"మీ చెయ్యి కాల్తుంటే మంచి చీకులు కాలిన వాసనొస్తుంది బాస్" అన్నాడో రౌడీ.
"అందుకే మీరెప్పుడు శపధం చేస్తారా అని వీడు ఎదురుచూస్తుంటాడు బాస్" అన్నాడు మరో రౌడీ ఇంకొకడ్ని చూపిస్తూ.
"నాకైతే నోరూరిపోతుంది బాస్" లొట్టలు వేస్తూ అన్నాడు ఇంకో రౌడీ.
"షటప్....షటప్....షటప్...." జుట్టు పీక్కుంటూ అరిచాడు మంగులు. "నేను బాధపడుతుంటే మీకంత వేళాకోళంగావుందిరా వెధవల్లారా?!"
"సార్! మీరేమీ అనుకోనంటే నేనో విషయం అడగనా బాస్?" సందేహిస్తూ అన్నాడు వీరూ.
"చెప్పు...." కుడి చెయ్యి ఊదుకుంటూ ఎడమ చేత్తో కన్నీళ్ళు తుడ్చుకుంటూ అన్నాడు మంగులు.
"మీరు అంత బాధపడుతూ కొవ్వొత్తులు ఆర్పుతూ చేతులు కాల్చుకుంటూ శపధాలు చెయ్యకపోతే మామూలుగా శపధం చెయ్యొచ్చు కదా బాస్?"
గజదొంగ గంగులు బాధగా నిట్టూర్చాడు.
"ఈ ఆచారాన్ని మా ముత్తాత మొదలెట్టాడు వీరూ....అప్పటి నుండీ మా తాత, మా నాన్న, నేను, మొన్న చనిపోయిన నా అన్న గంగులు ఈ ఆచారాన్నే ఫాలో అవుతూ వచ్చాం....దీన్ని నేను మానలేను వీరూ....మానలేను!! ....నాకీ బాధ కూడా తప్పదు!" అని మంగులు అక్కడ గోడకి తగిలించి వున్న అతని ముత్తాత ఫోటో దగ్గరికి వెళ్ళి దాని వైపు చూస్తూ నిల్చున్నాడు.
"ఇప్పుడు మన బాస్ ఆయన తాతగారి ఫోటోకి భక్తిగా దండం పెట్టుకుంటాడు చూడు...." అన్నాడు ఓ రౌడీ పక్క రౌడీతో.
ఆ రౌడీ మాట పూర్తయీ కాకమునుపే మంగులు ముత్తాత ఫోటో వంక క్రూరంగాచూస్తూ-
"ధూ....నీ బతుకు చెడా!...." అని ఫోన్ దగ్గరికి వెళ్ళి కమీషనర్ లింగారావ్ నెంబర్ డయల్ చేశాడు.
"హలో!...." అవతలి నుండి కమీషనర్ లింగారావ్ గొంతు.
"నేనేరా కమీషనర్ ....నువ్వు నీ కూతురికి చాలా సెక్యూరిటీని పెట్టావని అనుకుంటున్నా వేమో....కానీ అటువంటివేమీ నన్ను ఆపలేవుగా....నువ్వెంత టైట్ సెక్యూరిటీ పెట్టినా నీ కూతుర్ని చంపుతారా....కాస్కో...." అంటూ ఫోన్ డిస్కనెక్టు చేసి కాలిపోయి మాడిన తన కుడి అర చేతినే చూస్కుని భోరుమన్నాడు గజదొంగ మంగులు.
4
రాంబాబు, చిన్నారావ్ లు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ యింట్లో హాల్లో నేలమీద కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు సాయంత్రం ఆరుగంటలైంది. అప్పటిదాకా ఇద్దరూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ యింట్లో ఇల్లు ఊడవడం, అంట్లు తోమడం, మొదలైన చాకిరీలు నడ్డివిరిగేలా చేశారు. అప్పుడే కాస్త రిలాక్స్ అయ్యారు.
ఆ టైంలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ భార్య మదన మనోహరి వంకరటింకరగా హాల్లోకి నడుచుకుని వచ్చింది. ఆమె చేతిలోని ఓ గిన్నెని ఇద్దరి ముందు పెట్టింది.
"ఏం మేడమ్?....దీన్ని తళతళలాడేలా తోమెయ్యాలా?...." అడిగాడు రాంబాబు.
"ధగధగలాడేలా తోమెయ్యాలా?" లోపల లోపల తిట్టుకుంటూ అడిగాడు చిన్నారావ్.
"తోమడం కాదెహె....ఈ గిన్నెతో బయటికెళ్ళి కాస్త బంకమన్ను తెండి!" బొంగురుగొంతుతో అంది మదన మనోహరి!....
"బంకమన్నా?!....ఎందుకు మేడం?" ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.
"ఎందుకా?....మీ మొహానికి పుయ్యడానికి! నోర్మూస్కుని చెప్పింది చెయ్యండి!...." చికాకుగా అనేసి విసురుగా లొపలికి వెళ్ళిపోయింది మదన మనోహరి.
రాంబాబూ, చిన్నారావ్ ఇద్దరూ ఆమెని బండబూతులు తిట్టుకుంటూ యింట్లోంచి బయటపడ్డారు. కాస్త దూరం వెళ్ళాక వాళ్ళకో బుదర గుంట కనిపించింది.
"హమ్మయ్య....శ్రమపడి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే బురద గుంట కనిపించింది!" తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అన్నాడు రాంబాబు.
"ఓ పంది తన ఫామిలీతో బాటు వుందే!!...."అన్నాడు చిన్నారావ్. రాంబాబు క్రిందికి వంగి ఓ రాయి తీశాడు.
"నువ్వు కూడా తియ్!" అన్నాడు.
చిన్నారావ్ కూడా క్రిందికి వంగి రాయి తీశాడు.
"రెడీ....వన్....టూ....త్రీ...." ఇద్దరూ ఒకేసారి పందుల మీద రాళ్ళు విసిరారు.
పందులు వీళ్ళని పెంటభాషలో తిడ్తూ బురదలోంచి లేచి దూరంగా పారిపోయాయి.
రాంబాబు, చిన్నారావ్ లు బురద గుంటని సమీపించి నేల మీద కూర్చున్నాడు.
రాంబాబు గిన్నెని చేతులో పట్టుకుంటే చిన్నారావ్ దోసిలితో బురద తీసి గిన్నెలోకి వెయ్యసాగాడు.
"ఇంతకీ ఆవిడగారికి ఈ బురదెందుకో ....బహుశా ఏ బ్యూటీ టిప్స్ బుక్ లోనో ఈ బురదని ఫేస్ ప్యాక్ లో ఉపయోగించొచ్చని రాశారేమో!" అన్నాడు చిన్నారావ్.
"కావొచ్చు!" కూల్ గా అన్నాడు రాంబాబు.
"బాబోయ్....అలాగైతే పందులుపొర్లిన ఈ బురదని ఆవిడ మొహానికి రాస్కుంటే ఎలా?" కంగారుగా అన్నాడు చిన్నారావ్.
"బురదని నీ మొహానికి రాస్కో మన్నంత కంగారు పడ్తావేం?....అయినా ఆవిడ మొహానికి ఈ బురదే కరెక్టు!!" అన్నాడు రాంబాబు కసిగా పళ్ళునూర్తూ.
