Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 8

    శ్రీలక్ష్మి చేతులు జోడించింది. "స్వామీ వెంకటేశ్వరా....ఏడు కొండలవాడా....మా పాప స్కూలునుండి క్షేమంగా తిరిగివస్తే నీకు మా ఆయన...."

    ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే లింగారావ్ ఒక్కసారిగా శ్రీలక్ష్మి దగ్గరికి లాంగ్ జంప్ చేసి ఆమె ఇంకేం అనకుండా చేత్తో నోటిని నొక్కేశాడు.

    "ఇంకొక్క ముక్క అన్నావంటే పీక పిసుకుతా....నీకు హామీ ఇస్తున్నాగా....మన దీపకి ఏం కాదు....టైట్ సెక్యూరిటీ ఎరేంజ్ చేశా....నువ్వే చూడు...."అన్నాడు లింగారావ్.

    అందరూ బయటికెళ్ళారు. బయట అరడజను మంది పోలీసుల్తో జీపు రెడీగా వుంది. అందరి చేతుల్లో గన్స్!

    "చూశావ్ కదా....వీళ్ళు దీపని స్కూలుకి తీస్కెళతారు....స్కూలు అయిపోగానే అక్కడి నుండి యింటికి తీసుకొస్తారు" శ్రీలక్ష్మితో చెప్పాడు కమీషనర్ లింగారావ్.

    శ్రీలక్ష్మి మనసు కాస్త నిమ్మళించింది. దీప మమ్మీ డాడీలకి టాటా చెప్పి జీపెక్కింది. డ్రయివర్ జీపుని స్టార్ట్ చేశాడు.

    "సార్....మాకేం ఫర్వాలేదు కదా?"

    ఆ అరడజను మంది కానిస్టేబుల్స్ లో ఒకడు భయం భయంగా కమీషనర్ లింగారావ్ ని అడిగాడు.

    కమీషనర్ లింగారావ్ ఆ కానిస్టేబుల్ కి ఏ సమాధానం చెప్పలేదు. అతను శ్రీలక్ష్మి వంక ఇబ్బందిగా చూశాడు.

    శ్రీలక్ష్మి భర్త వంక కోపంగా చూస్తుండగా జీపు కదిలి ముందుకు వెళ్ళింది.


                                *    *    *    *

    ఆ కాలనీలో....ఒక యింటి కాంపౌండ్ వాల్ దగ్గర....సందు మొదట్లో నక్కి  మెయిన్ రోడ్డువంక చూస్తున్నాడు మంగులు. అతని వెనకాలే వీరూ కూడా నక్కాడు.

    "దీప స్కూలుకి ఈ రూట్ లోనే వెళ్తుంది కదూ?" అడిగాడు మంగులు.

    "అవును బాస్! ఏంటి బాస్ మీ నోట్లోంచి పరపరా శబ్దం వస్తుంది?! టైం పాస్ గా తినడానికి మీరు కూడా అప్పడాలు గానీ తెచ్చుకున్నారా?"అడిగాడు వీరూ.

    "కాదు....నేను కోపంతో పళ్ళు నూర్తున్నా....ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రశ్నలేస్తే పళ్ళు పీకుతా!!" అంటూ మళ్ళీ పళ్ళు పరపరా నూరాడు మంగులు. అతని దృష్టి మొత్తం మెయిన్ రోడ్డుమీదే వుంది.

    అయిదు నిముషాలు గడిచాయి.

    "ఏంటి....ఆ పిల్లని స్కూలుకి తీసుకెళ్ళే ఆటో ఇంకా రాదేం?" అని గజదొంగ మంగులు అంటుండగానే ఆ వైపుగా వెళుతున్న పోలీసు జీపు, వాళ్ళ మధ్యన కూర్చుని దీప వాళ్ళిద్దరికీ కనిపించింది.

    "ఓ...." బాధగా జుట్టు పీక్కున్నాడు మంగులు. ఒరేయ్ వీరూ-ఓ కొవ్వొత్తి ముట్టించరా" అన్నాడు.

    "సారీ బాస్....మీరు రోడ్డుమీద శపధం చేస్తారని అనుకోలేదు. అందుకే నేను కొవ్వొత్తులు తేలేదు....ఈ పూటకి కొవ్వొత్తులు లేకుండానే అడ్జస్టయిపోండి బాస్!" అన్నాడు వీరూ.

    "నో....ఈ మంగులు సంప్రదాయాల్ని, కట్టుబాట్లనీ ఎప్పటికీ మర్చిపోడు. మన డెన్ కెళ్ళాకే శపధం చేస్తా! కానీ నువ్వో విషయం గుర్తుంచుకో....ఇక ముందు ఎప్పుడు, ఎక్కడ, ఏ శపధం చేయాల్సి వస్తుందో నాకే తెలీదు. అందుకే నీ వెంట ఎప్పుడూ కొవ్వొత్తులు తెచ్చుకోతొట్టినాయాలా!" 

    "అలాగే బాస్!" అని వీరూ సమాధానం చెపుతుండగా ఇంటి కాంపౌండ్  లోపలనుండి ఎవరో విసిరిన ఎంగిలి విస్తరాకులు మంగులుమీద పడ్డాయి. "ఆ...." అని బాధగా అరిచి వీరూవంక చూశాడు మంగులు.

    "నా దగ్గర కొవ్వొత్తులు లేవు బాస్. మీరిప్పుడు శపధం చెయ్యలేరు" అన్నారు వీరూ.

    "ఆ...." అని బాధగా అరుస్తూ మరోసారి జుట్టు పీక్కున్నాడు మంగులు.



                                                                   *    *    *    *


    గజదొంగ మంగులు డెన్ లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.కోపంతో బుసలు కొడుతూ, ఉన్నట్టుండి అతని రెండు కాళ్ళూ  ఒకదానికొకటి తట్టుకుని బోర్లా పడిపోయాడు. వీరూ కంగారుగా పరుగున వచ్చి మంగులు జబ్బ పట్టుకుని పైకి లేవదీశాడు.

    మంగులు "హబ్బా!" అని బాధగా అంటూ మోకాలు చిప్పలు రుద్దుకున్నాడు.

    "మీరెంత కోపంలో వున్నా కాస్త నింపాదిగా పచార్లు చెయ్యొచ్చు కదా బాస్....ఇప్పుడు చూడండి ఎలా బోర్లాపడి, మోకాలు చిప్పలు బద్దలు కొట్టుకున్నారో?!" అన్నాడు వీరూ మంగులువంక జాలిగా చూస్తూ.

    "నోర్ముయ్....అసలే చిప్పలు పగిలి నేచస్తుంటే నీ సోదేంటి నాకు. ముందు ఓ కొవ్వొత్తి అంటించి ఇలా పట్రా" మండిపడ్డాడు మంగులు.

    "ఇప్పుడే మోకాలు చిప్పలు బద్దలు కొట్టుకున్నారు. మళ్ళీ అంత అర్జంటుగా చేతులు కాల్చుకోవాలా బాస్....అయినా ఇప్పుడంత అర్జంటుగా ఏం శపధం చెయ్యదల్చుకున్నారు బాస్?" అడిగాడు వీరూ.
   
    "నీ బోడి సలహాలు మాని కొవ్వొత్తి అంటించి తీసుకురా....ఇందాక దీప జీపులో వెళ్ళుతుంటే రోడ్డుమీద శపధం చెయ్యలేకపోయాను కదా....అందుకని ఇప్పుడు శపధం చేస్తా" అన్నాడు గజదొంగ మంగులు.

    వీరూ ఓ లావుపాటి కొవ్వొత్తి వెలిగించి మంగులు ముందుకు చాపాడు. మంగులు కొవ్వొత్తి మంటమీద చెయ్యి పెట్టి శపధం చేశాడు.

    "ఆ కమీషనర్ కి మనశ్శాంతి లేకుండా చేస్తాను. వాడి ముద్దుల కూతుర్ని కిడ్నాప్ చేసి చంపుతా!"

    కొవ్వొత్తి మీద చెయ్యి పెట్టి మంటని ఆర్పేశాడు.

    "ఆ...." చెయ్యి కాలి బాధగా అరిచాడు మంగులు.

    "ఆహా....ఒహో...." అంటూ ఆనందంగా అన్నారు డెన్ లోని రౌడీలు.

    "ఏంట్రా మీ గోల?!" మండుతున్న చేతిని ఊదుకుంటూ అడిగాడు గజదొంగ మంగులు.                         
                        
                                     
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS