Previous Page Next Page 
శంఖారావం పేజి 10

 

    "రేపో ఎల్లుండో విశ్వనాద్ వస్తున్నాడు" అన్నాడత్సాహంగా.
    సీతమ్మ కామాటలర్ధమైనట్లు లేదు. మనుషుల్ని గుర్తించడానికి కాసేపూ వారి మాటలు అర్ధం చేసుకునేందుకు మరికాసేపు పట్టిందామెకు.
    కులభూషణ్ మాటనర్ధం చేసుకుని ఆమె అదోలా నవ్వింది.
    'డాక్టర్లు ,మాటల్ని కూడా మందులుగా వాడతారు" అంది సీతమ్మ నీరసంగా.
    "విమానం కూలిపోయిన గంటదాకా మనకు సమాచారం అందలేదు. ఈలోగానే మనవాళ్ళిద్దరూ ఏదో కారణం వల్ల పశ్చిమ జర్మనీ వెళ్ళారు. ఈ వార్త తెలిసి మనం కంగారు పడతామని అక్కణ్ణించి ఫోన్ చేశారు నాకు. నీకీ వార్త చెప్పాలని నేననుకున్నాను. ఈలోగానే జానకమ్మ నీకు కబురు చెప్పి హడలు గొట్టేసింది."
    ముందు సీతమ్మ నమ్మలేదు. కానీ క్రమంగా ఆమెలో నమ్మాకం పెరిగింది. అప్పుడామెకు సంతోషం కలిగింది.
    "నీకీ కబురింత తొందరగా చెప్పి వుండేవాణ్ణి కాదు. ఈ శుభవార్తను నీతో పంచుకోకుండా ఉండలేక పోవడం మొదటి కారణం , మన విశ్వనాద్ వచ్చేసరికి నువ్వు కోలుకోవాలంటే ఈ సంతోషం అవసరం. అది రెండో కారణం. హటాత్తుగా మరో మూడు రోజుల తర్వాత విశ్వనాద్ నీ కళ్ళడితే ఆ సంతోషం పట్టలేక అసలే బలహీనంగా వున్న నీ గుండెకేమై పోతుందో నన్న భయం మూడో కారణం ..."
    'దేవుడున్నాడురా ....' అంది సీతమ్మ సంతోషంగా.
    'అవునమ్మా- నాకూ ఆ నమ్మకం కదుర్తోంది."
    'చదువుకున్నరుగా అందుకని ఈ విషయం తెలుసుకుందుకు మీ కింత ఆలస్యమవుతుంది...." అని నవ్వింది సీతమ్మ.
    "మన ఉదయకు ప్రాణం పోస్తే దేవుడి మీద పూర్తీ నమ్మకం కలుగుతుంది నాకు" అన్నాడు కులభూషణ్.
    "పోస్తాడురా తప్పకుండా దేవుడాపని చేస్తాడు. ఇంతకాలం స్వామి నడగడానికి భయపడ్డాను. స్వయంగా దర్శనం చేసుకుని ఆ అలౌకికానందస్వామినే వేడుకుంటాను. - ఉదయ ప్రాణం నిలబెట్టమని. కాస్త ఒంట్లో చేకూరనీ?"
    'అలౌకికానందస్వామి ఉదయ ప్రాణాలు నిలబెట్టగలడా?"
    "జానకమ్మ ఆ వార్త చెప్పగానే అలౌకికానంద నా బిడ్డను రక్షించలేవా? అనుకున్నాను. ఆ తర్వాతేం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచే సరికి నువ్వీ కబురు చెప్పావు. అంటే ఆ స్వామి మహిమే కదా ఇదంతా ? నా విస్సీగాడు బ్రతికాడంటే ఉదయ కూడా బ్రతుకుతుంది. అంతా స్వామి సంకల్పం....."
    కులభూషణ్ కాస్త ఇబ్బంది పడ్డాడు.
    సీతమ్మ కళ్ళలో నమ్మకం స్పష్టంగా కనబడుతోంది.
    విశ్వనాద్ బ్రతకడానికి అలౌకికానందస్వామి కారణమా?
    ఏదో అలౌకిక శక్తి అతడిని కాపాడిన మాట నిజం అది అలౌకికనందుడిదేనా?
    ఇప్పుడా శక్తి ఉదయను కాపాడుతుందా?
    ఉదయ బ్రతికి బట్టకడితే ఏమవుతుంది ?
    ఆమె ఇప్పుడు తన భార్య ....
    ఈ విషయం సీతమ్మకు తెలియదు....తెలిస్తే ఏమవుతుంది ?
    కులభూషణ్ లేచి నిలబడ్డాడు.
    "నీకు విశ్రాంతి అవసరం. కళ్ళు మూసుకుని పడుకో....' అన్నాడతను.
    "మళ్ళీ వచ్చినప్పుడు ఉదయను తీసుకునిరా" అందామె.
    "నువ్విక్కడున్నట్లు ఉదయ కింకా తెలియదు. లేకుంటే ఈపాటికే పరుగున వచ్చేది" అన్నాడు కులభూషణ్.
    "నాకు తెలుసు. విస్సీగాడు చచ్చి బ్రతికిన సంగతి కూడా డానికి చెప్పు. సంతోషిస్తుంది. దాని ప్రానాలన్నీ వాడి మీదే వుంటాయి..."
    కులభూషణ్ తలూపాడు కానీ ఈ మాటలతడిని బాగా ఇబ్బంది పెట్టాయి.
    ఉదయ ఇప్పుడు తన భార్య.
    సీతమ్మకి విషయం చెబితే ?
    విషయం అక్కడి నాలుక చివరి దాకా వచ్చి ఆగిపోయింది. అతడు సెలవు తీసుకుని ఆ వెళ్ళడం తిన్నగా ఉదయ గదికి వెళ్ళాడు.
    గదిలో ఉదయతో పాటు నర్సోకామె ఉంది.
    "రొటీన్ చెకప్ లో ఈ గదికి వచ్చాను. ఈమె మంచం మీద స్పృహ తప్పి పడి వుంది. నేను శీతలోపచారాలు చేశాను. ఇప్పుడే స్పృహ వచ్చింది" అంది నర్సు.
    కులభూషణ్ కంగారుగా ఆమెను సమీపించాడు.
    ఉదయ నీరసంగా దిక్కులు చూస్తోంది.
    "ఆర్ యూ అల్ రైట్ !" అన్నాడు కులభూషణ్.
    "ఊ" అంది నీరసంగా.
    "నువ్విక వెళ్ళవచ్చు" అన్నాడు కులభూషణ్ నర్సుతో.
    ఆమె వెళ్ళిపోయింది.
    "ఏం జరిగింది ?"
    "వార్త వింటుండగా కళ్ళు తిరిగాయి. తర్వాతేం జరిగిందో నాకు తెలియదు. గానీ .....'అంది ఉదయ నెమ్మదిగా.
    ఏం జరిగిందో కులభూషణ్ కప్పుడర్ధమైంది. తనామెను పట్టించుకోకుండా వెళ్ళి పోయినందుకతడు నొచ్చుకుని "మన పెళ్ళి కాగానే నిన్ను నేనబ్బురంగా చూసుకోవలసింది పోయి నిర్లక్ష్యం చేశాను నన్ను క్షమించు" అన్నాడు.
    "విస్సీ బావ నాలుగు కాలాల పాటు సుఖంగా వుండాలనుకున్నాను. మన పెళ్ళి జరగ్గానే విస్సీ బావ విమానం కూలిపోయిన వార్త విన్నాను" అంది ఉదయ బాధగా.
    "నువ్విక విస్సీబావ గురించి ఆలోచించకూడదు. ఆలోచించినా నాకు చెప్పకూడదు. నేను నీ భర్తను.' అన్నాడు కులభూషణ్ గంబీరంగా.
    ఉదయ తెల్లబోయినట్లతడి వంక చూసి "నీ మిత్రుడి మరణం నిన్ను కృంగదీసినట్లు లేదు. పైగా నన్ను భార్యగా శాసించాలనుకుంటున్నావు" అంది.
    కులభూషణ్ నవ్వి ఆమెకు అసలు విషయం చెప్పాడు.
    "నిజమా? అయితే అర్జంటుగా అత్తను చూడాలి" అందామె.
    చూద్దువు గాని. నాకిప్పుడు నువ్వంటే ప్రత్యేకనురాగం బయల్దేరింది. అమ్మ సీతమ్మ నిన్ను బ్రతికించు కుంటానంటోంది. అదే జరిగితే నేను నిన్ను నీ విస్సీ బావకు వదిలి వెళ్ళలేను" అన్నాడు కులభూషణ్.
    "వదిలి పెట్టడ మెందుకు ?మన పెళ్ళయిపోయిందిగా...."
    "కానీ నువ్వు నీ విస్సీబావను వదులుకోగలవా?"
    "వదులుకున్నానుగా...."
    ఇప్పుడు వదులుకోవడం వేరు. నీలో కొత్త జీవం నిండినప్పుడు...."
    నిండినప్పటి సంగతి కదా! అని నిట్టూర్చింది ఉదయ.
    "పోనీ ఇప్పటి సంగతి చెప్పు. నువ్వు నా భార్యవయ్యవు. నీకిప్పుడు నాకంటే నీ విస్సీబావ మీదే ఎక్కువ ప్రేమ లేదని చెప్పగలవా?"
    "నీకా అనుమానం ఎందుకు ?"
    "విశ్వనాద్ ని నువ్వు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించవని  నాకు తెలుసు  ...."
    'అది నిజం కాదనడానికి తిరుగులేని రుజువొకటుంది.
    "ఏమిటది ?"
    "రేపో మాపో అన్నట్టుంది నా జీవితం . నా శరీరానికి ప్రాణం వుందీ లేనట్లుంది. ఇలాంటి దశలో కూడా బావ విమానం కూలిపోయిందని తెలిసీనప్పుడు నా ప్రాణం పోలేదు" అంది ఉదయ.
    కులభూషణ్ ఆమె నింకేమీ ప్రశ్నించలేదు....

                                   *    *    *

    సీతమ్మ ఉదయ కూడా గులాబీ నర్శింగ్ హోం లోనే ఉన్నారు.
    ఇంట్లో కులభూషణ్ ఒక్కడూ వున్నాడు.
    అది రాత్రి తొమ్మిది గంటల సమయం.
    అంతకుముందు రోజు రాత్రంతా కులభూషణ్ నర్శింగ్ హోం లోనే గడిపాడు.
    ఈరోజతడికి అలసటగావుంది.
    నర్శింగ్ హోం నుంచి ఇంటికి వచ్చి మూడు గంటలయింది.
    అతడి కళ్ళు మూతలు పడుతున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    విసుగ్గా వెళ్ళి తలుపు తీసాడతడు.
    ఎదురుగా ఓ యువతి.
    "నువ్వా జలజా?" అన్నాడతను.
    "లోపలకు రావచ్చా" అంటూ అతడి అనుమతి కోసం ఎదురు చూడకుండానే ముందుకు వచ్చిందామే. అతడ్ని అడ్డు తొలగమని కూడా అనలెదామే.
    కులభూషణ్ వెనక్కు పడబోయి, తమాయించుకుని "ఏమిటా దూకుడు?" అన్నాడు.
    "మావారూరికి వెళ్ళారు. నీకోసం గులాబీకి ఫోన్ చేస్తే ఇంటి దగ్గరున్నావన్నారు. నీ అమ్మగారు అక్కడే వున్నట్టు నాకు నిన్ననే తెలిసింది. ఇంట్లో ఒంటరిగా వుంటావుగదాని ఇక్కడకు వచ్చాను.
    "థాంక్స్" అన్నాడు కులభూషణ్.
    ఇద్దరు కుర్చీల వైపు నడిచారు.
    "నిన్ననుసరించి వస్తూ చూసుకోలేదు. కుర్చీల వైపు నడిపిస్తావేమిటి?" మన మేమైనా కుర్చుని కబుర్లు చెప్పుకుంటామా?" అంది జలజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS