మధ్యాహ్నం నుంచి సోఫియా పడకేసింది, తలనొప్పిగా ఉన్నదంటూ.
"జాబ్! ఒక చాకలెట్ తెచ్చివ్వవ్వూ!" అని వీణ అంటే అలమారు తీసింది జుబేదా.
"ఏయ్, వీణా! ఆవకాయ సీసాల పక్కన పెట్టావేమిటీ పుర్రె ఎముకలూ!" అంది.
"ఆఁ! బయట ఉంచితే తలా ఒకటి పట్టుకొని పోతున్నారు. మరి ఆ తోటీని అడిగితే మళ్ళీ ఓ పది రూపాయలు ఇమ్మంటాడు."
జుబేదా ఆ పుర్రెను చేత్తో పట్టుకొని పరిశీలనగా చూడసాగింది.
వాచ్ మన్-"సోఫియా అమ్మ ఉందా?" అంటూ వచ్చాడు.
సోఫియా లేచి అలా విజిటర్స్ గదికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి డ్రెస్ చేసుకోసాగింది.
వీణ, జుబేదాలు ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు.
"సోఫీ! ఎక్కడికి? మేమూ తయారుకామా? ఎవ్వరా వచ్చింది?" అని అడిగింది జుబేదా.
"మీరు వచ్చే చోటు కాదు." తెల్లబోయి చూస్తున్న వారివైపు దీనంగా చూసి, వస్తున్న నిట్టూర్పును ఆపుకొంది.
చేతిలోని పెన్సిలు విసిరికొట్టి, "సోఫీ! మేము రాకూడని చోటుకు నీవూ పోకూడదు" అంది వీణ ముఖం కందిపోగా.
సోఫీకి సాధారణ అవసరాలు బోలెడన్ని ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. రాజీవ్ నడిగి హాస్టల్ ఫీజు కట్టింది. ఇప్పుడు సమయానికి రాజీవ్ కూడా లేడు. మద్రాసు వెళ్ళాడు. వచ్చిన ఘరానా వ్యక్తికి ఇప్పుడు కాస్త కంపెనీ ఇస్తే అవసరమైన ఖర్చు తీర్చుకోవచ్చు. ఆ సంగతి వీరికి ఎలా చెప్పడం!?
వెళుతున్న సోఫీ చెయ్యి పట్టుకొంది వీణ-"వెళ్ళటం నీకు ఇష్టమా!" అంటూ.
"రేపు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి." ఎటో చూస్తూ పలికింది సోఫియా.
"సోఫీ!" అంది జుబేదా.
ఆ మాట వీణకు అర్ధం కాలేదు. సోఫీకి ఎప్పుడూ మనియార్డరు రాదు. మరి కాలం ఎలా గడుపుతున్నదో వారెప్పుడూ ఆలోచించలేదు. ఏదో చిన్న స్కాలర్ షిప్ మూడు వందలు వస్తుంది. దానితో సాగిపోతుందా?
"సోఫీ! రేపు ఎవ్వరినైనా అడిగి కట్టేద్దాం. తరవాత నేను ఇస్తాగా?" అంది జుబేదా.
"మగవారి బలహీనతో, మరేదో గాని నా చదువు సాగుతున్నది. ఈ యజ్ఞం ఇలాగే పూర్తి కానివ్వండి" అంటూ బయటికి వెళ్ళిపోయింది సోఫియా.
జుబేదా వైపు చూచిన వీణకు ఆమె కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉండటం కనిపించింది.
"జుబ్!" అని చెయ్యి పట్టుకొని, "సోఫీని అలా బయటికి పంపకూడదు. మనం ఇంకా బ్రతికే ఉన్నాము" అంటూ పరుగు తీసింది.
ఒకరి వెనక ఒకరు పరుగెత్తుతూ, ఎదురుగా వస్తున్న పోలీసు ఆఫీసర్ని దూసుకొని పోయారు. కాని, అక్కడ సోఫీ లేదు. కారు రేపిన దుమ్ము మాత్రం చెదిరిపోయింది. కారు పోయిన వైపే చూస్తూ ఉన్నారు. పక్కగా వచ్చి నిలుచున్న పోలీసు ఆఫీసర్ని గమనించలేదు.
"హల్లో!"
ఉలిక్కిపడి చూశారు.
ఆ పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ వీరివైపు చూస్తూ ఉన్నాడు. జుబేదా ఆ కళ్ళలో మెరిసిన మెరుపును చూసింది.
"జగ్గూ?!!" అంది సంబరంగా."ఏయ్, జగ్గూ! ఏమిటీ పగటివేషం? జాతర రోజులుకూడా కాదు-" స్వగతంగా అనుకున్నది పైకే అనేసింది జుబేదా.
"వేషమే మరి!" అంటూ జేబులోనుంచి ఒక కార్డు తీసి చూపించాడు.
"జగదీశ్! సి. ఐ. డి.ఆఫీసర్!"
నమ్మలేనట్లు ఉన్నాయి వారి చూపులు.
విజిటర్స్ రూములో కూర్చున్నారు ముగ్గురూ. చుబుకం క్రింద చేతులుంచుకొని, జగదీశ్ చెప్పుతున్నది కథలా వింటూ సినిమాలా ఊహించుకొంటున్నారు జుబేదా, వీణలు.
జగదీశ్ పక్కా ఆంధ్రుడు. సి. ఐ. డి. అరవ సర్వర్ గా మారి ఆ హోటల్లో సంవత్సరంనుండి పని చేస్తున్నాడు. ఆ సంవత్సర కాలంలో పిండి రుబ్బాడు. ప్లేట్లు కడిగాడు. ఫలహారాలు అందించాడు. రాత్రులు హోటల్ ముందు బాటపై గాఢంగా నిద్ర పోయేవాడు. ఆ గాఢనిద్రలోనే అర్ధ రాత్రులు జరిగే పనిని తెలుసు కొన్నాడు. హోటల్ ప్రొప్రయిటర్ ని రెడ్ హేండెడ్ గా దొంగనోట్లతో పట్టుకొన్నాడు. రెండు రూపాయల నోట్లకట్టలను ప్రభుత్వానికి అప్పగించి ప్రమోషన్ పొందాడు.
విప్పారిన వారి కళ్ళతో తానొక హీరోగా చూసు కొన్నాడు. తేలిగ్గా నవ్వేస్తూ, "ఆ అజ్ఞాతవాసంలో కూర్చున్నంతసేపు నా కెంతో సంతోషంగా ఉండేది. మీ మాటలూ, మీ తగవులూ అన్నీ వింటూ నాలో నేను నవ్వుకొంటూ ఉండేవాడిని. మీ రంటే నా కేదో ఆత్మీయత కలగసాగింది. అఫ్ కోర్స్! మిస్ జుబేదా నాకు చిన్నప్పటినుండి తెలుసు" అన్నాడు.
"నేనా!?"
"మీరు గుంటూరులో ఉన్నప్పుడు మీరు మా వీధిలోనే ఉండేవారు. మీ వాళ్ళు తెరలు కట్టిన బండిలో ఎక్కడికైనా వస్తూ పోతూ ఉండేవారు. తెర బయట కూర్చున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే తమాషాగా ఉండేది-తరవాత అలవాటుగా మారింది. వాచ్ ఉన్నట్లు మీ మణికట్టు మీద ఉన్న ఆ పుట్టు మచ్చ నాకు బాగా గుర్తు. నన్ను మీరు చూసినా గుర్తుంచుకోవలసిన అవసరం మీకు లేదు..." అంటూ జుబేదా కళ్ళలో దేవి కోసమో వెతుకుతూ ఉండి పోయాడు.
వీణ పైకి లేస్తూ, "జుబ్! మన హాస్టలు కాఫీ, ఫలహారం రుచి చూపిద్ధామా?" అంటూ డైనింగ్ హాలుకు వెళ్ళింది.
వీణ వెళ్ళాక ఏమి మాట్లాడాలో తెలియక అటు ఇటు చూసి, తిరిగి జగదీశ్ ముఖంలోకి చూసింది జుబేదా-
'విశాలమైన తెల్లని ఆ నుదుటిమీద ఎర్రని కుంకుమ ఎంత అందాన్నిస్తుందో' అని అనుకొన్నాడు.-
సిగ్గు బరువుతో వాలిపోతూ చంచలంగా తిరిగే ఆ కళ్ళు చూసి తాను అడగవలసింది ఇక ఏమీ లేదన్నట్లు, జవాబు దొరికినట్లు తీయగా నవ్వాడు.
వీణ తెచ్చిన కాఫీ, టిఫిను తీసుకొని, "హైదరాబాదుకు తిరిగి వెళ్ళిపోతున్నాను. సోఫియాని కలుసుకోలేనందుకు విచారంగా ఉం"దని చెప్పి, ఆనందంగా వారి దగ్గర సెలవు తీసుకొన్నాడు జగదీశ్.
సోఫియా ఎప్పుడు వస్తుందా, జగదీశ్ సంగతి ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూడసాగారు జుబేదా, వీణలు.
* * *

హేమంతఋతువు. మంచివాడి మనస్సులా దినమంతా చల్లని గాలి! పిల్లవాని కోపం లాంటి ఎండ రోజులు మృదువుగా గడుస్తున్నాయి.
జుబేదా గదిముందు లోపల శుభ్రం చేసి కడిగి అంతా నీట్ గా సర్ధింది. వీణ గొణుక్కుంటూ సహాయం చేసింది. వంట సామగ్రి అంతా రెడీగా ఒక అలమారలో ఉంచింది.
"జూద్! ఆ కూరగాయలు, స్టౌ అదీ చూస్తూ ఉంటే మన గది వంటగదిలా ఉండి పరేదేశంలో ఊరివాడు కనిపించినట్లు ఆనందంగా ఉంది. జుబ్! వంటలో పరిచయ మేదైనా ఉందా? లేక ఎక్స్ పెరిమెంట్సు మా మీద ఉపయోగించవు కదా?" అంది భయంగా ముఖం పెట్టి వీణ.
బల్లపై టేబుల్ క్లాత్ మార్చి ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని ఉంచుతూ నవ్వింది జుబేదా.
"నెలంతా ఉపవాసం ఉంటావా? పగలంతా ఏమీ తినవా?"
వీణ సందేహాలకి పడుకున్న సోఫియా పైకి లేస్తూ, "జుబేదా! అమ్మాయిగారి సందేహాలన్నీ తీర్చేయి! లేకుంటే నీకు ఊపిరాడ నివ్వదు" అంది.
ఖురాన్ లోని పేజీలు తిప్పుతూ, "ఇది అరబిక్ భాష కదూ? రేపటినుండి మాకు ఖురాన్ కాలక్షేపం చేస్తావా?" అని కుతూహలంగా అడిగింది వీణ.
జుబేదా పకపక నవ్వింది. "రామాయణం, భారతం అనుకొన్నావా కాలక్షేపం కథలు చెప్పటానికి..." భక్తిగా ఆ గ్రంథాన్ని అరమోడ్పు కన్నులలో చూస్తూ, "అందులో ఒకరి చరిత్ర గాని, ఒక యుగానికి సంబంధించి నదిగాని లేదు. ఏ కాలమందైనా అధర్మ మార్గాన నడిచే వారిని ఆహ్వానించి ధర్మ పథాన్ని బోధించి దైవిక మార్గానికి దారి చూపే ఈ దైవిక నిజాన్ని అల్లా, మహమ్మద్ కి తెలియపరిచినవే ఖురాన్ లో ఉన్నాయి!" అంది.
"మొదలంటూ ఏమీ లేదా?" అంది వీణ.
"ఎందుకు లేదు? అల్లా ఈ లోకాన్ని సృష్టించారు. తరవాత మనిషిని ఆదాము, హవ్వను చేసి తనకు ప్రతి నిధులుగా భూలోకానికి పంపారు. రాను రాను పాపం ఎక్కువైంది. జలప్రళయంతో లోకాన్ని కడిగి వేశారు. కాని, మంచివాడైన వోవహా అతని కుటుంబాన్ని రక్షించారు. తరవాత...."
"జుబేదా! నీవు బైబిలు చెప్పుతున్నావు" అంటూ వీణ సోఫియా వైపు చూసింది సందేహంగా.
"పూర్తిగా విను. బైబిలు ఏదో, ఖురాన్ ఏదో తెలుస్తుంది" అని సోఫియా అనగా, చెప్పు అన్నట్లు జుబేదా వైపు చూసింది వీణ.
"అబ్రహామ్! అల్లా నియమించిన మొదటి ప్రవక్త. అతని ఇద్దరి కుమారులు అతని ప్రతినిధులుగా- ఒరియా- పాలస్తీనాకు ఇస్పాకు- పెద్ద కొడుకు ఇస్మాయేలు అరేబియాకి నియమించబడ్డారు. వారి రెండు రాజ్యాలు బాగా విస్తరించాయి. ఈ శాఖనుండి వచ్చిన తరము-ఇస్సాకు కొడుకు జాకబ్- జోసఫ్- మోసస్- డేవిడ్- సోలమన్ - జాన్- జీసస్. ఈ శాఖనుంచి వచ్చిన వారిని ఇజ్రాయిలులు అనేవారు. ప్రవక్తలందరూ - జీసస్ కూడా అల్లా కణకువగా ఉండి ఇస్లామ్ గురించి ప్రీచ్ చేశారు. మూలపురుషుడు అబ్రహామ్ అల్లా అడుగుజాడలలో నడిచి అందరినీ అల్లా దగ్గరకు చేర్చాడు. అతనే నాయకుడు. అతని నాయకత్వం ఇజ్రాయిలులకే వచ్చింది. ఆ సంతతి వాడైన సోలమన్ రాజు కట్టించిన గుడికిల్ బాహ్ అల్లాకి ప్రార్ధనలు చేసుకొనేవారికి ముఖ్య స్థానమైంది. కాని, రానురాను భ్రష్టత్వము నొంది పెడత్రోవలు పట్టి ఇస్లాం కు వేరు అర్ధములు, తప్పుడు మార్పులు చేసి భగవంతుని మరిచి 'మామ్మన్'ను కొలువ మొదలు పెట్టి ఇజ్రాయిలులు అల్లాకు విరోధులయ్యారు. అల్లాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కనుక వారు నాయకత్వానికి అనర్హులు అయ్యారు. అబ్రహామ్ సంతతిలో పుట్టినంత మాత్రాన నాయకత్వం రాదు. ఎవ్వరైతే అల్లాకి తమని అర్పించుకుంటారో వారికే నాయకత్వ ముంటుందని - ముందు ప్రవక్తలలా అల్లాని మహమ్మద్ అనుసరించగా ఇస్మాయేలు తరము వాడైన మహమ్మద్ కి ఆ దైవిక బాద్యత, నాయకత్వం అల్లా అప్పగించారు. నాయకత్వంతోపాటు జెరూసలేము లోని ముఖ్యమైన గుడి, క్యూబాకూడా ఉండకుండా పోయింది. మక్కాలో మహమ్మాద్ ఎక్కడైతే మిషన్ మొదలుపెట్టాడో అదె ప్రార్ధనామందిరం కాబహ్ గా మారింది. అబ్రహామ్ మిషన్ కు అదే ముఖ్యమైన స్థానం కాబట్టి ఇజ్రాయిలులుగాని, అరబ్బ్ గాని అడ్డు చెప్పలేకపోయారు. మక్కాలోని కాబా ముస్లిమ్స్ కి ప్రార్ధనా స్థలమైంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా మక్కా కాబా పడమరవైపున్నది. కనక ఆ దిక్కుకే మళ్ళి నమాజ్ చేస్తాము" అంటూ ముగించిన జుబేదా వారి సందేహాలను తీర్చింది.
రంజాన్ నెలవంకను చూడటానికి బయటికి వచ్చింది.
నిష్ఠగా నమాజ్ చేస్తూ ఆ నెలంతా గడిపింది.
తమాషాగా నుదుటిమీద కుంకుమ దిద్దినా వెంటనే నవ్వుతూ తుడిపేసుకునే జుబేదా హిందువైన జగదీశ్ కు మనస్సు ఇచ్చింది.
జగదీశ్ పనిమీద ఏ మూల ఉన్నా ఉత్తరాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. జుబేదా బద్ధకించి రెండు రోజులు జవాబు ఇవ్వటం ఆలస్యమైతే మూడో రోజు టెలిగ్రామ్ వచ్చేది!
హాస్టలుకు కాస్త దూరంలో ఉన్న కల్ వర్ట్ మీద కూర్చున్నారు ముగ్గురూ.
"జుబ్! స్నేహం అంటూ ప్రేమలో పడ్డావు. ఆ ప్రేమలో మునిగిపోక ముందే బాగా ఆలోచించు. నీవు నమ్మిన మతం నీ ప్రాణం కంటే ఎక్కువ నీకు. మత సహనం ఒక్క హిందువులకే ఉంది. అక్బర్ లాంటి వారు కాలంలో కలిసిపోయారనుకో. నీ భక్తుడు పిచ్చిలో పడకముందే కట్ చెయ్! మన జాతికి బుద్దే లేదు. ప్రేమ ప్రేమంటాడు. ప్రేమించి పెళ్ళి చేసుకోక పెండ్లి చేసుకున్నాక ప్రేమించటం నేర్చుకొన్నప్పుడే మన ఆడవాళ్ళు బాగుపడేది" అంది వీణ.
"హియర్ ! హియర్!" అంటూ చప్పట్లు కొట్టారు సోఫియా, జుబేదాలు.
"వీణా! నీవు ఎవర్నీ ప్రేమించవా?" జుబేదా అంది.
"ఛీ! ఆ పాడు పని ఎప్పుడూ చేయను."
"పోనీ! పెళ్ళాడినాక ప్రేమిస్తుంది. కదూ, వీణా?" సోఫియా సమర్ధించింది.
"మరి ఆ అదృష్టవంతుడెవ్వరో!" అంది జుబే.
"రాజీవ్!" అంది సోఫీ.
"సోఫీ! ఐ హేట్ హిమ్!"
"అమ్మాయిలు ఏదో ఘర్షణ పడుతున్నట్లున్నారు" అన్న రాజీవ్ స్వరం విన్న వీణ అదుటున అతని వైపు చూసింది. జుబేదా, సోఫియాలు ముసిముసిగా నవ్వుకొంటున్నారు.
కందిన బుగ్గలు, కోపంగా చిట్లించిన ముక్కు చూసి. "వీణకు అంత కోపం తెచ్చిన విషయం ఏమిటో?" అన్నాడు మెడమీద ఉన్న స్టెత్ తీసి కోటు జేబులో పెట్టుకొంటూ.
"వీణ కోపం కేం గాని, హౌస్ సర్జన్ గారూ, ఎలా ఉంది వార్డు వర్క్?" అంది జుబ్.
"ప్రాక్టికల్ వర్క్ మనం నేర్చుకోవలసిందంతా ఇప్పుడే! చాకిరీ ఎక్కువనుకో!"
"మన కెప్పుడో ఆ అదృష్టం!" అన్నట్లుంది వీణ ముఖం.
"నిన్ను చేతుల్లోకి తీసుకొనే ఆ శుభసమయం ఎప్పుడో" అన్నట్లున్న అతని కన్నుల్లోని ఆ భావన స్పష్టంగా చదవగలిగింది సోఫీ! ఎవ్వరి ఆలోచనలో వారు మౌనంగా ఉండిపోయారు.
రాజీవ్ వాచీ చూసుకుంటూ, "ఏమిటి, వాతావరణం స్తంభించినట్లు" అన్నాడు.
"పిల్లలు అప్పుడప్పుడు డిబేట్స్ పెట్టుతుంటారు" అంది సోఫీ.
"ఇప్పుడు చర్చ దేనిమీద ?" అన్నాడు.
