Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 10

    "ఎందుకండి అలా బాధ పడుతున్నారు? మీకు పని చెయ్యడం అంటే ఇష్టంలేదా?"బాధగా అడుగుతూ అతని ఛాతీమీదవి మరో రెండు వెంట్రుకలు మెలేసి పీకింది రాధ.
    "కెవ్ వ్... నువ్వు నా ఛాతీమీది వెంట్రుకలు పీకుతుండడం వల్ల కెవ్ వ్... బాధగా అరుస్తున్నాను గానీ పనిచేయాల్సి వస్తుందని కెవ్ వ్... బాధపడి కాదు రాధా."
    రాధ నాలిక కర్చుకుంది.
    "సారీ అండి" రాధ గోపి ఛాతీ మీదినుంచి చెయ్య తీసేసింది.
    "థాంక్స్ రాధా! నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను" ఛాతీ రుద్దుకుంటూ అన్నాడు గోపి.
    "పవిత్ర భారతనారెప్పుడూ భర్త క్షేమాన్నే కోరుకుంటుందండి" అంది రాధ గోపి ఛాతీమీద మళ్ళీ చెయ్యేసి మూడు వెంట్రుకలు పీకేస్తూ.
    "బేర్ ర్-" అన్నాడు గోపి.
    "ఓహ్... సారీ అండి" కిల కిలా నవ్వింది రాధ తన చేతిని వెనక్కి తీసుకుంటూ.
    "రాధా-రేపే నేను ఏదయినా పనిచేసి నిన్నూ, అమ్మనూ పోషిస్తా రాధా-"హఠాత్తుగా ఆవేశంగా అనేశాడు గోపి ఎందుకో.
    "ఏం చేస్తారండీ... ఏదయినా ఆఫీసులో గుమాస్తాగా చేస్తారా?" గోముగా అడిగింది రాధ అతని ఛాతీమీద చేయ్యేస్తూ.
    గోపి భయంగా రాధ చేతిని తన ఛాతీమీదనుండి తీసేస్తూ అన్నాడు."ఛీ...థూ...ఎబ్బే యాక్."
    "గుమస్తా పనికాకపోతే ఆఫీసర్ పనిచేస్తారా?" ఆశగా అడిగింది రాధ.
    "ఛీ...ఛీఛీ...ఛీఛీఛీ...థూ...థూథూ...థూథూథూ..."
    "ఊర్కే ఛీఛీ...థూథూ అంటూ నా మొహం ఉమ్ముతో తడిచేలాగా అనకపోతే అసలేం పనిచేస్తారో చెప్పకూడదా?..." అంది రాధ పైటకొంగుతో మొహం తుడుచుకుంటూ.
    "కూలి పనిచేస్తా... రాళ్ళుకొడ్తా..." కళ్ళు పెద్దవిచేస్తూ అన్నాడు గోపి.
    "హవ్వా... అదేంటండీ... మీరేమైనా చదువూ సంధ్యా లేనివాళ్ళా.... ఏ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళినా మీకు ఉద్యోగం ఇస్తారు కదండీ...
    "ఠట్...వీల్లేదు...నేను కూలిపనో...అలాంటి పని మరోటి ఏదైనా చేస్తాను...నువ్విక ఏం మాట్లాడకు... అంతే..." అంటూ రాధని లటుక్కున వాటేస్కున్నాడు గోపి.
                                                                            ***
    తెల్లారింది.
    రాధ ఇంటిముందు ముగ్గెట్టి తర్వాత వేడివేడి గంజి కాచి గ్లాసులో పోసి గోపికి ఇచ్చింది.
    గోపి 'సర్ ర్.... సర్ ర్..."అని శబ్దంచేస్తూ గంజి తాగుతుంటే రాధ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.
    "చిక్కని ఇన్స్టెంట్ కాఫీలూ, బోర్నవీటాలూ తాగే మీకు ఇలా నా చేతులతో గంజి ఇవ్వాల్సివస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి...." బాధపడుతూ అంది రాధ.
    గంజి గటగటా త్రాగేసి రాధ చేతికి అందించాడు గోపి.
    "బాధపడకు రాధా... మనకు త్వరలో మంచిరోజులువస్తాయ్..... నీతి, న్యాయం వున్నవైపే భగవంతుడు కూడా వుంటాడ్రాధా.... నేను కూలిపని సంపాదించి పెద్ద ఇల్లూ... దాంట్లోకి ఫ్రిజ్... కలర్ టివి.... వి.సి.ఆర్.... అన్నీ కొంటాను రాధా...అప్పుడు మనం రోజూ చిక్కని ఫిల్టర్ కాఫీ త్రాగుదాం రాధా..." అన్నాడు గోపి రాధ తలనిమురుతూ.
    "హేవండీ..." రాధ ఆనందభాష్పాలు రాల్చింది.
    "నేనిక వస్తాను రాధా...కూలిపని వెతుక్కోవాలి!...."
    గోపి రెండడుగులు వీధి గుమ్మంవైపు వేశాడు.
    "నాయనా గోపీ...."
    వెనుకనుండి తల్లి సరస్వతి గొంతు వినిపించింది.
    గోపి వెనక్కి తిరిగాడు.
    "ఏంటమ్మా?"
    "ఇలా రా నాయనా?...."
    "దగ్గరకు పిలిచి అప్యాయంగా కౌగిలించుకుందామనేనా?....వద్దమ్మా.... నాకు టైమైపోయింది.... నేను కూలిపని వెతుక్కోడానికి పోవాలి!" హడావిడిగా అన్నాడు గోపి.
    "అదికాదు నాయనా... ఇలారా... రావాలి మరి!" కళ్ళల్లో తల్లి ప్రేమనంతా నింపి అంది సరస్వతి.
    గోపి దగ్గరకువెళ్ళి నిల్చున్నాడు.
    "ఏంటమ్మా?"
    "రాత్రి గదిలో మీ ఇద్దరూ అనుకుంటున్న మాటలన్నీ విన్నాను బాబూ..." ఎంతో గొప్పపని చేసినట్టుగా చెప్పిందిసరస్వతి.
    "ఆ.... మా మాటలన్నీ విన్నావా అమ్మా...అయితే ఆ తరువాతి శబ్దాలు?!...." అయోమయంగా చూస్తూ అడిగాడు గోపి.
    "అవికూడా విన్నాను బాబూ..." పైట నిండుగా కప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ అంది సరస్వతి.
    ఆ మాట వింటూనే రాధ సిగ్గుతో చితికిపోతూ మొహం ఎర్రగా కందిపోగా "ఫో అత్తయ్యా మీరు మరీనూ...." అంది.
    "నువ్వు ఎంత మంచిదానిని అమ్మా.... మా అనురాగానికి ఈర్ష్య చెందకుండా చక్కగా నవ్వుతూ చెప్తున్నావ్! నువ్వు దేవతవే అమ్మా... సరేగానీ నువ్వు ఏమేం శబ్దాలు విన్నావ్? త్వరగా చెప్పాలి మరి!" అన్నాడు గోపి హుషారుగా.
    "పోరా చిలిపి సన్నాసెదవా...." ఫెటీల్మని గోపి టెంకి మీద సర్దాగా ఒక్కటిచ్చింది సరస్వతి "నిన్నిప్పుడు ఆ శబ్దాల గురించి మాట్లాడటానికి పిలవలేదు."
    "మరి?...."
    "నువ్వు కూలిపనిచేసి రాళ్లుకొట్టి సంపాదిస్తానని అంటున్నావ్ కదా?.... అలా చెయ్యకు బాబూ నేను చూళ్ళేను... లేత తమలపాకుల్లాంటి నీ అరచేతులు బొబ్బిలెక్కిపోతే నేను భరించలేను బాబూ..." అంది కొడుకు అరచేతుని తనచేతిలోకి తీస్కుని దుడ్డుముక్కల్లాంటి అతని వేళ్ళని నిమురుతూ.
    "మరి నేను కూలిపని చేయకపోతే ఇల్లెలా గడుస్తుందమ్మా?..."
    "నువ్వు రిక్షాతొక్కు బాబూ..."
    "అమ్మా.... కానీ రిక్షా కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు కదమ్మా...
    "ఆ డబ్బులు నీకు నేనిస్తాన్రా..." అంటూ తన కొంగుచివర్న ఉన్న చిన్న మూటను చూపించింది సరస్వతి.
    "హమ్మా..." ఆనందంగా అన్నాడు గోపి.
    "హత్తయ్యా..." రాధకూడా అంతే ఆనందంతో అంది.
    సరస్వతి కొంగు చివర్న ఉన్న మూటనివిప్పి అందులోంచి పచ్చనోట్లు తీసి గోపికి ఇచ్చింది.
    "నువ్వు దేవతవి అమ్మా...దేవతవి!" గోపి సరస్వతిని గట్టిగా కౌగిలించుకుని బిక్కిరిబిక్కిరి చేసేశాడు.
    ఆ దెబ్బకి ఊపిరి సలపక సరస్వతి "కేర్ ర్...బేర్ ర్...." అంది.
                                                                    9
    గోపి హుషారుగా డొంక దోవమ్మట నడుస్తూ ఉన్నాడు. అతని చేతిలో సరస్వతి ఇచ్చిన నోట్లు ఉన్నాయ్. ప్రస్తుతం అతను రిక్షా కొనుక్కోవడానికి వెళ్తున్నాడు.
    కాస్తంత దూరం వెళ్ళగానే దారి ప్రక్కగా ఉన్న ఒక చెట్టుమీద నుండి దభీమని ఒక రౌడీ దూకాడు. గోపి ఆగి వాడివంక చూశాడు.
    ఇంతలో మళ్ళీ దభీమని శబ్దం వచ్చింది ఈసారి వెనుక నుండి, గోపి వెనక్క తిరిగి చూశాడు. మరో రౌడీ చెట్టుమీదనుండి దూకి రెడీగా ఉన్నాడు.
    "దభీ.... దభీ" కుడిప్రక్క, ఎడమ ప్రక్కల నుండి కూడా శబ్దాలు వచ్చాయ్.
    రెండువైపుల నుండి మరో ఇద్దరు రౌడీలు దూకారు. నలుగురూ రౌడీలూ అతనిచుట్టూ నిల్చున్నారు.
    నలుగురూ అంతకుముందు సీతాలుని బలవంతం చేయబోయి గోపిచేత తన్నులు తిన్నవాళ్ళే"....
    "ఏంటిది?.... నా దారికి అడ్డులేవండి... ప్లీజ్" రిక్వెస్టుచేస్తూ వాళ్ళతో అన్నాడు గోపి.
    "హ్హ హ్హ హ్హ...." గట్టిగా నవ్వాడు మొదటి రౌడీ. రెండో రౌడీ మెడమీద చేతితో రుద్దుకున్నాడు.
    మూడో రౌడీ ఏదో కసకసా నముల్తూ క్రూరంగా వంకరగా నవ్వాడు.
    "నాలుగో రౌడీ మెడచుట్టూ ఉన్న మప్లర్ ని ముడేసి బిగించి, అది పీక్కి పట్టుకుపోతే "కేర్ ర్." అని అరిచి మళ్ళీ ముడిని కాస్త వదులుచేసి గోపివంక వికటాట్టా హాసం చేశాడు.
    గోపీ కంగారుగా వాళ్ళవంక చూశాడు.
    "ఏంటిది? దారికి అడ్డులేవండి." అన్నాడు.
    కానీ వాళ్ళు అతనిమాట వినలేదు.
    నలుగురూ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ అతనికి చేరువగా రాసాగారు.
    గోపీ కంగారుగా తనచుట్టూ తాను గిరగిరా తిరిగాడు.
    "మమ్మల్నే తంతావు కదూ? చూడు. ఇప్పుడు నిన్నేం చేస్తామో. హ్హ హ్హ హ్హ గట్టిగా నవ్వాడు మొదటి రౌడీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS