Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 8


    
    మాధవ, కేశవ, కామేశ్వరిని తన పెత్తండ్రి కూతురనో, పింతండ్రి కూతురనో పరిచయం చేస్తాడని ఎదురు చూసాడు. కాని, కేశవ కామేశ్వరిని మాధవకి ఏమని పరిచయం చెయ్యాలో తోచక ఏమీ అనకుండగా వూరుకున్నాడు. రామేశ్వరికి తనూ పరీక్ష ప్యాసయినట్లు గుర్తు వొచ్చింది అప్పుడు!
    'నేనూ ప్యాసయినాను' అంది.
    'అల్లాగా! అన్నట్లు నువ్వు మెట్రిక్ పరీక్షకి వెళ్ళినట్లు చెప్పింది వసుంధర! బాగుంది నువ్వూ ప్యాసయినావన్న మాట! వెరీగుడ్!' అన్నాడు కేశవ.
    కామేశ్వరి కాఫీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. వంటింట్లో అత్తగారు ఏదో పొయ్యిమీద వండుతూనే వుంది. వంటిల్లు చీకటిగా వుంది స్విచ్ వేసింది సీతమ్మ. కాని బల్బు వెలగలేదు.
    'ఎలట్రీ లేదేమిటమ్మా!' అంది సీతమ్మ.
    'లేదత్తయ్యా! దీపాలు ఇల్లంతా వెలుగుతున్నాయి! వంటింట్లో బల్బు మాడిపోయింది కాబోలు!' అంది కామేశ్వరి.
    'లాంతరు వెలిగించి తీసుకోనిరానాండి!' అంది కామేశ్వరి.
    'లాంతరు వెలుగు చాలదే అమ్మాయ్!' అంది సీతమ్మ.
    'అట్టయితే వుండండి.' అంటూ, కామేశ్వరి స్టోరు గదిలోని బల్బు తెచ్చి వంటింటిలో పెట్టింది. లైటు వెలిగించి, అక్కడున్న పీటమీద కూర్చుంది కామేశ్వరి. కోడలు తన వెనకతలే కూర్చోమంటం సీతమ్మకి ఎంతో సంతోషం కలిగించింది.
    'అబ్బాయి వచ్చినట్లున్నాడు' అంటూ కోడల్ని కదలేసింది.
    'వచ్చారు. కాఫీ ఇచ్చాను హాలులో ఎవరితోటో మాట్లాడుతున్నారు' అంది కామేశ్వరి.
    'కాస్త కూరముక్కలు తరిగిద్దూ!' అంది సీతమ్మ.
    బెండకాయలు, బంగాళా దుంపలు తెచ్చుకుని కత్తిపీట ముందేసుకుని తరుగుతూ కూర్చుంది.
    'పోన్లే తల్లీ నీకు అన్నీ వచ్చును! ఇట్టే ఎలట్రీ దీపాన్ని వెలిగించావు! చచ్చిపోయినవాళ్ళని అనకూడదు కాని, పెద్దావిడ వుండేది! అబ్బ! ఆ రాజేశ్వరీ దేవి రాజసానికి అంతే వుండేదికాదు! ఎప్పుడూ ఇల్లు పట్టేదికాదు కదా! క్లబ్బులూ, మీటింగులూ, స్నేహితులు, రావటాలూ, పోవటాలూ, ఇల్లంతా ఒకటే సత్రవలా వుండేది. మావాడి తత్వం తెలుస్తోంది కదా నీకు! దేనికీ వద్దనడూ, కద్దనడూ! ఇంట్లో ఒక్క రోజన్నా, ఒక్కగాని ఒక్క కోడలనీ, నా దగ్గర కూర్చుని కూరా, నారా, తరిగిచ్చిందీ! నా పనుల్లో సాయపడిందీ! ఇదిగో, నీ కూతురి వరస చూస్తున్నావు కదా! ఈడొచ్చిన పిల్లది! ఎక్కడన్నా అణుకువా, ఆడతనం వుందా! తల ఎగరేసుకుంటూ aరోడ్లట్టుకుని తిరగడనే దానిపని!' అంటూ కాస్సేపు చనిపోయిన పెద్ద కోడల్నిగురించి బ్రతికున్న మనుమరాలి గురించీ చెప్పి తిరిగి కామేశ్వరి పుట్టింటి వారిమీదకు ధ్వజ మెత్తింది సీతమ్మ.
    'చూడమ్మాయ్! పెద్దదాన్ని! నేను ఏదోగా, అంటున్నాను అనుకోకు! మీ అమ్మ నీకు రెండోపెళ్ళి రెండోపెళ్ళి అంటూ బొత్తిగా, నాసిగా చేసేసింది పెళ్ళి నిజానికి రెండోపెళ్ళి అనే కాస్త వారా ఉండబట్టేగా నువ్వు కానీ కట్నం లేకుండా కోటలాంటి ఇంట్లోకి వచ్చి పడ్డావు! కేశవాయ మొదటి పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందనుకున్నావ్! ఇరవయి ఏళ్ళక్రితం వాళ్ళు అయిదువేలూ కట్నం ఇచ్చారు. ఇప్పటి రోజుల్లో అయితే, ఇరవయివేల రూపాయిల నిలవన్నమాట! నాకూ, మీ వదినకీ చెరొక అయిదు వందలరూపాయిలూ, లాంఛనాలూ, పట్టుచీరలూ ఇచ్చారు. పదేసి పెద్ద రాణి కాసులు ఇచ్చారు. అయిదు రోజులూ ఘనంగా పెళ్ళి చేసారు. ఈ ఇంట్లో వున్న పందిరి మంచాలూ, మంచుబీరువా (ఫ్రిజిడేర్) ఇస్త్రీ పెట్టె (వాషింగ్ మిషన్) అన్ని తను సారెగా తెచ్చుకున్నవే! అన్ని మన కెందుకు! రేపు దాని కూతురు పెళ్ళి అయితే, అదె పట్టుక పోతుంది దాని తల్లి సామాను అంతా! కాళ్ళు గడిగేరు వందతులాల వెండి కంచంలో! పానకం బిందెలు వెండివి ఇచ్చేరు. ఇంక గ్లాసులు సరేసరి! పిల్ల రాజేశ్వరి కూడా బంగారు శలా కలా వుండేది! గొప్పింటిపిల్ల! అందుఅనే అంత హోరుగా ఇల్లంతా వెలిగి పోయేది అది వున్న నాలుగురోజులూ! ఇప్పుడూ అంత బాగా చేయగల్గినవాళ్ళూ వాడితో సమానంగా చదువుకుని వుద్యోగాలు చేస్తోన్నవాళ్ళూ పిల్లల నిస్తామంటూ వొచ్చారు. కాని కేశవాయే ఒప్పుకోలా!
    వసుంధర, బ్రతిమాలగా బ్రతిమాలగా ఎన్నో రోజులు నీ గురించి చెప్పగా చెప్పగా, సరే అన్నాడు! అందుకని అంత లోకువగా చేస్తారా పెళ్ళి, చెప్పు! కట్నకానుకలు అఖర్లేదన్నందుకు ఇంకెంత బాగాచేస్తారో అనుకున్నా. డువ్వీ డువ్వీ అనిపించేసేరు! ఆమాత్రం బుద్ది మీవాళ్ళకి లేకపోయింది! ఒక్క జరీ పంచెల చాపన్నా పెట్టేరా అల్లుడికి! వాడేం పెళ్ళికి ముఖం వాచి పోయేడనుకున్నారా మీవాళ్ళు! మంచి గంధబ్బొమ్మలాంటి దానితో, లేదంటే, ఇరవయి ఏళ్ళు సంసారం చేసాడు! 'పుత్తడి బొమ్మ' లాంటి కూతురుంది! రేపే పాటికి కూతురికి పెళ్ళి చేసుకున్నాడంటే, మనవలు పుట్టుకొస్తారు! ఏదో నేను పెద్ద దాన్ని అయిపోయేను! కూతురుకు, పెళ్ళి చేస్తే. అత్తారింటికి పోతుంది! నేను కాస్తా గుటుక్కుమంటే వాడికి కాస్త చెయ్యి ఆసరాగా ఇంట్లో ఆడది మసలాలనిచేసాం! కాని వాడికి పెళ్ళి ముచ్చటా, పెళ్ళాం ముచ్చటా తీరలేదని చేసామా చెప్పు! రేపు మీ చెల్లాయికి ఇల్లా కానీ ఖర్చుచేయకుండా, పెళ్ళి చేస్తే అదూరుకుంటుందా! అసలు ఎవళ్ళు చేసుకుంటారు దాన్ని మటుకు! చేసుకుంటే మటుకు, కొత్త చీరన్నా కొనకుండా, పట్టు బనారస్ చీరపెట్టకపోతే మావే, నాలుగురూపాయల కట్టుడు చీరన్నా కోని పసుపురాసి బొట్టుపెట్టి ఆడపిల్లని పంపకపోతే వూరుకుంటారా అవతలివాళ్ళు! మిఠాయిలతో ఇల్లు నింపక్కర్లేదు! అర్ధవీశ బెల్లం చలిమిడన్నా వొళ్ళోపెట్టి పంపరా కూతురుని? రెండో పెళ్ళి పెళ్ళాం అయితే ఇంక కడుపు చల్లన వుండక్కర్లే దనుకుందా మీ అమ్మ? తాను మళ్ళీ ఎల్లాకన్నదీ, నలుగురు పిల్లల్ని! ఆబుద్ది వుండక్కర్లేదా కన్నతల్లికీ!' అంది సీతమ్మ.
    కామేశ్వరి ఏమీ అనలేదు. 'నిజమే! వూరికే చేసుకుంటామనగానే, కనీస లాంఛనాలు కూడా జరపకుండా చేసారు. తన పెళ్ళికి మూడువెలు దాచామని చెప్పే వాళ్ళు! ఏం ఖర్చుపెట్టారు, తన పెళ్ళికి! మూడువందల రూపాయిలన్నా ఖర్చుపెట్టలేదు! తనకి ఒక జత బంగారపు గాజులన్నా చేయించలేదు. తాతయ్య గారి సంబంధానికి, అయిదుకాసులు బంగారం పెట్దాం. అంది తన తల్లి! పోనీ ఆ బంగారమేనా, తనని వూరికే చేసుకుందుకు వచ్చినందుకన్నా పెట్టవచ్చు కదా! కనీసం ఒక పట్టుచీరన్నా కొనలేదు. తను కొనమంటే,
    'నీ అదృష్టం బాగుంది! ఇంక పెట్టెడు చీరలూ, పట్టెడు నగలూ పెట్టుకుంటావు! ఇంకెందుకు అనవసరంగా వున్న డబ్బు ఖర్చుపెట్టుకోవటం! చెల్లి సంగతి చూడాలి! పెళ్ళి కావాల్సిన పిల్ల అది! దానికి మంచిబట్టలు లేకపోతే నలుగురిలో బాగుండదు!' అంది తల్లి. అప్పుడే తనకీ తనవాళ్ళకీ ఋణానుబంధం తీరిపోయింది. మూడుముళ్ళూ వేయగానే, తన కష్టసుఖాలన్నిటితో, వీళ్ళకే ముడిపడింది కాబోలు! ఇంక తన బాధ్యతంతా వీళ్ళదే! కామేశ్వరికి కళ్ళమ్మట నీళ్ళువొచ్చాయి. సీతమ్మ కోడలి వెంపు చూసింది. కామేశ్వరిముఖం దీనాతిదీనంగా వుంటం చూసి, సీతమ్మ, స్త్రీహృదయం ద్రవించిపోయింది.
    'తప్పు ఏడుస్తున్నావా! అసురసంజ వేళకంట తడిపెట్టకూడదు తల్లీ! ఇంటి ఇల్లాలివి! నిన్ను సాధిద్దామని అనలేదు. వూరికే మానవనైజం చెప్పాను. ఆశ దోషం ఎరుగదూ అని! నిజానికి మాతో నువ్వు చక్కగా కలిసిపోయావు! పెద్దావికన్నా నువ్వే మాతో చనువుగా వున్నావు! ఆ తల్లి మేడదిగేదేకాదు! మహారాణిలా ఇరవయినాలుగ్గంటలూ చదువు కుంటూ కూర్చునేది! కన్నవాళ్ళ కాఠిన్యానికి నువ్వేం చేస్తావ్! అంది సీతమ్మ.
    రాత్రి పదిన్నర అయినాక అప్పుడు వచ్చింది నళిని. అప్పటికే, కేశవ భోజనం చేసి, మేడమీదకు వెళ్ళి పడుక్కున్నాడు. కామేశ్వరీ సీతమ్మకూడా భోజనాలు చేసారు. కామేశ్వరి, వంటిల్లు కడిగి ముగ్గుపెట్టింది. ఒక కంచంలో, అన్నం, కూరలూ, నెయ్యీవేసి, పెరుగు చిన్న గిన్నెతోపెట్టి ఇంకో కంచం మూత వేసింది. సీతమ్మ హాలులో వున్న కవాచీ బల్లమీద పరుపు తలగడావేసుకుని పడుకుంది. కామేశ్వరి కూడా వంటింటి తలుపు జేరవేసివచ్చి సీతమ్మ, కాళ్ళ వద్ద కూర్చుంది.
    'నువ్వుకూడా వెళ్ళి పడుక్కో తల్లీ!' అంది సీతమ్మ.
    'నళిని ఇంకా రాలేదు' అంది కామేశ్వరి.
    'అది అంతే అమ్మా! ఇళ్ళన్నీ దేవిరించి, దేవిరించి, ఏ అర్ధరాత్రికో ఇల్లు జేరుతుంది. తండ్రి ఏమీ అనడు! నేను ఏమి చెప్పినా అది లెక్కచేయదు. భోజనం కంచంలో పెట్టి బల్లమీద పెట్టెయ్యి! నువ్వెళ్ళి నిద్రపో!' అంది సీతమ్మ. కామేశ్వరి, పైకి వెళ్ళిపోయింది. ఇంకా గదిలోకి వెళ్ళలేదు. నళినివచ్చింది. వస్తూనే 'అప్పుడే అంతా మంచాలెక్కేసారేమిటి!' అంది.
    'అప్పుడే అంటున్నావా! మొదటాట సినీమా వదలి ఎంతసేపు అయ్యిందీ!' అంది సీతమ్మ.
    'పోనీ ! నీకంటే పెద్ద కాలం! నిద్రకి ఆగలేవు అనుకోవచ్చును. ఆవిడకేం పోయే కాలం! ఈవిడ వచ్చినా, నాకంచం నేను పెట్టుకుని, అన్నం తినాలా! కాస్త విస్తట్లో అన్నంపెట్టి కంచం తీస్తేనే అరిగిపోతుందా, నీ ముద్దులకోడలు!' అంది నళిని.
    'నేను మెళుకువగానే వున్నాను కదా! పద అన్నంపెట్తాను. కాళ్ళు కడుక్కో!' అంది సీతమ్మ.
    'హు ఇన్నాళ్ళూ, నువ్వేమన్నా పెట్టే దానివా! నేను లేవలేను తల్లీ అంటూ దీర్ఘం తీసేదానివి! నీ ముద్దులకోడలు వచ్చేక, ఆవిడని నేనేమనిపోతానో అని, నువ్వే అర్ధరాత్రిదాకా మేలుకొని వుంటున్నావ్!' అంది వద్దేవాగా నళిని.
    'అర్ధరాత్రి అయ్యిందని ఒప్పుకుంటున్నావు కదా!' అంది సీతమ్మ.
    'ఎందుకు వప్పుకోను బామ్మా! అయినా ఈ కామేశ్వరికి, లేనిపోని దర్జాలు మప్పుతున్నారు నువ్వూ అత్తయ్యా కలిసి! లేకపోతే, ఆమె కెంత ధీమా! నేను ఇంటికివచ్చి భోంచెయ్యకుండానే, తాను కడుపునిండా వెనక్కి పడుక్కొంటుందా!' అంది నళిని.
    'నేను పెట్తానన్నానుకదే తల్లీ!' అంది సీతమ్మ.
    'నువ్వేం పెట్టక్కర్లేదు. నాకీ ఇంట్లో అన్నం వుండదని నాకు ముందే తెలుసు స్నేహితురాలింట్లో భోజనం చేసేవొచ్చాను. అసలు ఆమెగారి ఆవిధేయత చూడు! లేనింటి పిల్లఅయితే అణగి మణగిపడి వుంటుంది, అంది అత్తయ్య. ఇదే కాబోలు అణగి పడి వుంటం అంటేను! నేను పెద్ద దాన్ని అయ్యాను కనుక సరిపోయింది! అదే, చిన్నపిల్లవి, అయితే, తప్పకుండా విషం పెట్టి చంపును! ఎలా అన్నా సవితి తల్లి అన్నాక సవితి తల్లే!' అంది నళిని.
    'వూరుకో తల్లీ! అర్ధరాత్రి గొడవలు పెట్టకు!' అంది సీతమ్మ!
    కామేశ్వరి, అంతా వింది. గాఢంగా నిట్టూర్చింది. నళినికితనంటే, ముఖ్యంగా తానీ ఇంటికి రావటానికి ఇష్టంలేదని గ్రహించింది! ఆమె తనకన్నా నాలుగయిదేళ్ళు చిన్నదయినా, బొత్తుగా తనకి కూతురయ్యే ఈడు తనకిలేదు! తనని స్నేహితురాలిగా చూడకూడదా! తనేమన్నా, ఆ పిల్లని, ఆరడిపెట్టేంత అధికారిణి అయ్యిందా! చిన్నపిల్ల అయితే విషం పెట్టి చంపేసును అంది! సవతి తల్లులందరూ, పిల్లలకి విషాలు పెట్టి చంపేస్తారని, తనకింతవరకూ తెలీనే తెలీదు. తన్ని ప్రేమగా, ఆదరణగా చూసే వసుంధర, అత్తవారింట్లో వుంటుంది. ఇంక అత్తగారికి, తన పుట్టింటివాళ్ళు ఏమీ ఘనంగా పెళ్ళిచేయలేదని, అప్పుడప్పుడు, సముద్రపుపొంగులా, ఏదో వక ఆలోచన వస్తూనే వుంటుంది. నళిని తన ఈడూ జోడూ అయిన పిల్లది. తనతో సరదాగా వుంటుందేమో అంటే ఆ పిల్లకి, తన తల్లి స్థానం ఇదెవరో గతిమాలినది వచ్చి, ఆక్రమించుకుందనే కోపంపెట్టుకుంది. ఇంక, మూడుముళ్ళూ వేసి తన బాధ్యతని, శాశ్వతంగా తన నెత్తిమీద వేసుకున్న మహానుభావుడు, ఇరవయిఏళ్ల సంసార జీవితాన్ని తల్చుకుంటూ, ఆయన వుంటాడు! ఇంక తన వునికిని గుర్తించేది ఎవరు? తను ఎవరికి కావాలి? తను ఎవరికీ అక్కర్లేదు. తనకి అందరూకావాలి! పెళ్ళి కాకుండా తన తల్లితండ్రులకే తను మహాభారంగా వుండేది. ఇంక ఇప్పుడు, వాళ్ళకి చేతులు కడుక్కున్నంత హాయిగా తేలిగ్గా వుంది!

                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS