Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 9

   
    ఒకరోజు రాత్రి భోజనం చేశాక,

    "అలా చల్లగాలికి నాలుగడుగులు నడిచివద్దాం రండి!" అంటూ, భర్తని తీసుకొని గుడివైపుగా బయల్దేరింది జానకి.

    వెడుతూన్నప్పుడు రుక్మిణి చూడలేదుగాని, వచ్చేప్పుడు చూసింది. "నిండు మనిషివి! రాత్రి పూట ఏమిటీ తిరగడం? అన్నగారూ, మీరైనా కాస్త ఆలోచించకూడదా?"

    "ఏమౌతుందమ్మా? అలా నడిస్తే రక్తప్రసారం బాగా జరుగుతుంది ఒంట్లో! చల్లగాలి మంచి ఆరోగ్యం" అన్నాడు నవ్వుతూ, ప్రసాద్.

    "రాత్రిపూట ఏ గాలో ధూలో తగిలితే? పెద్దవాళ్ళు ఉండాలందుకే, ఇలాంటప్పుడు!" కొంచెం కోపంగా అంది.

    "ఆ లోటు నీవల్ల తీరుతూందిగా, అమ్మా?"

    ఆరోజు మధ్య రాత్రి వచ్చి కంగారుగా రుక్మిణి ఇంటి తలుపు తట్టాడు ప్రసాద్. "జానకికి నొప్పులొచ్చాయమ్మా! ఎలాగమ్మా?"

    "అరె! పురుడు రావడానికి ఓ నెల పడుతుందనుకొన్నాంగా? అయినా, తొమ్మిది పడ్డాయిగా? ఇంకేం భయంలేదు!" అంటూ వచ్చింది రుక్మిణి.

    జానకికి నొప్పులు తీవ్రంగానే వస్తున్నట్టుగా ఉన్నాయి. బాగా మూలుగుతూంది.

    "ఇప్పుడెలాగమ్మా! అనుకోకుండా ఇలా జరిగింది?"

    "భయం దేనికి అన్నయ్యగారూ? తొలుచూలు కాబట్టి కాస్త గాబరాగా ఉంటుంది! టౌన్ ఎంత దూరం? ఎవరైనా బండికడితే అరగంటలో వెళ్ళిపోతాం!" అని ధైర్యం చెప్పి, గబగబా ఇంటికివచ్చి, పడకమీదున్న మోహన్ని లేవగొట్టింది. "ఎవరినైనా బండి అడిగి చూడండి. వదిన బాగా నొప్పులు పడుతూంది!"

    మోహన్ అప్పయ్య శాస్త్రిగారింటికి వెళ్లాడు. ఇంటిముందు బండి ఎద్దులున్నాయిగాని జీతగాడు లేడు బండి  కట్టడానికి. మోహనే బండికట్టి ఇంటిముందుకు తీసుకువచ్చాడు.

    దేవుడి దగ్గర దీపం వెలిగించి, జానకిచేత నమస్కారం చేయించి తీసుకువచ్చి బండిలో కూర్చోబెట్టింది రుక్మిణి. పాతబట్టలు జానకి దగ్గరసరిగా లేవని తనింట్లోవి కూడా తీసుకొంది. ప్లాస్క్ లాంటి అవసరమైన వస్తువులు బుట్టలో సర్దుకొని క్షణంలో తెమిలి తనూ బండి ఎక్కింది. అవసరానికి వస్తాయని పెట్టెలో ఉన్న అయిదువందలు జేబులో పెట్టుకొని వచ్చిబండి తోలాడు మోహన్.

    జానకి నొప్పివచ్చినప్పుడల్లా ఏడ్చేస్తూంది, అరిటాకులా వణికిపోతూంది. "బాబోయ్! నేనింక బ్రతకను! ఇంత నొప్పి.... నావల్ల కాదు. వదినా..... నేను బ్రతకనమ్మా!" రుక్మిణిని వాటేసుకొని భుజంమీద తల మోపి ఏడుస్తూంది.

    "ఏం కాదు. ధైర్యం తెచ్చుకో! కాస్త కష్టపడితే పండులాంటి పాపణ్ణి ఎత్తుకొంటావు!"

    "ఏం పాపడో, అమ్మా! నా ప్రాణం పోతూంది."

    జానకి ముద్దుగా, గుణిసినట్టుగా అంటూంటే ఫక్కున నవ్వింది "ఇంత కష్టపెడుతున్నాడు కదా? వాణ్ణి ఎత్తుకోకేం? నాకు ఇచ్చేయ్ నేను సాక్కుంటాను."

    "నీ కంత నవ్వులాటగా ఉంది నా బాధ! నీకెలా తెలుస్తుంది?"

    "ఓస్! నేనెప్పుడో కందును! నీకు కొడుకు పుట్టాక నేను నిదానంగా బిడ్డను కందామని ఊరుకున్నాను గాని!"

    బండివెనుక నడుస్తున్న ప్రసాద్, "అమ్మో! అప్పుడే పుట్టే పిల్లవాడిని అల్లుడిగా రిజర్వ్ చేసుకొంటున్నావే!" అన్నాడు మనసారా నవ్వేస్తూ.

    "నిజంగా మగపిల్లాడే పుడితే నా బిడ్డకు మగడు కావలసిందే అన్నయ్యగారూ! మీరు నాకిప్పుడే మాట ఇవ్వాలి!"

    "మాట ఇవ్వడం ఏమిటమ్మా? వాడిమీద సర్వహక్కులూ నీకుంటాయి జబర్దస్తీగా వాణ్ణి తీసుకువెళ్ళి నీ కూతురుకిచ్చి చేసేయొచ్చు!"

    "అబ్బా! నా బాధ మీకేం పట్టలేదు! ఎంత సర్దాగా కబుర్లు చెప్పుకొంటున్నారో!"

    "నీ నొప్పులు నేను తీసుకొనేట్టు అయితే తప్పకుండా తీసుకొందును, వదినా!.... బండి కొంచెం నెమ్మదిగా తోలండి! కుదుపు చాలా అవుతూంది!" వాళ్ళ మాటలకు ముసిముసిగా నవ్వుతూ బండి తోలుతూన్న మోహన్ తో అంది.

    హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రెండుగంటల తరువాత జానకికి ప్రసవం అయింది. జానకికి కొడుకు పుట్టాడనటం కంటే రుక్మిణికి అల్లుడు పుట్టాడన్నట్టుగా వాణ్ణి అపురూపం చేస్తూంది.

    "ఇహ నువ్వన్నమాట తప్పకూడదు! త్వరగా కూతుర్ని కనాలమ్మో!" బాబును తృప్తిగా చూచుకుంటూ అంది జానకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS