Previous Page Next Page 
విశాలి పేజి 8


    "నీకేమన్నా మతి పోయిందా? పెళ్ళి వయసు దాటిన దాన్నంటావేమిటి? నీ కిప్పుడేమంత ఈడు మించి పోయిందని? చదువు ఉంది, అందమూ ఉంది. నీ కేం తక్కువని అలా మాట్లాడతావ్!" ఒక నిమిషం మౌనంగా గడిచాక మళ్ళీ తనే అంది సువర్ణ!
    "మీ అన్నయ్యది మరీ అన్యాయం, విశాలీ! ఇంట్లో పెళ్ళికాని చెల్లెల్ని పెట్టుకుని ఆ విషయమే తనకి పట్టనట్టు తను మాత్రం హాయిగా పెళ్ళి చేసుకుని, చెల్లెలికి అన్నం పెట్టినందు కన్నట్టుగా చెల్లెలు తెచ్చే జీతంకూడా తన పెట్టెలో నింపుకుంటున్నాడు..."
    "అలా అనకు, సువర్ణా! నా జీతం అన్నయ్య దగ్గిర దాచుకుంటున్నట్టే భావిస్తున్నాను నేను. ఒక రక్తం పంచుకుని పుట్టినవాళ్ళం. ఆమాత్రం అన్నయ్యని నమ్మకపోతే ఇంకెందుకూ?"
    "ఆఁ అలాగే అనుకుంటూ కూచో. మీ అన్నయ్య సంగతి నాకు మొదటినించీ తెలియదు గనకనా?" రామంమీద కోపం సువర్ణలో ఉవ్వెత్తున లేచింది.
    కిటికీలోంచి బయటికి చూస్తూ మాట్లాడలేదు విశాలి.
    "క్షమించు, విశాలీ! నువ్వు తలనెప్పి అని చెప్పినా కూడా నే నీ విషయాలన్నీ మాట్లాడి నీ మనసుకి బాధ కలిగించాను."
    తేలిగ్గా నవ్వేయగలిగింది విశాలి.
    ఆ తరవాత ఇద్దరూ చాలాసేపు చిన్ననాటి ముచ్చటలు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఆ ముచ్చట్లతో, నవ్వులతో రెండు గంటలు రెండు నిమిషాల్లో దొర్లించేశారు.
    ఇంక వెళతానని సువర్ణ లేవగానే చటుక్కున ఏదో గుర్తొచ్చి లోపలికి వెళ్ళింది విశాలి. తన పెట్లో అట్టడుగున దాచిన, ఎప్పుడో తను కొనుక్కుని ఇంకా కుట్టించుకోని చుక్కల జాకెట్టుగుడ్డ తీసి, పేపర్లో చుట్టి బొట్టు పెట్టి సువర్ణ చేతి కిచ్చింది.
    "ఎందుకే, విశాలీ. ఇప్పుడిది ఇవ్వడం?" సువర్ణ గొంతులో ఆప్యాయత.
    "కాదనకు, సువర్ణా! పెళ్ళి అయిన తరవాత అప్పుడప్పుడు నువ్వు మా ఇంటికి వస్తూనే ఉన్నావు గానీ, నా మొద్దుబుర్రకి ఇంతవరకూ తట్టలేదు. అందులో శుక్రవారం లక్ష్మిలా వచ్చావు. ఉత్త చేతులతో ఎలా పంపించను?" విశాలి హృదయంలో పొంగిన మమత పలికిన మాట లవి.
    సువర్ణని గేటువరకూ సాగనంపి ఇంట్లోకి నడిచింది విశాలి.
    కళ్ళెర్రజేసి తనవంకే చూస్తున్న వదినని చూపి అర్ధంకాక తల వంచుకుని అక్కడినుంచి కదిలిపోయింది.
    సాయంత్రం రామం ఇంటికి రాగానే మహాలక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది.
    "తలనెప్పి, ఆఫీసుకి వెళ్ళనని గొప్పగా చెప్పింది. అదెవర్తో వచ్చింది, స్నేహితురాలుట. ఇద్దరూ గదిలో చేరి ఒకటే కబుర్లు, ఒకటే పకపకలు. అంత తలనెప్పి నిజంగా ఉంటే అంతసేపు కూర్చుని కబుర్లు చెప్పడానికి ఓ పిక ఎలా వచ్చిందో? అసలైనా ఆ నవ్వు లెందుకో ఆ మాత్రం నే నర్దం చేసుకోలేనా? నన్ను చూసే! నా గురించే చెప్పుకుని తెగ నవ్వుకున్నారు. మా వదిన చూడు, ఎలా ఉంటుందో నని చూపించడానికేగా బొట్టు పెట్టించు కెళ్ళమనే వంకతో నన్ను పిలిచి మరీ చూపించింది స్నేహితురాలికి."
    భార్య మాటలకి కరిగిపోయాడు రామం.
    "మా చెల్లెలి సంగతి నీకు తెలియదూ? మొట్టమొదటి రోజునే దాన్ని గురించి నీకు చెప్పానుగా? అదో దురదృష్ట జాతకురాలు. దాని మూలాన అంతా చెడేగాని మంచి ఒక్కటికూడా జరగదు. పుట్టగానే మా అమ్మని ఈ లోకంనించి పంపేసింది. దానికి పెళ్ళి కాలేదన్న దుగ్ధకొద్దీ నిన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నట్టుంది. దాని మాటలు నువ్వు పట్టించుకోకు. దానికి బాగా బుద్ధి వచ్చేటట్టు నేను చేస్తాగా?" ప్రేమగా భార్య కళ్ళు తుడిచి బ్రతిమాలాడు. అప్పటికి శాంతించింది మహాలక్ష్మి.
    ఈ మాటలన్నీ పక్క గదిలో కూర్చున్న విశాలి చెవుల్లో పడి హృదయాన్ని బద్దలు చేశాయి. తల్లిని ఎరగని ఆ మనసు, ఆ క్షణంలో, ఏ లోకాల్లోనో ఉన్న తల్లిని తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది.
    'అన్నయ్యా! నే నంటే నీ కెందు కింత కక్ష?' పదేపదే ప్రశ్నించుకుని పలవరించి పోయింది. ఇంక ఆ సాయంత్రం సువర్ణా వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళ కూడదనే నిశ్చయించుకుంది.
    ఏ మొహం పెట్టుకుని వదినని పేరంటానికి వెళదామా అని అడగాలి? ఎలా అడుగుతుంది? వదిన నోటినుంచి ఏం మాట వినవలసి వస్తుందో, ఏమో? "ఏం, ఇంకా నీ స్నేహితురాళ్ళకి పది మందికి నన్ను చూపించి, వాళ్ళతో కలిసి నవ్వుకుందామనుకుంటున్నావా?" అని వదిన అడిగితే ఏం జవాబు చెప్పాలి? తన మనసులో వదినంటే ఉన్న గౌరవం, ప్రేమా చెప్పినా అర్ధం చేసుకుంటుందా?' ఇన్ని ఆలోచించి విశాలి పేరంటం విషయం తలపెట్టలేదు.
    పేరంటానికి వెళ్ళకపోతే సువర్ణకి కోపం వస్తుందేమోనన్న బెంగలేదు. తను మనసులో పడే ఆవేదన విప్పి చెప్పుకుంటే ఆమాత్రం అర్ధం చేసుకోకపోదు తన స్నేహితురాలు.
    కానీ, పేరంటానికి వెళ్ళనందుకు అనుకోని సంఘటన ఆ రాత్రి ఎదుర్కోవలసి వచ్చింది విశాలికి.
    రాత్రి భోజనాలయ్యాక వంటిల్లు కడుగుతున్న విశాలి దగ్గిరికి విసురుగా వచ్చింది మహాలక్ష్మి.
    తల వంచుకుని తన పని తను చేసుకుపోతున్న విశాలిని చూస్తూ వికృతంగా నవ్వింది.    
    "పాపం! నా వల్ల నీ ప్రియమైన స్నేహితురాలి ఇంటికి పేరంటానికి వెళ్ళడంకూడా మానుకున్నట్టు న్నావే?"
    చేతిలో చీపురు జారిపోయిందన్న సంగతికూడా గుర్తించలేని స్థితిలో విస్తుపోయి చూస్తూ నిలబడి పోయింది విశాలి వదిన మాటలకి.    
    "ఏం? అలా కొయ్యబొమ్మలా నిలబడిపోయావ్! పేరంటానికి వెళదామా అని నన్నడిగితే నే నెక్కడొచ్చేస్తానో- 'ఇంత అందమైనదాన్ని వెంటేసుకెళ్ళి వదిన అని చెప్పుకోక తప్పదురా దేవుడా' అని నీ బాధ. అవునా? నీ స్నేహితురాళ్ళ ముందు నీకు తీరని అవమానం జరిగినట్టు సిగ్గుతో 'కుమిలిపోతావ్ నన్ను తీసుకెళితే, అంతేనా?" ముందుకు పడ్డ ముంగురుల్ని వెనకకి తోస్తూ తిరిగి చీపు రందుకుంది విశాలి.
    "ఎందుకు వదినా, అలా అంటావ్! నువ్వు నాతో ఎక్కడికైనా వస్తే నాకు అవమానం అని నేను కల్లో కూడా భావించను. నా తప్పేమైనా ఉంటే తల్లిలాగా మందలించి మన్నించు. నేను కోరే దదే.... అంతేకాని ..." మరి మాట్లాడలేకపోయింది విశాలి.
    "ఓహోహో! నాకు నీతులు బోధిస్తోంది, నీతులు. నేను తల్లినట, ఆవిడగారు కూతురుట. నవ్వాలా, ఏడవాలా ఈ కల్లబొల్లి కబుర్లకి! నంగనాచి కబుర్లు, ఇలాంటి మనుషులు వెనకాల ఎన్ని గోతులైనా తవ్వగలరు." దూకుడుగా అక్కడినించి వెళ్ళిపోయింది మహాలక్ష్మి.
    'ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న పరిస్థితి తన దీ ఇంట్లో, ఎలా మాట్లాడినా, ఏం చేసినా అన్నయ్యా, వదినలు తన ప్రవర్తనని విమర్శిస్తూనే ఉంటారు. తప్పదు. ముందుకో, వెనక్కో వెళ్ళి ఎందు లోనో అందులో పడటం మాత్రం తనకి తప్పదు.' కొంగుతో కన్నీరు అద్దుకుంటూ అలాగే ఎంతసేపో ఉండిపోయింది విశాలి.

                            *    *    *

    ఆ రోజు ఆఫీసునించి ఇంటికి వస్తూండగా ఇంట్లో కూరలై పోయాయన్న సంగతి గుర్తొచ్చి, కూరల మార్కెట్టు కేసి నడిచింది విశాలి.
    తీరా అక్కడి కెళ్ళిన తరవాత సంచీ ఏమీ లేదు కదా, ఎలా తీసుకెళ్ళాలన్న సమస్య వచ్చి నిలబడి పోయిందో నిమిషం.
    "కూరలు కొంటారా? అలా నిలబడి పోయారేం?" అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. సదాశివం. చేతిలో కూరలసంచీ పెదాలపై చిరునవ్వు.
    నవ్వింది జవాబుగా విశాలి.
    "అవునండీ! కొందామనే వచ్చాను. కానీ ఎంత మందమతినో చూడండి. తీసుకెళ్లడానికి సంచీ ఏమీ లేకుండానే కొనేద్దామని వచ్చాను." సదాశివంతో మాట్లాడితే ఆప్తులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది విశాలికి.
    "మీ రేమీ అనుకోకపోతే, ఈ పక్క వీధిలోనే మా ఇల్లరండి, వెళదాం. నేను సంచీ ఇస్తాను మీకు. మా ఇల్లు పావనం చేసినట్టూ అవుతుంది...."
    "బలేవారే! పావనం, పవిత్రం అంటూ అంతంత పెద్ద మాట లెందుకు లెండి. నేనూ మీ లాంటి మనిషినే." సదాశివాన్ని అనుసరించింది విశాలి.
    "ఏదో ఊరికే అలా అనేశానండోయ్! మీ క్కోపం రాలేదుకదా?"
    సదాశివం ముఖం చూచి పక్కున నవ్వింది విశాలి. "అబ్బ! అంత భయపడిపోతారేమిటండీ?"
    ఒక్క మాటలో చెప్పాలంటే సదాశివానికి కల్మషం లేని మనసుంది.
    స్నేహితులన్నా, బంధువులన్నా ప్రాణమిస్తాడు. ఎటొచ్చీ మొహమాటం అన్నది అప్పుడప్పుడు అడ్డొచ్చి కూచుంటుంది కాబట్టి, స్నేహితులతో మాట్లాడినంత ఫ్రీగా బంధువులతో మాట్లాడలేడు.
    "ఇదే మా ఇల్లు!" అంటూ వరండా మెట్లెక్కాడు సదాశివం. చిన్న పెంకుటింట్లో ఒక పక్క వాటా వాళ్ళది. రెండో దానిలో ఇంటివాళ్ళే ఉంటున్నారని మెట్లెక్కుతూ అతనే చెప్పాడు విశాలితో. వరండాలోనే గోడవారగా ఉన్న స్టూల్ ని చూపిస్తూ, "కూర్చోండి" అన్నాడు.    
    లోపలికి వెళ్ళి భార్యతో ఏదో చెప్పి మళ్ళీ బయటికి వచ్చాడు.
    నిలబడే ఉన్న విశాలిని చూసి చాలా నొచ్చుకున్నాడు. "అబ్బే! దానికేముంది, ఫరవాలేదు లెండి. ఇంకోసారెపు డన్నా వస్తాలెండి. అసలు నే నెందుకొచ్చానో మరిచి పోయారు మీరు" అంటూ సంచీ సంగతి గుర్తు చేసింది.
    "లేదండీ! మరిచిపోలేదు. రాకరాక వచ్చారు మీరు మా ఇంటికి."
    "అయితే?"
    ఇంతలో అతని భార్య రెండు గ్లాసులతో కాఫీ పట్టుకొచ్చింది.
    భార్యని విశాలికి పరిచయం చేశాడు సదాశివం.
    "మీ కనవసరంగా శ్రమ ఇచ్చాను. లేకపోతే ఇప్పు డీ కాఫీ ఎందుకు చెప్పండి?"
    "ఇందులో శ్రమేమీ లేదు. ఆఫీసు నించి రాగానే ఆయన కెలాగో కాఫీ కలుపుతానుగా? ఇంకో గ్లాసెక్కువ కలిపానంతే." నవ్విందావిడ. "మీరు తీసుకోరూ?" విశాలి ప్రశ్నకి తడబడిందావిడ. "నేనా? అబ్బే! నా కలవాటు లేదు కాఫీ."
    "ఫర్వాలేదు. ఇద్దరం చెరిసగం తాగుదాం. ఇంకో గ్లాసు తీసుకురండి."
    విశాలి బలవంతం మీదావిడ ఇంకో గ్లాసు తీసుకొచ్చింది, ఖాళీది. ఆవిడ గ్లాసులో సగం పోసి తను సగం తీసుకుంది విశాలి. కాఫీ తాగడం పూర్తిచేసి గ్లాసు కింద పెడుతూ సదాశివంతో - "మీ పిల్ల లేరీ?" అని విశాలి అంటూ ఉండగానే, అతని భార్య లోపలికి వెళ్ళి ఏడాది పాపని ఎత్తుకు తీసుకొచ్చింది. అమ్మ కొంగుపట్టుకుని, మహ బిడియపడుతూ తను కూడా వచ్చాడు బాబిగాడు.
    "ఇరుగో! మా యువరాజు, యువరాణీ గార్లు" అన్నాడు సదాశివం విశాలితో.
    బొద్దుగా, ముద్దుగా ఉన్న పాప బుగ్గమీద చిటికె వేసి పలకరించింది విశాలి.
    పువ్వులా నవ్వింది పాప.
    "వీడికి మాత్రం మహ కొత్త లెండి. కొత్త ముఖాన్ని చూస్తే అమ్మ కొంగులోంచి ఇవతలికి రాడు. కానీ, ఆ కొత్త ఒక రోజుకంటే ఉండదు లెండి. ఒకసారో రెండుసార్లో చూస్తే కొత్త పోతుంది. అలవాటై పోతుంది. అప్పుడు వద్దన్నా ఆగకుండా వచ్చీ రాని మాటలు చెపుతూనే ఉంటాడు." మూడేళ బాబిగాడిని పరిచయం చేశాడు సదాశివం. అతని భార్య లక్ష్మి పిల్లలిద్దరి వంకా మురిపెంగా చూసింది.    
    వాళ్ళందర్నీ చూస్తుంటే ముచ్చటేసింది విశాలికి. "బాబూ! మళ్ళీ నేనీ సారి మీ ఇంటికి వచ్చేటప్పటికి నే నంటే నీ కున్న 'కొత్త' పోవాలి. తెలిసిందా" అంటూ బాబు చేతిమీద ముద్దు పెట్టుకుంది.
    సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయాడు బాబు.
    "నీ పేరు చెప్పావు కాదు" అంది విశాలి బాబు ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి.    
    "మీ రసడంగందే ఇంతకు ముందు? ఇప్పుడేగా అడగటం?" అంది లక్ష్మి గడుసుగా.    
    "ఓహో! అయితే నా తప్పుకి తల్లీ కొడుకులిద్దర్నీ క్షమించమని వేడుకుంటున్నాను."
    ముగ్గురూ పక్కున నవ్వుకున్నారు.
    "చెప్పరా నీ పేరేమిటో!" కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు సదాశివం.
    "మురలి."
    "మురళి అనాలి. మురలి కాదు." పాపని ఈ చేతి లోంచి ఆ చేతిలోకి మార్చుకుంటూ అంది లక్ష్మి.
    "ఇప్పటికే ఆలస్యమైంది. ఇంక నే వెళతాను." లేచింది విశాలి.
    సంచీ తెచ్చి ఇవ్వడానికి లోపలికి వెళ్ళాడు సదాశివం.
    "ఎప్పుడైనా వస్తూ ఉండండి. మీ రెప్పుడొచ్చినా స్వాగతమే." మనస్పూర్తిగా ఆహ్వానించింది లక్ష్మి.
    "మీరూ రావాలి మా ఇంటికి." నవ్వింది విశాలి.
    "తప్పకుండా."
    "ఏమిటి ఏదో వాగ్ధానం చేసేస్తున్నావు?" భార్య వంక చిలిపిగా చూస్తూ వచ్చాడు సదశివం.
    "మిమ్మల్నేం వరాలడగను లెండి." లక్ష్మి చిలిపి కోసం నవ్వు తెప్పించింది విశాలికి.
    సంచీ అందుకుని, "వస్తానండీ" అంటూ ఇద్దరికీ నమస్తే చెప్పి గబగబా ముందుకి నడిచింది విశాలి.
    ఇంట్లో అడుగు పెడుతుండగా, వదిన అష్టోత్తరమో, సహస్రనామమో చదువుతుండడం వినిపించింది.
    "మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు వెలగబెడితే ఇలాగే ఏడుస్తుంది. ఇల్లూ, వాకిలీ కనుపిస్తుందా? ఎక్కడెక్కడ తిరుగుతారో ఏమో? ఎవరు చూడొచ్చారు గనక?"
    లోపల అడుగు పెడుతున్న విశాలిని చూడగానే మహాలక్ష్మి దండకం టక్కున ఆగింది.
    అప్పటివరకూ అక్కడే కూర్చుని ఉన్న రామం, విశాలి చేతిలో కూరలసంచీ చూస్తూ మెల్లిగా తన గదిలోకి జారుకున్నాడు.
    "ఎంత కూరలు కొంటే మాత్రం ఇంతసేపపు తుంది టండీ! మరీ విడ్డూరంగానీ" అంటూ భర్త వెనకే వెళ్ళింది మహాలక్ష్మి. మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది విశాలి.

                             *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS