
బలహీనంగా కొట్టుకొనే నాన్నా గుండె ఆగటానికి క్షణం పట్టలేదు.
అమ్మ పిచ్చి చూపులు చూడటం తప్ప నోరు ఎత్తలేదు. బాస్తిస్మం పుచ్చుకోలేక పోయినందుకు చర్చి వాళ్ళు నాన్నని సమాధి చేయలేదు. ఇరవై రూపాయ లతో తోటివాళ్ళు నాన్న దేహాన్ని మోసుకొని పోయారు.
జైల్లో ఉన్న అక్కను చూశాను గుండె చిక్క పట్టుకొని, 'సోఫీ! నన్నెవరూ క్షమించరు. చివరికి భగవంతుడుకూడా. కాని, నే నేమి చేయను? తాగి వచ్చిన మామ నన్ను బలాత్కరిస్తూ ఉంటే నే నేమి చేశానో నాకే తెలియదు' అంది.
తాగి చెడిన మామ ఒక్క పోటుకే ప్రాణం విడిచాడని, మరణశిక్ష కాకుండా ఆజన్మాంతం జైలుశిక్ష పడింది అక్కకి. మంచి అక్కకి ఎందుకా శిక్ష? అందుకే నేను మంచిగా ఉండదలుచుకోలేదు.
ఇంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చే డబ్బుతోనే చదువు సాగుతున్నది.
గంటలకొద్దీ మాట్లాడుతారు. ఆ వయస్సు అలాంటిది. చేయి తగిలిస్తారు. కాలు తగిలిస్తారు. ముద్దు పెట్టుకొని వదిలేస్తారు.
నా లాంటి దానిని బంధించి పెట్టుకోవాలని చూడరు...."
ఉబికి వస్తున్న ఏడ్పును బిగపట్టుకొంది వీణ. వీణ కన్నీటిని తుడిచింది సోఫియా. తన చెంపల మీద కారిపోతున్న కన్నీటిని తుడిచేనా రెవ్వరు? అలాగే ముఖంమీద చారలు కట్టాయి.
గోధూళివేళకు రైలు వారిని గమ్యస్థానం చేర్చింది. కంపార్టుమెంటునుంచి సామాను దించుకొన్నారు. ప్లాట్ ఫారమ్ కిందుగా ఉంది.
"జాగ్రత్తగా దిగు, సోఫీ!" అంటూ హెచ్చరించింది.
ట్రెయిన్ వెళ్ళిపోయింది. వారిద్దరే ఆ స్టేషన్ లో దిగినవారు. ఒక్క కూలీకూడా లేడు!
ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని వదులుతూ, 'ఎన్నాళ్ళయిందీ గాలి పీల్చుకొని' అనుకొని, ఆనందంగా అటు ఇటు చూస్తూ ఉంది వీణ. దరిదాపుల్లో ఒక ఇల్లుకూడా లేదు. దూరంగా కోటగోడల్లా కొండల వరసలు. కొండల క్రింద అటవీ ప్రాంతం.
తలమీద తాటాకుబుట్ట, భుజానికి ఎయిర్ బాగ్ తగిలించుకుంది. చేతిలో సూటుకేసు పట్టుకొంది. నవ్వుతూ, "పదండి, అమ్మగారూ!" అంది వీణ.
"అంతా మన సర్వీసేనా!" అంటూ తన సూటుకేసు చేతిలోకి తీసుకొంది సోఫియా.
నిటారుగా నిలుచున్న వీణ కాస్త పొడగరనిపించింది. జాకెట్ కి, కుచ్చెళ్ళకి మధ్య ఉన్న స్థలం సూర్యుడు అస్తమిస్తున్న దిక్కులా ఉంది! పిరుదులమీద నాట్య మాడుతున్న వెంట్రుకల భారంతో భగీరధుడు కోరిన గంగ దివినుండి భూమికి వస్తున్నట్లుంది. మరీ కాస్త ఒయ్యారంగా నడుస్తూ కిలకిలా నవ్వింది వీణ! సోఫియాకి రాజీవ్ పలుమార్లు గుర్తుకు రాసాగాడు.
"ఏ ఊరు, ఏ దేశం, పిల్లా నీది! ? ఎంత దూరం లెఫ్ట్ రైట్ కొట్టాలి, పిల్లా!?" అంటూ పొడసాగింది సోఫియా.
స్టేషను బయట చెట్టు క్రింద విప్పి ఉన్న ఒంటెద్దు బండి కనుపించింది. ఆశ తళుక్ మంది సోఫియాకి బండి సొంతదారు దరిదాపుల్లో లేడు.
వీణ నేరుగా బండి దగ్గరకు దారి తీసింది. బండిలో ఒక ఆకారం చుట్ట చుట్టుకొని ఉంది!
"ఓయ్, గంగన్నా!" అంటూ పెట్టె దించి, బండికి గుచ్చిఉన్న చెర్నాకోల తీసుకొని ఒకటి వేసింది గంగన్న పిర్రమీద!
"తల్లో!" అంటూ లేచాడు, జొల్లు తుడుచు కొంటూ.
"అమ్మా! పొగబండి వచ్చేసిందా?"
"లేదురా! మేము పుష్పక విమానం మీద నుంచి వచ్చాం. సోఫీ! ఏడు గంగన్న! ఎక్కడ కూర్చున్నా ఇట్టే కన్ను మూసేస్తాడు!" చెట్టుకు కట్టి ఉన్న ఎద్దు దగ్గరకు వెళ్ళి, "వీడు భీమన్న!" అంది ముఖం పట్టి ఎత్తుతూ.
అది తల అటు ఇటు తిప్పింది, ముక్కులు పెద్దవి చేసి. దాని కొమ్ముల మధ్య తల పెట్టి, "'భీమన్నా! నిన్ను చూడటానికి సోఫీ వచ్చింది" అంది.
సోఫీకి చెమటలు పట్టాయి, దాని కొమ్ములు చూస్తూ ఉంటే!
"వీణా!" అంది గాభరాగా.
బండిలో కూర్చున్నారు. ఎద్దు నడక సాగించి తన ఇష్టప్రకారం పోతున్నది బాటమీద. గంగన్న బండి పక్క నడుస్తూ వెనకబడ్డాడు. దూరాన మైదానంలో ఎర్రటి దుమ్ము లేచింది. గాలిదుమ్ము అనుకొంది సోఫీ! కాదు, అది గోధూళి.
పొలాలమధ్య చిరుగంటల చప్పుడుతో బండి పోతున్నది. పచ్చని పైరు వాసన కమ్మగా ఉంది. శరీరం చిరుచెమట పట్టింది. నీటిపొలాల మధ్య చల్లని గాలి బదులు ఉక్కగా ఉంది ఆవేళ. సంధ్యారాగంలో దూరాన ఎలక్ట్రిక్ లైట్లు మిణుకుమంటున్నాయి.
"కరెంటు ఉంది. ఫరవాలేదు" అంది సోఫియా.
గ్రామానికి కొద్ది దూరంలో పూరి గుడిసె లున్నాయి. వాటిని చూపిస్తూ, "గ్రామాలలో పూర్తిగా అంటరానితానం పోలేదు, సోఫీ! మర్యాద ఇస్తారు. ఆదరిస్తారు. కాని, ఇండ్లలోకి రానివ్వరు" అంది.
"మరి నన్ను బయట ఉంచేస్తావా! ?" అంది సోఫీ.
"బయటనే నీ కాపురం! నీ విస్తరాకు నీవే ఎత్తి వేసుకోవాలి!"
గాభరాగా చూస్తున్న సోఫీ ఒడిలో తల ఉంచింది.
బండి గ్రామం దగ్గరకు రాగా బండిని ఆపమని చెప్పి దిగింది వీణ. అక్కడ గంగమ్మ గుడి ఉంది. గుడి చుట్టూ ప్రదక్షణ చేసి, సంచిలోనుంచి తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టి, అక్కడ శిలమీద ఉన్న కుంకుమను తీసి బొట్టు పెట్టుకొని వచ్చింది.
బండి గ్రామంలోకి రాగానే బండి వెనక పిల్లలు పడ్డారు. కొంతమంది పెద్దలు విచిత్రంగా చూస్తే, కొందరు-"ఏమమ్మా! డాక్టరమ్మా!" అంటూ పలకరించారు. బండిలోకి తొంగి చూసి, "ఈ అమ్మాయెవరు? పెళ్ళయిందా? పిల్లలు లేనట్లున్నారే?" అంటూ ముఖంమీదే ప్రశ్నలు వేసి, వారే జవాబులు చెప్పుకొన్నారు. అందరికీ వీణ నవ్వే సమాధానం!
బండి ఒకింటిముందు ఆగింది. దగ్గరలో పార్కు ఉన్నట్లుంది. గ్రామస్థుల కార్యక్రమం వినవస్తూ ఉంది మైక్ లో నుంచి.
వాకిట్లోకి పోగానే హంస పళ్ళెం పట్టుకొని ఉంది. పక్కగా నాన్నమ్మ ఓంకారి ఉంది.
దిష్టి తీస్తున్న హంసని చూసి, "ఇది హంస! ఎలిజబెత్ టెయిలర్ అంతటిది. చేసుకున్న వాడికి మూడోరోజుడై వోర్స్! ఎవడితోను పట్టుమని సంవత్సరం కాపురం చేయలేదు" అని చిన్నగా చెప్పింది సోఫియాకి.
నాన్నమ్మను చూస్తూ నిలబడింది వీణ అలాగే. కన్నీళ్ళుబికి వచ్చాయి!
"తల్లీ!" అంటూ చేతులు చాపింది నాన్నమ్మ. నాన్నమ్మకి అంటుకొనిపోయింది.
కన్నీటిని నాన్నమ్మ పైటతో తుడుచుకుంది. అని ఆనందాశ్రువులని వారిద్దరికి తెలుసు.
"నాన్నమ్మా! సోఫియాని తెచ్చాను."
"మంచిపని చేశావు, తల్లీ! రా, అమ్మా, రా!" అంటూ సోఫియాని దగ్గరకు తీసుకుంది, ఆ రంగు, ఆ తీరు నాగలక్ష్మిలా ఉంది అనుకొంటూ.
స్నానాలకి గంగ నీళ్ళు తోడుతున్నది.
సోఫియా చేతిని పట్టుకొని మేడపైకి వెళ్ళింది వీణ.
నాగలక్ష్మి పడుకొని ఉంది. వీరిద్దరి రాకతో లేచి కూర్చుంది. వీణను చూసి నవ్వింది, రోజూ చూస్తున్న అమ్మాయిని చూసి నవ్వినట్లు!
"నాగలక్ష్మీ! బాగున్నావా!" అంటూ మంచం మీద కూర్చుంది వీణ.
"పరీక్షలు బాగా వ్రాశావా? ఈ అమ్మాయి ఎవరు?"
"సోఫియా! అయిదో సంవత్సరం. పరీక్షలు బాగా వ్రాశాను. పాస్ అని చెప్పారు. పేపర్లో ఇంకా రాలేదనుకో!" పైకి లేస్తూ, "నాగలక్ష్మీ! నీకు గాజులు తెచ్చాను, తెలుసా?" అంది.
నవ్వి ఊరుకొంది నాగలక్ష్మి.
గంగ వచ్చి, "నీళ్ళు రెడీగా ఉన్నాయి" అని చెప్పింది.
"చూశావా, గంగ ఇంగ్లీషు మాట్లాడేస్తున్నది" అన్నది వీణ.
"పోండి, సిన్నమ్మగారూ అంతా ఎగతాలి."
"వస్తాం!" అంటూ క్రిందికి వచ్చారు.
స్నేహితుల్లా మాట్లాడుకొన్న తల్లీ బిడ్డలను చూసి ఆశ్చర్యపోయింది సోఫియా.
విశాలమైన నాగలక్ష్మి కళ్ళు జాలిగా, నిద్ర పోతున్నట్లున్నా ఆ కళ్ళలో వీణ పట్ల అంతులేని అనురాగం కనిపిస్తున్నది. కన్నుల పండుగ అంటే అర్ధం ఆ రోజు తెలిసింది సోఫియాకి.
వీణకు అక్కలాగా ఉంది నాగలక్ష్మి. సన్నగా చామనఛాయతో ఉన్న నాగలక్ష్మి వయస్సు కనుక్కోవటం కష్టం.
వీణకు నాన్నమ్మ పిండితో రుద్ది రుద్ది స్నానం చేయించింది. మెరుగు పెట్టినట్లు తళతళ మెరుస్తూ వచ్చింది స్నానం గదిలోనుండి. "సంవత్సరం మురికి వదిలింది" అంది నవ్వుతూ.
వేడివేడి నీళ్ళు బానెడు పోసుకున్న సోఫీకి నిద్ర ముంచుకు వచ్చింది.
బల్లమీద భోజనం చూసి కించిత్ ఆశ్చర్యపోయింది సోఫియా.
కుర్చీలో కూర్చుంటూ వీణ, "నాన్నమ్మ అంటే ఏమిటనుకొన్నావే? విక్టోరియా మహారాణి!" అంటూ నవ్వింది.
సీలింగ్ ఫాన్స్, ట్యూబులైట్లు, పుస్తకాల బీరువాలు, స్నానాల గది ఆధునిక నాగరికతకు ప్రతిబింబాలు! పెరుగు గడ్డను చాకుతో కోసి నోట్లో పెట్టింది సోఫియాకి వీణ!
సోఫియా బూరుగుదూది పరుపుమీద వాలగానే నిద్ర పోయింది.
వీణ నాన్నమ్మ పక్కలో పడుకొని కబుర్లు చెప్పుతూ, చెప్పుతూ ఎప్పుడు నిద్ర పోయిందో తెలియదు.
నిద్రపోతే వీణ కనపడదేమోనన్నట్లు ఓంకారి మెలకువగా ఉండింది!
* * *
సోఫియా పూర్తిగా కాలేజీని, స్నేహితులను మరిచి పోయిందనే చెప్పాలి! ప్రతి సాయంకాలం పొలాలలోకో, తోటలలోకో వెళ్ళేవారు. చెరువుకు వెళ్ళి ఈతలు కొట్టేవాళ్ళు. వీణతో ఈదటం నేర్పించుకొన్నా, భయానికి గట్టు దగ్గరే ఉండి కాళ్ళు నీళ్ళలో ఆడించేది సోఫియా!
చేపపిల్లలా పల్టీలు కొడుతున్న వీణ అందం నీళ్ళలోఇనుమడించ సాగేది!
"ప్రకృతిలో ఆస్వాదించే ఈ ఆనందం, స్వాతంత్ర్యం మనుష్యుల ప్రేమలో పొందలేమేమో!" అన్న వీణ మాట ల్లోని సత్యం మెల్లిగా బోధపడసాగింది సోఫియాకి.
తల ఆరబెట్టుకొని, ఆరిన బట్టలమూట చంకన పెట్టుకొని పల్లెకన్యల్లా వచ్చేవారు. ఇంట్లో మళ్ళీ స్నానం చేసి సన్నజాజి పందిరి కింద పొడుగాటి మాలలు కట్టేవారు.
కట్టిన మాలలు రెండుగా చేసింది వీణ. ఒకటి సోఫియా జడలో తురిమింది.
"రెండే తుంచావేం? మీ అమ్మకి ఇవ్వవా!" అంది సోఫీ.
"అమ్మపూలు పెట్టుకోదు, పెదనాన్న చనిపోయిన దగ్గరనుండి" అంది.
"మరి మీ నాన్న ఎక్కడ ఉన్నారు?"
"నాన్న పని చేస్తున్నారుగా? పోస్టుమాస్టరు! ఆ ఊరినుండి వస్తుంటారు. అమ్మను వదిలి వేయలేరు. చూడకుండా ఉండలేరు...నాన్నను నే నంటే ఇష్టం! కాని, నాకు నాన్నమ్మ అంటే ప్రేమ! వెంకట్రావుని చూడాలని ఎంత ఇష్టమో- అదే మా తాతగారిని! వారే నా ఆరాధ్య దైవము!" అంది.
రిజల్ట్స్ వచ్చాయి. వీణ, జుబేదాలు పాస్ అయ్యారు. సరోజ - సోఫియా క్లాసు మేటు-కూడా పాస్ అయింది. రాజీవ్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు.
ఓంకారి పూజచేసి అందరికీ విందు ఇచ్చింది. నాన్నమ్మ పెట్టిన పట్టుచీర కట్టి, ఎర్రటి బొట్టు పెట్టుకున్న సోఫియా పెళ్ళికూతురిలా ఉంది!
"ఆ ఎర్రటిబొట్టు నీ ముఖానికి ఎంత కళని తెచ్చిందో! మన సంప్రదాయం బొట్టు. పెట్టుకుంటే తప్పులేదు" అంది వీణ.
పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి. సీసాల్లోకి నెయ్యి, పచ్చళ్ళు, పిండివంటలు బుట్టల్లోకి సర్దారు. కృష్ణారావు-వీణ నాన్న-వచ్చాడు. కూతుర్ని ఆశీర్వదించి డబ్బు ఇచ్చాడు.
నాన్నమ్మని పట్టుకొని ఏడ్చింది వీణ. సోఫియాకి కళ్ళలో నీళ్ళు తిరిగింది, వారి ఆదరణ, ఆప్యాయతలకి. నాగలక్ష్మి దగ్గరకు వెళ్ళి, "వస్తానమ్మా!" అంటూ వీడ్కోలు తీసుకొంది వీణ.
"సోఫీ! ఆ హాస్టలు, చదువు అంటే మళ్ళీ కొత్తగా, భయంగా ఉంది. రమణ మామ దగ్గరకు వెళ్ళాలి ఓసారి సెలవుల్లో!" అంది ట్రెయిన్ ఎక్కిన వీణ.
* * *
