Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 89


    నేను వెంటనే వెళ్ళి, "ఏమిటండీ  ఈ అవతారం! బట్టలు వేసుకు రాకూడదూ ! ఈ తువ్వాలేమిటి? బనీనయినా వేసుకోలేక పోయారా" అని అడిగాను.
    'బతిమాలుకున్నానక్కా! ససేమిరా నా మాట వినలేదు. ఓహో_ఏమిటడుగుతావు? బావగారి అవతారం చూడు" అని మా తమ్ముడు అన్నాడు. "రండి. బట్టలు మార్చుకొని  వద్దురుగాని. నేనూ వస్తాను పదండి" అన్నాను.
    "ఏమీ అక్కర్లేదు సరోజా! వచ్చేవాళ్ళు  శ్రీశ్రీని చూడడానికి వస్తారుగానీ శ్రీశ్రీ వేసుకున్న బట్టల్ని చూడడానికి కాదు. నేను ఇలాగే  ఊరంతా  చుట్టి వచ్చేస్తాను. ఈ చీరలో  నువ్వు తిరిగి రాగలవా? నీకేమి తెలీదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో" అన్నారు.
    అందరికీ అరిటాకులు  వేసి గ్లాసులతో నీళ్ళుంచాను.
    "మకేమిటి, టిఫిన్లు  పెడతారా, లేక భోజనాలా" అని జ్వాలాగారు అడిగారు.
    "తొమ్మిది  గంటలకి  భోజనాలేమిటండీ  బాబూ! లైట్ గా టిఫిన్లే" అన్నాను.
    విస్తరెక్కడా  ఖాళీలేదు. శ్రీశ్రీగారు జోకులతో వాళ్ళని తెగ నవ్వించేస్తూ వుంటే, పదకొండు గంటలదాకా కూర్చున్నవాళ్ళు లేవలేదు.
    "అమ్మబాబోయ్! టిఫిన్లే  ఇంత హెవీగా వుంటే భోజనాల  సంగతి మరేమైనా వుందా" అన్నారు.
    సాయంకాలం  అందరం మీటింగ్ హాల్ లో మీటయ్యాం. జ్వాలాముఖిగారు  ఆ రోజు ఉపన్యాసంలో  అందర్నీ  అదరగొట్టేశారు. వారు ఎంత పవర్ ఫుల్ స్పీకరో ఆనాడు నాకు అర్ధమయింది.
    అందరి మీటింగులూ  అయిన  తర్వాత  శ్రీశ్రీగారు  ప్రారంభించారు.
    మధ్యలో చిన్న చిన్న జోక్ లు వేసే అలవాటు వారికి వుంది. ఆ రోజు సభలో ఈ చిన్న కథ ఒకటి చెప్పారు.
    "ఓ ఇద్దరు అమాయకులు మద్రాసు మీనంబాక్కం  విమానాశ్రయాన్ని చూడడానికి వచ్చారుట. వాళ్ళిద్దరూ విమానాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతూ దాన్ని వర్ణించడం ప్రారంభించారుట. అందులో మొదటాయనకి అన్నీ సందేహాలే.
    రెండవాయన్ని  చూసి 'ఏరా తమ్ముడూ ! ఈ విమానం ఇంత పెద్దది కదా, దానికి రంగులు (పెయింట్లు) వెయ్యాలంటే ఎంత డబ్బు  ఖర్చు అవుద్ది ? ఎంత రంగు కొనాలి ? అలా కొన్నా  ఇంత పెద్దదిగా వుందే_దీనికెలా రంగు వేస్తారురా' అని అడిగాడట.
    దానికి ఆ రెండవాయన 'ఓరి తెలివితక్కువ దద్దమ్మా ! ఇది ఇక్కడుండగా  రంగులు వెయ్యడం  ఎవరి తరంరా! ఆకాశం మీదికి ఎగిరిపోతే చిన్నదై పోతుంది చూడు అప్పుడు వేస్తారురా' అన్నాడట" అని చెపుతూ "ఈ జోక్ నాదికాదు. నా కొడుకుది. వాడు  ఇలాంటి జోక్స్ తెగ చెపుతూ వుంటాడ"ని అనేసరికి  ఆ జోక్ విన్న ఆడియన్స్ లో నవ్వులూ చప్పట్లూ  రెండు నిముషాలవరకూ  ఆగలేదు. చాలాసార్లు  విన్న జోక్ అయినా నేనూ నవ్వకుండా వుండలేకపోయాను.
    "నన్ను పూరీకి పంపిస్తానంటే  వస్తాను" అన్నాను.
    "నిన్ను పూరీకి పంపమని అడిగావుకానీ నేను రావాలని  కండిషన్ పెట్టలేదుగా. ఓకే. శాంక్షన్" అన్నారు.
    మమ్మల్ని ఆహ్వానించడానికి  వచ్చినవాళ్ళు "మిమ్మల్ని పూరీ మేంపంపిస్తామమ్మా" అని హామీ ఇచ్చారు.
    అంతవరకూ  నేను పూరీ వెళ్ళలేదు.
    వచ్చిన వాళ్ళలో  మమ్మల్ని తీసుకువెళ్ళడానికి  మాత్రం  ఒకరు వుండిపోయి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు.
    మర్నాడు రాత్రి  బండిలో బయలుదేరి  ఉదయానికల్లా  ఖుర్దా  చేరుకున్నాం.
    స్నానాలు చేశాక  ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళాం. ఎంత చక్కగావుందో చెప్పడానికి లేదు. మహా ప్రస్థానం కళ్ళముందు కనిపించింది.
    ఆ రోజు మీటింగ్ కి మాత్రం  నేను రానని, పూరీ జగన్నాథం  వెళతానని అన్నాను.
    నాతో  ఒక మిత్రుడు బయలుదేరాడు. ట్రయినెక్కి  నాలుగు గంటలు_ఐదు గంటల మధ్య పూరీ  చేరుకున్నాం. జగన్నాథస్వామి  దర్శనం చేసుకున్నాం.
    జగన్నాథ  రథం  చూడాలని న కోరిక. దానికి కారణం  కూడా లేకపోలేదు. రథం చూడాలన్న పట్టుదల భక్తితో మాత్రం కాదు.
    'వస్తున్నాయి, వస్తున్నాయి, రథచక్రాల్, రథచక్రాల్, జగన్నాథ రథచక్రాల్' అని రాశారే! జగన్నాథ రథచక్రాలని  మాత్రమే  ఎందుకు రాశారు? ఏమిటా ప్రత్యేకత? చూసి తెలుసుకోవాలని కోరిక. ఆ మాట వారితో అంటే తిడతారేమోనన్న  భయంతో చెప్పలేదు.
    జగన్నాథ రథాన్ని, చక్రాల్ని  చూసి బేర్ మన్నాను. అన్నీ చూసుకొని మళ్ళీ ఖుర్దాలో మా బసకి చేరుకోడానికి రాత్రి పదకొండు గంటలయ్యింది. మీటింగ్ పూర్తిచేసుకొని గురువుగారు హాయిగా  విశ్రాంతి తీసుకుంటున్నారు.
    "ఏవండీ_మీరింకా నిద్రపోలేదా?" అని అడిగాను.
    "నిద్ర ఎలా పడుతుంది సరోజా! నీ తీర్ధయాత్రలతో  ఛస్తున్నాం. ఇంతవరకూ రాకపోయేసరికి  నాకేమీ తోచలేదు. పోనీ_నీ కోరిక  తీరిందా" అని అడిగారు.
    అన్నీ  పూసగుచ్చినట్టు చెప్పేశాను.
    "జగన్నాథ రథం  కూడా  చూశానండీ" అన్నాను.
    "ఇప్పుడు చూడడం కాదు సరోజా! రథోత్సవాల్లో  చూస్తే దాని  సంగతి తెలుస్తుంది" అన్నారు.
    మాట్లాడుకుంటూ  ఆ రాత్రి  ఒంటిగంట  వరకూ  మేలుకున్నాం. మర్నాడు  అక్కడి నుండి తిరిగి బరంపురం చేరుకున్నాం.
    రెండు రోజులక్కడ  రెస్టు తీసుకున్న  తర్వాత...శ్రీశ్రీగారూ, నేనూ, మా తమ్ముడూ, మా చెల్లి సుందరి అందరం కలిసి కటక్ లో మీటింగ్ కి వెళ్ళాం.  
    అక్కడ మా పెద్దక్క  విజయమ్మ  వుంది.
    వాళ్ళింట్లోనే  బసచేశాం.
    శ్రీశ్రీగారు  తన ఇంట్లో అడుగు పెట్టినందుకు  ఆ దంపతుల ఆనందానికి అవధులులేవు. మీటింగ్ భువనేశ్వర్లో  మీటింగ్ పూర్తి చేసుకొని, మర్నాడు బరంపురం  చేరుకున్నాం. బరంపురంలో  అడుగుపెట్టేసరికి, రాయగడవాళ్ళు  శ్రీశ్రీగారి కోసం కాచుక్కూర్చున్నారు. రాయగడలో సన్మానం. నన్ను కూడా రమ్మని చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను వెళ్ళలేదు.
    మా తమ్ముడ్ని తీసుకొని శ్రీశ్రీగారు  వెళ్ళారు.
    అక్కడ చాలా  బ్రహ్మాండంగా  మాట్లాడారని, సన్మానం కూడా చాలా బాగా చేశారని చెప్పారు.
    అలా మీటింగులూ, సభలలో 73 లోకి  ప్రవేశించాం.
    మధ్యకాలంలో  చాలా  విషయాలు జరిగాయి.
    
                            *    *    *


                           యాభై ఏళ్ళ కాపురం  ముగిసింది


    మా పిల్లల్ని మా ఇంటికెదురుగా  వున్న సెయింట్ జాన్స్ లోనే జాయిన్ చేశాం. నా పిల్లలతో పాటు తల్లిలేని నా చెల్లి పిల్లల్ని కూడా  తీసుకువచ్చి మా దగ్గరే వుంచుకున్నాం. నా చెల్లికి ఇద్దరు కొడుకులు. ఒకే కూతురు. ఆ పిల్ల పేరే గౌరి.
    శ్రీశ్రీగారికి  ఆ అమ్మాయంటే  చాలా యిష్టం. ఇంట్లో వున్నంతసేపూ 'గౌరీ గౌరీ' అని తప్పితే రెండో పిలుపు వుండేది కాదు. ఆ పిల్లకూడా వారిని 'అప్పా' అని, నన్ను 'అమ్మా' అని పిలిచేది.
    ఒక్కమాటలో చెప్పాలంటే...గౌరి లేకుండా  వారికి తోచేదికాదు. అది కూడా అలాగే. "ఇడ్లీకి పప్పులేదు. అప్పా! బియ్యం కూడా లేవు. డబ్బు కావాల"ని అడిగేది.
    వారి తిండి విషయం, ఇంటి విషయాలు_అన్నీ అదే చూసుకొనేది. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వారు ఇంటికి రాగానే అన్నీ చెప్పడం దాని పని.నా పిల్లలూ, వాళ్ళూ అరిమరికలు, అభ్యంతరాలు  లేకుండా కలిసిమెలసి వుండేవారు.
    మా చెల్లెలు చనిపోయిన తరువాత  మా మరిది భీమారావుగారు కూడా తన పిల్లలతోపాటు  మద్రాసు వచ్చేశారు. అందరూ మా యింట్లోనే  ఉండేవాళ్ళు. అతనికి ఉద్యోగం లేదు. (అంటే మద్రాసు వచ్చేశాక.)
    ఆ సంవత్సరంలోనే  మా పెద్దావిడకి (రవణమ్మగారికి) సీరియస్ అయిపోయింది. హాస్పిటల్ లో జాయిన్ చేశారు. నేనూ  హాస్పిటల్ కివెళ్ళి  ఆవిడ్ని చూసుకొనేదాన్ని. కాస్త నయమయ్యాక ఇంటికి తీసుకొచ్చేశాం.
    తరువాత ఆరునెలలు ఆవిడ బాగానే వుంది. నేను తరచుగా  అన్నామలైపురంలో వున్న  మా పెద్దింటికి వెళ్ళి ఆమెను చూస్తూవుండేదాన్ని.
    ఒకరోజు  రాత్రి తొమ్మిది గంటల సమయంలో వంటావిడ  పరుగునవచ్చి శ్రీశ్రీగారితో, "అప్పా! అమ్మకి చాలా సీరియస్ గా వుంది. వెంటనే రండ"ని చెప్పింది. నేనూ ఆయనా కూడా పరుగెత్తుకు వెళ్ళాం. అప్పటికే ఆవిడ ప్రాణాలు  అనంత వాయువుల్లో  లీనమయ్యాయి.
    ఆ రాత్రంతా_చనిపోయిన ఆమె పక్కనే శ్రీశ్రీగారు పడుకున్నారు. నేను ఆమె తల దగ్గర ఏడుస్తూ కూర్చున్నాను.
    తెల్లవారింది. కర్మకాండ  జరిపించాలి.
    "ఏంచేద్దాం సరోజా!చేతిలో  చిల్లిగవ్వలేదు" అన్నారు.
    "మీరు దేనికీ కంగారు పడకండ"ని  చెప్పి, మందవల్లిలోని  నా ఇంటికి వచ్చి, మా వారి వెండికంచం  తాకట్టు పెట్టించి, డబ్బు తీసుకొని, నా కొడుకుతో సహా అరగంటలో  మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను.


                        *    *    *  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS