Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 8

   
    రుక్మిణి వచ్చి చూసేసరికి తోటకూర కాడలా పడుకొని ఉంది జానకి.

    "ఎలా ఉంది, వదినా?" జానకి భుజంమీద చెయ్యివేసి అడిగింది.

    "ఏమిటో కడుపులో త్రిప్పుతూందమ్మా!"

    "లొలొలో ఆయీ!" పాపాయిని ఊపుతున్నట్టుగా చేతులు తిప్పుతూ కొంటెగా అంది.

    "ఏం లేదు!" సిగ్గుగా నవ్వింది జానకి.

    "వాంతులు చేసుకోవడానికీ, వడలిన తోటకూరకాడలా పక్కమీద పడుకోడానికీ అర్థం ఏమిటో మరి!" అని, వంటింట్లోకి వెళ్ళి త్వరత్వరగా ఓ కప్పు కాఫీ కలుపుకువచ్చింది. "లే! కాస్త వేడి వేడిగా కాఫీ పడితే తేరుకొంటావు."

    కాఫీ త్రాగి, మళ్ళీ నిస్త్రాణగా పడుకొంటే ఆ రోజు భోజనం తనింటినుండే తెచ్చింది రుక్మిణి.

    జానకికి వేవిళ్ళు తీవ్రంగానే పట్టుకొన్నాయి. కొన్ని వంటలవాసన అస్సలు పడడంలేదు.

    రుక్మిణి తనింట్లో వంట చేసుకువచ్చి వాళ్ళకు పెట్టేది. ఒక్కోసారి అన్నం ఒకటి వండి కూరగాయలు తనింట్లో చేసినవి తెచ్చేది. "నీరసంగా ఉన్నావు! పడుకో." అని జానకిని కూర్చోబెట్టి పనిచేసేది.

    జానకికి అయిదోనెల వచ్చాక తల్లి వచ్చింది. ఓ నెల ఉంచుకొని పంపిస్తామని అల్లుడితో చెప్పి తీసికెళ్ళింది. జానకి పుట్టింటికి వెళ్ళిపోతే రుక్మిణికి రెండురోజులవరకు ఏం తోచలేదు. పిచ్చెత్తినట్టుగా అయింది. 'ఇంత స్నేహం ఎవరితోనూ పెంచుకోకూడదు!' అని రోజుకు ఎన్నిసార్లు మందలించుకొనేదో.

    రుక్మిణి దిగులుగా ఉండడం చూసి, మోహన్ కోప్పడ్డాడు. "ఆవిడ ఎప్పటికీ ఇక్కడ ఉండిపోయేదైనాకాదు! ట్రాన్స్ ఫర్ అయితే వెళ్ళిపోయే వాళ్ళమీద ఇంత మమకారం పెంచుకోవడం ఏమిటి, రుక్మిణీ?"

    "ఏమిటో, అలా కలిసిపోయింది నా మనసు! ఏం చేయను?" బేలగా అంది రుక్మిణి.

    ప్రసాద్ ఒకరోజు చెప్పాడు. "జానకి రేపు వస్తూంది. వాళ్ళ నాన్న జాబువ్రాశారు" అని.

    రుక్మిణి సంతోషం అంతా ఇంతా కాదు. మరురోజు జానకికి ఇష్టమని స్వీట్ చేసింది. ఇష్టమని పులిహోర చేసింది.

    అనుకొన్నవేళకి వాళ్ళన్నగారితో గుర్రబ్బండి దిగింది జానకి.

    గుమ్మంలో నిలబడి ఆమెకోసమే ఎదురుచూస్తున్న రుక్మిణి పరుగున వచ్చిస్నేహితురాలు దిగడానికి సాయం చేసింది "బాగున్నావా వదినా? నన్ను ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకొన్నావా?" అనడిగింది డగ్గుత్తికతో.

    "జ్ఞాపకం చేసుకోవడమా? ఎప్పుడూ రుక్మిణీ నామస్మరణే మా జానకికి. వచ్చిందేగాని మనసంతా నీ మీదేనమ్మా!" నవ్వుతూ చెప్పాడు జానకి అన్న.

    జానకికి ఎనిమిదో నెల వచ్చింది. "తొమ్మిది పడుతూనే వచ్చి తీసికెడతా"మని వ్రాశారు వాళ్ళ నాన్నగారు. పురుడు వచ్చేసరికి ఓ నెలా పదిహేను రోజులు, కన్న తరువాత మూడోనెల వచ్చాకగాని పంపరు. అంతా కలిసి నాలుగైదు నెలల వియోగం అనుకొనేసరికి, ప్రసాద్ కి దిగులనిపించింది.  "తొమ్మిది పడుతూనే రావద్దు, తొమ్మిది నిండాక రండి. నెలలు నిండిన మనిషి ఏం చేసుకొంటుంది? ఏం తింటుంది? అన్న దిగులు మీకొద్దు. ఇక్కడ రుక్మిణి ఆమెను ఒక్కపనీ చేయనివ్వడం లేదు! 'కన్న తల్లి కూడా ఇలా చేయదు' అన్నట్టుగా చూస్తూంది జానకిని. జానకికి ఇక్కడ ఏం కష్టంలేదు! మీరా విషయంలో నిశ్చింతగా ఉండండి" అని వ్రాశాడు ప్రసాద్. "నీ ఇష్టం, నాయనా" అంటూ ఆయన జవాబు వ్రాశారు.

    ఒకరోజు జానకికి తలంటిపోసి, జుట్టు పాయలుచేసి సాంబ్రాణి పొగ వేస్తూంది రుక్మిణి.

    "నీ రుణం ఎలా తీర్చుకోవాలి, వదినా?" జానకి అన్నది.

    "నీకూ నాకూ మధ్య రుణప్రసక్తి ఏమిటి? నువ్విలాగ అంటే నీ మనసు నన్నింకా పరాయిగా భావిస్తూందన్న మాట!" బాధ నిండిన స్వరంతో అంది రుక్మిణి.

    జానకి ఆనందోద్వేగంతో రుక్మిణి చుట్టూ చేతులు పెనవేసి, "నీ లాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా ఎంత అదృష్టం?" అంది.

    "అదృష్టం నీదికాదు, వదినా! నాది! ఎవరూ పలకరించని నన్ను నువ్వు దగ్గరికి తీశావు! నీ స్నేహాన్ని పంచావు. నాకూ పలకరించేందుకు, కష్టం సుఖం చెప్పుకొనేందుకు ఒక తోడు ఉంది, అన్న నిశ్చింత నాకు నీ వల్ల ఏర్పడింది! అదృష్టం నాది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS