"నీ సట్టిముక్కు కొడుక్కి నా కూతుర్నిస్తానేమిటి?" రుక్మిణి బాబు ముక్కుపట్టి లాగుతూ అంది.
"లక్ష కట్నం ఇచ్చి మరీ ఇవ్వాలి నీ కూతుర్ని!"
"అబ్బో! లక్ష! ఈ సట్టిముక్కుకి!"
"ఏయ్! వాడికి కోపం వస్తే నీ కూతుర్ని అసలు చేసుకోడు!"
"జానకి ప్రసవించింది! తల్లీ పిల్లాడు కులాసా" అన్నటెలిగ్రాం అందుకొని ఆఘమేఘాలమీద వచ్చిపడ్డారు తల్లీ తండ్రీ. ఒకరోజుండి కూతుర్ని తీసుకొని బస్సెక్కారు.
* * *
బాబుకి మూడోనెల వచ్చాక వెళ్ళి తీసుకువచ్చాడు ప్రసాద్. జానకి లేని ఈ రెణ్ణెల్లు అతడి భోజనం రుక్మిణి ఇంట్లోనే జరిగింది.
ఇద్దరు తల్లుల ముద్దుల పాపడన్నట్టుగా పెరుగుతున్నాడు బాబు.
తరచుగా పోరు పెడుతూంది రుక్మిణిని, జానకి. "బాబుకి పెళ్ళాన్ని ఇంకెప్పుడిస్తావు! మహా డాబుగా వాడిని అల్లుడిని చేసుకొంటానని చెప్పావు గాని!" అని.
"ఇస్తాను ఇస్తాను! అప్పుడే అంత తొందరా" అంటుంది రుక్మిణి.
నాలుగు సంవత్సరాలు గడిచాకగాని రుక్మిణి తన మాట నిలబెట్టుకో లేకపోయింది.
"ఏయ్! మా వాడికి పెళ్ళానివ్వాలి! కొడుకుని కంటానంటే వినేది లేదు!"
"బావగారి అలుక తీర్చేందుకు ఒక బావమరిది అవసరం కదా?"
"ఇలా మాట త్రిప్పితే ఊరుకొనేది లేదు! ముందు మా వాడికి పెళ్ళాన్నిచ్చి మాట్లాడు!"
"ఇవ్వకపోతే?"
"ఇస్తానని ఇవ్వలేదని నీమీద దావా వేస్తాను!"
సరిగా అప్పుడే జానక్కి వేవిళ్ళు మొదలయ్యాయి. ఎవరి బాధ వాళ్ళకయ్యి ఒకరి సంగతి ఒకరికి పట్టనట్టుగా అయ్యారు. 'రుక్మిణి తనకు ఎంత చేసింది! రుక్మిణికి నెల తప్పితే ఆమెకి తనేం చేయలేకపోతూంది' అని బాధపడింది జానకి. ఈసారి అయిదో నెల వస్తూనే పుట్టింటికి వెళ్ళిపోయింది. జానకికి ప్రసవం దగ్గరికి వస్తూంటే, రుక్మిణి తనకు పాప పుట్టిందని వ్రాస్తూ, "బారసాల ఏం చేయడం లేదు! పిలువడానికి బంధువులెవరూ లేనివాళ్ళం! పాపకి ఏం పేరు పెట్టాలి? వ్రాయి!" అని ముగించింది.
బాబు పేరు అరుణభాస్కర్ కదా, వాడికి కాబోయే భార్యకి సంధ్యారాణి అనైనా, ఉషారాణి అనైనా పెట్టమని వ్రాసింది జానకి.
పాపపి 'సంధ్యారాణి' అని పెట్టింది రుక్మిణి.
ఈసారి జానక్కీ పాప పుట్టింది. మూడోనెల వచ్చాక వచ్చింది.
* * *
"అత్తా, బావ పడుకొన్నాడేమిటి? బడికెళ్ళడా?"
"జ్వరం వచ్చిందమ్మా బావకి?"
వారం రోజులు పక్కదిగలేదు అరుణ్. ఆడుకొనేందుకు తోడులేక సంధ్య వంటరి పక్షిలా అయింది. తోచనట్టుగా తిరుగుతున్న ఆ పిల్లని చూస్తూంటే పెద్దవాళ్ళ మనసు కలుక్కుమన్నట్టుగా అవుతూంది.
వారం రోజులకి గాని జ్వరం జారలేదు అరుణ్ కి.
ఆ రోజు నీరసంగా పాలిపోయిన ముఖంతో పక్కమీద పడుకొని ఉన్నాడు.
సంధ్య వచ్చింది.
"జ్వరం తగ్గిందా, బావా? నువ్వలా పక్కమీద పడుకొంటే నాకేం తోచడం లేదు!.... బొమ్మలు తీసుకురానా? లేవక్కరలేదు! నువ్వలా పక్కమీద పడుకొనే చూడు! మగపెళ్ళికీ, ఆడపెళ్ళికి పెద్దని నేనే అవుతాను! ఏం?"
అతడికీ పక్కమీద పడుకొని పడుకొని విసుగొచ్చేసిందేమో, "తీసుకురా!" అన్నాడు.
సంధ్య రివ్వున ఇంటికి పరిగెత్తుకు వచ్చి బొమ్మలబుట్టలు తెచ్చింది. తల్లి ఉదయం తనకిచ్చిన మురుకులు కొద్దిగా తిని కొన్ని అరుణ్ కని దాచింది. అవి కాగితంలో పొట్లంలా చుట్టి బుట్టలో పెట్టుకు వచ్చింది.
