గోపి ఇంటి చూరు మీదినుండి గుభీల్ అని కిందికి దూకాడు.
"చూశావా రాధా! మన ఇల్లు ఎంత బాగుందో?" అన్నాడు గోపి. రాధా, సరస్వతి ఇంటిని చూసి మురిసి ముక్కలయ్యారు.
"హబ్బ! ఎంతబాగా ఉందండీ మన ఇల్లు?" అంది రాధ ఆశ్చర్యంగా చూస్తూ.
"ఊ...మరేం అనుకుంటున్నావ్?" నెత్తికి చుట్టిన టవల్ విప్పి గట్టిగా దులిపి భుజంమీదేస్కున్నాడు గోపి.
గోపీ అప్పుడే వెదురు బొంగులతోనూ, తాటాకులతోనూ ఓ చక్కని ఇల్లు కట్టాడు.
"అమ్మాయ్ రాధా! కొత్తింట్లో పాలు పొంగించమ్మా" అంది సరస్వతి.
"అలాగే అత్తయ్యా!" అంటూ రాధ ఓ సిల్వర్ గిన్నెపట్టుకుని దారిని పోతున్న ఓ ఆవుని పట్టుకుని చకచకా పాలు పితికి ఆ పాలను ఇంట్లో పొంగించింది.
"నేటినుంచీ ఈ తాటాకుల ఇల్లే మన పాలిటి మమతల కోవెల బాబూ!" అంది సరస్వతి ఆనంద భాష్పాలు రాలుస్తా.
"హబ్బా!...." ఉద్వేగంగా అని గోపీ తల్లిని కౌగిలించుకుని తను కూడా యధాలాపంగా ఆనందభాష్పాలు రాల్చాడు.
మీ ఇద్దరేనా ఉన్నది? నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్టు రాధ కూడా తన శక్తికి మించి బోలెడు ఆనంద బాష్పాలు రాల్చింది.
తర్వాత హఠాత్తుగా రాధకీ, గోపికీ మూడ్ వచ్చి పాటందుకున్నారు.
గోపి : ఈ పొదరిల్లు మన హృదయాన విరిసిన హరివిల్లు.
రాధ : మనకాపురం - అది పవిత్రమైన గుడిగోపురం.
గోపి : రాధ : కలిసి మెలిసి ఉందాం
మనం జీవితకాలం
లేదులే ఎన్నటికీ
మనకి పోయే కాలం
గోపి " ఈ పొదరిల్లు, మన హృదయాన
విరిసిన హరివిల్లూ
లా...లా...లా...
లలల...లాలా...
రాధ : ఓ...హో...హో...
హొహొహొ.... హోహో...
గోపి: ఈ ఇంటికి దీపం నువ్వైతే
ఆ దీపం నూనే మాయమ్మా.
రాధ : మీ అమ్మ నాకు అత్తయినా
ఆ అత్తే నాకు దేవతలే...
గోపి : ఆ...ఆ...ఆ...
రాధ: ఓ...ఓ...ఓ...
గోపి : ఈ పొదరిల్లు... మన హృదయాన విరిసిన హరివిల్లు
రాధ: మన కాపురం... అది పవిత్రమైన గుడి గోపురం
పాటంతా అయ్యేసరికి ఆ ప్రదేశం మొత్తం బురద బురదగా అయిపోయింది.
"హర్రే?.... మనం పాట పాడుతూ గమనించనే లేదండీ...ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం బురదగా ఉంది... వర్షంగానీ పడిందో ఏమిటో?" అంది రాధ.
ఆ మాటలకి సరస్వతి ఫక్కున నవ్వింది.
"అది వానవల్ల ఏర్పడిన బురద కాదమ్మా... మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఛెంగు ఛెంగున ఎగుర్తూ పాట పాడ్తుంటే నేను ఆనంద భాష్పాలు రాల్చాలనన్నమాట!"
హత్తయ్యా... నువ్వు దేవతవి అత్తయ్యా! లేకపోతే కోడలు సంతోషంగా ఉండటం చూసి ఏ అత్తయినా ఆనంద భాష్పాలు రాలుస్తుందా?" అంది రాధ తబ్బిబ్బు అయిపోతూ.
వెంటనే సరస్వతి మొహం మాడ్చుకుంది.
"అనమ్మా... అను! ఎంతైనా నేను నీకు పరాయిదాన్నే కదా?" అంది బుంగమూతి పెట్టి.
"అత్తయ్యా! నేనిప్పుడు తప్పుమాట ఏమన్నానత్తయ్యా?" బెంబేలుపడిపోతూ అంది రాధ.
"అవును తల్లి! నేను నీకు అత్తయ్యనేగా...అమ్మని కానుగా?"
"కాదు-అత్తయ్యా! నువ్వు అత్తవు కాదు-నాకు అమ్మవు..." అంది రాధ.
"హమ్మా రాధా!"
"హత్తమ్మా!"
రాధా, సరస్వతి బిగియార కౌగిలించుకున్నారు.
వాళ్ళని చూసి గోపి ఆనందభాష్పాలు రాల్చాడు.
7
ఆరోజు ఉదయమే గోపి ఊరుమీద పడ్డాడు. గోపి ఉల్లాసంగా పొలం గట్టుమీద నడుస్తూ ఉన్నాడు.
ఉన్నట్టుండి అతనికి "కెవ్వు" మని ఎవరో అరిచినట్టు వినిపించింది.
"ఎవరబ్బా గుండెలదిరేలా ఇలా కెవ్వుకెవ్వుమని అరుస్తున్నారు" అని ఆశ్చర్యపోయాడు.
మళ్ళీ "కెవ్వు... కెవ్వు" మని ఓ ఆడకూతురు ఆర్తనాదం చేసింది.
"ఎవరో ప్రమాదంలో ఉన్నారు. లాభంలేదు. నేవెళ్ళి రక్షించాల్సిందే!" అనుకుని పొలాల గట్లమ్మట ఆర్తనాదం వచ్చిన దిక్కుకు పరుగుతీశాడు గోపి.
ఆర్తనాదం సౌండు మరికాస్త పెరిగింది.
గోపి పరుగువేగం కూడా అందుకుంది.
హఠాత్తుగా గోపి కాల్జారి బురదలో పడిపోయాడు.
అంతే. గోపి ఆ బురదలోనే కొన్ని గజాలు ఈతకొట్టి తర్వాతలేచి నిలబడి మళ్ళీ పరుగందుకున్నాడు.
కాస్తదూరం పరుగుతీశాక అతని కళ్ళముందు ఒక ఘోరమైన దృశ్యం కనిపించింది.
ఒక ఆడ కూతురుని నలుగురు గూండాలు బలవంతం చేస్తున్నారు.
గోపి ఉగ్రుడైపోయాడు.
"అర్రేయ్!" గట్టిగా అరిచాడు. అలా అరవటంచేత గొంతు పట్టుకుపోయి అతనికి దగ్గొచ్చేసింది.
కాస్సేపు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ దగ్గి తర్వాత తమాయించుకుని మళ్ళీ గట్టిగా అరిచాడు.
ఒర్రేయ్!
కానీ గోపిఉనికినే వాళ్ళు గమనించలేదు.
గోపి అంతగా అరిచినా వాళ్లు అతనివైపు చూడనైనా చూడకుండా ఆ అమ్మాయిని నాలుగువైపులనుండి ఒకడు కాలు, ఒకడు చెయ్యి ఒకడు పైట, మరొకడేమో జుట్టుపట్టి లాగుతున్నారు.
తనని వాళ్ళు అస్సలు ఖాతరు చెయ్యకపోవడం గోపిని చాలా బాధించింది.
అందుకని జుట్టు పీక్కుని, ముక్కు పొంగించి సైడు యాంగిల్లో నిలబడ్డాడు.
ఇంతలో "కేరు...బేరు" మంది ఆ అమ్మాయి.
గోపీ తల ఎత్తి చూశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి కేవలం లంగా, జాకెట్టుతో ఉంది. ఒక గుండా చీర ఉండచుట్టి దూరంగా విసిరేస్తూ కనిపించాడు.
ఇక తాను బాధపడ్తూ తాత్సారంచేస్తే ఒక పవిత్ర భారతనారి శీలం మంటగలిసి పోతుందని గోపీకి అర్థమయ్యింది.
అంతే...
"హొర్రేయ్!" అని అరుస్తూ ఒలింపిక్స్ హైజంప్ రికార్డులు బద్దలుచేస్తూ గాల్లోకి ఎగిరి ఓ అరడజను పల్టీలు గాల్లోనేకొట్టి తర్వాత ఒకడి గుండెల మీద ధడేల్ మనితన్నాడు. ఆ దెబ్బకి వాడు పది గజాల దూరం ఎగిరిపడ్డాడు. వేరే ఎవరైనా అయితే గుండెల మీద అంతచేటు తన్ను తన్నినందుకు కిక్కురుమనకుండా చచ్చూరుకునేవాడే.
కానీ ఆ గూండామాత్రం వెంటనే నేలమీదికి చటుక్కున లేచి నిలబడి "ఒరెయ్ ఎవడ్రా నువ్వూ?" అంటూ చొక్కా చేతులు మడిచి పిడికిళ్ళు బిగించి మీదికి దూసుకుని వచ్చాడు.
కానీ గోపీ అతిలాఘవంగా తప్పుకున్నాడు.
ఆ దెబ్బకి గుండా రివ్వున ముందుకెళ్ళి నేలమీద దుమ్ములో బోర్లాపడిపోయాడు.
గోపి పకపకా నవ్వి "నేను మీపాలిట యముణ్నిరా... హహహ"అన్నాడు.
వాడుకూడా అంతదూరం ఎగిరిపడ్డాడు.
అప్పుడు మొదటిగూండా "ఒరేయ్. నీపని పడ్తాను చూడ్రా." అంటు గుండు రుద్దుకుంటూ గోపివైపు రాబోయాడు కానీ వాడిని మూడో గూండా అడ్డుకున్నాడు.
"ఏంట్రా సన్నాసి నాయాలా? ఇందాకేకదా వాడితో తన్నులు తిన్నావ్. ఇప్పుడు నావంతైతే మళ్ళీ నువ్వే వెళ్తావేం?"అన్నాడు మూడో గూండా పళ్ళు నూర్తూ.
"ఓ అవునుకదూ? నేనా విషయమే మర్చిపోయా..." పక పకా నవ్వుతూ ప్రక్కకి తప్పుకున్నాడు మొదటి గూండా.
