Previous Page Next Page 
పగటికలలు పేజి 10


    "నువ్వన్నది కాదననుగాని, ఈ రోజుల్లో అంత స్వతంత్రంగా యిష్టమొచ్చినట్టు తల్లిదండ్రులూ, పిల్లల మెడలు వంచి, చేయడం లేదు! అంచేత పెద్దవాళ్ళదే తప్పంటే - లాభం లేదు. ఇటు తనకు భార్యా, అటు కట్నం డబ్బూ సరదాలూ అన్నీ ఒక్క దెబ్బకు తీరుతూంటే ఎందుకు అడ్డుపెట్టాలి! ఆ నిమిషానికి వూరు కుంటే చాలు! తర్వాత ఎవడు మనవి అనేది? అంటే మాత్రం. అందరూ తీసుకుంటున్నదే కదా?" అని ఈ మగపిల్లలు కూడా ఆలోచించకపోవడంలేదు- వీళ్ళేగాని నిజంగా అడ్డుపెడితే, బలవంతాన్ని యిష్టంలేని పెళ్ళి చేయగలరా ?.... అంచేత పరివర్తన, పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా రావాలి?"
    కొడుకుల చదువులకి ఖర్చయింది, వాళ్ళ పెళ్ళిళ్ళలో కట్నం రూపంలో లాగాలనీ, కూతుళ్ళకి కట్నం యిచ్చి పెళ్ళి చేయాలి కాబట్టి- కొడుకులకి కట్నం పుచ్చుకొని. ఆ నష్టం భర్తీ చేసుకోవాలని. పెళ్ళి కూతురికి నగలు పెట్టాలి కదా. అని కట్నం పుచ్చుకొని అదే ఆ నగల క్రింది ఖర్చు పెట్టాలని కోడలు యింటికి వచ్చిందంటే దాన్ని పోషించడానికే ఈ కట్నం అనీ యిలాటి మనస్తత్వాలు నశించాలి!
    "మగవాడు!" అని అనిపించుకుంటే చాలు, వాడి స్థితి, వంశం, గుణం, తాహతు రూపం. ఆరోగ్యం, ఉద్యోగం, యిలాటి వేవీ చూడకుండా ఏదో కొంత డబ్బు పారేసి, ఎలాగో ఒకలాగే, ఎవడికో ఒకడికి పిల్లని అంటగట్టి వదల్చుకుంటే చాలని చూసి, ఆ తర్వాత, కన్నకూతురి జీవితం ఎలా వున్నా బాధ్యత లేదనుకునే మనుష్యులు మారాలి!"
    ఆజన్మాంతం కష్టసుఖాల్లో, సుఖదుఃఖాల్లో, పంచుకుని - తోడుగా, నీడగా - సంసారం చేస్తూ ఎన్నో సంబంధాలా, అవుసరపడుతున్నది చాలక, కట్నం కూడా తీసుకుంటామా? పెళ్ళి అనేది స్త్రీకేగాని, పురుషుడికి కాదా? ఆమెకే అది అవసరమా?- అందులో యిద్దరికీ ఒకేబాధ్యత. హక్కూ వున్నప్పుడు, ఒకరు ఒకరికి డబ్బివ్వడం కొనుక్కోవడం ఏమిటి? కొనుక్కునే హక్కును యిష్టమొచ్చినట్టు ఉపయోగించుకొనే హక్కు మిగతా అన్నిటికీ వర్తించింది. ఇందులో వర్తించదేమి?.... అంచేత కట్నం అనేపేరుతో వున్న ఈ క్రయధనం తీసుకోడం ఎంత అవమానం? ఎంత నీచమయిన పని? అని యువకుల్లో పరివర్తన కలగాలి! అలాటి పెళ్ళిళ్ళు చేసుకోము అని శపథం చేయాలి!
    పెళ్ళి సమయాల్లో చేసిన వాగ్దానాలూ, ఏకార ణటం చేతనో జరపలేకపోతే, భార్యలని బాధ పెట్టే రాక్షసులు పోవాలి!" అని దాసుగారు ఉపన్యసించారు?
    "అయితే మీ పిల్లకి కట్నం లేకుండానే పెళ్ళి చేయదల్చుకున్నారన్నమాట!" అని అడిగాడు ఉద్దేశ్యం తెలుసుకుందామని గిరి.
    నే ననుకోడం ఏమిటోయ్! అసలు మా అమ్మాయే కట్నం పుచ్చుకుంటానన్న వాడిని చేసుకోదు! పెళ్ళికాకపోయినా వుండి పోతానంటుందిగాని కట్నం యిస్తే పెళ్ళాడదుట!"
    "దానికేంలెండి. మొదట్లో అందరూ అలానే అంటారు."
    "సరే నేనెందు కనాలి! అలా జరిగాకే అవునందువుగాని!"
    "అయితే మీ పిల్లకు మంచి స్వతంత్రమే ఇస్తున్నారన్నమాట!"
    "ఎవరికెంత యివ్వాలో అంతే! ఆమె అభిప్రాయాలను చంపకుండా ఆమె స్వతంత్రం హద్దు మీరకుండా చూస్తాను?"
    "అంటే చుట్టూ ఒక గిరిగీసి అందులో ఇష్టమొచ్చినట్లు తిరగమనా మీ అర్ధం!".... స్వతంత్రానికి ఒక పరిమితి ఏమిటి? అలాంటప్పుడు ఉన్నా లేకపోయినా ఒకటే కదా?
    "ఛా ఛా అదికాదు నా అభిప్రాయం! దేవిక యినా క్రమం కట్టుబాటు అంటూ వుండాలని-మనం ఎంత స్వతంత్రుల మయినా హద్దులు దాటితే ఒక్కొక్కప్పుడు ప్రమాదిస్తుందని-వయసులో వున్నవాళ్ళు ఏ ఒక్కటీ నిర్ణయించుకోలేరు? ఉద్రేకానికి లొంగిపోయి పొరపాట్లు చేయవచ్చు, అనుభవజ్ఞులయిన పెద్దలు ఆ సమయాల్లో చెప్పి, తప్పించాలని అంటాను, అటువంటప్పుడే ఆ యిచ్చిన స్వతంత్రం సార్ధకం అవుతుంది- అనర్ధాలకు దిగదు."
    "అంటే మీరన్న స్వతంత్రం ఎటువంటిదో నా కర్ధం కాలేదు."
    "స్వాతంత్ర్యం యిచ్చేరు కదా అని, బాధ్యతని వ్యక్తిత్వాన్ని - సంఘాన్ని మరచిపోయి ప్రవర్తించ కూడదు -పెళ్ళి విషయమే తీసుకో - ప్రేమ అనే పేరుపెట్టి, జాతి, మత, కుల భేదాలు పాటించకపోవడం, నా కిష్టంలేదు, ఆ ప్రేమించడం ఏదో, స్వజాతివారితోనే అయితే మంచి దంటాను."
    "బాగానే వుంది, ఆమెకు ప్రేమ కలిగినపుడు తన జాతి, తన కులం, తన మతం, వాళ్ళే ఎదురు రావాలన్న మాట. ... అలాంటివాళ్ళ మీదే ప్రేమ కలుగుతుందని నమ్మకం ఏమిటి? కలగకపోతే?" ఇంకెవరిమీద నయినా మనసు కలిగితే"
    "అటువంటి ప్రేమల్లో నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ప్రేమించుకున్నాం, అంటున్న ఈనాటి వారంతా ఏమిటి చేస్తున్నారు? ఎక్కడో ఎప్పుడో యిద్దరూ చూసుకున్నారు, కాకపోతే కాస్తసేపు మాటాడుకున్నారు! అంతేనా? అంత మాత్రంలో ఒకరి మనసు ఒకరు గ్రహించి పట్టేనా? ఒకరి నొకరు అర్ధం చేసుకున్నట్టేనా? మరి పూర్వకాలంలో మాత్రం ఏం జరిగింది? యిట్లాగే పెళ్ళిచూపులని పెట్టి చూపించేవారు? అయితే యిపుడు వారు ఏకాంతంగా చూసుకుంటే అప్పుడు నలుగురి పెద్దలముందూ చూసుకొనేవారు!....అంతకు తప్పితే ఇంకేముంది?"
    "అలా అంటారుగాని దానికీ దీనికీ భేదం ఎంతో వుందండి?"
    ఇంకేం వుంది? చూపులూ, మాటలూ, తప్ప యింకేం వున్నా- పవిత్రత చెడినట్టే కదా? అంచేత ఈ చూపుల్లోనూ వాటిల్లోనూ ఏంలేదు. ఏదో శక్తిమాత్రం అల అనిపిస్తుంది, ఆ శక్తి మన భావనలోనే వుంటుంది!... ప్రేమించి పెళ్ళాడినా- ఏమీ లేకుండా పెళ్ళాడినా, ఆ దంపతుల సంసార జీవితం సఫలం కావడానికి ముఖ్యంగా పెళ్ళాడిన తర్వాత వారు ప్రేమించు కోవాలి! అని నా అభిప్రాయం!"
    "మరి పూర్వం బలవంతపు పెళ్ళిళ్ళూ, ఇష్టం లేని పెళ్ళిళ్ళూ జరుగుతుండేవి కదా! ఆడపిల్ల లకి ఏం స్వాతంత్ర్యం వుండేది?"
    అటువంటి వాటిని నేను వ్యతిరేకిస్తా?... కాని ఒక్క విషయం- అభిమానం వున్నచోట అల్లాంటివి జరగవు - పెళ్ళి చూపులనాడు ఆడపిల్లలు మనసులో వున్నది చెప్పక ఊరుకోవడం వల్లనే అలా కొన్ని జరుగుతూంటాయి -ఇహ డబ్బుకి ఆశపడి పూర్వం ముసలి వివాహాలు జరిగితే యిప్పుడు కట్నానికి భయపడి అదే చేసేస్తున్నారు!"
    ప్రేమ వివాహాలపై మీ అభిప్రాయం ఏమిటి?
    "ఎవరినయినా ప్రేమించడం అన్నది మనసావాచా అనుకోడంలో వుంటుంది. అటువంటప్పుడు ఆ భావాలను, ఆ మనసును అదుపులో వుంచుకొనే శక్తిగలవానికి ప్రేమ ఎక్కడ అనుకుంటే అక్కడ కనబడుతుంది! అనుకున్న దాన్నే ప్రేమించగలరు. ఏ కోర్కెనిగాని, ఏ భావాన్నిగాని మన అధీనంలో, మన వశంలో వుంచుకొని మనసుని ఆ విధంగా త్రిప్పుకోవడం లోనే మన గొప్పదనం- ప్రేమించేపుడు- కామానికి, కోర్కెకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, ఉండకూడదని కాదు! ఆ కోర్కె తీరేకకూడా శాస్వతంగా, పవిత్రంగా, నిశ్చలంగా వుండే ప్రేమే.....ప్రేమ......అటువంటిది లేక కేవలం కామానికి, కోర్కెకీ, పుట్టిన ప్రేమలవల్లే- ఎంతోమంది ప్రేమించుకున్నాం అన్నవాళ్ళ వివాహాలు విఫలం అయిపోతున్నాయి."
    మీ అభిప్రాయాలు.....ఆద్యాత్మిక దృష్టితో ప్రేమించుకొనేవారికి సరిపోతాయి! కానీండి...వేడివేడిగా ప్రేమించుకొనేవారికి ఇవన్నీ బోధపడవు! వంట బట్టవు!.... యిలా అన్నానని....వేరేలా అనుకోవద్దు! అన్నీ ఆలోచించి- చేసుకుందికి ప్రేమ యువకుల్లో పుడుతుందని-పడుచుదనం అటువంటిదని.... మరచిపోకూడదు!" అని తెగించి అన్నాడు గిరి.    
    "సరే! దానికేమిలే! ఎవరి అభిప్రాయాలు వారివి....నా అభిప్రాయాలనే పట్టుకు వెళ్ళాడు అని బలవంతం పెట్టే మూర్ఖుణ్ణికాను! ఇంతకీ మనలో మాట! నువ్వు కట్నం పుచ్చుకున్నావా? అని అకస్మాత్తుగా అడిగేడు...
    "నా కసలు..." అని నిజం చెప్పబోయి, జ్ఞాపకం వచ్చి నాలిక్కర్చుకున్నాడు గిరి-    
    తీసుకోలేదంటే నమ్మడని .... "తీసుకున్నా నండి.... అబ్బె! ... తీసుకోవలసి వచ్చిందండి...." అని తడబడుతూ అన్నాడు.
    "అవున్లే! నాకు తెలుసు ఈ కట్నం తీసుకున్న వాళ్ళంతా చదువుకి డబ్బులేకనో, చెల్లెలికి పెళ్ళి చెయ్యాలనో, ఆర్ధిక పరిస్థితులు బాగులేకనో, ఏదో కారణం చెబుతారని తెలుసు!"
    అక్కడితో వూరుకుంటే బాగుండునని పించింది గిరికి. అతను చెప్పిన దాంట్లో నిజంవున్నా, చాదస్తంకూడా వుంది? అతని అభిప్రాయాలకి కొంచెం నవయుగపు మరమ్మత్తులు కావలసి వుంది! అటు పాతకాలపు అభిప్రాయ లని వదలలేక, యిటు కొత్త అభిప్రాయాలను సమర్ధించి, మేలు కలయిక చేసే తపన అతనిలో వుంది.
    ఏది ఎలావున్నా అతని అభిప్రాయాలను విన్నాక గిరికివున్న ఆశకూడా ఆరిపోయింది-కర్మజాలక అతని ఎత్తు ఫలిస్తే గిరిజని తనూ తనని గిరిజా ప్రేమించుకుంటే.... గిరి ఎవడో గిరిజ ఎవతో? పెళ్ళి ఎలా జరుగుతుంది? అలాటి వాటికి ఒప్పుకోనని చెప్పేశాడే!...
    ఇంటికి వచ్చే త్రోవలో నిశ్శబ్ధంగానే గడిచింది. ఆయనకు నోరు నొప్పెట్టింది కామోలు వూరుకున్నాడు.
    గిరి గుమ్మం ఎక్కి గమనించాడు. అంతా నిశ్శబ్దంగా వుంది అందరూ వెళ్ళినట్టే వుంది! గిరి మనసంతా, కమలమీదే వుంది. ఆలస్యం అయిపోయింది! ఏమనుకుందో ఏమో!...ఎలాగో ఒప్పుకుంది గాని మరోసాటి డయితే కాదు పొమ్మంటే తన మర్యాద పోయేది. అందులోనూ స్నేహితుడి చెల్లెలు, చెప్పరాని పని చెప్పేడు!
    గిరి లోపలకు వెళ్ళేటప్పటికి కమల ముళ్ళ మీద వున్నట్టు వుంది? గిరిని చూడగానే.
    "వచ్చారా! బాబూ ఇంత ఆలస్యం చేశారేం! నన్ను ఇరుకులో వుంచి. మీ రెప్పటికీ రాకపోతే ఎంత భయం సేసిందని!"
    "అవును నేననుకుంటూనే వున్నా.....అదుగో దాసుగారు నన్ను పట్టుకుని యింతవరకూ వదల్లేదు! మరేం రసా భాస కాలేదుగా!"
    "అంతపని జరగలేదు కానీండి! అబ్బబ్బ! నా ప్రాణం తీసేరు! ఏమిటేమిటో అడిగేరు! నాకేం తెలియదాయె! గోల ఎలాగో సర్ది గోడ మీద పిల్లిలా తప్పించుగున్నాను!"
    నీ ఉపకారం మర్చిపోలేను!" అని ధన్యవాదాలు అర్పించేడు, "దానికేం లెండి! గాని ఎన్నాళ్ళిలా దాగుతుంది! చక్కా పెళ్ళి చేసుకో కూడదూ ఈ అవస్థ తప్పుతుంది!" అని నవ్వుతూ అడిగింది కమల.
    దానికేం జవాబు చెప్పాలో తెలియక-
    మరి నువ్వెందుకు చేసుకోలేదు." అని అన్నాడు అప్రయత్నంగా.
    "నన్నడుగుతారేమిటి?..." అని అంది సిగ్గు పడుతూ?
    "ఈ రోజుల్లోకూడా పెద్దవాళ్ళ నడగడం ఏమిటని!.... అయినా పెద్దవాళ్ళ సంగతు లెట్లా వున్నా.... మన మట్టుకి మనకి. ఎన్నో ఊహలుంటాయి.....పెళ్ళాడబోయే వ్యక్తి అందంగా వుండాలని, చదువూ, గుణం, యిలా ఎన్నో కోరికలుంటాయంటారా! ఎవర్ని పడితే వార్ని చేసేసు కోవడమేనా?"
    "ఇంతవరకూ అలాటివాళ్ళే దొరకలేదా?"
    "ఏమో ప్రయత్నం చేయలేదు..... ఇపుడు ఆలోచిస్తే నీలాటి వాళ్ళను చూశాక.....అలాంటి వాళ్ళు వుంటారనే అనిపిస్తుంది!"
    కమల ఆ మాటలు విని సిగ్గుపడి జవాబివ్వకుండానే....
    "ఇంక వెళతానండి..... చాలా ఆలస్యం అయింది." అని.... వెళ్ళబోయింది.....మణి రాసిన ఉత్తరం జ్ఞాపకానికి వచ్చి-
    "ఉండు మీ అన్నయ్య ఉత్తరం ఏం వ్రాసేడో ఈ సందడిలో అది మరచేపోయాను" అని ఉత్తరం తీసి చదివాడు.
    అందులో అర్జంటుగా పాతిక రూపాయలు పట్టుకురమ్మనమని వుంది. అది చదివి కమలతో-
    "నువ్వు పద....నేను వెనకాలే వస్తాను. అన్నట్లు- ఈ మాత్రందానికి వాడే రాలేక పోయాడా? నిన్ను సంపాడేం?"
    "అన్నయ్యకు ప్రొద్దుటనుండి జ్వరం వస్తూంది, అందుకని"
    "అరే! అయితే చెప్పేవుకాదేం! వెళ్ళి ఇప్పుడే వస్తావని చెప్పు!" అని కమలని పంపే సేడు.
    కమల వెళ్ళేక ఆమెమీద ఆలోచనలను అంత వేగిరం త్రెంచుకోలేక పోయాడు? తనెవరు? ఆమె ఎవరు? స్నేహంగా యింటికి వస్తూ పోతున్నంతమాత్రంలో, ఎటువంటి కోర్కెని ఆమె మన్నించింది? యిన్నాళ్ళూ ఆమెపై దృష్టిలేదు. కాని ఈ నాడు, ఆమె అణకువ, వినయం, ఏమిటోలా అనిపించింది! ఎప్పుడూ లేనట్టు అందంగా, అదోలా కనిపించింది వంటరిగా ఆమె, అటువంటి మాటలాడుతున్నా-అంతకన్నా దురుద్దేశం తనలో కలగలేదు! నిజానికి.... ఆమెను చూసేక గిరికి మనస్సు చలించకపోలేదు కాని, ఆమె అమాయకత్వం, పవిత్రత చూసేసరికి, మనసుకు వికారంపోయి, వికాసం వచ్చినట్టయింది? ....తనెందుకు కమలని పెళ్ళిచేసుకో కూడదు? మణి తల్లిదండ్రులు ఆమె పెళ్ళికోసం పడుతున్న తాపత్రయం తెలుసు! తను తలుచుగుంటే అమ్మను వప్పించవచ్చు, అది, కమల తల్లితండ్రులకుకూడా యిష్టమే అవుతుంది కూడా! కాని.... తను అనుకున్నట్టు అవుతుందా? అంత ధైర్యం చేసి- పెళ్ళాడతా ననగలదా?....
    తలుచుగుంటే- ఏదో చిలిపితనంచేత యిలా గిరిజ కోసం అవస్థ పడుతున్నాడు తప్పిస్తే నిజంగా పెళ్ళిచేసుకుంటాను అని గుండెలమీద చేయివేసుకు చెప్పగలడో లేదో!

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS