రెండో సంవత్సరం మొదటిసారి అనాటమీ థియేటరుకు వెళ్ళారు-ఇంతవరాకు కప్పల్ని, కాక్ లోచెస్ ని డిఫెక్ట్ చేశారు. ఈ రోజునుంచి మనిషి శరీరాలకు డిఫెక్ట్ చేయాలి. తెలియని భయం ఆవహించింది.
థియేటరుకు కొత్తగా పోవటం- అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. థియేటర్ లో సీనియర్స్ ఉన్నారు. గాడీ రంగుల్లో ఉన్న వాళ్ళమీద కామెంట్సు జరిగాయి. సాధారణంగా తెల్లదుస్తులు వేసుకొని రావాలన్నారు.
లోనికి రాబోయిన వాళ్ళని సీనియర్ అబ్బాయి-అనాటమీ పరీక్షకు బాగా పునాహ్ది ఉన్నవాడు-"ఆగండీ! ఆగండీ!" అంటూ అందరిని ఆపి, అటెండరు అందించిన ట్రే తీసుకొన్నాడు. అందులో పుర్రెమీద కర్పూరం వెలిగించి కొత్త పిల్లలకు హారతి ఇచ్చాడు.
కొబ్బరికాయ పగులగొట్టి కొబ్బరి ముక్కలు అందరికీ పంచాడు.
గుంపులు గుంపులుగా అందరూ లోనికి వెళ్ళారు.
విశాలమైన కిటికీలున్న హాలు గాలి, వెలుతురులతో పరిశుభ్రంగా ఉంది.
అక్కడక్కడ గోడల వారగా స్టాండ్సు మీద అస్థి పంజరాలు వేలాడుతున్నాయి. గదికి ఇరు పక్కల రాతి బల్లలున్న పొడుగాటి టేబుల్స్, వాటిమీద శవాలున్నాయి. కొన్ని బాడీస్ పై, ఎర్రటి రబ్బరు షీట్సుకప్పి ఉన్నాయి.
జుబేదా చెయ్యి గట్టిగా పట్టుకొంది వీణ.
ఒక శవం దగ్గర చుట్టూ మూగిన సీనియర్స్ విరిగిపోయిన ఆటవస్తువు ముక్కలతో ఆడుకొంటున్న పిల్లలులా ఒకరు కాలిని కోస్తున్నారు. మరొకరు చెయ్యి, మరొకరు కడుపు కోస్తున్నారు. దగ్గరలో స్టూల్సు మీద కూర్చుని డిసెక్ట్ చేసే భాగాన్ని గురించి చదువుతూ ఉంటే పార్ట్ నర్స్ డిసెక్ట్ చేస్తూన్న ఒక్కొక్క భాగం పరిశీలిస్తూ చూస్తూ ఉన్నారు.
అమ్మాయిల గుంపు కిలకిల నవ్వుకొంటూ కబుర్లతో చుట్టూ చేరారు. కొందరు విడివిడి భాగాలను దూరంగా తీసుకొని వెళ్ళి చేసుకొంటున్నారు.
వీణ, జుబేదాలకు కడుపులో దేవినట్లు వికారం కలగసాగింది. ఒక మూలకు వెళ్ళి కూర్చున్నారు. దగ్గరలో టాంకు లో నున్న శవాలనుండి ఒక బాడి తీసుకువచ్చి ఒక బల్లమీద ఉంచారు తోటీలు.
అది నల్లగా శుష్కించిపోయి ఉంది. ఒక గ్రూపు తమకేదో విందు జరుగుతున్నదన్న సంబరంతో ఆ కొత్త శవం దగ్గర చేరారు. ఆ గ్రూపు ఆకలిగొన్న సింహాల గుంపులా కనపడింది వీణ కళ్ళకి. ఏదో ఘాటైన వాసన వచ్చింది. బాడీస్ ని ఫార్మలిన్ లో ప్రిజర్వు చేస్తారు. ఆ వాసన అది.
"వీణా! ఆ శవానికి రక్తం వస్తూ ఉంది. చూడు" అంది జుబేదా.
పక్కనే ఉన్న సీనియర్ నవ్వుతూ వచ్చాడు వారి దగ్గరకు. "మిస్! అది రక్తం కాదు. రక్తనాళాలు బాగా కనపడాలని- తెలుసుకోవటానికి డై ఇంజక్ట్ చేస్తారు ఆర్టరీలోకి - ఆ ఫ్లూయిడ్" అన్నాడు.
గుటకలు మింగుతూ తలలు ఊపారు.
"రండి! మీకు చూపుతాను థియేటరు అంతా!" అంటూ వాళ్ళను తీసుకొని వెళ్ళాడు ఆ అబ్బాయి.
థియేటరు హాలు పక్కన ఒక పెద్ద టాంక్ ఉంది. అది చూసి, "టబ్ లో కప్పల్ని ప్రిజర్వ్ చేసినట్లు ఇక్కడ బాడీస్ ని ఉంచుతారు. దాని పక్క మరో చిన్న తొట్టి ఉంది. దానిలో మనిషిలోని లోపలి భాగాలు ఉంచుతారు" అంటూ దానిమీది మూత తీశాడు.
"మీ కేది కావాలో తీసుకొని చదివాక అందులో వేసేయవచ్చు" అన్నాడు.
అందులో గుండె, ఊపిరితిత్తులు, మెదడు, లివర్ లాంటివి చాలా ఉన్నాయి.
వాళ్ళ కళ్ళలోని భయాన్ని చూసి, "ముందు అందరికీ అలాగే ఉంటుంది. తరవాత శవాల కొరకు తగవులు వేసుకొంటారు. పంతాలతో కూరగాయలను తరిగినట్లు తరిగేస్తారు!" అంటూ నవ్వాడు.
అటెండన్సు తీస్తూ ఉంటే జూనియర్స్ అందరూ ఒక దగ్గర చేరి హాజరు పలికారు-డెమాన్ స్ట్రేటర్ కొత్తవాళ్ళను ఒక బాడీ దగ్గరకు తీసుకొని వెళ్ళి అనటామికల్ టర్మ్స్ అన్నీ చెప్పాడు.
"నెక్స్ట్ క్లాసునుంచి మీరు లింబ్స్ చేయటం మొదలుపెట్టాలి. ముందే చదువుకొని రండి" అని చెప్పాడు. కోటు వేసుకోని వాళ్ళని చూసి, "కోటు లేక థియేటర్ లోకి రాకూడదు" అని అక్కడనుండి మరో బాచ్ దగ్గరకు వెళ్ళాడు.
థియేటర్ టైమ్ అయిపోయింది. పరుగు పరుగున బయటికి వచ్చారు. అంతవరకు భూత్ బంగళాలో ఉన్నట్లు నీరసంగా, వికారమైన మనస్సులతో డైనింగ్ హాలుకి వెళ్ళారు.
డైనింగ్ హాలంతా థియేటరు వాసన వస్తున్నట్లు ఉంది. భోజనాన్ని చూస్తూ ఉంటే వాంతి వచ్చేస్తున్నది. పరుగులాటి నడకతో రూముకి వచ్చి పడకల మీద పడిపోయారు వీణా, జుబేదాలు.
సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన సోఫియా పడకల మీద నిద్రిస్తున్న వీణ, జుబేదాలను చూసింది.
"వీణా! వీణా!" అంటూ తట్టి లేపింది.
మగత నిద్రలో ఉన్న వీణ ఒక్క వెర్రికేక వేసింది. ఆ కేక విన్న జుబేదా కేకలు వేయటం మొదలుపెట్టింది. పక్కగదుల వాళ్ళు పరుగున వచ్చారు. సోఫీ గట్టిగా పట్టుకొని ఒక్కొక్కరిని కుదిపింది.
బాహ్య ప్రపంచంలోకి వచ్చిన వీణ, జుబేదాలు సిగ్గుతో ముడుచుకు పోయారు!
"ఫస్ట్ డే థియేటర్ కి వెళ్ళారా!" అంటూ చప్పరించి వెళ్ళిపోయింది, అనాటమీ వాల్యూమ్ పట్టుకొన్నఅమ్మాయి.
అందరూ వెళ్ళిపోయాక, "అబ్బ! ఎంత భయపెట్టారు!" అంది సోఫియా.
"సోఫీ! శవాలను ఎలా పట్టుకోవాలి? ఎలా కోయాలి? భయం వేయదూ? ఎమ్. బి. బి. ఎస్, అంటే ఇలా ఉంటుందనుకోలేదు" అంది వీణ.
"రెపరెపలాడే చీరమీద మల్లెపువ్వులాంటి తెల్లటి కోటు, స్టెత్ చేత పట్టి సన్నజాజి తీగలా పోవటం లాగా ఉంటుందనుకొన్నావా, పిచ్చితల్లీ!? చీము, రక్తం, ప్రాణం ఉన్న మనిషికి, చీము, రక్తం ఉన్న గాయంలో చెయ్యి పెట్టటంకన్నా కట్టెలా ఉన్న బాడీస్ ని డిసెక్ట్ చేయటం సులువనుకో! లేచి డ్రెస్ చేసుకోండి! అలా బయటకు వెళ్ళుదాము" అంది సోఫియా.
జుబేదా పెట్టెలో నుండి తీసిన బ్లాక్ జార్జెట్ చీరను చూసి, "ఏయ్, జుబ్! జపాన్ జార్జెట్ కదూ?" అని చీరను పట్టుకొని నాణ్యం చూడసాగింది వీణ. ఆ చీరమీద జరీపువ్వులు కుట్టి ఉన్నాయి.
"నల్లచీర నీకు ఇష్టమా? నీకు ఒక్క నల్లచీరకూడా లేదుగా?" అంది జుబేదా.
"ఐ లైక్ బ్లాక్! బట్ నాన్నమ్మకి ఇష్టం లేదు. ఎప్పుడూ కొనదు." బుంగమూతి పెట్టింది వీణ.
"నీవు కట్టుకో!" అంది జుబేదా.
"నిజం! థాంక్యూ, జూబ్!" అంటూ తను కట్టుకోవాలనుకొన్న ధర్మవరం పసుపుపచ్చ చీర జుబేదాకు ఇచ్చింది.
వీరు మాటల్లో ఉండగానే సోఫియా తయారై పోయింది. చిన్న చిన్న పూలు ఉన్న తెల్లవాయిల్ చీర కట్టింది.
"సోఫీ! కంచి గ్రీన్ బార్డర్ కట్టుకో! నీ జాకెట్ కి సరిపోతుంది" అని ఆ చీర సోఫీ పడకమీద ఉంచింది వీణ.
"నా రంగుకి సోబర్ కలర్స్ సరిపోతాయి" అంటూ తుది మెరుగులు దిద్దుకొంది.
పౌడర్ దగ్గరినుండి పేస్ట్ వరకు వారివే వాడుతుంది. వారి చీరలు మాత్రం కట్టదు. కట్టినా నిర్మల హృదయులు, ఏమనుకోరు! కాని, తన కున్న సాదా చీరలే కట్టుతుంది. పట్టుచీరల తాహతు తనకు లేదని సరిపెట్టుకొంటూ వీణ వైపు చూసింది సోఫియా.
వీణ చెవులకు నల్లని ఆభరణాలులా చెవి దగ్గర వంకీలు తిరిగిన ముంగురులను సరిదిద్ది, నల్లని కమ్మలు పెట్టుకొంది. నల్లని గాజులు, నల్లని దండ, నల్లని చెప్పులు, నల్లని చీర, నల్లని జాకెట్ వేసుకొంది. అంతా బ్లాక్ డ్రెస్ లో ఉన్న వీణ ఒంటి ఛాయ మరీ పసుపు పచ్చగా మెరవసాగింది.
"వీణా! నీ ముఖం గ్రహం వీడుతున్న చంద్రబింబంలా ఉంది." జుబేదా అంది.
"జుబ్! మీరు పొగిడే అందం నాకేం కనిపించటం లేదు. నా కళ్ళకి మీరే అందంగా ఉంటారు" అంది.
"జుబేదాతో నన్ను పోలుస్తున్నావా? సరిసరి- ఇక పదండి" అని సోఫియా అనగా, "సోఫీ! నీకేం? నీ స్ట్రక్చర్ ఎంత బాగుంటుందో!" అంది వీణ.
"ఆఁ! వయస్సులో ఉన్న గాడిద పిల్లకూడా బాగుంటుంది."
ముగ్గురూ నవ్వుకొంటూ బయటికి వచ్చారు. అలా రోడ్డు ఎక్కారో లేదో రాజీవ్ తయారు- "హల్లో!" అంటూ.
'ఎక్కడ ఉంటాడో ఏమో! పిలిచినట్లు వచ్చేస్తాడు!' అని తలచింది జుబేదా.
"అది కెమెరానా!" అంటూ రాజీవ్ చేతిలో ఉన్న తోలుసంచి బాక్స్ ని చూసి కొంటెగా నవ్వుతూ అడిగింది సోఫియా.
"కాదు. బైనాక్యులర్స్" అంటూ వీణవైపు చూశాడు.
ఇప్పుడర్దమైంది వారికి. బాయిస్ హాస్టలు నుంచి బైనాక్యులర్స్ తో వీరి గదివైపు చూస్తూ కనిపెట్టుతూ ఉంటాడన్న మాట! అలా వారు రోడ్డుమీదకు భాగానే వచ్చేస్తాడు.

'ఎందు కా కష్టం అంతా!' అనుకొంది వీణ.
వీరి మొదటి రోజు థియేటర్ అనుభవం చెప్పి నవ్వుతూ, "నన్ను హడలకొట్టేశారనుకో! ఈ రోజంతా స్టార్వ్ అయ్యారు. ఏమైనా తినిపించు" అని సోఫియా అనగా, "యూ ఆర్ వెల్ కమ్" అంటూ కారు తీసుకొచ్చాడు.
అందమైన అమ్మాయిలు వెంటరాగా, ఎవరా అదృష్ట వంతుడని అందరి కళ్ళు అతన్ని వెంటాడగా, సుపరిచితమైన హోటల్ థ్రిల్లింగ్ లోని ఎయిర్-కండిషన్డ్ గది లోకి అడుగుపెట్టాడు రాజీవ్.
వీణకు ఇష్టమైన గులాబ్ జామ్, జుబేదాకు ఇష్టమైన హల్వా, సోఫియాకు ఇష్టమైన లడ్డూలు తెప్పించాడు.
థియేటర్ జ్ఞాపకం రాకూడదని ఏవేవో విషయాలు చెప్పి నవ్వించసాగాడు.
ఇది వరకులా వీణ, జుబేదాలు సిగ్గుపడలేదు. జోక్స్ కి నవ్వేస్తున్నారు. వీణ నవ్వుతుంటే మరీ మరీ కరిగి పదేపదే వీణ కావాలంటున్నది మనస్సు! బలాత్కారంగా, అంతమందిలోనూ చుంబించాలన్న బలవత్తరమైన కోరికను అణుచుకోవటం కష్టమే అయింది రాజీవ్ కి. ఎందుకు మరీ ఇంత ఆకర్షిస్తూంది తనను?
వీణ ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూడసాగింది. అలా అబ్బాయిలతో స్నేహంగా ఉండి నవ్వగానే తాను మైలపడిపోదు అని తెలుసుకుంది. తాను వచ్చిన కోర్సులో దూరంగా ఉంటే జరగదు. మగవారని భేదం లేదు. అందరూ ఒక్కటే. ఒక అబ్బాయితో దగ్గరగా మెలిగి నవ్వినంత మాత్రాన మనసిచ్చేసినట్లు కాదు అన్న విశాల భావాలు కలగసాగాయి.
అందుకే ఎవ్వరైనా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మరీ ముడుచుకొనిపోదు. ఇప్పుడు ప్రాక్టికల్స్ లో కలిసి చేయటం, ఒకరికి కావలసిన వస్తువులు మరొకరి నుండి తీసుకోవటంతో ఆ బెరుకు పోయింది.
ఏ భావాలూ లేని స్వచ్చమైన నవ్వు! చంద్రుడు వేడిని గ్రహించి చల్లని వెన్నెలనే చిలికినట్లు చిందిస్తున్న ట్లుంది వీణ నవ్వు!
జుబేదా కళ్ళు తెల్లని యూనిఫారమ్, గ్రీన్ టోపీ వాళ్ళలో జగ్గు కొరకు వెతకసాగాయి.
"జాబ్! నీ భక్తుడు ఎక్కడాకనపడలేదు. ఇండియాలో దేవతలకు కొదువ లేదు మరి!" అని జుబేదా చెవిలో గుసగుసలాడింది వీణ.
"వీణా! నలుగురిలో ఉన్నప్పుడు సీక్రెట్స్ పనికిరావు. ఆఁ!" అన్నాడు రాజీవ్.
"నాకు వినపడింది" అంది సోఫీ!
"మీ చెవులు పరీక్ష చేయించుకోండి" అంది జుబేదా!
కౌంటర్ దగ్గరకు బిల్లు చెల్లించటానికి రాజీవ్ వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న సర్వర్ ని పిలిచి, "జగ్గు ఏడీ? ఈ రోజు డే ఆఫా?" అంది సోఫీ.
ఆ సర్వర్ కళ్ళలో భయం! వీరివైపు వింతగా చూసి విననట్లు వెళ్ళిపోయాడు తడబడుతూ.
అతడు వెళ్ళి తక్కిన వారికి ఏమీ చెపుతాడోనని వారికి అనిపించింది వాడి కళ్ళలోని భావాలు చూసిన తరవాత. అంతకంటే మరెక్కువగా జగ్గు విషయం అడగటానికి భయం వేసింది వీరికి. రాజీవ్ ని వచ్చి కలుసుకొన్నారు.
సూర్యుడు అస్తమించేవేళకి హాస్టలుకి చేరుకొన్నారు. జుబేదా, సోఫియాలు గదికి వెళ్ళారు.
డైనింగ్ హాలువైపు వెళ్ళింది వీణ, ఈవినింగ్ పోస్టులోనైనా నాన్నమ్మ దగ్గరనుండి ఉత్తరం వస్తుందని! తనపేర కవరు ఉంది. నాన్నమ్మ గొలుసువ్రాత కాదు. అడ్రెసు అచ్చు గుద్ధినట్లు వ్రాసి ఉంది.
కవరు మూల 'గెస్ మీ' అని ఉంది.
గెస్ చేసేంత ఓపిక లేని వీణ కవరు చించింది.
సిల్కులా ఉన్న కాగితంపై అతి నీట్ గా వ్రాసిన వ్రాత. ఉత్కంఠతో కాగితం చివర సంతకం చూసింది.
'ఆరాధకుడు-నీ- సంజయ్!'
పెదాలు బిగించింది. మొట్టమొదటి ప్రేమలేఖ. ఆ లేఖలో అతని హృదయం, తన అందం కనిపిస్తున్నాయి. ఒక పక్కంతా 'ఐ లవ్ యు వీని- వీని ఐ లవ్-యు' అని ఉంది.
వస్తూ చిన్న చిన్న ముక్కలుగా చించివేసింది. డస్ట్ బిన్ లో పడేస్తూ, 'అతని లాగా వ్రాతకూడా చక్కనిది! ఇంటినుండి బయటికి వస్తేఇలాటివి ఎదుర్కోవలసి వస్తుంది' అని తలచింది.
సోఫియా, జుబేదాలకు చెప్పదలుచుకోలేదు. ఆటలు పట్టిస్తారు. తను మరిచిపోయినా వారు మరిచిపోనివ్వరు అనుకొంది.
నిద్రలో మూత పడుతున్న కళ్ళకి ట్రెయిన్ లో ఎదురుగా కూర్చుని ఐ లవ్ యు- ఐ లవ్ యు అంటున్న హాండ్
సమ్ సంజయ్ కనిపించసాగాడు.
ఐ లవ్ యు అంటున్న మరెవ్వరి స్వరమో కూడా వినిపించసాగింది. నిద్ర మరి ఆలోచింపనీయలేదు వీణని.
* * *
అనాటమీ, ఫిజియాలజీ రికార్డ్సు ముందేసుకొని అనాటమీ రికార్డులో వేసిన ఫిగర్స్ కి రంగులు పూస్తూ ఎడమచేతి వేళ్ళ కున్న పిన్ ప్రిక్స్ వత్తుకొంటూ ఉన్నది వీణ.
జుబేదా వచ్చి ఆ వేళ్ళకి వాజిలైన్ పూసింది.
బ్లడ్ ఎక్స్ పెరిమెంట్సు ఫిజియాలజీలో చేసే టప్పుడు ఆర్. బి. సి. కౌంట్ వాటికి ఎవరి బ్లడ్ వారే పొడుచుకుని తీసుకోవాలి. అలా లాన్ సెట్ తో పొడుచుకొని వేళ్ళు నొప్పిగా ఉన్నాయి వారికి.
