Previous Page Next Page 
శంఖారావం పేజి 8

 

                                      2

            

     ఆమె భరిణ మూత తెరిచి "నాకు బొట్టు పెట్టు !" అంది.
    "ఎందుకు ?"
    "అదే మన పెళ్ళి ?"
    "పెళ్ళికి మంత్రాలుండాలి. తాళిబొట్టు కావాలి "
    "అవసరం లేదు " అంది ఉదయ
    'అప్పుడు మన పెళ్ళి పెళ్ళి అనిపించుకోదు. పెళ్ళికీ, కాకపోవడానికి తేడా ఏముంటుంది ?"
    ఉదయ నవ్వి "పెళ్ళయ్యాక నేను నిన్ను ఏమండీ అని పిలుస్తాను' అంది.
    "వద్దు" అన్నాడు కులభూషణ్ భయంగా.
    "ఏం ?"
    "పెళ్ళి చేసుకున్నాక నువ్వు నాకు దగ్గర కావాలి. ఆ పిలుపు మన దూరాన్ని పెంచుతుంది."
    "కానీ అది మన సంప్రదాయం...."
    కులభూషణ్ నవ్వి "పెళ్ళిలో లేని సంప్రదాయం పిలిపులో పాటిస్తానని నువ్వంటున్నావు . పెళ్ళిలో సంప్రదాయం పాటిద్దాం. పిలుపులో వద్దు' అన్నాడు.
    "సరే -- నీ ఇష్టం. కానీ విమానం ఇండియా చేరేసరికి మన పెళ్ళి అయిపోవాలి " అంది ఉదయ.
    'మన పెళ్లయ్యేదాకా విమానన్నాపుతాను సరా?!"
    ఉదయ అదోలా నవ్వింది.
    మర్నాడుదయం కులభూషణ్ ఆమెను కలుసుకుని 'సమయానికి బ్రాహ్మణుడు దొరకలేదు. తాళిబొట్టు తెచ్చాను. ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు మంచి ముహూర్తముంది" అన్నాడు.
    'బ్రాహ్మణుడు లేకుండా పెళ్ళి చేసుకునేటప్పుడు తాళిబొట్టు నువ్వే కట్టాలనే ముంది నేనే కట్టుకుంటాను" అంది ఉదయ.
    "ఎంతో కొంత సంప్రదాయం పాటించాలి కదా!" అంటూ గదిలో  రేడియో అన్ చేశాడతను. హిందీ వార్తలు ప్రారంభం కాగానే అతడు తన చేతి వాచీని దిద్దుకున్నాడు.
    సరిగా ఎనిమిది గంటల ఐదు నిమిషాల కతడామే మెడలో తాళి కట్టాడు.
    తాళి కట్టడానికి మెడ వంచిన ఉదయ అలాగే ఉండిపోయింది.
    తను పాతాళం లోకి క్రుంగి పోతుందా అనిపిస్తోందామెకు.
    భూకంపం వచ్చినట్లు సముద్రం పొంగినట్లు అగ్నిపర్వతం బ్రద్దలైనట్లు ఆమెలో కంపనం ప్రారంభమైంది.
    శాస్త్ర ప్రకారం మూడుముళ్ళు వేయగానే -- హిందీ వార్తల్లో తాజా సమాచారం అంటూ చెప్పడం అప్రయత్నంగా అతడు విన్నాడు. ఆ వార్త ప్రకారం విమానమొకటి మార్గమధ్యంలో కూలిపోయింది. బహుశా పంజాబు తీవ్రవాదుల కారణం కావచ్చు. వార్త  కులభూషణ్ కి అర్ధమైంది. అతడికి హిందీ బాగావచ్చు.
    "మన పెళ్ళి అప్పుడే ఒక విమానాన్ని కూల్చింది" అన్నాడు కులభూషణ్ నిట్టూర్చి.
    "ఏమైంది?" అంది ఉదయ తలెత్తి.
    కులభూషణ్ తను నవ్వి వార్త ఆమెకు చెప్పాడు.
    ఉదయ కంగారుగా -" ఏ విమానమది ?' అంది.
    "ఏం?' అని ఉలిక్కి పడ్డాడతడు. అది న్యూయార్క్ నుంచి బయలుదేరిన విమానమని అతడికి తెలుసు. కానీ పట్టించుకోలేదు. కొంపదీసి అందులోనే వేదాంతం, విశ్వనాద్ లు బయల్దేరి వస్తుంటే ....
    అతడు ఇంగ్లీషు వార్తలు కూడా విన్నాడు.
    నిస్సందేహంగా అది విమానమే!
    హిందీలో తాజా సమాచారం - ఇంగ్లీషులో హెడ్ లైన్ అయింది.
    "మైగాడ్!' అన్నాడు కులభూషణ్.
    ఉదయ ఏమీ మాట్లాడలేదు. అప్పటికే ఆమెకు స్పృహ తప్పింది.
    కులభూషణ్ ఉదయ వంక చూడలేదు. ఆమె కొత్త పెళ్ళి కూతురన్న భావనే అతడికి లేదు.
    ఈ వార్త సీతమ్మకు తెలిస్తే ?
    అతడు చటుక్కున అక్కడ్నించి లేచి బయటకు వెళ్ళాడు.
    విశ్వనాద్ గురించి తను తర్వాత విచారించవచ్చు. ముందీ వార్త ఆమెకు తెలియకుండా ఆపాలి.
    కొడుకు కోసం ప్రానాలన్నీ కూడగట్టుకుని ఎదురు చూస్తోందామే.
    ఈ వార్త కామె తట్టుకోలేడు.
    తన గదిలోకి వెళ్ళాడతడు. అక్కడ అసహనంగా కాసేపు పచార్లు చేశాడు.
    సీతమ్మను తాను ముందుగా పదిమందికీ దూరంగా ఉంచాలి. అందుకామెతో విశ్వనాద్ ప్రయాణం వాయిదా పడిందని చెప్పాలి.
    ఒక పధకం కులభూషణ్ మెదడులో రూపు దిద్దుకుంటోంది.
    కులభూషణ్ కీ ప్రపంచంలో ఎవరైనా సీతమ్మ తర్వాతే!
    విమాన ప్రమాదం గురించి వినగానే ఉదయ విశ్వనాద్ గురించి ఆలోచించింది. విశ్వనాద్ గురించి అనుమానం రాగానే కులభూషణ్ సీతమ్మ గురించి ఆలోచిస్తున్నాడు.
    అతడింకా ఆలోచనలో వుండగానే "సార్! టెలిఫోన్ ' అంటూ బాబు వచ్చి అతడికి కబురందించాడు.
    అప్పుడే సీతమ్మకు కబురు తెలిసిపోయిందా అని కంగారు పడ్డాడతడు.
    పరుగున వెళ్ళి రిసీవరందుకున్నాడు.
    "హలో?" గట్టిగా అరిచాడతను.
    "హలో -- అవతల ఎవరూ మాట్లాడుతూంట?"
    'డాక్టర్ కులభూషణ్!"
    'భూషణ్ నేను వేదాంతాన్ని మాట్లాడుతున్నాను."
    "వేదాంతమా?" తెల్లబోయాడు కులభూషణ్"
    'అవును --నేనే !"
    అని అతడింకా ఏదో అనబోతుండగా "విశ్వనాద్ బ్రతికున్నాడా?" అన్నాడు కులభూషణ్ కంగారుగా.
    'అది చెప్పడానికే ఫోన్ చేస్తూంట. మేమిద్దరం క్షేమం. జరిగినదానికి  విశ్వనాద్ షాక్ తిన్నాడు. అసలేం జరిగిందో నేను చెబుతాను. తిరిగి వచ్చేక-- మీరెవ్వరూ కంగారు పడకండి. మేము క్షేమంగా ఉన్నాం, అమ్మకూ, ఉదయకూ ఈ కబురు చెప్పు ."
    'అయాం సో హాపీ , థాంక్యూ వేదాంతం థాంక్యూ వెరీమచ్...ఇప్పుడు నువ్వెక్కడ నుంచి ఫోన్ చేస్తున్నావు ?'
    "వెస్ట్ బెర్లిన్ నుంచి...."
    "ఎప్పుడొస్తున్నారు?"
    "ఒకటి లేక రెండురోజుల్లో..."
    కులభూషణ్ ఇంకా ఏదో అడగాలనుకున్నాడు. అవతల అర్ధంతరంగా కట్ అయింది.
    కులభూషణ్ ఫోన్ పెట్టేసి --"అమ్మ సీతమ్మకు వెంటనే కబురందించాలి !" అనుకున్నాడు. అతడు లేచి కదుల్తుండగా మళ్ళీ ఫోన్ మ్రోగింది.
    "వేదాంతమే -- ఏమో ' అనుకుంటూ కులభూషణ్ వెనక్కు వెళ్ళి ఫోనందుకున్నాడు.
    "డాక్టర్ కులభూషణ్?" అని ప్రశ్నించిందవతలి గొంతు.
    "అవును --వేదాంతం ?"
    "నా పేరు వేదాంతం కాదు ప్రకాశరావు ...."
    "ప్రకాశరావు ....?"
    "సీతమ్మ గారి ఎడురిల్లు మాది!"
    'ఓహో జానకమ్మ గారి...." అని అర్హోక్తిలో ఆగిపోయాడు కులభూషణ్.
    "ఆ అవును జానకమ్మ మొగుణ్ మాట్లాడుతున్నాను. సీతమ్మ గారు ఉన్న పళంగా స్పృహ తప్పి పడిపోయింది."
    "ఏమైంది ?"
    "న్యూయార్క్ నుంచి వస్తున్న విమానం కూలిపోయిందన్న వార్త తెలియగానే మా ఆవిడ ఉండబట్టలేక వెంటనే వెళ్ళి ఆవిడకు చెప్పింది ...."
    "ఇప్పుడు స్పృహ వచ్చిందా?"
    "లేదు -- నా పరిమిత జ్ఞానానికి అది హార్ట్ స్ట్రోక్ అనిపిస్తోంది!"
    "ఇప్పుడే వస్తున్నాను!" అంటూ ఫోన్ పెట్టేశాడు కులభూషణ్."
    జానకమ్మ ఎంత పని చేసింది?
    నిజంగానే సీతమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చిందా ?"
    తను క్షేమంగానే ఉన్నానన్న వార్త విశ్వనాద్ చేరవేసేలోగా - జానకమ్మ ఆ శుభవార్తను విలువ లేకుండా చేసింది.
    గులాబీ నర్సింగ్ హోం లో ఉంటూ వైద్య శాస్త్రంలో పరిశోధనలు గావిస్తూ అమ్మ సీతమ్మను రక్షించుకో లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను సృష్టించిన ఆ దేవుడ్ని కూడా క్షమించను" అనుకుంటూ కులభూషణ్ అక్కడ్నించి ఆవేశంగా కదిలాడు.
    విమాన ప్రమాదం నుంచి రక్షించ బడ్డ విశ్వనాద్ -- తన తల్లికేమైనా అయిందని తెలిస్తే ఏమైపోతాడు ?
    ఆ తల్లీ కొడుకులు తిరిగి కలుసుకోవాలి . వారి కన్నుల వెలుగులు చూడాలి. వారిలో ఇద్దరికీ ప్రమాదం ఎదురయింది. ఒకరిని దేవుడు రక్షించాడు !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS