Previous Page Next Page 
శంఖారావం పేజి 9

 

    అమ్మ సీతమ్మను తాను రక్షించాలి.
    కులభూషణ్ ఆవేశ పుటాలోచనల్లో ఆ క్షణంలో ఉదయకు రవంత స్థానం కూడా లేదు.
    తను కొత్త పెళ్ళి కొడుకునన్న విషయమే అతడికి గుర్తులేదు.

                                  *    *    *

    పశ్చిమ జర్మనీ లోని వెస్ట్ బెర్లిన్ లో రైల్వే స్టేషన్ కు దగ్గరగా వున్న జూలో తిరుగుతున్నారు వేదాంతం, విశ్వనాద్.
    "మన దేశం జంతువుల్లా కాక ఇది కోవెక్కి తెగ బలిసి ఉన్నాయి" అన్నాడు వేదాంతం.
    "వీటిని చూస్తుంటే నాకేమని పిస్తోందంటే ...." ఆగాడు విశ్వనాద్.
    "ఊ....చెప్పు " కుతూహలంగా అడిగాడు వేదాంతం.
    'ప్రతి మనిషి ఒక క్రూర జంతువూ లాంటి వాడు. నాగరికత, సంప్రదాయం అతడిని బోనులో ఉంచి అదుపు చేస్తున్నాయి. అంటే మనమందరమూ సమాజమనే జూలో బంధించబడి ఉన్నాం. కానీ మనలో కొందరు నాగరికతకు, సంప్రదాయానికి వ్యతిరేకులు. వాళ్ళు జూలోంచి తప్పించుకున్న క్రూర జంతువుల్లాంటి వాళ్ళు ....' అన్నాడు విశ్వనాద్.
    "నువ్వు చెప్పింది కొంతవరకూ నిజం. అయితే ప్రతి మనిషి క్రూర జంతువూ కాడు'. చెప్పాలంటే మనుషుల్లో క్రూరుల సంఖ్య పరిమితం. కానీ వాళ్ళో మిగతా మనిషు లందర్నీ శాసించ గలుగుతున్నారు." అన్నాడు వేదాంతం.
    'అంటే --ఎక్కువమంది మనుషులు సాధు జంతువులూ. తక్కువమంది క్రూర జంతువులు. ఆ తక్కువ మందిలో కొందరు మాత్రమే సమాజపు బోనులో ఉన్నారు. కొందరు తప్పించుకుని సాధు జంతువుల్లా నటిస్తూ మన నేలుతున్నారు. కొందరికా నటన చేతకాక సమాజ విద్రోహులుగా పరిగణించబడుతున్నారు."
    "మనం తప్పించుకొనడం ఒక కలలా లేదూ?" అన్నాడు వేదాంతం మాట మారుస్తూ.
    ఇద్దరూ ఓ బెంచిమీద కూర్చున్నారు.
    ఎదురుగా ఓ బొమ్మ ఉంది.
    ఓ చిన్నపిల్లాడు ఉచ్చపోస్తున్న వీగ్రహమది.  అదే పౌంటెన్లా వస్తోంది.
    చూడముచ్చటగా ఉందా బొమ్మ.
    విశ్వనాద్ ఆ బొమ్మ వంకే చూస్తూ -- "నీ ముందు చూపు మనని రక్షించింది ' అన్నాడు.
    "ఒక్కటే నాకిప్పటికీ అర్ధం కావడం లేదు. ప్రొఫెసర్ ఆర్నాల్డ్ గానీ, డాక్టర్ గ్రే కానీ నిజంగా మనని చంపాలనుకున్నారా ? చంపాలనుకుంటే మన కోసం మొత్తం ఒక విమానంలోని జనాలందర్నీ బలిచేస్తారా ?' అన్నాడు వేదాంతం.
    విశ్వనాద్ ఇంకా ఆ బొమ్మ వంకే చూస్తూ "నా అనుమానం చాలా దూరం వెడుతోంది. అయితే త్వరగా ఒక నిర్ణయానికి రాకూడదను కుంటున్నాను" అన్నాడు.
    "నీ అనుమానమేమిటో చెప్పు "
    "విమానం పేలిపోవడానికి తాము బాంబు పెట్టడమే కారణమని ఖలిస్తాన్ నేర్పాటు తీవ్రవాదులు కొందరు ప్రకటించారు. అందులో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటె ఆ విమాన ప్రయాణీకుల్లో ఒక్క సిక్కు కూడా లేడు. భారతదేశానికీ చెందిన ప్రముఖులు చాలామంది ఉన్నారు ....' అని ఒక్క క్షణం ఆగి --'అయితే ఈ విధంగా జరుగుతుందని ప్రొఫెసర్ ఆర్నాల్డ్ కు ముందే తెలుసా? సిక్కు తీవ్రవాదులతో అమెరికన్స్ కు సంబంధ ముందా ?" ఆలోచిస్తుంటే ఎన్నో ప్రశ్నలు ....' అన్నాడు విశ్వనాద్.
    సిక్కు వేర్పాటు వాదులతో అమెరికాకు సంబంధం అంటగట్టడం అన్యాయం. కానీ డాక్టర్ గ్రేకీ విమాన ప్రమాదం గురించి ముందే తెలిసుండాలి. లేదా అంతా కాకతాళీయంగా జరిగుండాలి. ఏమైతేనేం చివరి క్షణం వరకూ ఎవరికీ చెప్పకుండా మన ప్రయాణాన్ని వెస్ట్ బెర్లిన్ కు మార్చుకోవడం మంచిదే అయింది." అన్నాడు వేదాంతం.
    విశ్వనాద్ అతడి మాటలు పూర్తిగా వినలేదు. - అమెరికాకు సంబంధం అంటగడితే అది అన్యాయమెందుకు అవుతుంది? వేర్పాటు వాడులాదేశంలో శిక్షణ పొందుతున్నారా లేదా? ఒక పక్క స్నేహ వాక్యాలు పలుకుతూ మరోపక్క పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా పెంచే అమెరికా పై నాకెప్పుడూ సదభిప్రాయం లేదు...."
    "ఈ విషయంలో సూపర్ పవర్సే కాదు. సంపన్న దేశాలేవీ ఒకదాని కొకటి తీసిపోవు. ఎప్పుడూ నిదానంగా ఆలోచించే నీవీ రోజు అమెరికాకు వ్యరిరేకంగా ఎందుకావేశ పడ్తున్నావో అర్ధం కావడం లేదు " అన్నాడు వేదాంతం.
    'ఎందుకంటె -- ప్రపంచంలోనే అన్ని అనర్దాలకూ అమెరికాయే మూలం. ఆ దేశానికి బాగా డబ్బుంది. ధన బలాన్ని ఆ దేశం దుర్వినియోగం చేస్తోంది.'
    "నే నొప్పుకోను" అన్నాడు వేదాంతం. -- "ఆ మాటకొస్తే మన దేశం గురించి చాలామందికి అమెరికాలో సదభిప్రాయం లేదు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడదీశామని సిక్కింను లోబరుచుకున్నామని, మనకు విస్తరణ కాంక్ష ఎక్కువనీ వాళ్ళనుకుంటారు. దేశంలో నూటికి డెబ్బయి మంది ప్రజలు తినడానికి తిండి లేక మలమల మాడిపోతూ ఆలో లక్ష్మణా అని అఘోరిస్తుంటే --- వారి సహకారంతో నాయకులైన కొందరు విలస జీవితాలతో మురిసిపోతూ విదేశ యానాలు చేసుకుంటూ ఉపగ్రహ నిర్మాణాలు, అణు బాంబు పరిశోధనల ద్వారా దేశం ముందుకు వెళ్ళిపోతున్నట్లందర్నీ నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అమెరికన్సంటారు. అవన్నీ నిజాలా అబద్దాలా అన్నది మనకనవసరం. ప్రతి దేశం గురించి ప్రతి దేశానికి కొన్ని అభిప్రాయాలుంటాయి. మనం ఒకరిని తప్పు పట్టకూడదు."-
    విశ్వనాద్ వేదాంతం భుజం తట్టి --"నువ్వు నిజం చెప్పావు. అమెరికా సంపన్న దేశం అందుకే అదంటే నాకు అసూయ. మనం ఇండియాకు తిరిగి వెళ్ళగానే అమెరికన్స్ మనమంటే అసూయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అది డాక్టర్ గ్రేకి తెలుసు. అందుకే అతడు మనల్ని తెలివిగా చంపాలనుకున్నాడు. కానీ నీ ముందు చూపు హెచ్చరిక మనలో --ఊపిరి నింకా మిగిల్చాయి. మనవాళ్ళు కంగారు పడకుండా నువ్వు ముందు హెచ్చరించడం మంచి పని అయింది. అసలమ్మ ఎంత కంగారు పడుతుందో నని నేను హడలిపోయాను. అయితే ఆ విమానం కూలిపోయిందన్న వార్త నాకు కలిగించిన షాక్ నుంచి ఇంకా సరిగా తేరుకోలేదు నేను....' అన్నాడు.
    'అది తెలుస్తూనే వుందిలే ....' అన్నాడు వేదాంతం.
    "ఎదురుగా ఈ బొమ్మ చూడు. ఇది చిన్న పిల్లాడిది కావడం వలన ఎంతో ముచ్చటగా వుంది. ఇదే ఏ యువకుడి బొమ్మో అయితే జుగుప్సాకరంగా ఉండేది. కానీ చిన్న పిల్లల వల్ల సృష్టి కి అందం రావచ్చు గానీ ముందుకు వెళ్ళదు...."
    "ఏమిటి నువ్వు చెప్పాలనుకుంటున్నది?"
    "పసిపాపల నగ్నత్వం మనోహరం. యువతీ యువకుల నగ్నత్వం ప్రదర్శనీయం కాదు. మొదటిది అనురాగాన్ని చిలికిస్తే, రెండవది కాంక్షలను చెలరేపుతుంది. అలాగే ఈర్ష్యా ద్వేష భావాలు పసివారిలోనూ ఉంటాయి. వారిని ప్రదర్శించినా ముచ్చటగానే వుంటాయి. ఒక వయసు దాటాక తన నగ్నత్వాన్ని దుస్తులతో దాచినట్లే మనిషి వాటిని సంస్కారం మాటున దాచగలగాలి. ఏమంటావు ?'
    'ఒప్పుకుంటాను , కానీ నాకులా అందర్నీ ఒప్పించాలేవుగా ?"
    "ఒప్పిస్తాను " అన్నాడు విశ్వనాద్ తీవ్రంగా"
    "ఎలా?"
    "ఇండియాకు తిరిగి వెళ్ళగానే నువ్వు ధనుషంకారం చేద్దువు గాని...."
    "నువ్వేం చేస్తావు "
    "నేను ధనువును తీస్తాను ...."
    వేదాంతం ఆశ్చర్యంగా మిత్రుడి వంక చూసి "నువ్వు నాకు పూర్తిగా అంతా చెప్పడం లేదు. నీ బుర్రలో ఏదో పెద్ద పధకమే వుంది" అన్నాడు.
    నీకేలాగూ చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడో చెబుతాను"
    "ఎప్పుడో అంటే ?"
    "విశ్వనాద్ నవ్వి అమ్మకు దూరమై చాలా కాలమయింది. వెళ్ళగానే ఒక వారం రోజులు అమ్మ ఒడిలో పసిపాపనై పోవాలి " అన్నడింకా ఆ బొమ్మ వైపే చూస్తూ.
    "ఆ తర్వాత ?"
    "ఉదయ ఒడిలో యువకుడినై పోతాను"....
    "ఉదయ ఒడులోనా ?' ఆశ్చర్యంగా అన్నాడు వేదాంతం.
    'అవును, నేను ఉదయ కోసం ఉదయ నాకోసం పుట్టాం. ఇండియాకు తిరిగి వెళ్ళగానే మా ఇద్దరి పెళ్ళి జరుగుతుంది...."
    "కానీ ఉదయ జీవితం...."
    విశ్వనాద్ అదోలా నవ్వి "రాముడు సీతతో ఎంత కాలం కాపురం చేశాడు?" ఉదయ పాలిటి మృత్యువు నా పాలిటి రావణుడు. ఉదయ విరహంతో ఎన్నో విధాల మృత్యువు నెదిరిస్తాను ...' అన్నాడు.
    "బహుశా ఉదయ ఒక ఏడాది కూడా బ్రతకదు ...."
    "అందుకే ఉదయ బ్రతికున్నంత కాలం నా జీవితం ఆమెకే అంకితం చేస్తాను. ఆ తర్వాతనే నా పధకం నీకు వివరిస్తాను ...."
    "వేదాంతానికా మాటలు ఇబ్బందిగా అనిపించాయి.
    "నాకోసం మరో ఉదయ ఉంటే ఎంత బాగుండును ?" అని మనసులో అనుకున్నాడు.
    "వేదాంతం! ఈసారి ఎప్పుడు వస్తున్నది అమ్మకు ముందుగా చెప్పొద్దు. మనం అమ్మను సర్ ప్రైజ్ చెయ్యాలి?" అన్నాడు విశ్వనాద్.
    అపుడు వేదాంతం ఆలోచనల్లో ఉదయ వుంది. వినకుండానే విశ్వనాద్ మాటలకు తల ఊపాడతడు.
    సీతమ్మకు స్పృహ వచ్చింది. అప్పుడు కులభూషణ్ ఆమె ప్రక్కనే ఉన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS