Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 90

 

    ఇక్కడొక  విషయం  రాయక తప్పదు.
    నేనూ, మా పెద్దావిడా  కలిసి, శ్రీశ్రీగారికి ఇష్టం లేకున్నా  బలవంతాన వారిని ఒప్పించి, ఐదేళ్ళ వయసున్న మా బైజుకి వేదోక్తంగా  ఒడుగు చేశాం.
    రవణమ్మగారి  కోరిక మీద 1968 వ సంవత్సరంలో  ఆవిడఇంట్లోనే నెం. 11, కెనాల్ బేంక్ రోడ్డు, అన్నామలైపురంలో  చాలావైభవంగా  ఒడుగు చేశాం.
    శ్రీశ్రీగారు, ఆవిడా  మాత్రమే పీటలమీద  కూర్చున్నారు.శ్రీశ్రీగారే  వాడికి బ్రహ్మోపదేశం  చేశారు. నేను పక్కనుండి  ఆ వేడుకలన్నీ  చూశాను. పీటలమీద కూర్చోపెట్టి, స్వయంగా  బైజుకి  ఉపనయనం చేయించినందుకు  ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు.
    "సరోజా! మన ముగ్గురికీ  తల కొరివి పెట్టడానికి  ఒక కొడుకు వున్నాడు. ముచ్చటతీరా వాడికి ఒడుగు కూడా నాచేత చేయించి నా కోరిక తీర్చావు. నాకిక ఏ విచారమూ లేదు. నేను చనిపోతే మాత్రం వాడిచేత నాకు దహన సంస్కారాలు  చేయించు" అన్నారావిడ.
    "సరిలెద్దురూ. ఇప్పుడెందుకా  మాటలు?" అనేదాన్ని. ఆవిడ తరచుగా ఆ మాటలు నాకు జ్ఞాపకం చేసేవారు.
    "మీ కెందుకండీ  ఆ బెంగ? మన ముగ్గురికీ  వాడే కొరివి పెడతాడు. నేను ముందుపోతే మీరు జరిపించండి. మీరు పోతే నేను జరిపిస్తాను" అనేదాన్ని.
    నేను వెళ్ళి తెచ్చిన డబ్బు వారి చేతిలో పెట్టాను.
    "ఎక్కడిదీ?" అన్నారు.
    "ఇప్పుడదంతా  ఎందుకు?" అన్నాను.
    ఆ టైములో  ఆమె వంటినున్న  ముప్పయి కాసుల బంగారం తీసేసి, అమ్మాజీ (పెంపుడు కూతురు) చేతికి మావారే ఇచ్చేశారు.
    రవణమ్మగారికి  తలకొరివి  పెట్టే విషయంలో  కొన్ని గొడవలు వచ్చాయి. కొడుకు ఉండగా మరెవ్వరూ  పెట్టకూడదని పురోహితులే చెప్పేశారు. 'గుండు చేయించాల'ని కొందరన్నారు. 'కన్నతల్లి ఉండగా గుండు చేసుకోకూడదు తప్పు' అని మళ్ళీ పురోహితులు  గొడవ చేశారు.వాళ్ళకి  నామీదున్న  సదభిప్రాయమూ, అభిమానమే అందుకు కారణం.
    అశ్వనీ, రోహిణీలని  ఈనాడు  మద్రాసులోనూ, మద్రాసు సినిమా ఫీల్డులోనూ  కూడా పేరు మోసిన పురోహితులు  వాళ్ళు.
    ఏమైతేనేం_నా కొడుకు కుండ పట్టుకొని  ముందు నడిచాడు. శాస్త్రోక్తంగా ఆవిడ అంత్యక్రియలు జరిపించేశారు. పునిస్త్రీ  తనంగా  పోయిందన్న  ఉద్దేశంతో  నేను కొన్ని చాదస్తాలు పెట్టుకున్నాను. శ్రీశ్రీగారు ఏమీ మాట్లాడలేదు.
    ఆవిడ  చనిపోవడంతో  మానసికంగా చాలా కృంగిపోయారు. సుఖంలో కన్నా, కష్టాల్లోనే  ఆ ఉత్తరాలు ఎక్కువగా పాలు పంచుకొంది. ఏనాడూ  వారి మాటకి  ఎదురాడలేదు. శ్రీశ్రీగారంటే  పంచప్రాణాలామెకు.
    వాళ్ళిద్దరిదీ  యాబైఏళ్ళ అనుబంధం మరి !
    పెద్దకర్మ  జరిపించాలని అందరూ అన్నారు.
    ఎవరి చేతిలోనూ  దమ్మిడీ లేదు. పదకొండు  రోజుల ప్లాన్లు  మాత్రం  పరుగెడుతున్నాయి. అనేక కారణాలవల్ల  ఆ పదకొండు రోజులూ మేము ఆ ఇంట్లో ఉండడం కుదరలేదు. మందవల్లి  ఇంటికి, ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళం.
    రెండు మూడు వేలు కావల్సి  వచ్చింది. నా ఇంట్లో  ఉన్న  అవుట్ హౌస్ ఇల్లూ, జాగా మీద అప్పటి అవసరానికి మూడువేలు  తీసుకొచ్చాం. నేనే దగ్గరుండి  మూషిక వాయినాలు వగైరా  తంతులన్నీ నెరవేర్చాను.
    తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు కర్మలకి లెక్కలు వేసే రోజున నన్నూ, నా పిల్లల్నీ  లిస్టులో  నుండి  తీసేసి, మిగతా వాళ్ళని లెక్కకట్టడం  ప్రారంభించారు. (శ్రీశ్రీగారు కాదు).
    అప్పుడు నేను  నిజంగానే  బాధపడి, "ఇదేమిటి? ఆ నాలుగు రోజులూ, నేనూ, నా పిల్లలూ ఉండమా? మమ్మల్ని లెక్క పెట్టలేదేమిట"ని అడిగాను.
    శ్రీశ్రీగారికి లక్షమంది  తెలిసినవాళ్ళుంటారు. అంతమందినీ పిలవగలమా? పిలవాలని ఉందా ? లక్షమందిలో  మీరొకర"ని  ఒక పెద్దమనిషి (మా స్వంత మనిషే. నేను కోరి తెచ్చుకున్న వ్యక్తి) అన్నాడు.
    "శ్రీశ్రీగారిని  తెలిసినవాళ్ళు లక్షమందేనా  ఉన్నారు ? ఈ మాటతోనే  మీ తెలివితేటలు  తెలుస్తున్నాయి. ఆవిడకి  స్వంతం అని చెప్పుకునే వాళ్ళకన్నా  మేమేమీ తోసిపోము.
    ఈ ఇంటిలోనూ, ఫంక్షన్ లోనూ  కలుసుకొనే  హక్కు  మాకూ వుంద"ని అన్నాను.
    "అదే లేదంటున్నాం" అని అన్నారా వ్యక్తి.
    శ్రీశ్రీగారు బాధపడి, "ఒంటిమీద  తెలివుండే  మాట్లాడుతున్నారా ? దానికి దాని పిల్లలకీ  హక్కు లేకపోవడం ఏమిటి?" అని అడిగారు.
    మాటా మాటా పెరిగింది.
    'ఆస్తిపాస్తుల  కోసం ఆశపడి  ఇక్కడెవరూ  తిష్ట వేసుక్కూర్చుని  గడ్డి తినడంలేదు. ఈ కార్యక్రమం సవ్యంగా సాగాలి" అన్నాను.
    "ఆశపడ్డా  లాభంలేదు. అది జరిగిపోయిన  కథ. ఆవిడ పెంపుడు కూతురి పేరిట ఆస్థి అంతా రాసేసింది" అన్నారు వాళ్ళు.
    శ్రీశ్రీగారు  నిశ్చేష్టులైపోయారు.
    నేనేమీ ఆశ్చర్యపడలేదు. కారణం_ఆ గేంగ్  సంగతి  నాకు  బాగా తెలిసిందే. వాళ్ళని భస్మాసుర హస్తం అని నాకు తెలుసు.
    శ్రీశ్రీగారు  మాత్రం "ఇదంతా  ఎప్పుడు జరిగింది? నాకో మాట అయినా నా ముసల్ది చెప్పలేదే" అన్నారు.
    వారి మాటలకి  ఎవరూ  జవాబు చెప్పలేదు. "మొత్తం  ఎనిమిది మంది కన్నా భోజనాలకి హెచ్చు కార"ని మళ్ళీ మొదలు పెట్టారు.
    ఇక అక్కడ వుండి  అవమానం  పొందేకన్నా  వదిలేసి  రావడమే మేలని మా బైజూని  తీసుకొని  బయలుదేరి  పోయాను. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
    నేను గేటు దాటకుండానే  శ్రీశ్రీగారు  కూడా వచ్చేసి "పద నేనూ వచ్చేస్తాను. పోదాం" అన్నారు.
    అప్పుడు నేను, చూడండి. మిమ్మల్ని  తీసుకువెళ్ళిపోవడానికి  కారణం కూడా నేనేనని నన్ను తిడతారు ప్లీజ్_రాకండి" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS