Previous Page Next Page 
పగటికలలు పేజి 9


    
    ఆమె తిరిగి వెళ్ళిపోబోతుంటే -జంకుతూనే ధైర్యంచేసి-
    చూడూ కమలా! ఇలా ఒక్కమారు లోపలకి రా చిన్న మాట!"
    "ఎక్స్ క్యూజ్ మీ?" అంటూనే పాత పరిచయం వల్ల అనుమానించకుండానే తొణుకూ బెణుకూ లేకుండా లోపలికి వచ్చింది-
    "మరేం లేదు కమలా నేనిపుడో ఆపదలో చిక్కుకున్నాను నాకేమీ దురద్దేశం లేదు?....నువ్వే నన్నిప్పుడు రక్షించాలి- ఇన్నాళ్ళూ సమయానికి మీ అన్నయ్య వచ్చి ఆదుకొనేవాడు ఇప్పుడు ఆ భగవంతుడే నిన్నిలా పంపించాడు! వివరాలు వెంటనే చెప్పడానికి వ్యవధిలేదు ......తర్వాత అన్నీ చెబుతాను కాని.... నేను చెప్పినట్లు......నువ్వు ఒక్క అరగంట చేయాలి. .... మీ అన్నయ్యకు కూడా తెలుసులే నా యిబ్బంది" అని ప్రాధేయపడ్డాడు.
    ఆమె అయోమయంగా చూసింది. ఆమెలో కొంచెం సానుభూతి కలిగింది.
    "ఏమిటో చెప్పండి! నాచేతనయితే చేస్తాను? దానికేల?"
    "అయితే విను! కొన్ని కారణాలవల్ల -నాకు భార్య లేకపోయినా, వున్నట్టు - ఈ యింటి వాళ్ళను నమ్మించి యిందులో అద్దెకుంటున్నాను .... ఇన్నాళ్ళూ ఏ అనుమానమూ లేకుండా చూసుకుంటూ వచ్చాను! మీ అన్నయ్య ధర్మం వల్ల .... మీ అన్నయ్య చేత అడారి మాటలాడిస్తూ నాటక మాడేను - అందువల్ల, నా భార్య ఇంట్లోనే వుంది. ఎక్కడికీ వెళ్ళడం ఇష్టంలేక యింట్లోనే ఉంటుంది అనుకుంటున్నారు!.... కాని-ఇవాళ ఈ వీధిలో ఆడవాళ్ళూ, పక్కింటి అమ్మాయిలూ అందరూ కలిసి మా యింటికి వస్తారట. అంచేత ఏం చేయడానికీ పాలుపోక కూర్చున్నాను నిజంగా భార్య వుంటే కదా? అసలు సంగతి బయటపడిందంటే ఎలాగా? అని భయం. పోనీ మీ అన్నయ్యకో కబురంపుదామంటే దూరంనించి ఎంత మోసం చేసినా- దగ్గిరగా ఎలాగ? ఈవాళ వాళ్ళేలాగూ లోపలికి వచ్చి పలకరించక మానరు.....అదృష్టంకొద్దీ నిన్ను పంపేడు భగవంతుడు! మీ అన్నయ్యలాగే నువ్వూ నా మర్యాద కాపాడు. కమలా! నిన్ను వీళ్ళెవ్వరూ చూడలేదు కాబట్టి అనుమానం ఉండదు .... ఒక అరగంట వాళ్ళ ముందు నా భార్యగా నటించాలి. అంతే చాలు. వాళ్ళూ వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళిపోదుగాని!"
    "నేనా బాగానే వుంది?" అని అనుమానంగా అంది.
    "నిజంగా నాకే దురుద్దేశ్యంలేదు కమలా! నా పరువు నిలబెట్టు.... వాళ్ళొచ్చేసే వేళయింది!...
    "అది కాదండీ? ఏం తెలియందే ఎలా? వాళ్ళేమన్నా అడిగితే ఏం చెప్పాలి? అయినా నేనూ.....ఎవరయినా నమ్ముతారా!"
    "మరేం ఫర్వాలేదు! నా భార్య గురించి, ఎవళ్ళకీ ఏం తెలీదు! .... ఎవరూ చూడలేదు ! నువ్వేం చెప్పినా సమయస్ఫూర్తిగా చెప్పేస్తే సరి! .... నువ్వలా కూర్చుని, కబుర్లాడితే చాలు! లేమరి..." అని తొందర చేశాడు?
    ఆమెకూడా ఏమనడానికీ తోచక మరేం మాట్లాడలేదు. ఆమె అలా ఒప్పుకుని- తల, చీరె.... అవీ సర్దుకొని. ఒక దగ్గిర కూర్చో బోతూండేసరికి.... గిరికి..... అదోలా అనిపించింది !ఇన్నిసార్లు మణి యింటికి వెళ్ళుతున్నాడు గాని పెళ్ళీడు చెల్లెలు మణికివున్నా..... తనకి ఆమె మీద వేరే దృష్టి ఏమీ పోలేదు!... స్నేహితుడు అయినందుకేమో! అప్పుడప్పుడు మణి చెల్లెలికి సంబంధాలు చూస్తున్నారని - కట్నాలు ఎక్కువ అడుగుతున్నారని... చెబుతూంటాడు! .....ఏమిటో అంత వినిపించుకొనే వాడుకాదు!....పోనీ మణి తల్లితండ్రులయినా తనతో ఒక్కమాటంటే- యింత మంచి అమ్మాయిని. తనే పెళ్ళిచేసుకొని వుండేవాడేమో! అయినా వాళ్ళ దృష్టి ఎలా వుందో? తనిష్టమేనా? అని అనుకొని-కొన్ని ఇన్ ష్ట్రక్షన్స్. ఆ మెకి ఇచ్చి వాళ్ళ రాకకోసం రెడీగా వున్నాడు? .... అనుకున్నట్టు తలుపు చప్పుడు కూడా అయింది? తలుపు తీసేందుకు దగ్గరకు వెడుతున్న కొద్దీ - గాజుల చప్పుడూ- సువాసనలూ, గుసగుసలూ, మడత చీరెల బరబరలూ, వినిపిస్తున్నాయి. తలుపు తీసి చూసేడు కదా.
    వనితా ప్రవాహం? ఆ ఇంటిముందు ఎన్నడూ లేని క్రొత్తదనం! ప్రమదావనం! సాధారణంగా వనాల్లో ఒక చెట్టు ఒకరకమే పూలుపూస్తే ఈ ప్రమదావనం ప్రమదల తలల్లో రకరకాల పువ్వులు పూచినట్టున్నాయి!
    గిరి తలుపు తీయడం ఏం మర్యాదగా లేదు కాబోలు ... గిరినిచూసి అదోలా చూశారు అందరూ. అందరినీ నడుపుకుంటూ వచ్చిన గిరిజ ముందుకి వచ్చి -
    "మీరు కాస్తసేపలా బయటికి వెళ్ళి వస్తారా? మేం పేరంటానికి వచ్చాం!" అని కొట్టోచ్చినట్టు మొహం ముందు చెప్పింది. అప్పుడేం చెప్పడానికీ తోచక గిరి - "అలాగే అలాగేనండీ" అని అంటూ వాళ్ళందర్నీ లోపలకు పోనిచ్చి - బయటకు నడిచాడు. కాని మనసంతా యింట్లోనే వుంది! ఎందుకంటే ఏమీ తెలియని ఆ పిల్లతో ఏం అవకతవక వస్తుందో అని.
    వీధి గుమ్మం దిగేసరికి దాసుగారు కూడా మీసాలూ కీటుకుంటూ కర్ర చేతబుచ్చుకొని గ్లాస్కో పంచె మడతలు ముందు పడుతూ వుంటే మల్లుచొక్కా తెల్లగా మెరుస్తూంటే - జలతారు వోణీ పైమీద వదులుగా వేసుకొని హుందాగా బయలుదేరాడు- సాయంత్రం కదూ- అంచేత తీరుబాటుగా బయలుదేరాడు- గిరిని కులాసాగా పలకరించాడు కనుబొమ్మలు ఎగరేస్తూ.
    "ఏం వాళ్ళ బాధపడలేక వచ్చేస్తున్నావా? ఏం? అదే మంచిదిలే. పెద్దపెద్ద ఫ్యాక్టరీల్లో మిషన్ల చప్పుడు వింటూ కూర్చోవచ్చు- స్టేషన్లలో రైళ్ళ గోల భరించవచ్చు- కాని- నలుగురాడవాళ్ళు కూర్చున్నచోట మాత్రం మనం వుండి భరించలేం! వాళ్ళగోలే వాళ్ళది. అందరూ ఒక్కసారే మాటాడుతారు. ఒకళ్ళదొకళ్ళకి ఎలా అర్ధమవుతుందో వాళ్ళకే తెలియాలి." అన్నాడు.
    "అది నిజమే అనుకోండి. అయినా ఆడవాళ్ళున్నప్పుడు మనం ఎందుకని - వచ్చేశాను?....అంతే!" అని అన్నాడు గిరి.  
    "అయితే పద అట్లా తిరిగివద్దాం. ...నీకేం పనిలేదు కదా!" అని లౌక్యంగా అడిగేడు అతనితో తిరగడం అలవాటు కాబట్టి.
    "అబ్బే! పనేం లేదండి!.... అలాగేపదండి" అన్నాడు గిరి!-
    చర్చించడానికి అవకాశం దొరకలేదో - ఏ విషయం స్ఫురించని లేదో -దారి పోరుగునా ఏవేవో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ నడచి పోతున్నారు. అంతలో మధ్య దారిలో ఒకాయన కనబడి దాసుదారికి నమస్కరించాడు!- కుశల ప్రశ్నలు అయినాక-
    "తమ దయవల్ల మా పిల్లకి సంబంధం కుదిరిందండి.- ఈ మాఘమాసంలో ముహూర్తం స్థిరపరచాం - ఏదో అయిందనిపించేస్తే .... బాద్యత తీరిపోతుంది...... తమతో చెబుదామని - యింకా వద్దామనుకుంటున్నాను....... ఇంతలో.... మీరే..." అని అన్నాడు- అతని మొహంలో మాత్రం - కోర్టు కేసుతో గెలిచినా, ఖర్చులకే తడిసి మోపిడయి గెలిచామన్న సంతోషం ఒక్కటే మిగిలినవాడి మొహంలా, ఏడవలేక నవ్వినట్టుంది! అతని వాలకం.
    "పోనీండి! పాపం! చాలా అవస్థపడుతున్నారు!.... కుర్రవాడేం చేస్తున్నాడు!" ఎవరబ్బా యేమిటి?" అని అడిగారు దాసు.
    "ఏదోలెండి రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆ వుద్యోగం తప్పిస్తే మరి ఆస్థి పాస్తు లేమీ లేవు లెండి..... అయినా కట్నానికి మాత్రం లోటులేదులెండి!" అని అరిగిపోయిన నయాపైసలా పెట్టేడు మొహం!    
    "ఎంతేమిటి?"
    "మూడువేలు!తతిమ్మా లాంఛనాలూ ఖర్చులూ మినహాయించి."
    "విశ్వనాధంగారూ! చాలా తొందరపడిపోయి నారండీ! కట్నం లేకుండా ప్రయత్నించ లేక పోయినారా?"
    అలాగంటారేమిటి? దాసుగారూ! మీలాటివారి కది సాధ్యమేమోగాని- మాబోటి వాళ్ళకది సాధ్యమా?....,మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల వుంటే గుండెలమీద కుంపటే కదండీ?....పూర్వం మగపిల్లలకు చదువు చెప్పిస్తే సరిపోయేది, యిప్పుడా- ఆడపిల్లలకి చదువు చెప్పిందాలి! కట్నమూ ఇవ్వాలి! ఏదీ తప్పడం లేదు- అప్పు తెచ్చిన సొమ్ము, ఎదిగిన ఆడపిల్లా, ఎన్నాళ్ళుంటే అంత నష్టమే కదా!....ఏం చెయ్యమంటారు?
    "అదంతా మనం అనుకోవడంలో వుంటుందండి, మొదటినుండి ఆడపిల్లలని చదువుసంధ్యా లేకుండా- ఏమీ చేతకాని వారిని చేసి ఒకరిమీద ఆధారపడి బ్రతికేట్టే చేయడం వల్లనే ఈ నాటికి వాళ్ళని ఒదుల్చుకునే అవస్థలోకివచ్చింది. ముందునుంచి వాళ్ళనికూడా మొగపిల్లలు లాగానే సమంగా పెంచి వున్నట్టయితే ఈ గతి రాకపోయేదేమో! వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడి, కట్నాలు తీసుకున్నవాళ్ళని పెళ్ళాడం మాని అందరూ స్ట్రయికు చేస్తే ఈ మగపిల్ల లెన్నాళ్ళుండగలరూ? కొంగులు పట్టుకొని - తిరిగి డబ్బిచ్చి తీసుకుపోరూ?"
    "మీ కంతా వెటకారంగాని.... చదువువల్ల జ్ఞానం వస్తుందా అండీ చూడండి- యిప్పుడు మగపిల్లలు చదివిన చదువులను బట్టి కట్నాలు కూడా మారుతున్నాయి! స్కూలు పైసలు సర్టిఫికెట్ కలవాడికి వెయ్యీ, రెండు వేలూ ఆపైన బి. ఏ. లోపునయితే అయిదూ, పది వేలమధ్యా బి. ఎ. దాటితే పదిహేను, యిరువై వేలలో పున. వాళ్ళ తీసుకున్న గ్రూపులబట్టి కూడా ఈ కట్నాల సంఖ్య మారుతోందాయె!.......
    "ఇదంతా చూస్తూంటే వీళ్ళందరూ కట్నాల కోసమే చదువుతున్నారా అనిపిస్తూంది! ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కట్నం తాగొచ్చు......అంచేత "చదువుకు తగ్గ కట్నం అనే సబ్జక్టును స్కూలు సిలబస్ లో చేర్చితే, వీళ్ళకి ఇంకా బాగా పనికివస్తుందనుకుంటాను"
    "ఇవన్నీ ఆలోచించే- మా వాడికి మరో అయిదువందలు, ఎక్కువ వచ్చిన సంబంధమే చూశాను! దానికీ దీనికీ సరిపోతుందిలెండి అప్పులేకుండా గట్టెక్కవచ్చు-"
    "అయితే మీ కోడలి తండ్రికి తనకొడుక్కి యింకా ఎక్కువయిచ్చే సంబంధం దొరకవద్దా?"
    "ఏమో!మనమొర్ర గట్టెక్కింది కదా?"
    "ఇదుగో యిలాటి అభిప్రాయాలే మనల్ని యింతవరకూ తీసుకు వచ్చేయండి! మరీ ఈ కట్నాలూ, లాంఛనాలూ, పోవాలంటే ఏట్లా పోతయి? మా పిల్లకి కట్నం యిచ్చి పెళ్ళి చేయాలి కదా అని మా కొడుక్కి అంతకన్నా ఎక్కువే కట్నం తీసుకున్నారు?- మీ పిల్లకూడా తనకి కట్నం యివ్వకుండా భర్త లభించలేదు కాబట్టి తనకు పుట్టబోయే కొడుక్కి కూడా తప్ప కుండా కట్నం తీసుకునే తీరాలని- యిప్పటి నుండీ నిర్ధారణ చేసుకుని వుంటుంది. అంతే గాని తనకు కట్నం యిచ్చి పెళ్ళి చేసినపుడు తన తల్లిదండ్రులు ఎంత యిబ్బంది పడ్డారో అలాగే తన కోడలి తల్లిదండ్రులివ్వడంత బాధ పడుతున్నారు అని ఆలోచించదు.... ఇలాగే అందరూ.... ఒకడు లంచంయిచ్చి ఒక పని సాధించాడంటే, తనకలాటి అవకాశం దొరికినప్పుడు తనూ గుంజేస్తాడు! ఇలా చక్రంలా జరుగుతూ వుంటే ఈ చెడ్డ అలవాట్లు- పోవాలి పోవాలి అంటే ఎలా పోతాయి? ఏ ఒక్కడన్నా తెగించి త్యాగంచేస్తే నేకదా?" అని దాసుగారు ముఖంమీద గుద్దినట్టు చెప్పేసరికి అవతలాయన యింతమొహం చేసుగున్నాడు!
    "ఏమిటోనండి, ఆ ఆదర్శాలూ అభిప్రాయాలూ చెప్పడానికేమిలెండి. ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టం సుమండీ- డబ్బున్న వాళ్ళు తాము కట్నంయిచ్చి కూతుళ్ళకి పెళ్ళిచేసి కొడుకులకి పుచ్చుకోకపోయినా ఫరవాలేదు!....ఏమీలేనివాళ్ళు యింతకన్నా ఏం చేస్తారు?....నాకు అవతల పని వుందండి... మళ్ళీ వచ్చి కలుస్తాను! సెలవు!" అని ఆయన వెళ్ళి పోయాడు అదృష్టవంతుడు-
    ఇక చూడండి- ఆ విసురు గిరి మీదపడింది.
    "నీ అభిప్రాయం ఏమిటి గిరీ?" అని అడిగనే అడిగాడు -
    "ఈ విషయంలో యువకులది తప్పు లేదని నా అభిప్రాయం. ఎందువల్లనంటే- పెళ్ళి జరిగే సమయంలో, సాధారణంగా- ఆ వయస్సులో-పెళ్ళాం- పెళ్ళి సంబరం ఈ మోజుల్లో మిగతావన్నీ ఆలోచించే స్థితిలో వుండరు పెళ్ళికొడుకులు కట్నాలు, లాంచనాలు యివన్నీ పెద్దవాళ్ళ మధ్య జరుగుతూ వుంటాయి. యువకులకు తెలిసినా అడ్డు పెట్టగలిగే స్వతంత్రం కూడా వుండదు. యింక తల్లి దండ్రులు చెప్పే కారణాలు. వారి పరిస్థితులూ, యివన్నీ కూడాకలిపి వారికీ ఎదురు చెప్పే సాహసం లేకుండా చేస్తాయి.... అంత వరకూ ఎందుకు? ఒక్కొక్కప్పుడు వాళ్ళకిష్టమయిన పిల్లనే ఎంచుకుందికి అవకాశం లేకుండా చేస్తారు ఈ పెద్దలు అంచేత పెద్దవాళ్ళలోనే ఈ పరివర్తన రావాలి! అంటాను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS