5
కామేశ్వరి భారంగా అడుగులు వేస్తూ తమ గదిలోనికి వెళ్ళింది. కేశవ ఇంకా నిద్రపోలేదు. ప్రక్కమీద పడుకునే ఏదో చదువుకుంటున్నాడు. ఆ బెడ్ రూంలో రెండు గాడ్రెజ్ మంచాలు వున్నాయి. రెంటికీ దేనికి దానికిగా దోమతెరలున్నాయి తలాపి దిక్కుకి వొంగివున్న జీరో వాట్ బల్బులున్నాయి. రెండు మంచాలమీదా డన్ లప్ పరుపులు, తలగడాలు వున్నాయి! ఒక గోడవారగా ఒక సోఫా నలుగురు కూర్చునేందుకు వీలుగా వుండేది వుంది. రెండుగోడల కెదురుగా నిలువుటద్ధాలు బిగించి వున్నాయి. సీలింగ్ ఫాను పైన ఏకాలమూ, గిరగిర తిరుగుతూనే వుంటుంది. గోడకి ఒకవారగా ఆరుకోణాలు గల పెద్ద డ్రాయరూ దానిమీద పెద్ద స్టాండ్ లో బెల్జియం అద్దం వున్నాయి. ఒక గోడ వార అయిదుఅడుగుల గాడ్రెజ్ బీరువా వుంది. కామేశ్వరి వచ్చిన అలికిడి విని కేశన లేచివొచ్చి సోఫాలో కూర్చున్నాడు. కామేశ్వరి మౌనంగానే పాలగ్లాసు తీసుక వచ్చి అందిచ్చింది. కేశవ పాలు త్రాగేడు ఖాళీ గ్లాసుతీసి డ్రాయరుమీద పెట్టి కట్టిపున్నిచ్చిన తమలపాకుల కిళ్ళీ ఇచ్చింది. కేశవ తీసుకున్నాడు. కామేశ్వరి నిలబడి వుంటం చూసి 'కూర్చో కామేశ్వరీ!' అన్నాడు. కామేశ్వరి ప్రక్కన జంకుగా కూర్చుంది. ఒకవంక సాయంత్రం మాధవ ఎదురుగా నిలబడిపోయినందుకు సంజాయిషీ అడుగుతాడేమో అనే బెదురూ ఇంకోవంక తన్నేమన్న.... అనే లజ్జా పీడించాయి కామేశ్వరిని.
'సాయంత్రం...' అన్నాడు కేశవ.
పై ప్రాణాలు పైనే పోయాయి. కామేశ్వరికి. 'మాధవ నీ కెలా తెలుసు? అతనితో అంత చనువు నీ కెలా వుంది?' మొదలైన ప్రశ్నలూ, 'నావద్ద నుండగా అల్లాంటి స్వేచ్చా ప్రసంగాలు బాగుండవు!' అనే నీతి పాఠాలూ వస్తాయనే ఆమె వూహించింది.
'నీవు మెట్రిక్ ప్యాసయినా నన్నావు కదూ!' అన్నాడు కేశవ!'
'అమ్మయ్యా! తేలిగ్గా ఊపిరి పీల్చింది కామేశ్వరి.
'అవునండీ!' అంది వినయంగా.
'పి. యు. సి. లో జేరదామని వుందా!' అన్నాడు.
'మీ ఇష్టం!' అంది కామేశ్వరి.
'పెళ్ళి కాకపోతే చదివేదానివి కాదా!' అన్నాడు.
'పెళ్ళి కానప్పుడు చదువుకోవాలనే వుద్దేశంతోనే మెట్రిక్ పరీక్షకి కట్టాను' అంది కామేశ్వరి.
'అయితే ఇప్పుడు మటుకు అడ్డేముంది? కాలేజీలో జేరి చదువుకో! నళిని ఎల్లానూ వెళ్ళుతుంది కదా కాలేజీకి! నువ్వూ దానితో పాటే చదువుకోవచ్చును! అన్నాడు కేశవ.
'మీ ఇష్టం', అంది కామేశ్వరి. కామేశ్వరి వెంపు చూసాడు కేశవ! అదే సమయంలో కామేశ్వరి కూడా కేశవ వెంపు చూసింది. ఆమె కళ్ళల్లోని మెరుపుకి కేశవ విచలితుడైనాడు! తెల్లగా మిసమిసలాడే శరీరంతో ఎప్పుడూ మంచి గంధంలా సువాసనలు వెదజల్లు తూండే రాజేశ్వరితో అతను ఇరవయి ఏళ్ళు సంసారం చేశాడు! రాజేశ్వరి అతనికి భార్యగా సంతృప్తి కలిగించినా, కలిగించకపోయినా సొసైటీ లేడీగా బాగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకునేది! సోషల్ వర్క్ లో ఆమెకి ఆమెయే సాటిగా వుండేది! చిల్డ్రన్ వెల్ ఫేర్ కమిటికి, వుమెన్స్ వెల్ ఫేర్ కమిటీకి ఆమె అద్యక్షురాలిగా వుండేది! ఆమె కార్యకలాపాలు సీతమ్మగారికి నచ్చేవి కావు!
'ఇంట్లో నవమాసాలూ మోసీ కనివున్న పిల్లకి పాలిచ్చుకుందుకు తీరటం లేదు. కాని వూళ్ళో పిల్లలకి పాల డబ్బాలు పంచిపెట్టటానికి తయారవుతుంది. ఇంట్లో పెద్ద ముండని వక్కర్తినీ చేయలేక ఛస్తోంటే కాస్త సాయి తాగా రాదు కాని, వుమెన్ వెల్ ఫేర్ కమిటీకి అధ్యక్షత వహిస్తుందట. ఇంట గెలిచీ రచ్చ గెలవాలన్న సామెత వూరికే పుట్టిందా? ఇంట్లో చంటిపిల్ల దాన్ని వదిలేసి సభలనీ, సన్మానాలనీ ఇలా వూరట్టుకుని తిరుగుతూ అర్ధరాత్రీ గాలనీ ధూళనీ లేకుండా తిరిగివస్తుంటే ఆ పిల్లకి పోరురాదూ? నేను వక్కర్తినీ ఇంటిపనీ, వంటపనీ చూడగలనా! కాస్త మందలించకపోతే ఎల్లారా కేశవా!' అనేది.
'రాజీ! నళిని ఎందుకు పోతోందే! చూసావా!' అన్నాడు కేశవా ఒకసారి. నళినికి ఆర్నెల్లు అప్పుడు!
'వో! గ్లాస్కో పడలేదు కాబోలు! ఇంకేదన్న డబ్బా మార్చి చూద్దాం!' అంది నిర్లక్ష్యంగా రాజేశ్వరి.
'అది కాదు రాజీ! పిల్లకి నీళ్ళూ అవీ పొయ్యాలి! వేళ పట్టున పాలు పట్టాలి! అమ్మ పెద్దది! అన్ని ఆమె వక్కర్తే చేయలేదు కాస్త నీవు కూడా ఆమెకి సహాయంగా ఇంటిపని చూడరాదూ!' అన్నాడు కేశవ!
'వో! అదా సంగతి! బేబీకి ఒక ఆయాని పెట్దాం! ఆ,ఏ చేతికి వీలుగా వుండేట్లు ఒక పనిపిల్లని చూస్తాను. కాస్త కూరా నారా తరిగి ఇచ్చేందుకు మడిబట్టలు ఆరేయడానికీ, అర్ఫనేజ్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. బ్రాహ్మిన్స్ లో ఎవరన్నా వుంటే తీసుకవస్తే తీరిపోతుంది. అన్నది ఇంక ఆ మాట మళ్ళీ ఎప్పుడూ ఎత్తలేదు కేశవ!
'అమ్మా! నువ్వు వదిన్ని ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూ వుంటావు! నువ్వు వంట చేయలేకపోతే చెప్పు! అన్నయ్య వంటమనిషిని పెట్టుకుంటాడు! అంతే కాని వెనకాతల సాధించకు! ఆమెవల్ల మన కుంటుంబానికి ఎంతపేరు ప్రతిష్ఠ వస్తోందో నీకేం తెలుసు! నువ్వెక్కడో పూర్వకాలందానివి!' అనేది తల్లిని వసుంధర.
'అదేం బాగుంది! ఇంటికి ఎవరు పేరంటానికి పిలుపుకి వచ్చినా బొట్టు పెట్టించుకుందుకు ఎవరూ వుండక పోతిరి! ఇంటికి ఇల్లాలు లేనట్లు గడపకి బొట్టు పెట్టి నాతో పేరంటం చెప్పి పోతూంటారు. నాకేం బాగుంటుంది నువ్వే చెప్పు!' అనేది సీతమ్మ.
'ఎవరో పేరంటాలకి పిలుపులకి ఎప్పుడో వస్తారని ఆమె ఇంట్లో వుంట దేమిటే నీది మరీ చాదస్తం!' అనేది వసుంధర!
రాజేశ్వరి, శరీర సౌందర్యం అంతా, కామేశ్వరి కళ్ళల్లోని కాంతికిరణాల్లో నిబిడీ కృతమై వుందా అన్న భావన నిచ్చింది కేశవకి! తన కూతురు తోటి పిల్లలా వున్న కామేశ్వరి మెళ్ళో తాను మూడుముళ్ళూ వేసి ఆ పిల్లకి తా నన్యాయం చేయలేదు కదా! అని అనిపించింది. కామేశ్వరి తన భార్యగా ఆ ఇంటికి వచ్చింది. ఆ పిల్ల మీద తనకి సర్వహక్కులూ వున్నాయి. అ హక్కుల్ని తిరస్కరించటానికి స్తోమతు లేని గొర్రెపిల్ల కామేశ్వరి! ఆ చిన్నది తనెదురుగా నిలబడినప్పుడు తనకి రాజేశ్వరితో గడిపిన సుఖానుభూతులు నెమరుకు వస్తాయ్! ఆ ఆవేశంలో కామేశ్వరిని ఏదయినా బలవంతం చేస్తే, ఆమె అభిప్రాయ మేమిటో తన కింతవరకూ తెలీదు! కుటుంబపు దారిద్రావస్థలో కన్నెచెర వదలటమే దుర్భరంగా తోచి నిరాశతో వప్పుకుందో! లేక తనంటే మనస్పూర్తిగా ఇష్టపడి...........

'ఛ ఛ! నాకింకా ఈ వయసులో మన స్ఫూర్తిగా ఇష్టపడే పిల్లది కావాలనుకోవటం, ఛ ఛ! ఏమీ బాగులేదు!' అనుకున్నాడు కేశవ!
'చదువుకుంటావా!' అంటే మీ ఇష్టం అన్నది కామేశ్వరి! 'నాతో సంసారం చేస్తావా అంటే కూడా మీ ఇష్టమే నంట దేమో!' ఈ తలపుతో అతనికి చిన్నగా నవ్వు వొచ్చింది.
'పడుక్కో కామేశ్వరీ!' అంటూ తనని తను సంబాళించుకుని తన మంచం మీదకు పోయి దోమతెర దించుకుని పడుక్కున్నాడు కేశవ!
* * *
'మన అమ్మాయిని కాలేజీలో జేర్పించారుట!' అంది జగదాంబ.
'కూతురు చదువుతోంది కదా! కాస్త సాయింగా వుంటుందికదా అని దీన్ని జేర్పించారు కాబోల్ను' అన్నాడు నరసయ్య.
చిట్టిబాబు పి. యు. సి. ప్యాసయి నాడు. బి. ఎ. కి కామేశ్వరి దగ్గర అట్టే పెట్టా మన్నది జగదాంబ.
'ఛీ ఛీ! ఏ ముఖం పెట్టుకుని వాళ్ళింటికి వెళ్ళేది! పెళ్ళయి నాలుగు నెలలు కావస్తోన్నా ఒక వుత్తరం ముక్కయినా వ్రాసేరా! వాళ్ళ పిల్ల మనింట్లో వుంది. దాని క్షేమ వార్త మనకు తెలపాలన్న జ్ఞానమన్న వుందా!' సంబంధం కలుపుకుంటే వుండే తీరువ ఇదేనా! రాకపోకలు, ముద్దు ముచ్చటలు లేనివాళ్ళతో మనమేమని మన ఇబ్బందులు చెప్పుకోగలం!' అన్నాడు నరసయ్య.
'అల్లాగంటే ఎల్లాగండీ! పిల్ల నిచ్చుకున్నవాళ్ళం! మనకు అలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎల్లా కుదురుతుందీ! మనమే ఎల్లాగో అల్లా సర్దుక పోవాలి!' అంది జగదాంబ.
'సరి సర్లే! అవసరంవస్తే వసుదేముడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట! మీ ఏడుపేదో మీరు యాడవ్వండి! నాకేం తెలీదు! అయినా, దానికేనా బుద్ది వుండొద్దా! కన్న తల్లితండ్రుల కొక వుత్తరం వ్రాయాలన్న ధ్యాసేనా లేదు! మన బంగారం మంచిదైతే కంసాలివాడి నెందుకనాలి! మూడుముళ్ళూ పడగానే తమకి కన్నవాళ్ళున్నారనే సంగతి విస్మరిస్తారు ఈ ఆడపిల్లలు!' అన్నాడు నరసయ్య.
'కొత్తగా కాపురానికీ వెళ్ళిన పిల్లకి వుత్తరాలు వ్రాసేటంత స్వతంత్రత ఎక్కడుంటుందీ! చిన్నపిల్లవా, అమ్మనీ, నాన్ననీ చూడాలనీ బెంగ పెట్టుకుందుకు? అంటారు! మనమే వకసారి వెళ్ళి సంగతి సందర్భాలువిశదంగా తెలుసుకోవాలి!' అంది. జగదాంబ.' 'నువ్వెళ్ళితే వెళ్ళు నేనురాను!' ఖండితంగా చెప్పేడునరసయ్య.
తల్లినీ, తమ్మున్నీ చూసి, సంబరపడి పోలేదు కామేశ్వరి. సీతమ్మ మటుకు, మహా మర్యాద చేసింది. జగదాంబ కూర్చున్నచోటనించి లేవకుండా ఫలహారాలూ, పానీయాలూ సరఫరా చేసింది. కామేశ్వరికి, సీతమ్మ మర్యాద ఒకనాటకంలా తోచింది. నిన్నటిదాకా పానకం బిందెలివ్వలేదనీ, పట్టుతాపితాలు ఇవ్వలేదనీ,సణుగుతూండే అత్తగారు ఇవ్వాళ ఈ మర్యాద లెందుకు చేయాలి! తన మనసులో వున్న మాటలన్ని తన తల్లి రాగానే పట్టు కు దులిపేయ కూడదూ! 'మా అబ్బాయికేం తక్కువ అని పెళ్ళిని ముష్టి పెళ్ళిలా చేసేవు?' అని ఎందుకు అడగదు? లోపల కుళ్ళు పెట్టుకుని, పైకి ఈ మన్నన మర్యాదలెందుకు? కామేశ్వరి మనస్సులో గింజుకో సాగింది. మధ్యాహ్నం భోజనాలయినాక, సీతమ్మ నిద్రపోయినప్పుడు, జగదాంబ, నెమ్మదిగా కామేశ్వరి గదిలోకి వచ్చింది. కామేశ్వరి గదిలోని, ఖరీదయిన సోఫాసెట్టులూ, దేవకన్యలు పవళించేట్టున్న పాలనురుగు లాంటి పట్టు పరుపులూ, దోమతెరలతో మంచాలూ, చూసేసరికి, జగదాంబ, దిగ్భ్రమ చెందింది. వసుంధర వాళ్ళ పుట్టింటివారు కలిగిన వాళ్ళని విందికాని ఇంత నాజూకయిన ఫర్నిచర్ తో అధునాతనంగా వుంటారని ఆమెకి తెలీదు. జగదాంబ, అక్కనీ రెండో పెళ్ళివానికి ఇచ్చారు. అక్కతోపాటు జగదాంబ కూడా, అక్క అత్తవారింటికి వెళ్ళింది. అప్పుడు జగదాంబకు పది పన్నెండేళ్ళు కన్న ఎక్కువ లేవు! జగదాంబ అక్కకు, చాలా డబ్బున్న వాళ్ళని, రెండోపెళ్ళి వాళ్ళకిచ్చారు. పెళ్ళిలో అక్కభర్తని చూసింది జగదాంబ. తలపూర్తిగా బట్టతల అయిపోయింది. కొంచెంగా బొజ్జకూడా వుంది. ఆమె అక్కకు మటుకు బాగానే నచ్చాడు పెళ్ళికొడుకు! వడ్డాణం, కాసులదండ, కంటే పెట్టారు జగదాంబ అక్కకు! అరచేయి అంతేసి జరీ పువ్వులున్న ఎర్ర పట్టుచీర పెట్టారు జగదాంబ నగలూ, చీరలూ, చూసి మురిసిపోయింది. జగదాంబ అక్క అత్తవారిల్లు మండువా ఇల్లుగా వుంది. సగం ఇల్లు పేడమన్ను వేసి అలకాల్సిందే! వాకిట్లో, గడ్డివాములు, ధాన్యం పురులు వున్నాయి! పెరట్లో మంచినీళ్ళనూయి, ధాన్యంగాదెలు, పశువుల పాకలూ, ప్రహరీ గోడలకి పిడకలు తరవటం, అంతా విచిత్రంగా కన్పించింది జగదాంబకు! పెళ్ళయినాక జగదాంబ అక్క ఎప్పుడూ గర్వంగా తిప్పుకుంటూ మాట్లాడేది గోచీపోసి చీరకట్టుకునేది! జగదాంబకు కామేశ్వరి ఇల్లు చూసేసరికి, తాను చిన్నప్పుడు చూసిన అక్క అత్తవారిల్లు జ్ఞప్తికి వచ్చింది. కామేశ్వరి ఇల్లు దివ్య భవనంలా వుంది. ఇంట్లో ప్రతిగదిలోనూ సీలింగ్ ఫాను లున్నాయి. ఖరీదయిన సోఫాలు, వాటికి మంచిరంగుల్లో కవర్లు, వున్నాయి. ప్రతిగదిలోనూ, మూలన చక్కని త్రిభుజారపు బల్లులు, వాట్లమీద అందమయిన, ఫ్లవర్ వాజ్ లు వున్నాయి. తన కూతురు అదృష్టవంతురాలు అనుకొంది! అల్లుడు కూడా, అంత వయసుమీరిన వాడిలా కనపడడు!
