రెండు విశేషాలు
"లతా! నువ్వు కూడా అందరిలాగే అనుకుంటున్నావా?
నేను నిజంగా ఏ పాపం ఎరగను. నా మాట నమ్ములతా? నా మాట నమ్ము....నువ్వు కూడా నా మాట నమ్మకపోతే నేనేమైపోవాలి! లతా-నేనేమైపోవాలి!...."
అందరూ చప్పట్లు కొట్టేశారు.
అంతవరకూ నాగేశ్వరరావు డైలాగ్సు, నటన అనుసరించడమైంది. రామారావు అదే డైలాగ్సు ఎలా చెబుతాడో అనుకరించడం మొదలుపెట్టాను. అలా చాలామంది నటులను అనుకరించాను. ఒకో నటుడి అనుకరణ ముగిసి నప్పుడల్లా అంతా చప్పట్లు కొట్టేస్తున్నారు. నాలో ఉత్సాహం క్రమక్రమంగా పెరిగిపోతోంది.
నిజానికి నేనున్నది ప్రదర్శనశాల కాదు. నేను పనిచేసే ఆఫీసు. మా ఆఫీసరు ప్రస్తుతం టూర్లోవున్నాడు. ఇంకా రెండ్రోజులదాకా రాడు. ఎవరికీ ఆట్టే పనిలేదు.
ఆయన ఊళ్ళో వున్నప్పుడు ఎవరికీ క్షణం తీరుబడి వుండదు. మనిషి మంచివాడే కాని మాట కటువుగా వుంటుంది. ఎప్పుడూ నవ్వడు.
మా ఆఫీసరూళ్లో లేనప్పుడల్లా మాకు ఆఫీసు ఓ క్లబ్బులాగుంటుంది. చాలా సరదాగా కాలక్షేపం చేస్తాం. అందరూ కాస్త కష్టపడి వున్నపనిని రాజుకంటే శీఘ్రంగా ముగించి కులాసాకబుర్లు మొదలుపెడతాము. ఈ విధమైన కాలక్షేపాల్లో నాదే అగ్రస్థానము. నా అనుకరణ విద్య-మవాళ్ళందరికీ కలిగించే ఆనందానుభూతి అంతా యింతా కాదు.
ఈ విద్య చిన్నప్పట్నించీ అలవడింది. ఎవరినైనా చూస్తే-వాళ్ళమాట, నడక వగైరాలన్నింటినీ ఇట్టే పట్టేసేవాణ్ణి.
మనం నిత్యంచూసే మనిషి ప్రవర్తన మనకు వింతగా అనిపించకపోవచ్చు. కానీ అనుకరణ విద్యకు అలవాటుపడ్డ నాబోటివాళ్ళకా ప్రవర్తనలోని వింతలన్నీ కనబడతాయి. ఒకసారి నేను అనుకరించి చూపాక ఆ మనిషి ప్రవర్తన మళ్ళీ చూస్తే అందరికీ నవ్వు పుడుతుంది. అందుకే అనుకరణ విద్య అందరికీ వినోదాన్నిస్తుంది-అనుకరించబడ్డ వ్యక్తికి తప్ప!
నేను విశ్రాంతి తీసుకోబోతూండగా మోహన్ అన్నాడు "ఇంక ఒక్కటి మిగిలింది-మన ఆఫీసర్నిమిటేట్ చేయాలి...."
నేనులిక్కిపడ్డాను. మిగతా విషయాల్లో ఎంత ఫ్రీగా ఉన్నప్పటికీ ఆఫీసర్నిమిటేట్ చేయాలనేసరికి నాకు ఆఫీసులో ఎటు చూసినా మా ఆఫీసరే కనిపించాడు. కనిపించడంలోనూ మామూలుగా కాదు-రూక్షకషాయిత వీక్షణాలతో!
అయితే మా ఆఫీసర్నిమిటేట్ చేయడం నాకు కొత్త కాదు. ఇంట్లో శ్రీమతివద్ద చాలాసార్లాయన్నిమిటేట్ చేశాను. ఆఫీసరుగారి ప్రవర్తన ఎలాగుంటుందంటే-ఆయన్ని చూడని వాళ్ళక్కూడా ఆ అనుకరణ నవ్వు పుట్టించగలదు. ఎదుటివాళ్ళను నవ్వించే విశేషాలు ఆయన నడకలోనూ, మాటలోనూ కూడా చాలా వున్నాయి.
వేగంగా మాట్లాడినప్పుడాయనకు కొంచెం నత్తి వస్తుంది. బాగా కోపం వచ్చినప్పుడాయన రెండుకళ్ళలో ఒకటి మూతపడుతూంటుంది. తరచుగా ఆయన భుజాలెగరేస్తూంటాడు. మామూలుగా నడిచినప్పుడు ఫరవాలేదు కానీ వేగంగా నడిచేటప్పుడు మాత్రం ఆయన పదడుగులు వేసి హఠాత్తుగా ఆగిపోయి అప్పుడు మళ్ళీ నడుస్తూంటాడు. నువ్వు విషయంలో-ఎంత గొప్ప జోకువేసినా చిర్నవ్వు కూడా నవ్వడు కానీ తనకానందం కలిగిందన్న విషయాన్ని తమాషాగా ఇంకో రకంగా ముఖంలో వ్యక్తపరుస్తాడు.
ఇవన్నీ చేసిచూపించాక ఒకరోజు శ్రీమతి ఆయన్ను బజార్లో చూసింది. నేనాయన్నామెకు పరిచయం చేశాను. ఓ పదినిముషాలు ఆయన మాతో వున్నాడు. ఆయన వెళ్ళి పోయేక శ్రీమతి పడిపడి నవ్వింది. నా అనుకరణ విద్యను అమితంగా మెచ్చుకుంది.
ఒక పర్యాయం మోహన్ మా ఇంటికి వస్తే అతనికీ విషయం చెప్పి-నన్ను బలవంతపెట్టి-ఆ అనుకరణ చేయించింది. శ్రీమతి అయితే ఒక్కసారి చూసింది కాబట్టి కానీ నిత్యం మా ఆఫీసర్ని చూస్తుండే మోహన్ గుక్కతిప్పుకో లేకపోయాడు. నవ్వినవ్వి అలసిపోయి-"చంపేశావోయ్ బాబూ-ఒకసారి మన ఆఫీసులో ప్రదర్శించాలిది నువ్వు" అన్నాడతను.
నేను భయపడి-"ఈ అనుకరణ మాత్రం నా గృహ జీవితానికి మాత్రమే పరిమితం చేసుకున్నాను. ఎందుకంటే ఇది మన ఆఫీసరుదాకా వెళ్ళిందంటే-అనుకరణే నాకు జీవనాధారమైపోతుంది...." అన్నాను.
మోహన్ కు కూడా పరిస్థితి తెలుసు కాబట్టి ఎన్నడూ నొక్కించలేదు. ఈ రోజుమాత్రం నా ఉత్సాహాన్నీ, ప్రేక్షకుల ప్రోత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని అతను ఈ మాటలన్నాడు. నేను బాగా భయపడ్డాను కానీ లోలోపల నాకూ ప్రదర్శించాలని ఉంది. అందరి ప్రోత్సాహమూ అధికంగా వుంది.
"మే ఐ డిస్టర్బ్ యూ ఫరేవైల్" అని మొదలు పెట్టాను.
ఎవరైనా ఆఫీసులో మాట్లాడుకుంటున్నప్పుడు ఆఫీసరు వచ్చినా వాళ్ళాయన్ను గమనించనప్పుడూ ఆయన అనే ముక్కలు అవి. నేనిలా మొదలుపెట్టగానే అందరూ చప్పట్లు మ్రోగించేశారు.
నాలో ఉత్సాహం పెరిగిపోయింది. ఆయనలో వున్న వివిధ లక్షణాలను ఉత్సాహంగా అనుకరిస్తున్నాను. ఆ ఉత్సాహంలో నాకు వళ్ళు తెలియటంలేదు.
"మే ఐ డిస్టర్బ్ యూ ఫరేవైల్....." అన్న మాట వినిపించింది.
అది నా కంఠంకాదు. మా ఆఫీసరుది.
2
నా గుండె ఆగిపోయింది. అనుకోని సంఘటన నా కిది.
ఇంకా రెండ్రోజుల వరకు రాకూడని ఆఫీసరు అప్పుడే వచ్చేశాడు. ఆయన వచ్చేసరికి ఆఫీసంతా అల్లకల్లోలంగా వుంది. అందుకు కారకున్ని నేను.
ఆఫీసులో అల్లరిపనులు చేయడం ఒక తప్పయితే, ఆ అల్లరి మా ఆఫీసర్ని అనుకరించడానికి సంబంధించింది కావడం రెండో తప్పు. అది కూడా మరొకరూ మరొకరూ ఫిర్యాదు చేసింది కాదు. మా ఆఫీసరు స్వయంగా కళ్ళారా చూసిన దృశ్యమిది.
అయిపోయింది. నా ఉద్యోగం పని అయిపోయింది. చేజేతులా నా ఉద్యోగం పోగొట్టుకుంటున్నాను.
"ఒకసారి నా గదికి రండి...." అని చెప్పి ఆఫీసరు లోపలికి వెళ్ళిపోయాడు.
నేను ఆఫీసరు గదికి వెళ్ళలేదు. తిన్నగా నా సీట్లో కూలబడ్డాను. నోట మాట రావడంలేదు. అవయవాలన్నీ పట్లుతప్పాయి. అంధకారపు భవిష్యత్తు కారణంగా కళ్ళకేమీ కనబడ్డంలేదు.
"భయపడకు బ్రదర్-ధైర్యంగా లోపలికి వెళ్ళు...." అన్నాడు మోహన్.
"ఎలా వెళ్ళేది? చిన్న తప్పయితే ఫరవాలేదు! ఆయన్నే అనుకరిస్తూ పట్టుబడిపోయాను...."
"ఇలా జరుగుతుందనుకోలేదు. తప్పు నాదే!" అన్నాడు మోహన్ బాధగా.
