Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 8


    అయితే బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించడం పూర్తిగా నా చేతుల్లోనే వుంది. అయితే విశ్వామిత్రుడంతటివాడిని మేనక లొంగదీసేసింది. నేను సామాన్యుణ్ణి! ఈ అప్సర బారినుండి తప్పించుకోగలవా?
    "వయసులోవున్న మగాడివి. నన్నీప్రశ్న ఆడగడానికి సిగ్గులేదూ..." అంటూ నాకు దగ్గరగా వచ్చిందామె. ఆమె శరీరంమీద నుండి మత్తెక్కించే పరిమళాలు వస్తున్నాయి.
    "నన్నుగురించి ఏమైనా అనుకో. కానీ నాకు దగ్గరగా మాత్రం రాకు. ఒక్కక్షణం బలహీనత నన్ను జీవితాంతమూ బాధిస్తుంది" అన్నాను.
    "సరే-రానులే-అయితే నేచెప్పినట్లు వినాలి...."
    "వింటాను...." అన్నాను.
    "నేనడిగిందానికి తెలియదనకుండా జవాబు చెప్పాలి.."
    "చెబుతాను...." అన్నాను.
    "సర్పనగర నిధికి సంబంధించిన ప్లాన్ కాగితం ఎక్కడుంది?" అంది అప్సర.
    "నేను ప్రేమించే నా ప్రజలమీద, నేను నమ్మిన బ్రహ్మచర్యంమీద ఒట్టువేసి చెబుతున్నాను. ఆ సర్పనగర నిధి గురించి నాకేమీ తెలియదు. దాని గురించి నేనెన్నడూ విని కూడా వుండలేదు. ఎవరో ఈ విషయంలో పొరబడ్డారు" అన్నాను దీనంగా.
    అప్సర తమాషాగా నవ్వింది.... "నువ్వు ప్రేమించే ప్రజలు నిన్నెన్నుకున్నప్పుడే మట్టిగొట్టుకుపోయారు. నువ్వు నమ్మిన బ్రహ్మచర్యం ఈ రోజుతో వమ్మైపోతుంది. అందువల్ల నీ ఒట్టు వృథా...." అంటూ ఆమె నన్ను సమీపించి గట్టిగా కౌగలించుకుంది.
    ఆ స్పర్శ నాకు చాలా హాయిగా వుంది. ఏవో కొత్త అనుభూతులు కలుగుతున్నాయి. మనసు నిలకడ తప్పు తోంది. నన్ను నేను మరిచిపోతున్నాను. అప్సర నడుం చుట్టూ నేను చేతులు బిగించలేదు. కానీ ఆమె నన్ను కౌగలించుకుంటే విడిపించుకుందుకూడా ప్రయత్నించలేదు.
    
                                        4
    
    అప్సరతో ఆ గదిలో నాలుగు రోజులు గడిపాను. నిజంగానే నేను స్వర్గానుభూతుల్ని చవిచూశాను. ఆమె చేతిలో నా బ్రహ్మచర్యదీక్ష ఓడిపోయింది. ఆ గదిలోంచి బయటపడ్డాక వివాహం చేసుకోవాలనే నిర్ణయానికికూడా వచ్చాను.
    అప్సర నన్నలరింపుజేస్తూకూడా తన విద్యుక్త ధర్మం మరిచిపోలేదు. సర్పనగర నిధి గురించి నన్ను తరచుగా అడుగుతూనే వుంది. నేను తెలియదని అంటే గోముగా అడిగి ప్రయత్నించి చూసేది. నాకు నిజంగా తెలిసి వుంటే ఆమెకు సర్పనగర నిధిగురించి చెప్పివుండేవాడినే
    "నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ప్రేమికులమధ్య రహస్యాలుండకూడదు. సర్పనగర నిధి గురించి నువ్వు నా కెందుకు చెప్పవు?" అంది అప్సర ఓరోజు దీనంగా.
    "అప్సరా! నిన్నిప్పుడు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఈ గదిలోంచి బయటపడితే నిన్ను పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. నా భార్యవైతే అప్పుడైనా నీకు నిజం తెలియగలదు...."
    "నన్ను నువ్వు పెళ్ళిచేసుకుంటావా? అది వట్టిమాట." అంది అప్సర.
    "నేను అబద్దమాడను. బాపూజీ అడుగుజాడలలో నడిచేవాణ్ణి...." అన్నాను.
    "బ్రహ్మచర్యదీక్ష పూనారు. కొనసాగించగలిగేరా!" అంది అప్సర నవ్వుతూ.
    "నిజమేలే-మహాత్ముడితో నాకు పోలికేమిటి? అయినా నిన్ను పెళ్ళి చేసుకుంటానన్న విషయం ఋజువు చేయదానికి కాలమే ఆధారం..." అన్నాను.
    "నన్ను మీరు పెళ్ళి చేసుకుంటానంటే మిమ్మల్నిక్కన్నించి తప్పించగలను...." అంది అప్సర.
    "నిజంగా?"
    "ఆఁ"
    ఆ తర్వాత నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెలకువ వచ్చేసరికి ఓ కొత్త గదిలో ఉన్నాను. పరీక్షించిచూసి అది ఒక హోటల్ రూం అని తెలుసుకోగలిగాను.
    నేనిప్పుడు ఎవరికీ బందీని కాను. కాసేపు ఆ గదిలో విచ్చలవిడిగా తిరిగాక నాకు అర్ధమైనదేమిటంటే - నేనున్నది హైదరాబాదులోని హోటల్లో. నిన్నరాత్రి ఎవరో నన్నిక్కడకు తీసుకువచ్చి నా పేరున ఈ గది తీసుకున్నారుట.
    నేను త్వరగా తెమిలి అక్కణ్ణించి బయటపడి పోలీసు స్టేషన్ కు వెళ్ళి నన్ను సుమారు పది రోజులుగా ఎవరో ముఠావాళ్ళు బంధించి, సర్పనగర నిధిగురించి రకరకాలుగా బాధించారని చెప్పాను.
    పోలీస్ ఇన్ స్పెక్టర్ నేను చెప్పినదంతా ఆశ్చర్యంగా విని-"సర్పనగర నిధిగురించి నేనూ వినలేదు. కానీ ఇది ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించినదే అయుండాలి. ఎందుకంటే ఊళ్ళో ఈ విధంగా పదిమంది ఎమ్మెల్యేలు మాయమై తిరిగివచ్చారు..." అన్నాడు.
    నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సర్పనగర నిధి గురించి అపహరించబడ్డ మా పదిమంది ఎమ్మెల్యేలలో ఒకరికి తెలిసుండాలి. అతనెవరో నాకు  తెలిసినా బాగుండును. వెళ్ళి కలుసుకుని మాట్లాడాలి.
    బాగా ఆలోచించేక-సర్పనగర నిధి గురించి మాలో ఒకరికి తెలిసినట్లు ఆ ముఠాకు తెలిసివుంటుందనీ, అందుకనే పదిమందినీ అపహరించి తమ ప్రయత్నాలు చేశారనీ-ఆఖరికి ఒకరిద్వారా విశేషాలు తెలియగానే అందర్నీ వదిలిపెట్టేశారనీ నాకు అనిపించింది.
    ఏది ఏమైనా ఆ పదిరోజులూ మేము లేకపోవడంవలన ఒక ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రిమీద పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్ను నాయకుడిగా తొలగించారు.
    మేము పదిమందిమీ ఆయనకు నమ్మకమైన అనుచరులము. ఎనిమిది ఓట్ల తేడాతో ఆయన పదవిపోయింది. మేము పదిమందిమీ వుంటే ఆయన నాయకత్వం నిలబడి వుండేది. పదవిపోగానే ఆయన అనుచరులు చాలా మంది కొత్త నాయకుడికి అనుచరులైపోయారు. కొత్తనాయకుడి కారణంగా కొందరు ప్రతిపక్ష సభ్యులుకూడా మాపార్టీలో చేరారు.
    "మీరుండి వుంటే అవిశ్వాస తీర్మానం ఓడిపోయి వుండేది. అప్పుడు అందరూ నా అనుచరులుగా మారివుండేవారు. సమయానికి మీరు రాని కారణంగా నేనిప్పుడు అనామకుడినై పోయాను...." అని వాపోయాడు మాజీ ముఖ్యమంత్రి.
    మే మాయన్నోదార్చి......"సర్పనగర నిధి మీ పదవిని దెబ్బతీసింది. ఒకోసారి అలా అవుతూంటుంది...." అన్నాము. పదవిమీద కోరికలేని మాకు ముఖ్యమంత్రి యెవరైనా వొకటే. అయినా మాజీ ముఖ్యమంత్రిని అవసరానికి ఆదుకోలేక పోయమన్న బాధ నాలో వుండిపోయింది.
    సుమారు రెండు నెలల తర్వాత అప్సర నన్ను కలుసుకుంది. ఆమెను నేను వివాహం చేసుకుంటానన్నాను.
    "ఇంకా మీరు మాటమీద నిలబడుతున్నారా? నేను పవిత్రురాలీని కాదు. తెలుసా?" అంది అప్సర.
    "ఇప్పుడు నేనింకో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే నేనుమాత్రం పవిత్రుడినౌతానా?" అన్నాను.
    నన్నర్ధం చేసుకోవడానికి అప్సరకు రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత సింపుల్ గా మా విబాహం జరిగి పోయింది.
    వివాహం జరిగిన మొదటిరోజు రాత్రి ఆమెతో అన్నాను ...."నేను నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ప్రబలమైన కారణముంది. సర్పనగర నిధి గురించి తర్వాత ఏమయిందో నువ్వే చెప్పగలవు...."
    "ఏముంది చెప్పడానికి-ఏమీలేదు!"
    "అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తదగ్గర రహస్యా లుంచ కూడదు..." అన్నాను.
    ఆమె నవ్వి-"అంతా మాయ, మోసం, డగా! కొత్త ముఖ్య మంత్రిగారు మీ పదిమంది ఎమ్మెల్యేలానో దాచేయాలనుకున్నారు. కారణం అదికాదనుకోవడంకోసం సర్పనగర నిధి అనే భ్రమను మీకు కలిగించారు. అసలా నిధికోసం ఏ ముఠావాళ్ళూ ప్రయత్నించలేదు. మీరే కారణంగా బంధించబడ్డారో మీకు తెలియకూడదు. అదే ఆయన ఉద్దేశ్యం. ఇప్పుడు పోలీసులు సర్పనగర నిధి గురించీ, ఆ ముఠాగురించీ అంతులేలక కొట్టుకు చస్తున్నారు. మీకు చెప్పానుకానీ ఈ రహస్యాన్నీ మీరు మరెవ్వరికీ చెప్పకూడదు...." అంది.
    "పదవికోసం మరీ ఇంత ఘోరమా? నాకు తెలిసిన ఈ నిజాన్ని నేను దాచలేదు. వెళ్ళి పోలీసులకు....." అని నేను ఏదో అనబోతుండగా-
    "నాకోసం ఈ నిజాన్ని మీరు దాచక తప్పదు...." అంది అప్సర.
    "నిజాన్ని దాచలేను. బాపూజీ అనుచరుణ్ణి నేను...." అన్నాను.
    "అస్తమానూ ఆయన్ను స్మరిస్తారెందుకు? బ్రహ్మ చర్య దీక్షకులా దీన్నీ సడలించండి...." అంది అప్సర.
    అప్సర చేతిలో మరోమారు ఓడిపోయాన్నేను. అయితే రాజకీయాల్లో మాత్రం మరో కొత్త పాఠం నేర్చుకున్నాను.
    

                                      * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS