్వానాలు బయలుదేరాయి. "ఆయన చెప్పినట్టు చెయ్యకపోతే మీకు పళ్ళుతెచ్చే కూలీలుండరు" అని కిందనించి కేక వినిపించింది. "ఔను. ఇంకో యుద్ధం వస్తే ఇక మీరు దొంగిలించడానికి కూడా జనం ఉండరు" అన్నాడు నాయకుడు.
    "వీణ్ని చంపేద్దాం" అని మేము ముసలి కోతి చెవిలో ఊదేం.
    "అడుగున వీడికి పెద్ద బలగం ఉంది. మనం అల్పసంఖ్యాకులం. ఆయుధాలు కూడా మనకి సిద్ధంగా లేవు" అంది ముసలికోతి.
    అది వాస్తవమే. అంచేత కూలీకోతుల నాయకుణ్ని కింది కొమ్మలకి వెళ్ళిపోనిచ్చాం.
    వాడు పోయాక మేమంతా మీదకొమ్మలమీద ఒక సమావేశం చేశాం. మా ముసలికోతి ఇలా అంది. "వీడి ఉపన్యాసం మీకు వింతగానూ, విప్లవాత్మకంగాను తోచిఉండవచ్చు. నిజమేగాని వీడు చెప్పినదానిలో విశేషం ఏదీలేదు. విచిత్రం ఏదీ లేదు. కొత్తగా మనకి చెప్పిందీలేదు. సృష్టి ప్రారంభమయింది లగాయితు ఎన్నో విప్లవాలు జరిగాయి. అయితే ఏమయినట్టు? ఏదిబ్బాలేదు. తిరుగుబాటుకి పూర్వం ఎలావుందో తిరుగుబాటు తర్వాత కూడా అలాగే వుంటుంది ప్రపంచం. అంచేత తిరుగుబాటుదారుణ్ని చూసి జడుసుకోకండి! ఇలాంటివాళ్ళని నేను చాలామందినెరుగుదును. ఇదోరకం పిచ్చి. మనం దువ్వవలసిన విధంగా దువ్వితే ఎవడిపిచ్చిలోపడి వాడు నిరపాయంగా మరణిస్తాడు. అదొహటిన్నీ వీడు చెప్పినదాన్ని పూర్తిగా మనం కొట్టివెయ్యకూడదు. యుద్ధంవల్ల కలిగే జననష్టం ఎంతో ప్రమాదకరమని వీడన్న మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. మన కార్మికులంతా యుద్ధంలో చచ్చిపోతే మనకి పళ్ళు తెచ్చిపెట్టే వాళ్లుండరు. అప్పుడు మనం తిండిలేక మాడనైనా మాడాలి. లేదా సుఖంగా బతుకుతున్న ఈమీది కొమ్మల్ని వదలి ఆహారాన్ని వెదుక్కుంటూ అడుగు ప్రదేశాల్లో అఘోరించాలి. ఎందుకొచ్చిన ఆపద చెప్పండీ ఇది మనకి? అంచేత ఈ ఒక్క విషయంలో మనం కూడా వీడి ఉద్యమాన్ని బలపరచాలని నేను అభిప్రాయపడుతున్నాను."
    "ఘోరం ఘోరం! అనాచారాన్నీ ద్రోహాన్నీ బలపరచడమా? అన్యాయం! అన్యాయం!" అని మేమంతా అరిచాం.
    "ఊరుకోండి. మీకేమీ తెలియదు. సైనికుల్లాగ మీరు మాట్లాడుతారు. రాజకీయవేత్తగా నేను చెబుతున్నాను వినండి. వయస్సులో, చదువులో, తెలివిలో మీకన్నా నేను పెద్దని మరిచిపోకండి. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని మన చెయ్యిదాటి పోనివ్వకూడదు. కిందటి పళ్ళదోపిడి తర్వాత మనకాళ్లు చల్లబడ్డాయి. ఇంకా ఏమైనా వేడి మిగిలితే అది కింది జనాభాలోనే వుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS