Previous Page Next Page 
విశాలి పేజి 9

 

    మర్నాడు పొద్దున్న ఆఫీసులో విశాలి నడిగింది పరమళ: "నిన్న మీరు సదాశివంగారింటి కెళ్ళినట్టున్నారు?"
    "అవును మీ కెలా తెలుసు?" అంది విశాలి కొద్దిగా ఆశ్చర్యపడుతూ.
    "ఆఁ ఇలాంటివి దాచినా దాగవు లెండి. మా ఇల్లూ ఆ వీధిలోనే ఉంది. నేను మా గుమ్మంలోంచి చూశాను మీరు వాళ్ళింట్లోకి వెళ్ళడం. ఏం కథ? వాళ్ళావిడ ఊళ్ళో లేదా? పుట్టింటి కెళ్ళిందా?" పెన్నుతో చెంపమీద సుతారంగా కొట్టుకుంటూ అడిగింది పరిమళ.
    ఒళ్ళు మండింది విశాలికి. ఇటువంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదనుకుంది.    
    "కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిట" అనేసి వచ్చి తన సీట్లో కూర్చుంది.
    వెనకనించి' పరిమళ వెకిలినవ్వు వినిపిస్తూనే ఉంది.
    ఆ రోజంతా ఆఫీసులో పని సరిగ్గా చెయ్యలేక పోయింది విశాలి.    
    పరిమిళ మాటలే చెవుల్లో మోగుతున్నాయి.        
    "ఛీ! ఛీ!' అనుకుంది ఎన్నోసార్లు మనసులోనే.
    ఆ రోజునుంచే విశాలికీ, పరిమళకీ మాటలు తగ్గి పోయాయి.
    పనిలో ఏదైనా అత్యవసరమైన కారణం ఉంటే తప్ప, ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు.        పరిమళ కాక ఆఫీసులో మిగిలిన వాళ్లెవరైనా కూడా తననీ, సదాశివాన్నీ కలిపి చెడుగా చెప్పుకుంటున్నా రేమోనని రోజూ చాలా జాగ్రత్తగా గమనిస్తూంది విశాలి.
    కానీ, ఆ రోజు పరిమళ నోటినించి అటువంటి మాటలు వినడమే తప్ప, మరెవరూకూడా తమ ఇద్దరి గురించీ చెడుగా చెప్పుకోవటం లేదని నిశ్చయంగా తెలుసుకుంది. దానితో మనసు కొంచెం శాంతించిందనే చెప్పాలి.
    
                               *    *    *

    ఆ రోజు విశాలి ఆఫీసునించి వచ్చి ఇంటిగుమ్మం ఎక్కుతుండగా "అక్కా!" అన్న పరిచితమైన కంఠం విని వెనక్కి తిరిగి చూసింది.
    చిట్టి, వాళ్ళమ్మ....ఎక్కడికో వెళుతున్నట్టున్నారు.
    "ఇదేనా, అక్కా, మీ ఇల్లు? మా బడికి దగ్గరే     అయితే" అంటూ సంబరంగా విశాలి చేతులు పట్టుకుంది చిట్టి పరుగున వచ్చి.
    "రావే, మొద్దూ!" అంటూంది వాళ్ళమ్మ వెనక నించి.
    నవ్వుతూ ఆవిడని ఆహ్వానించింది విశాలి "రండి" అంటూ.
    "అబ్బే! వెళ్ళాలి! రావే, చిట్టీ, తొరగానూ!" విసుక్కుందావిడ. "టాటా!" అంటూ పరుగెత్తి వెళ్ళిపోయింది చిట్టి.
    విశాలి అనుకున్నట్టే ఆ మర్నాటినించీ చిట్టి రోజూ స్కూలు వదిలిపెట్టాక సాయంత్రమప్పుడు విశాలి దగ్గిరికి వచ్చి కాసేపు కూర్చుని కథలుచెప్పించుకుని, కబుర్లేమో తను చెప్పి వెళుతూంది.
    "నువ్వు రోజూ ఇలా మా ఇంటికి వస్తున్నట్టు మీ అమ్మకి తెలుసా చిట్టి?" అని తన సందేహం వెలిబుచ్చింది విశాలి ఓ రోజు. దానికి కారణం, వాళ్ళమ్మ కిది ఇష్టం ఉండదని నిశ్చయంగా తెలుసు కాబట్టి. "తెలియదు." ఉన్న మాట చెప్పడానికి భయపడలేదు చిట్టి.
    "మీ అమ్మకి తెలియకుండా నువ్వు రోజూ ఇలా మా ఇంటికి వస్తున్నావన్న మాట. అలా చెయ్యడం తప్పు కదూ?"
    భయంగా చూసింది చిట్టి.
    "మీ అమ్మలో చెప్పి మీ అమ్మ ఒప్పుకుంటేనే రా. లేకపోతే రాకు, చిట్టీ." అంత కఠినంగాతను మాట్లాడగలదని అనుకోలేదు విశాలి.
    కానీ అలా చెప్పక తప్పదు మరి.
    లేకపోతే ఈ సంగతి తరవాత ఎప్పుడైనా వాళ్ళమ్మకి తెలిసినప్పుడు, ఏవో మాయమాటలు చెప్పి, తనా పిల్లని రోజూ తమ ఇంటికి రప్పించుకుంటున్నానని అన్నా అనగలదు.
    "ఇంకనించీ మా నాన్నతోనూ, అమ్మతోనూ చెప్పే మీ ఇంటికి వస్తాను. సరేనా," అక్కా?"
    ప్రేమగా చిట్టిని దగ్గిరికి తీసుకుంది విశాలి.
    ఆ పిల్లమీద తన కంత ప్రేమ, ఆ పిల్లకి తన మీద ఇష్టం ఎందుకో అర్ధం కాలేదు విశాలికి.
    ఆ సంగతే చిట్టిని అడిగింది! "నే నంటే నీ కెందు కంత ఇష్టం, చిట్టీ?"
    "మరేమో! నువ్వు మంచిదానివక్కా! అందుకని."
    విశాలి గుండెల్లో తల దూర్చి, అంతకంటే మరేమీచెప్పలేకపోయింది ఆ చిన్ని హృదయం. ఇంక ఇంటికి వెళతానంటూ చిట్టి లేవడంతో, గేటువరకూ సాగనంపి జాగ్రత్తగా వెళ్ళమని మరీ మరీ హెచ్చరించి, మెల్లిగా ఇంట్లోకి నడిచింది విశాలి.
    
                           *    *    *

    మహాలక్ష్మి కీమధ్య ఒంట్లో బాగుండటం లేదు. పట్టుబట్టి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిందా రోజు విశాలి.
    ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చింది.    
    "ఏమి" టని ఆదుర్దాగా చెల్లెల్ని అడిగాడు రామం, వాళ్ళు రాగానే.
    విశాలి కళ్ళలో మెరిసింది సంతోషం.
    "శుభవార్త, అన్నయ్యా! వదినే చెప్పాలి నీకు. నేను చెప్పను." నవ్వుతూ వదిన ముఖంలోకి చూసింది. ఏ భావమూ లేని వదిన ముఖం చూసి భయపడింది.
    "ఊఁ సరేలే! నువ్వెళ్ళి నా క్కొంచెం కాఫీ కలుపు."
    విశాలి ముఖంలోకి అదోలా చూశాడు రామం. మౌనంగా వంటింటి వైపు నడిచింది విశాలి, వెనక నించి వదిన ఏదో సన్నగా గొణుగుతున్నా ఏమీ చెయ్యలేని స్థితిలో.
    నిజంగా ఆ రోజు విశాలి మనసు ఆనందంతో తేలిపోతూంది.దానికి కారణం-తమ ఇంట్లోకి చిన్న పాపాయి రాబోతూంది. పాపాయి ఆటపాటలతో ఇంక నించీ కావలసినంత సందడి. ఆ చిన్నారిపాపే అన్ననీ, చెల్లెల్నీ కలపాలి. తమ మధ్య నవ్వులు పండించాలి.
    ఆ రాత్రంతా అన్నయ్యకి అమ్మాయి పుడితే బాగుంటుందా, అబ్బాయి పుడితే బాగుంటుందా అన్న ఆలోచన తెగక సతమతమైంది విశాలి.
    
                            *    *    *

    అసలు ఎప్పుడూకూడా వదినని ఎక్కువ పని చెయ్యనియ్యకుండా చూస్తుంది విశాలి. తను ఉద్యోగం చేస్తున్నాకూడా రెండు పూటలా వంట బాధ్యత తన మీదే ఉంచుకుంది. మాటవరసకైనా మహాలక్ష్మి ఒక పూట వంటైనా తను చేస్తానని అనదు.
    ఇప్పుడసలు తను ఇంట్లో ఉన్నంతసేపూ వదినకేం కావాలన్నా కూర్చున్న చోటికే తీసుకెళ్ళి అందిస్తూంది విశాలి.

                                     
    ఆ రోజు సాయంత్రం మహాలక్ష్మి కాఫీగ్లాసుతో గదిలోకి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు రామం.
    గ్లాసు బల్లమీద పెట్టి నిలబడింది. ఒక నిమిషం పోయాక నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ అడిగింది: "ఏమిటాలోచిస్తున్నారు?"
    "ఆ? ఏమిటి?" ఉలిక్కిపడ్డాడు రామం.
    "ముద్దుల చెల్లెలి పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా?" భార్య వెటకారంగా అన్న మాటలకి తేలిగ్గా నవ్వేశాడు. "
    "ఆఁ ఇంక ఇప్పుడేమవుతుందిలే దాని పెళ్ళి! పెళ్ళీడు దాటినదాన్ని చేసుకోవడానికి ఎవడు దిగిస్తాడు?"        వెంటనే అందుకుంది మహలక్ష్మి: "ఒకవేళ దిగొచ్చినాగానీ వేలకి వేలు గుమ్మరిస్తే గానీ అందుకు సిద్దపడరు. గుమ్మరించరించడానికి మనం సిద్ధ పడం. అంతేనా?" ఫక్కున నవ్విన మహలక్ష్మి నవ్వులో తను కూడా శ్రుతి కలిపాడు రామం.
    "నా కొకటి అడగాలనుంది. అడగనా?"
    "ఏమిటో అడుగు." రామం అడగమన్నదే తడవుగా తన కోరిక వెల్లడించుకుంది మహాలక్ష్మి.
    "అరే! రెండు రోజులబట్టీ నేనుకూడా ఇదే ఆలోచిస్తున్నాను. చూశావా? మనిద్దరి అభిప్రాయం ఒకటే అయింది." ప్రేమగా భార్య కన్నుల్లోకి చూశాడు రామం.
    ఎక్కడలేని సిగ్గూ ఒలకబోస్తూ సన్నగా గొణిగింది మహాలక్ష్మి: "ఇరుగు పొరుగు అమ్మలక్కలు నన్ను నువ్వేం చదువుకున్నావని అడుగుతుంటారు. నే నేమో ఏమీ చదువుకోలేదని చెప్పగానే- 'మీ ఆడపడుచు కాలేజీలోకూడా చదువుకుంది కదూ? ఉద్యోగంకూడా చేసుకుంటోంది చక్కగా. చాలా తెలివైన పిల్ల' అంటూ నన్ను తక్కువచేసి, ఆవిడగార్ని ఎక్కువ చేసి మాట్లాడతారు. నా కెంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? ఆ మహాతల్లి ఉద్యోగం మానేస్తే సగం బాధ వదులుతుంది. అదీకాక..."
    "ఆఁ ఆఁ నాకు తెలుసులే. నీకు హాయిగా ఇంట్లో చేతికింద ఒక ఆడమనిషి పిలిస్తే పలికేటట్టుగానూ ఉంటుంది. అవునా?"
    అవునన్నట్టుగా ముద్దుగా తల ఊపింది మహాలక్ష్మి.

                                *    *    *

    ఆ మర్నాడు రాత్రి తన గదిలో కూర్చుని 'పెంకు టిల్లు' నవల చదువుతూంది విశాలి. అది నాలుగవ సారొ, అయిదవ సారో ఆ నవల చదవడం. విశాలికి వచ్చిన నవలల్లో అది ఒకటి.
    మంచి మంచిపుస్తకాలు కొనడం, చదవడం చెయ్యకుండా ఉండలేదు విశాలి. మంచి పుస్తకమే మనిషికి స్నేహితుడన్నది నమ్ముతుంది. అందుకే అనవసరపు ఖర్చులు ఎప్పుడూ చెయ్యకుండా, మంచి మంచి నవలలు కొని స్వంత లైబ్రరీ తయారుచేసింది.
    వేదులవారి 'దీపావళి' పుస్తకం కోసం ఉన్న ఊళ్ళో ఎంతో వెతికి, లభించక చివరికి ఎక్కడో ఉన్న స్నేహితురాలు పద్మకి వ్రాసి వాళ్ళ ఊరినించి ఎలాగైతేనేం తెప్పించుకుంది. అలాగే ఎన్నో పుస్తకాలు మంచి మంచిని కష్టపడి సంపాదించి తన గదిలో అందంగా అమర్చింది. అడుగుల చప్పుడై తల ఎత్తింది విశాలి. ఎదురుగా అన్నయ్య. పుస్తకం మడిచి బల్లమీద పెట్టింది. "ఏం కాదా లన్నయ్యా?"
    "చూడు, విశాలీ!" ఒక్క క్షణం తటపటాయించాడు రామం. అన్నయ్యేదో ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాడని గ్రహించింది విశాలి.    
    "నేనన్నా, నా మాటన్నా నీకు గౌరవం ఉంది కదూ?" నిజంగానే ఆశ్చర్యపోయింది విశాలి. "అదేమి టన్నయ్యా, అలా అడుగుతావ్! నీకు తెలియదూ?"
    "అవునులే! నువ్వు నా మాట లక్ష్యపెడతావ్! అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇలా చెప్పవలసి వచ్చినందుకు ఏమీ అనుకోకు..." లేనిపోని బాధ నటించాడు రామం.
    ఏం వినవలసివస్తుందోనని తల్లడిల్లిపోతూంది విశాలి మనసు.
    ఆ రోజు అన్నయ్యసాంబయ్యగారిని పెళ్ళి చేసుకో మని అడగడం హఠాత్తుగా గుర్తుకొచ్చింది.
    'నలుగురూ నాలుగు విధాలుగా నీ గురించి అనుకోవ డం నా కిష్టం లేదు. నీ గురించి చెడ్డగా చెప్పుకుంటే నాకు మాత్రం బాధకాదూ!"
    తెల్లబోయింది విశాలి. తనని గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారా? ఎందుకీ లేనిపోని అభూతకల్పనలు? చెప్పలేక చెప్పలేక చెపుతున్నట్టుంది రామం గొంతు. "నిన్నూ, నీ కొలీగ్ ఆనందం గురించీ ఇద్దర్నీ కలిఫై ఏవేవో కోస్తోంది లోకం. వెధవది నేను నమ్మననుకో. కానీ, ఎంతైనా పరువున్న కుటుంబం మనది. ఆ పరుపు పోగొట్టుకోకుండా ఉండాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది. ఏమంటావ్? అందుకే నువ్వా ఉద్యోగం మానేసి హాయిగా ఇంట్లో ఉంటే ఆ అనేవాళ్ళని చెప్పు తీసుక్కొట్టి నట్టవుతుంది. నేను దేవుడి దయవల్ల ఏదో సంపాదిస్తూనే ఉన్నాను. నేను సంపాదిస్తూ కూడా ఇంకా నీ చేత పని చేయిస్తున్నానన్న నింద నాకూ ఉండదు. అందుకని చెప్పవలసిన నాలుగు మాటలూ చెప్పాను. ఆ తరవాత నీ ఇష్టం మరి." మెల్లిగా నిష్క్రమించాడు రామం.
    నిశ్చేష్టురాలైన విశాలి నెమ్మదిమీద తేరుకుంది. 'సూటిగా ఉద్యోగం మానేయ్ అని చెప్పక ఎంత కథ అల్లావ్, అన్నయ్యా! నా మాటంటే నీకు గౌరవం ఉందా అంటూ చక్కగా ముందరి కాళ్ళకి బంధం వేశావు కదా! మా ఆఫీసులోనే కాదు, నా గురించి అలిసిన వాళ్ళని ఎవర్ని అడిగినా నేను మంచిదాన్ననే చెపుతారన్నయ్యా! కానీ, నా దురదృష్టం-నీ దృష్టిలో అధమురాల్ని అయ్యాను. అందుకే నా శీలానికే ముప్పు తెచ్చే కథ అల్లావ్, స్వంత అన్నయ్యని అయి ఉండి కూడా! ఆ ఆనంద్ తో నే నెప్పుడూ మాట్లాడి ఎరగను కూడా. అనవసరంగా అతని పేరుకూడా ఎందుకు పైకి లాగుతావ్! పాపం!పెళ్ళాం బిడ్డలు కలవాడు. ఉద్యోగం మానేస్తే ఆ అనేవాళ్ళని చెప్పు తీసుక్కొట్టినట్టవుతుందన్నావ్! అంటే నిన్ను నువ్వే చెప్పుతో కొట్టుకున్న ట్టవుతుంది. నేను చెల్లెల్ని, నువ్వు అన్నయ్యని అని ఇప్పుడు గ్రహించావా, అన్నయ్యా? ఈ చెల్లెలి బాధ్యత నీ మీద ఉందని ఇప్పుడు, ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా, అన్నయ్యా? అదైనా నీ అవసరార్ధం, నీకు కావలసి నట్టు, నువ్వు చెప్పినట్టు వినడం కోసం నా బాధ్యత నీ మీద ఉన్నట్టు గుర్తు వచ్చిందా?' ఏకధారగా స్రవించే కన్నీటిని అదుపులో పెట్టలేకపోయింది విశాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS