ఒక్క నిమిషం అన్నయ్య మాట మీద తిరుగుబాటు చేసింది మనసు.
'తను అన్నయ్య చేతిలో కీలుబొమ్మలా ఆడించి నట్టల్లా ఆడక తప్పదా? ఉద్యోగం మాని తీరవలసిందేనా? అన్నయ్యా వదినలకి తను ఉన్నా, లేకపోయినా ఒకటే. తనకి భర్తా? పిల్లలా? ఎవరూ లేరు. తన కెవరూ లేరు. తను ఎవరికీ అక్కర్లేదు అన్న బాధ ఉద్యోగ రంథిలో పడి మరిచిపోదామనుకుంది. ఆ విధంగా నైనా కాలం దొర్లించేయాలనుకుంది. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఇంట్లో కూర్చుంటే తను ఎవరికీ అక్కర్లేదన్న బాధ మనసుని దొలిచివేయదూ? భగవాన్! ఏమిటి కర్తవ్యం?'
అంతలోనే విశాలి మనసు శాంతంగా ఆలోచించింది. అన్నయ్య మాట కాదని తను ఉద్యోగం చెయ్యదలుచు కుంటే ఈ ఇంట్లో ఈమాత్రం ఆశ్రయంకూడా తనకి ఉండదేమో? అప్పుడింక అన్నయ్య తనకేం జరిగినా పట్టించుకోడు. తను ఒంటరి దవుతుంది. ఒంటరి ఆడది సన్మార్గంలో బ్రతికేందుకు అవకాశం ఇవ్వని సంఘం ఇది. అప్పుడు తన గతి.....తన శీలానికే ముప్పు తెచ్చే కథలు ఇంకా ఎన్నయినా అల్లుతా డన్నయ్య....తన బ్రతుకేమవ్వాలి? తలుచుకుంటేనే భయంతో కంపించింది విశాలి హృదయం.
ఉద్యోగం మానేయాలనే నిశ్చయించుకుంది చివరికి.
ఆ రాత్రంతా నిద్రలో ఒకటే కలలు.
అడవిలో, ఎవరికీ పనికిరాని, ఎవరూ కొయ్యని పువ్వుగా మారి విలపిస్తూంది ఆ కలలో తను. కలల మూలంగా ఎన్నోసార్లు మెలకువ వచ్చి ఉలిక్కి పడి లేచి కూర్చోవటంవల్ల నిద్ర కలత నిద్రయి తల బరువెక్కి నట్లయింది.
తన ఆలోచనలకీ, తన భయాలకీ నవ్వొచ్చింది.తనకి తనే ధైర్యం చెప్పుకుంది.
తాతయ్య జ్ఞాపకం వచ్చి ఒక్క నిమిషం ఏవేవో ఊహించుకుంది.
కన్నవాళ్ళు చిన్నతనాన్నే దూరమైనా, కనిపెట్టి పెంచిన తాతయ్యకూడా తన కొక సరిఅయిన బాటచూపించకముందే ఎందుకు దూరమవ్వాలి?
* * *
విశాలి రాజీనామా చూసి ఆశ్చర్యపోయారు రాఘవ రావుగారు.
వివరాలడగబోతున్న ఆయన్ని చూసి వారించింది విశాలి. "కారణా లడక్కండి. కాలచక్రంలో నా బోటి వాళ్ళు నలిగిపోతుంటారు. అంతమాత్రాన దయతో కాలచక్రం ఆగిపోదు. ఆ చక్రాన్ని నడిపించే నాథుడు అసలు పట్టించుకోడు. ఇంక రక్షణ కోసం ప్రాకులాడి ప్రయోజనం ఏమిటి?"
విశాలి మాటల్లో దాగిఉన్న వేదన రాఘవరావుగారి గుండెల్లో మంట రగిల్చింది. మాట్లాడలేక మౌనంగా ఆ మంట భరిస్తూ ఉండిపోయారాయన. చివరికి ఓ నిమిషం పోయాక గొంతు పెగుల్చుకుని గద్గదంగా పలికారు: "నీ శుభం కోరేవాళ్ళలో నే నొకడిని. నన్ను మరిచిపోకమ్మా! నీ కెప్పుడైనా నా వల్ల అయ్యే సహాయం అంటూ ఉంటే తప్పకుండా నా కా అవకాశం ఇయ్యి, తల్లీ!" ఆప్యాయత ఉట్టిపడిం దా స్వరంలో.
రెండు చేతులూ జోడించి, కన్నీటితో వెనుతిరిగింది విశాలి. బరువుగా ముందుకు సాగాయి విశాలి పాదాలు. బాధగా మూలిగింది రాఘవరావుగారి మనసు.
* * *
విశాలి మాటలకి నిజంగానే బాధపడ్డాడు సదాశివం.
"అలా అనకండి. మీకు ముందు ముందు ఎప్పుడూ కూడా తప్పకుండా మంచే జరగాలని నేను కోరుతున్నాను. ఇంత చిన్నవయసులోనే మీ రంత వైరాగ్యం పెంచుకోవడం మంచిది కాదు."
నవ్వి ఊరుకుంది విశాలి.
ఒక క్షణం పోయాక మళ్ళీ అతనే అన్నాడు: "మీ లాంటి మంచి స్నేహితురాలు దూరమవుతున్నందుకు చాలా బాధగా ఉంది నాకు."
మాటలు పెంచదలుచుకోలేదు విశాలి. మరి సెలవు పుచ్చుకుని ముందుకి నడిచింది.
"రాజీనామా చేశారని విన్నాను!" ఎదురుగా వచ్చి నిలబడింది పరిమిళ.
"అవును!"
"మారేజ్ చేసుకుంటున్నారా?"
తల వంచుకుని మెల్లిగా గొణిగింది విశాలి: "కాదు."
"పోనీలెండి! అత రహస్యమా? ఇప్పుడు రహస్యంగా దాచినా మారేజ్ చేసుకున్నాక తెలియకుండా దాచగలరా?" పరిమళ గొంతులో వెటకారం. పెదవుల మీద అర్ధంలేని నవ్వు.
చిరాకేసుకొచ్చింది విశాలి కా మాటలతో. తను వెళ్ళిపోయాక, రహస్యంగా పెళ్ళిచేసుకుందన్న పుకారు తన మీద పుట్టించగల దీ మహానుభావురాలు!
బాధనిపించింది విశాలికి. ఒక్క క్షణం మౌనంగా పరిమళ కళ్ళలోకి చూసి, సాధ్యమైనంత మెల్లిగా- "పెళ్ళి చేసుకున్నప్పుడు మిమ్మల్ని పిలవడం మాత్రం మరిచిపోను లెండి. మీ రే బెంగా పెట్టుకో నక్కర్లేదు" అనేసి మరి ఒక్క క్షణంకూడా అక్కడ నిలబడలేదు విశాలి.
ప్రతిమలా నిలుచుండిపోయింది పరిమళ.
కాసేపటికి తేరుకుని, చేతిలో ఉన్న రుమాలుతో నుదుటి మీద అద్దుకుంది.
స్వేచ్చగా ఒకసారి గాలి పీల్చుకుని, తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది.
విశాలి రాజీనామా పరిమళ కొక్కదానికే సంతోషం కలిగించింది. దానికి కారణం లేకపోలేదు. మొదటినించీ కూడా విశాలి అంటే ఏమాత్రం ఇష్టం లేదాయె. రాను రాను అందరికీ విశాలిమీద ఏర్పడిన మంచి అభిప్రాయం పరిమళమీద ఎవరికీ కలగలేదు. పైగా ప్రతి విషయంలోనూ తనకి పోటీగా ఇంకో స్త్రీ తను పనిచేస్తున్న చోటే ఉండడం పరిమళ కేమాత్రం నచ్చలేదు. అందుకే ఇప్పుడు తను తప్ప ఇంకో స్త్రీ ఎవరూ ఆ ఆఫీసులో లేకపోవడం తో ఎంతో తృప్తి కలిగింది.
ఒకసారి తలెత్తి, చుట్టూ ఉన్న మగపురుగుల్ని విలాసంగా చూసింది.
* * *
రెండు మూడు రోజులు గడిచిపోయాయి.
ఆ రోజు సుడిగాలిలా దూసుకువచ్చింది సువర్ణ.
సువర్ణ ముఖంలోకి ఎర్రదనాన్ని పసిగట్టిన విశాలి,స్నేహితురాలి చేయందుకుని తిన్నగా తన గది లోకి నడిపించి, ముందు కూజాలో నీళ్ళు ఒక గ్లాసుతో అందించింది.
"ఏం? రాగానే కూజాలో నీళ్ళందిస్తున్నావు. ఎందుకొచ్చానో తెలిసిపోయినట్టుందే?"
కిటికీలోంచి బయటికి చేయి చాచి, అందిన ముద్ద మందార సుతారంగా తుంచింది విశాలి.
ఆ ఎర్రని మందార సువర్ణ కెదురుగా బల్లమీద ఉంచింది. అర్ధంకాక చూస్తూంది సువర్ణ.
"కోపంలో నీ ముఖం ఇంత అందంగానూ, ఇంత ఎర్రగానూ ఉంటుంది."
విశాలి మాటలకి ఫక్కున నవ్వింది సువర్ణ.
"చాల్లే! సంతోషించాం."
ఒక్క నిమిషం ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. గాలికి గదిలోని జంట పావురాల కేలండరు రెపరెప లాడుతూంది.
గాలితో సరాగమాడుతున్న మందార ఆకులు కిటికీకి రాసుకుని వింత శబ్దాన్ని చేస్తున్నాయి.
సూటిగా విశాలి కళ్ళలోకి చూస్తూ అడగనే అడిగింది సువర్ణ: "ఉద్యోగం మానేశా వెందుకూ?"
"మానేశాను." నవ్వింది విశాలి.
"మీ అన్నయ్య ప్రయోజకత్వం కదూ?"
ఒక్క క్షణ మాగి మళ్ళీ తనే అంది సువర్ణ: "ఈ ఉద్యోగం లోనైనా నువ్వు కాలాన్ని వెళ్ళబుచ్చుదా మనుకుంటే అదికూడా చూడలేకపోయాడా మీ అన్నయ్య!"
"పోనీలే, సువర్ణా! అయిందేదో అయిపోయిందిగా?"
"మీ అన్నయ్య వద్దనగానే ఉద్యోగానికి స్వస్తి పలికావు. కానీ ఇప్పుడు నీ కేం తెలియదు. ముందు ముందు నీ కీ ఆధారంకూడా లేనందుకు నిన్నింకా హీనంగా చూస్తారు మీ అన్నావదినలు. స్వేచ్చగా ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఉండదు. ఎంత బాధపడవలసి వస్తుందో నీకేమైనా ఆలోచన వచ్చిందా?"
స్నేహితురాలు అంటున్న ఒక్కొక్క మాటా భయం కరంగా వినిపించింది విశాలికి. కానీ, అంతలోనే తేరుకుని, గుండె చిక్కబట్టుకుని స్థిరంగా పలికింది: "నే నన్నీ ఆలోచించే ఆ పని చేశాను."
ప్రేమగా విశాలి చేతు లందుకుంది సువర్ణ.
"నువ్వుత్త అమాయకురాలివి, విశాలీ!"
"కాదు, కాదు! నువ్వనుకున్నది పొరబాటు. నేనాలోచించిన విధానం నీకు చెపితే నే నమాయకురాల్ని కాదని నువ్వే తెలుసుకుంటావు.' మనసులోనే అనుకుంది విశాలి.
"నీకు తెలియదు, విశాలీ! నీ విషయంలో మీ అన్నయ్య ప్రవర్తించే తీరు చూస్తే నా గుండ నీరవుతోంది. నీ కంటే ఎక్కువ నేనే బాధ పడతాను నీ స్థితి చూసి. నువ్వు 'ఊఁ' అను. మీ అన్నయ్యతో దెబ్బలాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను."
"వద్దొద్దు. అంత పని మాత్రం చేయకు. నే నొకటి అడుగుతాను. జవాబు చెపుతావా?"
"అడుగు."
"అన్నిటికంటే శీలం ప్రధానం. అవునా, కాదా?"
"కాదని ఎలా అంటాను?"
"మరి అందుకే నేను అన్నయ్య చెప్పినట్లు చేస్తున్నాను."
"అంటే?" అర్ధంకాక అయోమయంగా చూసింది సువర్ణ.
"జీవిత సమరంలో ఒక ఆడది ఒంటరిగా నెగ్గుకు రాలేదు. ఇప్పుడు ఉద్యోగం విషయంలో అన్నయ్య మాట కాదన్నానంటే ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అలా అని ఒక్కదాన్నీ వేరే ఎక్కడికో పోయి ఉద్యోగం చేసుకునే ఆలోచన నాకు లేదు. కారణం ముందే చెప్పానుగా? తన మాట కాదంటే ఫలితంగా నా పేరు నలుగురి నోళ్ళలోనూ పడేటట్టు చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడన్నయ్య. ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఏ విధంగా చూసినా నేను అన్నయ్య మాట కాదన్నా నంటే నా జీవితానికే ముప్పు. ఈ ఇంట్లోనే ఉండి అన్నా వదినలచేత ఎన్ని మాటలైనా పడతానుగానీ, వాళ్ళని కాదని బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టి నా జీవితానికే ముప్పు తెచ్చుకోలేను. అనవసరంగా నా శీలానికి లేని మచ్చ వస్తే భరించే శక్తి నాకు లేదు, సువర్ణా, లేదు." రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని విలపిస్తున్న విశాలిని కన్నీటితో అక్కున చేర్చుకుంది సువర్ణ. మనసులో వేదన కన్నీరై స్రవించగా మనసు తేలికపడి శాంతంగా అంది విశాలి.
"అయినా సంపాదించే అన్నయ్య ఉండగా ఉద్యోగం చెయ్యవలసిన అవసరం నాకేమిటి? అన్నా వదినలే నాకు తోడునీడ. హాయిగా అన్నయ్య నీడన కాలిమీద కాలేసుకుని కూర్చుని జీవితం గడిపేస్తాను." తనకి తనే ధైర్యం చెప్పుకుంటున్నట్టున్నాయి విశాలి మాటలు.
భారంగా నిట్టూర్చి వెళ్ళడానికి లేచింది సువర్ణ.
వెళుతూ వెళుతూ "మా బావ మారిపోయాడు, విశాలీ!" అంది కొంచెం విచారంగా.
గబుక్కున సువర్ణ చేతిని అంది పుచ్చుకుని, తన వైపు తిప్పుకుంది విశాలి. సూటిగా ఆ కళ్ళలోకి చూస్తూ భయం భయంగా అడిగింది: "ఏమిటి నువ్వనేది?"
"ఇదివరకటిలా సరదాగా కబుర్లు చెప్పటం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం మొదలు పెట్టాడు."
"అయితే ఎప్పుడూ నా బాధలో నువ్వు భాగం పంచుకోవడమేగాని, నీ మనసులో బాధ ఏమిటో వినేందుకుకూడా నేను అర్హురాల్ని కాదా?" బాధగా అడిగింది విశాలి.
"ఛ! అంత మాట నే నన్నానా?"
"మరి నాతో ఇంతవరకూ నోరు విప్పి నీ మనసులో వేదన వినిపించలేదేం?"
"బావ అలా ఉండడం ఈమధ్యనే మొదలు పెట్టాడు. అయినా నీ కష్టంలో, నీ బాధలో నువ్వు మునుగుతుంటే ఇంక నా గోడుకూడా నీ ముందు పెట్టి నిన్నింకా బాధ పెట్టాలంటే నాకు..." ఆగి పోయింది సువర్ణ. అర్ధం చేసుకోమన్నట్టు.
"ఏమున్నాలేకపోయినా భగవంతుడు నీ లాంటి స్నేహితురాల్ని నాకు ప్రసాదించినందుకు నిజంగా నేను అదృష్టవంతురాల్ని." తృప్తిగా విశాలి కళ్ళు మెరిశాయి.
ఒక్క క్షణ మాగి, స్నేహితురాలి చేతిని మృదువుగా నొక్కుతూ మళ్ళీ అంది విశాలి. "మీ బావ మళ్ళీ ఎప్పటిలా సరదాగా ఉండాలని, నీ కళ్ళలో మీ బావ నవ్వులు మెరవాలనీ భగవంతుడిని మనఃస్ఫూర్తిగా కోరుతున్నాను."
స్నేహితురా ళ్ళిద్దరి చూపులూ పూవులై నవ్వాయి.
* * *
