మూడో గూండా గోపి మీదకి వెళ్ళాడు. పీ ఇచ్చిన కరాటేఫైటు తృప్తిగాతిని బోర్లాపడ్డాడు.
తర్వాత నాలుగోవాడు ముందుకొచ్చాడు.
"హీ...హో ...హు" అంటూ ఒంటేలుపోసే కుక్కలా కాలెత్తి రకరకాల విన్యాసాలు చేశాడు వాడు.
గోపి వాడి డిప్పమీద నాలుగు తగల్నిచ్చాడు.
అంతే. వాడు వెల్లకితలా పడి చీపురుదెబ్బ తిన్న బొద్దింకలా గిలగిలా తన్నుకుని లేచి నిలబడ్డాడు.
ఈసారి నలుగురు గూండాలు ఒక్కసారిగా గోపిమీద విరుచుకుపడ్డారు.
గోపి వాళ్ళని ఎగిరెగిరి తన్నసాగాడు.
అతిఘోరంగా ఫైటింగ్ జరుగుతుంటే ఆ అమ్మాయి మాత్రం ఏమాత్రం ఫీలవకుండా ఓ చెట్టుకింద నిలబడి సంతోషంతో ఎగుర్తూ చప్పట్లు కొడ్తూ "హిహిమి.... హిహిహి..." అని నవ్వసాగింది.
గోపి వాళ్ళని తన్నుకుంటూ తన్నుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తీస్కెళ్ళాడు.
తర్వాత వాళ్ళని ఒక్కొక్కడినీ తంతుంటే వాళ్ళు ఎగిరి చెర్లోదూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయారు.
అప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా చప్పట్లు కొట్టి "భలే... భలే. మా బాగాతన్నారు బాబుగారూ" అంది ఛెంగు ఛెంగున గంతులేస్తూ.
"సర్లే. ముందా చీర తీసికట్టుకో ..." అన్నాడు గోపి కళ్ళు మూస్కుంటూ."
ఆ అమ్మాయి సిగ్గుతో చితికిపోయి నేలమీద ఉన్న చీర తీస్కుని కట్టుకుంది.
"ఊ. ఇప్పుడు చెప్పు. ఎవరు నువ్వు? ఆ మనుషులు నిన్నెందుకు బలవంతం చెయ్యాలని చూస్తున్నారు?" అని అడిగాడుద్ గోపి.
"నాపేరు సీతాలు బాబూ. ఆ సచ్చినోళ్ళు రాయుడు మనుషులు బాబూ" అంది సీతాలు.
"రాయుడా? వాడెవడు?
"రాయుడు పరమ దుర్మార్గుడు బాబూ. యిక్కడ అందరూ పేదోళ్ళేగానీ ఆయనొక్కడే భూస్వామి బాబూ.
ఇందాక ఆ గూండాలు నన్ను బలవంతంచేసి తర్వాత నన్ను తీస్కెళ్ళి ఆ రాయుడికి అప్పజెప్పాలని అనుకున్నారు బాబూ. సమయానికి మీరొచ్చి దేవుడిలా కాపాడారు."
గోపి ఏవగించుకుంటూ అన్నాడు. "ఏంటీ? రాయుడి మనుషులు ఇంత నమ్మకద్రోహంగా ఉంటారా? అతని ఉప్పు తింటూ ఆయనకే ద్రోహం చేస్తారా?"
"అదేంటి బాబూ అలా అంటారు?"
"లేకపోతే నిన్ను ముందుగా వాళ్లు అనుభవించడం ఏమిటి? మర్యాదగా రాయుడికి అప్పగించాలిగానీ..."
"బాబూ! అయితే రాయుడు నా శీలం కొల్లగొట్టినా పర్వాలేదా బాబూ? నేను సీతా, అనసూయా, సావిత్రిలు పుట్టినదేశంలో పుట్టాను బాబుగారూ..." ఆవేశంగా అంది సీతాలు.
గోపి తన పొరపాటుకు నాలుక కొరుక్కున్నాడు.
"అది కాదు సీతాలూ... నా ఉద్దేశం అది కాదు... యజమాని ఉప్పుతిని యజమానికి ద్రోహం చెయ్యకూడదని అంటున్నాను...పవిత్రమైన శీలాన్ని అపహరించడం తప్పేననుకో..."
"శీలం ఎవరిదయినా పవిత్రమయినదే బాబుగారూ"
"కానీ నీ శీలం గంగానది అంత పవిత్రమయినది సీతాలూ"
"ఎంత పవిత్రం అయితే ఏంలే బాబూగారూ..." కుమిలిపోతూ అంది సీతాలు.
"నీకేం భయంలేదు సతాలూ... ఇప్పుడు ఈ పేటకి నేను వచ్చానుగా.... ఆ రాయుడుగానీ, వాడి మనుషులుగానీ, ఈ పేటలోని ఏ ఆడదాని శీలాన్ని ఏమీ చెయ్యలేరు" ఆవేశంగా అన్నాడు గోపి.
"బాబూగారూ..." ఆనందంగా అంది సీతాలు.
"బాబూగారూ కాదు. మనలో మనకి గొప్పా బీదా తేడాల్లేవు. నన్ను గోపి అనే పిలువ్" ప్రేమగా చూస్తూ అన్నాడు గోపి.
"గోపి బాబూ..." బొట బొటా ఆనంద భాష్పాలు రాలుస్తా అంది సీతాలు .
"రాధా...రాధా."
గోపి హుషారుగా యింట్లోకి అడుగుపెట్టాడు.
"ఆ... మీరా?....వచ్చారా?? రండి!!" అంది రాధ చాలా నిర్లిప్తంగా.
"రాధా...నాకు ఆకలి చాలా దంచేస్తుందిగానీ త్వరగా వడ్డించు" అన్నాడు గోపి.
"కాళ్ళు కడుక్కుని రండి"
గోపి కాళ్ళు కడుక్కుని పీటమీద కూర్చున్నాడు. రాధ గోపి కంచంలో అన్నం వడ్డించింది.
"మరి నీ కంచం ఏది?" అడిగాడు గోపి.
"నాకు అప్పుడే ఆకలిగా లేదండీ.... నేను కాస్సేపయ్యాక తింటాను."
"రాధ... ఏనాడయినా నువ్వు నాతోకాకుండా విడిగా తిన్నావా రాధా?"
"సరేలే... ఈ పూటకి తినండి. నాకు బొత్తిగా ఆకలిలేదు. కాస్సేపయ్యాక తింటానుగా."
గోపి అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయాడు కానీ ఎందుకో అనుమానం వచ్చి రాధవంక చూశాడు.
రాధ కళ్ళలో నీళ్ళు!
గోపి చూడగానే తన మొహాన్ని చటుక్కున అటువైపుకి తిప్పేసుకుంది. కానీ రాధ కన్నీళ్ళు గోపి చూడనే చూశాడు.
గోపి తన ముందున్న మట్టికుండ మూట తెరిచి చూశాడు!
అది ఖాళీగా ఉంది.
అంటే ఇంట్లో బియ్యం కూడా లేవన్నమాట!! ఉన్న కాస్త అన్నం తనకి లేకుండా రాధ మొత్తం అతనికే పెట్టేసింది!!
"రాధా" బాధగా అరిచాడు గోపి.
8
గోపి అరచిన అరుపుకి రాధ తుళ్ళిపడి వెనక్కి పడి తర్వాత సర్దుకుని కూర్చుని మోకాళ్ళు మధ్యన మొహం పెట్టుకుని "ఉహు... ఉహు" అంటూ కుమిలి ఏడ్చింది.
"ఏంటి రాధా! నేనొక్కడినే తిండిపోతునని అనుకున్నావా? నన్ను బకాసురిడిని అనుకున్నావా రాధా?" ముక్కు పోంగిస్తూ అన్నాడు గోపి.
"హేవండీ" బావురుమంది రాధ.
"ఊర్కో రాధా ఊర్కో ఏదయినా మనం సగం సగం రాధా. కష్టమయినా, సుఖమయినా,చివరికి భోజనమయినా సరే రాధా"
"మరి మీ అమ్మో?" కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ.
"పోని కష్టసుఖాల్లో మనిద్దరం సగం.... సగం. భోజనం విషయంలో మాత్రం మనం ముగ్గురం. వన్ బై త్రీ రాధా."
"మీరు ఎంత మంచివారండి" అంది రాధ ఆనందంగా గోపి వంక చూస్తూ.
"మా అమ్మ భోజనం చేసిందా?" అడిగాడు గోపి.
"ఓ... ఇందాకే మింగేసి గుర్రుపెట్టి నిద్దరోతున్నారు..." చెప్పింది రాధ.
"నిజంగా ఆవిడ దేవత రాధా" అన్నాడు గోపి. అలా ఎందుకన్నాడో అతనికే తెలీదు
"అవునండీ" అంది రాధ.
"సరేగానీ కాస్త దగ్గరకు జరుగు - పాపం నీకు ఆకలేస్తున్నట్టుంది" అన్నాడు.గోపి కంచాన్ని చేతిలోకి తీసుకుంటూ.
రాధ గోపి దగ్గరకు జరిగింది.
గోపి అన్నాన్ని కూరతో కలిపి ముద్దలుచేసి ఒక ముద్దని రాధనోటికి అందించాడు. రాధ ఆ ముద్దని గుటుక్కున మింగి కంచంలో తన చేతిని. ఎగబడి పెట్టి ఓ ముద్దు అందుకుని గోపి నోట్లో కుక్కింది. గోపి కూడా తన శక్తివంచన లేకుండా ఆ ముద్దని గుటుక్కున మింగాడు.
అలా ఇద్దరూ ఒకరికొకరు ముద్దలు నోటికి అందించుకుంటూ, గుటుక్కున మింగుతూ కంచం మొత్తం ఖాళీ చేసేవారు.
రాత్రి...
గోపి "కెవ్వు కెవ్వు" మని కేకలు వేస్తుండగా అతని ఛాతీమీది వెంట్రుకలు సరసంగా పీకుతూ అంది రాధ.
"మీరు ఏదయినా పని చెయ్యందే ఇల్లు గడవదండి."
"అలాగే కెవ్ వ్ ... రాధా" అన్నాడు గోపి ఛాతీ మంటెక్కి బాధపడుతూ.
"ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి"
రాధ నాలుగు వెంట్రుకలు పీకేసింది.
"ఇందాక నువ్వు చాలీచాలకుండా కెవ్ వ్-అన్నం పెట్టినపుడే కెవ్ వ్ అనుకున్నా రాధా కెవ్ వ్."
