41
"విశాఖపట్నం ఎందుకూ!" అడిగాడు వెంకటపతి అర్ధాంగిని.
"అక్కడ పిచ్చాసుపత్రి ఉందిగా?" అంది వరూధిని చిరబురలాడుతూ.
"ఉంటే?" నోరు వెళ్ళబెట్టాడు భర్త.
"నిన్ను చేర్పిద్దామని?" అన్నది భార్య.
"నేనెందుకూ! నువ్వే చేరిపో!" వెంకటపతి నవ్వాడు.
జన్మకో శివరాత్రిలా వస్తుంది నవ్వు వెంకటపతి. శరీరంలో ఎక్కడో పుట్టిన ఆ నవ్వు పెదవుల మీద కొచ్చి చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఎప్పుడో గాని భర్తను నిండుకళ్ళతో చూడని వరూధిని కళ్ళు, భర్తమీదే నిలిచిపోయాయి. ముసిముసి నవ్వులు ఆపుకోలేకపోయింది.
"ఇట్లాంటి మొగుడితో కాపరం చేసేకంటే ఆ పిచ్చాసుపత్రిలో ఉండటమే హాయి."
"నువ్వు మంచోళ్ళకే పిచ్చెక్కిస్తావు. పాపం ఆ పిచ్చోల్లేమాగుతారు నీ ముందు?" వెంకటపతి పచ్చగడ్డి మొలిచిన గనెంమీద నడిచినంత హాయిగా అన్నాడు.
"ఇహ చాల్లే తెలివి! నిన్నటినుంచీ నేను మొత్తుకుంటుందేమిటి? డి.యస్.పి. గారితో మాట్లాడదామని గదూ?"
"విశాఖపట్నంలో వున్న పోలీసాయన ఇక్కడ కోర్టులో జరిగే వ్యాజ్యంలో మనకేం సాయం చెయ్యగలుగుతాడా అని?" అనుమానాన్ని నాన్చి నాన్చి వెళ్ళగక్కాడు వెంకటపతి.
"మీకు తోచదు. చెప్తే తెలియదు. మీతో వచ్చిన చావే అది."
"అన్నీ నీకే తెలుసు చెయ్! చెయ్!" సణుక్కున్నాడు వెంకటపతి.
"అదిగాదండీ? ఆ శంకర్రావును లాయరుగా పెట్టింది ఆ డి.యస్.పి.గారేనా? ఇప్పుడీ శంకర్రావు చేస్తున్న దగాకోరు వ్యవహారం అంతా ఆయన్తో చెబితే, వచ్చి వీడి తాట వలుస్తాడు. వీడని తీసేసి మరో లాయర్ ను పెడ్తాడు. ఆయనయితే జడ్జీగారితో కూడా మాట్లాడగలడుగా?"
"మరే! అవున్లే! ఆ మాటా నిజమేలే. పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకు మాత్రం తెలిసుండదా?" సమాధానపడ్డాడు వెంకటపతి.
"అదేగా నే చెప్పటం? చూస్తూ చూస్తూ కేసు పాడుచేసుకొంటామా? ఆ శంకర్రావుకు వదిలేసి? మన చేతనయింది మనం చేసుకోవాలిగాని? లేచి రిక్షా పిల్చుకురండి. టైం అయిపోతోంది బండికి." వరూధిని చీరలు సర్దుకొని పెట్టె మూస్తూ అన్నది.
వెంకటపతి రిక్షా తెచ్చి ఇంటిముందు నిలబెట్టి లోపలకొచ్చాడు. వెంకటపతి, భార్య సూట్ కేసు పట్టుకొని "రా! రా! రిక్షా వచ్చింది" అన్నాడు.
"ఏం? రిక్షావాడ్ని లోపలకు రమ్మనకపోయారూ పెట్టె మీరు మోయకపోతే?" అన్నది వరూధిని భర్త వెనక నడుస్తూ.
"ఆఁ ఇదేం బరువంట? వడ్ల బస్తా విసిరేసేవాడ్నొకప్పుడు!" పెట్టెను పైకీ కిందకూ ఊపుతూ దాని బరువును అంచనావేసుకొంటూ అన్నాడు వెంకటపతి.
"నీకంటే ఆ వడ్ల బస్తా నయం. ఎన్నాళ్ళయినా ఈ మనిషంతే! నా ఖర్మ! నారాత!" అనుకొంది వరూధిని.
రిక్షా ఎక్కి కూర్చుని వరూధిని "ఇల్లు తాళం పెట్టి ఊరిమీద తిరగొద్దు! ఇల్లు జాగ్రత్త డబ్బు చూసివాడుకోండి. నేనొచ్చేసరికి నాలుగురోజులు పట్టొచ్చు" అన్నది.
"ఆఁనువ్విచ్చింది ఒక్కరోజుకు రాదు. నాలుగురోజుల్దాకా ఎక్కడొస్తది?" గొణిగాడు వెంకటపతి.
"అసలే డబ్బులేక చస్తుంటే నీ గొణుగుడేమిటి?" వరూధిని పర్సులో నుంచి ఐదు రూపాయల నోటుతీసి భర్త చేతిలో విసిరింది.
"నువ్వు పోనియ్ వోయ్? ఏమిటి సుతారం చూస్తున్నావ్! అవతల బండి అందదు." వరూధిని రిక్షావాడ్ని కసిరింది.
సెకండ్ క్లాసు కంపార్ట్ మెంటులో సూట్ కేసు సర్దుకుని కూర్చుంది వరూధిని.
ఎదురుగా కూర్చున్నాయెనెవరో తనకేసే చూస్తున్నాడు. ఎక్కడో చూసినట్టుంది. ముఖం కిటికీ వైపుకు తిప్పుకొని ఆలోచించసాగింది వరూధిని.
అతన్ని తను ఎక్కడ చూసింది? ఏమీ ఎరగనట్టే తిరిగి ఓర చూపులు చూసింది. పెట్టెలో వున్న చాలామంది మగవాళ్ళు తనకేసే చూస్తున్నట్లనిపించింది వరూథినికి. అంతటితో మొదట చూసిన అతన్ని గురించిన ఆలోచన ఆగిపోయింది.
బండి విశాఖపట్నం చేరుకునేసరికి ఆరుగంటలన్నా అవుతుంది. డి.యస్.పి. ఊళ్ళో ఉంటాడా? కాంప్ కెళితే? ఆయన వచ్చేదాకా తను ఎక్కడ వుంటుంది? అదృష్టం బాగుండి సమయానికి అయన ఊళ్ళో ఉంటే సరేసరి? ఆయన ఇల్లెక్కడో? ఎవర్నడిగినా చెప్తారు! డి.యస్.పి.గారిల్లు తెలియకుండా ఉంటుందా? అసలు ఇంటికి వెళ్ళడం బాగుంటుందా? నేరుగా ఆఫీసుకే వెళ్తేసరి. అక్కడే మాట్లాడొచ్చు రాత్రికి ఉంటే ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకొంటారు. సంవత్సరం పైగా అయింది ఆయన్ని చూసి. కోర్టులో వ్యాజ్యం వేసిన పదిరోజులకే ఆయన బదిలీ అయిపోయాడు. ఇంతవరకూ మనిషి ఇటు వచ్చినట్టుగా కూడా లేదు. అక్కడికీ తను నాలుగుత్తరాలు రాసింది. కాని సమాధానం లేదు. విసుగెత్తి అతని ముఖం మళ్ళీ చూడకూడదనుకొంది. కాని ఇప్పుడు తను అతను దగ్గరకే వెళ్ళి సహాయాన్ని అర్ధించాల్సి వచ్చింది. ఆ శంకర్రావు సరైనవాడై కేసు సవ్యంగా నడిపిస్తే ఇలా తను ఒకళ్ళను ప్రాధేయపడాల్సి వచ్చేదేకాదు. ఆ త్రాష్టుడు అలా చేశాడు. అసలు ఇలాంటి లాయర్ ను తన నెత్తిన ఎందుకు రుద్దినట్టు ఆ పోలీసాయన? వాళ్ళిద్దరూ మహా స్నేహితుల్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ శంకర్రావు ఇలా చేస్తున్నాడంటే మరి ఆయన బాధ్యత తీసుకోవద్దూ? ఎవడికోసం? ఎలా తప్పించుకొంటాడో చూస్తా?
అసలిలాంటి లుచ్చాలాయర్ ని ఎందుకు అప్పజెప్పాడో? ముఖం మీదే అడిగేస్తే సరి. అందుకేం జవాబు చెప్పాడో? తను ఎదురుపడి అడిగితే ఈ మాత్రం సహాయం చెయ్యడా? తప్పకుండా చేస్తాడు. తనతోపాటే వచ్చి శంకర్రావు అంతు తేల్చుకోడూ? తన దగ్గిర అన్యాయంగా గుంజిన డబ్బు తిప్పి ఇప్పించేస్తాడు. ఎవడి కోసం ఇస్తాడు? జడ్జీగారికి లంచం ఇవ్వాలని చెప్పి తన దగ్గిర డబ్బుతీసుకోవడం మోసంకాదా? అది పెద్ద నేరంకాదా? ఈ సంగతి డి.యస్.పి.గారు వింటే అసలు ఫోర్ ట్వంటీ క్రింద శంకర్రావును బుక్ చేయించడూ? ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా నిక్కచ్చి మనిషి తను సొంతంగా ఇంటరెస్టు తీసుకొని ఇప్పించిన కేసులో శంకర్రావు ఇలా చేస్తే డి.యస్.పి. గారు ఒక్కనాటికీ ఊరుకోరు. అసలు అక్కడదాకా ఎందుకు? డి.యస్.పి. గారు వచ్చి నిలబడితే శంకరరావుకు చెమట్లు పట్టవూ? డి.యస్.పి. గారు తనంటే ఎంత యిదిగా వుండేదీ ఆ శంకర్రావుగాడికి మాత్రం తెలియదా ఏం? వాడ్ని.....వాడ్ని మాత్రం వదిలిపెడ్తారా? ఆ తొత్తుకొడుకు గుర్నాథంగాడ్ని చెట్టుకు కట్టించి తన్నడూ? వాడు వెధవపని చేసింది కాక తనను అల్లరి చేస్తాడా? ఆ ముసలినక్క కనకయ్యగాడ్నికూడా. ఆఁ వాడేం చేశాడ్లే? ఆయనకు తెలియకపోవచ్చు అసలు విషయం. వీడే.....ఈ గుర్నాథంగాడే ముందుగానే ఎత్తువేసి మామతో అలా చెప్పి ఉంటాడు. కనకయ్య వచ్చి తనకు చెప్తే తను నమ్మి వాడి ఉచ్చులో పడ్తుందని! తనలాగే కనకయ్యకూడా నమ్మి ఉంటాడు. కనకయ్య కావాలని తనను మోసం చెయ్యలేడు. తను అన్నా, తన తండ్రి అన్నా ఆయన కెంత గౌరవం? ఎంత అభిమానం. తన మామ సాంబయ్యగారంటే కనకయ్యకు ఎక్కడలేని గురి. ఆయనంటే ప్రాణాలు విడుశాడు. తమ ఇళ్ళ దగ్గిర బతికినోడుగదా? ఆ మాత్రం విశ్వాసం ఉంది. ఎటొచ్చీ వీడే, ఈ గుర్నాథంగాడే రోగ్. నాలుగురాళ్ళు సంపాదించి నల్లకోటు వేసుకొని కోర్టుకు వెళుతుండేసరికి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. వాడి రక్తం కళ్ళజూడాల్సిందే.
వాడి పెళ్ళాం! ఆ చీమిడి ముక్కు దానికెంత పొగరు? నా ఇంటిముందు కసువు ఊడ్చింది. అంట్లగిన్నెలు తోమిన ముండ, లాయరు పెళ్ళా మయేసరికి వళ్ళు కొవ్వింది. ఆయన్ని ఎంతెంత మాటలంది? అమాయకుడు, ఆయన కాబట్టి ఊరుకొన్నాడు. మరొకడైతేనా?
రెండోలైనుమీద ఎక్స్ ప్రెస్ శరవేగంగా పోతూంది. వరూధిని చెవులు దిబ్బెళ్ళు పడిపోయినయ్. దాటిపోతున్న రైలుపెట్టెలు అలుక్కుపోయినట్లు కన్పించాయి. మళ్ళీ పొలాలూ, మధ్య మధ్య చెట్ల గుబుర్లూ దూరంగా ఇళ్ళూ కన్పించసాగాయి. వరూధిని మనసులో ఆలోచనలు మళ్ళీ పరుగు లంకించుకున్నాయి. చెప్పిందంతా అబద్దమేనా? కోర్టులో సరిగా వాదించటం లేదన్నాడు? అవతల పార్టీవాళ్ళ దగ్గిర డబ్బు తీసుకొన్నాడన్నాడు. ఇవన్నీ అబద్దాలా? అయితే శంకర్రావు కేసు బాగానే చేస్తున్నాడా? తనెంత తెలివితక్కువ మొహం? అలా ఎలా నమ్మింది? అనవసరంగా శంకర్రావుతో పేచీ పడింది. లేకపోతే దివ్యంగా కేసుచేసేవాడు. జడ్జీగారు ఆయనకు బంధువు. పైగా డబ్బు ఆశకూడా పెట్టాడు. శంకర్రావు తప్పకుండా వ్యాజ్యం గెలిపించేవాడు. తను చేజేతులా చెడగొట్టుకొన్నదా?

