Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 10


    నేను లేచాను. భయపడి ప్రయోజనం లేదు. ఆలశ్యం చేసి లాభం లేదు. జరుగనున్నదెలాగూ జరుగుతుంది. "నువ్వు ప్రోత్సహిస్తే మాత్రం నా వివేకమయింది! అసలు తప్పు నాదేలే...." అన్నాను.
    అడుగులు తడబడుతూండగా ఆఫీసరు గదిలో అడుగుపెట్టాను. పులిబోనులో ప్రవేశించిన అనుభూతి కలిగింది నాకు.
    "ఎస్ కమిన్!" అన్నాడు ఆఫీసరు.
    క్షణంపాటు ధైర్యంచేసి అయన ముఖంలోకి చూశాను. ఆయన చూపులో కోపం లేదు. మామూలుగా ఏదయినా పని వున్నప్పుడాయన గదిలోకి పిలిచినపుడు ఎలా చూస్తాడో అలాగే చూస్తున్నాడాయన. ఆ చూపులు నాకు కాస్త ధైర్యాన్నిచ్చాయి.
    "నమస్కారమండీ" అన్నాను.
    "కూర్చోండి...." అన్నాడు ఆఫీసరు.
    నేను కుర్చీ దగ్గర నిలబడ్డాను కానీ కూర్చోలేదు. కూర్చోమంటాడు కానీ ఆయన ఎదురుగా కూర్చోవడం మా ఆఫీసరు కిష్టముండదు.
    "మిస్టర్ చలం-మీరు నాకు నచ్చారు....." అన్నాడు ఆఫీసరు.
    ఆయన అలా అనడం నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అయితే మా ఆఫీసరుకు డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటుంది. మొదలెట్టిన విషయానికీ చివర చెప్పేదానికీ సాధారణంగా పోలికుండదు. ఇప్పుడిలా మొదలుపెట్టి ఆఖర్న నా ఉద్యోగం తీసేస్తున్నాననవచ్చు.
    నేను మాట్లాడకుండా నవ్వాను.
    "అనుకరణ అన్నది చాలా మంచి విద్య. అది ఇచ్చే వినోదం ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు నన్ను అనుకరించడం చూసి నేను చాలా ఆనందించాను. నిజానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. కానీ యిది ఆఫీసు. అనుకరణ కోసం సృష్టించబడిన ప్రదర్శనశాల కాదు. అటువంటివి జరుగుతూంటే ఆపడం నా బాధ్యత. అందుకే మిమ్మల్ని వారించవలసి వచ్చింది....." అన్నాడు ఆఫీసరు. ఆయన కళ్ళల్లో మాత్రం ఏ భావమూ వ్యక్తం కావడం లేదు.
    "నన్ను మన్నించాలి. నాది పొరబాటు...." అన్నాను.
    "ఆఫీసులో అనుకరణను ప్రదర్శించడం పొరపాటే. ఆ పొరపాటు మళ్ళీ చేయకండి. అయితే అనుకరణ విద్యను మాత్రం మరిచిపోకండి. మీ కీ విద్య తెలుసునని నాకింతవరకూ తెలియదు. కొంతకాలంపాటు నేను మీ విద్య నానందించ దల్చుకున్నాను. అయితే ఆఫీసులో మాత్రం కాదు. వచ్చే సోమవారం సాయంత్రం మీరు సతీ సమేతంగా మా ఇంటికి రండి....." అన్నాడు ఆఫీసరు.
    జవాబేమివ్వాలో తెలియలేదు నాకు. ఆయన మాటల్లో నిజమున్నదో, వ్యంగ్యమున్నదో నాకు అర్ధం కావడంలేదు.
    ఏది ఏమయినా ప్రస్తుతానికి గండం గడిచినట్లే అనిపించింది. ఈరోజు సోమవారం. వచ్చే సోమవారమంటే ఇంకో వారం రోజులున్నదన్నమాట. అంతవరకూ నా ఉద్యోగం వుంటుందనే అనిపిస్తోంది.
    ఆఫీసరుకేసే ఇంకా చూస్తూ నిలబడ్డాను - "దట్సాల్. యూ కెన్ గో" అన్నాడాయన.
    నేను గదిలోంచి బయటపడ్డాను. అంతా నా కోసమే ఎదురు చూస్తున్నారు. జరిగినదంతా విని అందరూ ఆశ్చర్యపడ్డారు.
    
                                       3

    మా కంపెనీకి మంచి లాభాలు వస్తూంటాయి. అందువల్ల మాకు చాలా మంచి జీతాలు ఇస్తారు. అయితే మేము చేసే పని మాత్రం చాలా శ్రద్దగా చేయాలి. ఎక్కడ చిన్న పొరపాటు దొర్లినా ఇబ్బందు లెదురవుతాయి.
    ధనికులు, గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు-వగైరా లకు సంబంధించిన రహస్య పత్రాలు, జీవిత రహస్యాలు, నల్లధనం వగైరాలను భద్రపరిచే కంపెనీ మాది. పేరు ఏమాత్రం కన్సల్టెన్సీ ఏజన్సీ.
    మా కంపెనీకి ఓ అనుబంధ సంస్థ వుంది. అదెక్కడుందో మా కెవ్వరికీ తెలియదు. ఆ సంస్థలో వస్తువులను భద్రపరచడానికి అవసరమైన సదుపాయాలన్నీ వుంటాయి. అక్కడికేమైనా వస్తువులు జేరితే ఆ సమాచారం మా ఆఫీసరుకి అందుతుంది. దాన్నాయన కోడ్ లాంగ్వేజ్ లోకి మారుస్తాడు. అందుకు ఓ కంప్యూటరుంది. ఆ కంప్యూటర్ని వాడడం మా ఆఫీసరుకి తప్ప మరెవ్వరికీ చేతకాదు.
    కోడ్ లాంగ్వేజ్ లోకి మార్చబడిన సమాచారం మాకు అందుతుంది. దాన్ని మేము భద్రపరచాలి. కోడ్ లాంగ్వేజిని డీకోడ్ చేయడం మాకు తెలియదు. కానీ సమాచారంలో అక్షరం కూడా పొల్లు పోకూడదు.
    కంప్యూటర్ ద్వారా అందిన సమాచారాన్ని మా కాతాదార్ల ఫైల్సులో జతపర్చాలి. మా దగ్గరున్న సమాచారం చదవడానికి మామూలుగా వ్యావహారిక భాషలో వుంటుంది. అంతకు మించి మాకు ఏమీ తెలియదు. మేము చిన్న పొరపాటు చేసినా ఆ భాషను డీకోడ్ చేయడం కంప్యూటర్ వల్ల కాదు.
    ఈ వుద్యోగం నాకు బాగానే వుంది. ఏ పరిస్థితుల్లోనూ ఇంతటి సుఖప్రదమయిన ఉద్యోగాన్ని వదులుకోలేను. మా ఆఫీసుకి ఆఫీసరు చాలా ముఖ్యమైన మనిషి. కంపెనీ రహస్యాలు, లాభాలు ఆయనపైన ఆధారపడి వున్నాయి. మాలో ఎవరినైనా ఆయన క్షణాలమీద ఉద్యోగం నుంచి తీసివేయగలడు.
    ఇటీవల మా కంపెనీని పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
    మా కంపెనీ క్లయింట్స్ ని ఆకర్షించడానికి ఓ కొత్త కంపెనీ ప్రయత్నిస్తున్నదట! మా కంపెనీ రహస్యాలను సరిగ్గా దాచలేదనీ, మా కంపెనీలో దాచబడిన రహస్యాలను అతి సులభంగా బయటపెట్టవచ్చుననీ ఆ కొత్తకంపెనీ ఋజువు చేయడానికి చూస్తోందట. అందుకని మేమందరమూ శక్తిని ఋజువు చేయాల్సిన సమయం వచ్చింది.
    ఈ పరిస్థితిలో నేను మా ఆఫీసర్ని అనుకరిస్తూ పట్టుబడ్డాను. అందుకే కాస్త భయపడ్డాను కూడా. ఆ భయం ఆఫీసరు చెప్పిన సోమవారం వచ్చేవరకూ పూర్తిగా తగ్గలేదు.
    సోమవారం వరకూ నాకూ ఆఫీసరుకీ మధ్య మరే ఇతర విశేషాలూ జరుగలేదు. సోమవారం మధ్యాహ్నం మాత్రం ఆయన మరోసారి తన ఆహ్వానం గుర్తు చేశాడు. నేను తల వూపి గుర్తుందని చెప్పాను.
    ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళి ఓ గంట విశ్రాంతి తీసుకుని శ్రీమతితో కలిసి ఆఫీసరింటికి వెళ్ళాను.
    ఆఫీసరింట్లో మాకు బాగా మర్యాదలు జరిగాయి. మమ్మల్నంత బాగా ట్రీట్ చేస్తారని నేనూహించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS