క్రింద పరిచిన ఎర్రని తివాసీమీద కూర్చుంది కామేశ్వరి, జగదాంబ కూడా కూర్చుంది కూతురి దగ్గర.
'చిట్టిబాబు బి.ఎ. లో జేరతానంటున్నాడు!' నాందీ ప్రస్తావనగా అంది జగదాంబ.
'అల్లాగా!' ముక్తసరిగా అంది కామేశ్వరి.
'నీ కూతురు కూడా, బి.ఎ. నే చదువుతోందిట కాదా?'
'అవును'
'ఎన్నో యేడు చదువుతోందీ!' అంది జగదాంబ.
'ఇది ఆఖరు సంవత్సరం. ఆ అమ్మాయికి!' అంది కామేశ్వరి,
'మన చిట్టిబాబుకి, ఆ అమ్మాయి, పుస్తకాలు పనికి వస్తాయేమో! ఇక్కడ కాలేజీలో జేర్పించుతాను. బావగారు కూడా, రెండు ముక్కలు చెప్తోంటారు వాడికి!' అంది జగదాంబ బులిపెంగా. జగదాంబ చెప్తోంటే, కోపం వచ్చింది కామేశ్వరికి.
'ఆ అమ్మాయి, నాతోనే, తిన్నగా, మాట్లాడదు! అల్లాంటి మనిషి వీడికి పుస్తకాలు ఇచ్చి, స్నేహితంగా వుంటుందా? ఇప్పటికే నాకు చీరెలూ, సారెలూ ఘనంగా ఇచ్చి పంపలేదని, మా అత్తగారు, నన్ను దెప్పుతూ వుంటారు. వీణ్ణి ఇంట్లో అట్టే పెట్టుకుంటే, ఇలా సంసారం, అంతా, దోచుకతినొచ్చుకదా అనే రెండోపెళ్ళివాడికి ఇచ్చారు అంటారు! ఎందుకొచ్చిన తంపులు నాకు!' అంది కామేశ్వరి.
'రెండోపెళ్ళివాడికి కూడా, కట్నకానుకలూ, సారె చీరెలూ, పెట్టి పెళ్ళి చేయాల్సివస్తే, ఇంక పెళ్ళిళ్ళు ఎల్లా చేస్తాం? ఏవో ఖర్చులు కలిసివొస్తాయనే, కదా ఒకరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన కాళ్ళనే, మళ్ళీ కడగటానికి ఒడంబడటం ఆ మాత్రం ఖర్చులేనా కలిసి రాకపోతే రెండోపెళ్ళి వాళ్ళకి పిల్లనిచ్చు కుని లాభం ఏమిటీ?' అంది జగదాంబ.
'నిజమే! ఖర్చులు కలిసిరావాలనే, రెండోపెళ్ళివాళ్ళకి ఇచ్చి చేస్తారు! ఆయనకి రెండోపెళ్ళికాని, నాకు రెండో పెళ్ళికాదుగా మరి? నాకోసం మీరేం చేసారు? కన్నందుకు, అందునా పెద్ద అందచందాలు లేని, అనాకారి పిల్లను కన్నందుకు నా మెళ్ళో మూడుముళ్ళూ వేయించటమే పరమావధి అనుకున్నారు! పెళ్ళికి అంటూ నాకోసం మూడువేలూ దాచాము అన్నారు. ఆ డబ్బులో సగమన్నా నాకోసం ఖర్చు పెట్టారా? మొదట నన్ను పెళ్ళాడుతా నన్న అబ్బాయికి, రెండువేలు కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డారు, అందులో సగమన్నా నా పెళ్ళికి ఖర్చుపెట్టి, ఆడపిల్లకి ఇవ్వాల్సిన చీరలూ సారెలూ కొంటే మా అత్త వారు నన్నేమన్నా మాటలు అంటారా? ఆ పెళ్ళికొడుకుకన్నా, మావారు ఎందులో తీసిపోయేరనీ, మీకు ఆ లోకువ! కేవలం, రెండోపెళ్ళి అన్నకారణంతో మీరంత తక్కువగా చేసారు. ఇప్పుడు; ఏ ముఖం పెట్టుకుని, నా తమ్ముడికి నేను చదువు చెప్పించుతాను అంటూ ఇంట్లో పెట్టుకో గలనూ! నువ్వే చెప్పు! అంది కామేశ్వరి.
'ఎంత చదువు చదివావే! లక్షణంగా కోటలాంటి ఇంట్లో పడవేస్తే, ఇంకా ఏవో పెట్టుపోతలు తక్కువ అయ్యాయని గొణుక్కుంటావా? మూడుముళ్ళూ పడగానే నీది, నాది, అంటూ తయారవుతారు. ఈ ఆడపిల్లలు!' అంది జగదాంబ.
'అత్తవారింట సకల భోగభాగ్యము లున్నా, మగనిమీద తన కెంత మక్కువ కలిగున్న, ఆడపుట్టువు తన పుట్టింటి కానపడును' అని వుంది కదా!' అంది నవ్వుతూ కామేశ్వరి!
చిట్టిబాబు, అక్కడవున్న రెండు మూడు రోజులలో నళినిని ఉత్సాహంగా పలకరించబోయేడు. కాని ఆ పిల్ల, ముఖం, ముటముట లాడించుకుంటూ తప్పుకపోయింది. చిట్టిబాబు ప్రాణం చివుక్కుమంది!
సాయంకాలంవేళ వంటపని కామేశ్వరి చూస్తోంది. సీతమ్మ, జగదాంబ. తీరిగ్గా, కాళ్ళు చాచుకుని కబుర్లు మొదలెట్టారు.
'నేను అన్నానమ్మా, వదినా! దానికి చదువెందుకురా నాయనా అని! హాయిగా ఇంట్లో పనీపాటా చూసుకుని సంసారం చేసుకునీ, పిల్లకి చదువెందుకు? నేనా పెద్దదాన్ని? ఏ మాట, కాస్త లోకం తీరువగా అన్నా, అదిగో అత్తగారు ముండ, ఆంక్షలు పెట్తోంది అంటారు. కాని అసలు ఇబ్బంది గ్రహించరుకదా! పెళ్ళి కానిపిల్లలు చదూకుందుకు వెళ్తేనే, నా నా రకాలుగా మాటలు అంటూ వెంట పడుతూ వుంటారు మగకుర్రాళ్ళు! ఇంకా, ఈ రెండోపెళ్ళి పెళ్ళాం చదువు కుందుకు కాలేజీకి వస్తే, ఇంక వూరు కుంటారా! వెర్రివాడి పెళ్ళాం, వాడవదిన, అన్నట్లు వెంటపడతారు! అసలే ఈ వూళ్ళో కాలేజీ పిల్లలు పుట్టి రాలుగాయి మూక!' అంది సీతమ్మ జగదాంబతో.
'అవును! సంసారం చేసుకునేవాళ్ళకి చదువు లెందుకండీ! పెళ్ళి కాకపోతే, చదువుకుని వుద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతారు, కదా అని, చదువులు చెప్పించుతారు మరి!' అంది.
ఆ మాటకి, సీతమ్మ ప్రాణం చివుక్కుమంది.
'మా నళిని తల్లిదంటే దర్జా చదువు అనుకో! దాని తల్లి సొమ్ములన్నీ దానికే ఇచ్చేస్తాం! మా కేశవాయక్కూడా కూతురంటే పంచప్రాణాలూనూ! పాతిక వేలన్నా కట్నం ఇచ్చి, సుబ్బరమయిన సంబంధం చేస్తాడు. అది అయితే చదువు సర్ధాకోసం చదువుకుంటోంది! ఈ లాకాయి లూకాయిగాళ్ళు దాన్నేం చేయగలరు?' అని తన మనవరాలి గొప్ప తనాన్ని వర్ణించింది. రెండు మూడు రోజులుండి జగదాంబా, వాళ్ళూ వెళ్ళి పోయేరు.
* * *
కాలేజీ వదిలి అర్ధగంటయినా, 'నళిని'. ఇంకా గరల్స్ రూం వద్ద నిలబడి వుండటం చూసి, మాధవ గరల్స్ రూం వరండాలోకి వెళ్ళి నిలబడ్డాడు. మాధవిని చూసి నళిని వరాండామీదికి వచ్చింది. గరల్స్ రూంలో అమ్మాయిలు కలకలం చేయటం వరండాలోకి విన్పడుతోంది.
'ఏం! ఇంకా వుండిపోయేవేం?' అన్నాడు మాధవ.
'నువున్నావని!' చిలిపిగా అంది నళిని.
'నువ్వుంటావని నేనూ వున్నా! మనం వుంటామని కారూ వుంటుంది' అన్నాడు మాధవ.
'కధకులు మీరు! మీరెక్కడ!' అంది నళిని.
'ధన్యుణ్ణి! అదుగో మీ కారు వస్తోంది! వాహనయోగం కలిగించుతావా!' నవ్వుతూ అన్నాడు మాధవ.'
'తప్పకుండా! మీ కన్నానా!' అంటూ రూం వద్దకివెళ్ళి.
'కారు వచ్చింది కామేశ్వరి!' అంది. కామేశ్వరి తలవంచుకుని పుస్తకాలు పుచ్చుకుని వచ్చి కారు వెనకసీటులో కూర్చుంది. మాధవ, డ్రైవరూ ముందు సీట్లలో కూర్చున్నారు. 'నళిని' కామేశ్వరి ప్రక్కన కూర్చుంది. ఇంటి దగ్గర కారు ఆగగానే తన పుస్తకాలు కూడా కామేశ్వరి కిచ్చి.
'నువ్వెళ్ళు కామేశ్వరీ! నేను ఇతన్ని ఇంటివద్ద డ్రాప్ చేసివస్తాను!' అంది నళిని.
'నళిని' కామేశ్వరిని, కామేశ్వరీ అనే పిలుస్తూంటుంది. మాధవ, కామేశ్వరినీ కాలేజీలో జేరినది మొదలు నళినితో రావటం పోవటం చూస్తూనే వున్నాడు. నళిని, కామేశ్వరిని వరస పెట్టి 'పిన్ని' అని పిలవకపోవటంతో 'కేశవ' భార్య కామేశ్వరి అని కాలేజీలో ఎవరికీ తెలియదు. 'కేశవ' పెళ్ళి వేసంగి. సెలవల్లో అవటం, గృహప్రవేశం మొదలైన హంగు, ఆర్భాటాలేమీ లేకపోవటం, వాళ్ళ ఇల్లు వూరికి చివరగా పెద్ద తోటలో వుంటం చేత కేశవ మళ్ళీ పెళ్ళి విషయం వూళ్ళో పాకిపోలేదు! తగినంత పబ్లిసిటీ లేకుండానే వాళ్ళకి మూడు ముళ్ళూ పడిపోయేయి!
తమకి తాముగా కామేశ్వరి కాని, నళిని కాని, వాళ్ళ నడుమనున్న సంబంధాన్ని బయట పెట్టుకోలేదు. 'నళిని'కి కామేశ్వరిలాంటి ఆకర్షణ లేని పిల్ల తమ ఇంటికి యజమానురాలు అని చెప్పుకోవటానికి నామర్ధాగా తోచింది. నళిని చక్కని చుక్కల్లే వుంటుంది. ఆమె తన అందానికి తానే అతిశయం పెంపొందించుకుంది! అసలు మామూలుగా మాట్లాడటానికే 'నళిని' తనతో సరి సమాన మయిన అందగత్తెలూ, ధనవంతుల పిల్లలూ అయితే కాని, నోరు విప్పదు. కామేశ్వరి నలుగురు ఎదుటా ఆ పిల్లని పలకరించితే చిరాకు ప్రదర్శించుతుంది. అంచేత కామేశ్వరి ఎప్పుడూ నళినిని క్లాసు పిల్లల ఎదురుగా పలకరించటానికి సాహసించదు. నళినికి తనపట్ల సద్భావం లేదని కామేశ్వరికి తెలుసును! న్యాయంగా కామేశ్వరికి, నళినిమీద సర్వహక్కులూ వున్నయి! ఆమె పూజనీయ మైన మాతృస్థానంలో నిల్చుంది కనుక! కాని నళినికి ఆ హక్కు కామేశ్వరి కీయటం బాగుండలేదు. కామేశ్వరి మీద తనకే అన్ని హక్కులూ వుండాలని భావించింది. కుటుంబపు ప్రతిష్ఠ రచ్చ కెక్కకుండా కామేశ్వరి ప్రవర్తనని తనకి సరిదిద్దాల్సిన బాధ్యత కలదని భావించింది నళిని! కాలేజీలో జేరిన కొత్తలో కామేశ్వరి ఒకరోజు.
'కొంచెం! ఈ లెక్క చూడు నళినీ! నాకు రావటంలేదు!' అని అడిగింది నళినిని.
నళినికి వళ్ళు దహించుకపోయింది.
'నా పాఠాలు నేను చదువుకో అక్కర్లా! నాది డిగ్రీ కోర్సు! నీకు తెలీదుకాబోల్ను! తెలీనివి మీ ఆయన్ని అడిగి చెప్పించుకో! లేకపోతే అందమైన కుర్రాడిని నీకు, ఈడూ, జోడుగా వుండే కుర్రాడిని చూసి ప్రైవేటు పెట్టించమను!' అంది నళిని.
కామేశ్వరికి సిగ్గుతో చచ్చిపోయినంత పనయింది. పెళ్ళి అయిన కొత్తలో 'నళిని' ని చూసి మురిసిపోయింది కామేశ్వరి! సుభద్రలానే అందమయిన నాజూకయిన నళినంటే ఆప్యాయితే కలిగింది కామేశ్వరికి! చదువుకొంటున్న 'నళిని' తో స్నేహంగా ఆడుతూ పాడుతూ, రోజులు గడపొచ్చనుకున్న కామేశ్వరి కలలు నీటి అలలైనాయి!
ఒకరోజు సీతమ్మకి వంట్లో నలతచేసి ప్రొద్దుట లేవలేకపోయింది. అల్లానే పడుక్కుండిపోయింది. ఆరుగంటలకల్లా తన గదిలో టేబుల్ మీద బెడ్ కాఫీ రెడీగా లేకపోవటంతో 'నళిని' లేచి ఇవతలకు వచ్చింది. పడుక్కున బామ్మని చూసి.
'ఏం బామ్మ! వంట్లో బాగాలేదా!' అని ప్రేమగా పలకరించింది. ఎప్పుడూ చిర్రల గొడ్డులా చిర్రూబుర్రూ మంటూ వుండే నళిని ఇంత ప్రేమగా అడగటం చూసి సీతమ్మ పొంగిపోయింది.
'అవునే తల్లీ! నడుం నొప్పిపట్టింది! కదలనీట లేదే అమ్మా!' అంది.
'కామేశ్వరీ!' అంటూ క్రిందనించే మేడమీదకు వినబడేలా ఒక గావు కేక పెట్టింది నళిని. అప్పుడే లేచి ఇవతలకు వస్తోన్న కామేశ్వరి వురుకులతో పరుగులతో మేడ మెట్లు దిగబోయింది. నాలుగుమెట్లు వున్నాయనగా చీరకుచ్చెళ్ళు కాళ్ళకి అడ్డం తగిలి బోర్లగిలా పడిపోయింది. ముఖంమీద నిమ్మకాయంత బొప్పి కట్టింది కామేశ్వరికి!
'అదే టి కామేశ్వరి! బామ్మకి వంట్లో బాగులేకపోతే పెందరాళే లేచి కాఫీ పెట్టాలని తెలీదూ!' అంది.
'అయ్యో లేవగానే పడిపోయేవే!' అని మాటవరసకన్న సానుభూతి చూపలేని ఆ పిల్ల కాఠిన్యతకు తనలోతనే మధన పడింది కామేశ్వరి!
'చూడు కామేశ్వరీ బామ్మకు వంట్లో బాగుండేదాకా కొంచెం పెందరాళే లేచి ఇంటిపనులు చూస్తోండు!' అంది నళిని.
క్వార్టర్లీ పరీక్షల ముందు రాత్రుళ్ళు ఎక్కువ ప్రశాంతంగా వుంటుందని అప్పుడే చదువుకునేది కామేశ్వరి! దానికి నళిని.
'చూడు! కామేశ్వరీ! రాత్రి అర్ధరాత్రి దాకా మీ గదిలో దీపం వెలుగుతూనే వుంది! మా నాన్నారి ఆరోగ్యం అంత దిట్టమైనది కాదు! అర్ధరాత్రిదాకా ఆయన్ను చదువు చెప్పమని వేధించకు! నీకు నిద్ర రాకపోతే క్రింద గదిలో కూర్చుని చదువుకో! అనేది!
నర్మగర్భంగా వున్న ఆ ఎత్తి పొడుపు మాటలకి కామేశ్వరి పసిమనస్సు గిజగిజ లాడేది! ఆమె తండ్రి ఆరోగ్యం అమెకెంత ముఖ్యమో, తన భర్త ఆరోగ్యం తన కంత ముఖ్యం కాదా! ఆమెకంటే తనకే, కేశవ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి చదువుకుంటున్న నళినికి ఎందుకు తెలీదు? తన సర్వసౌభాగ్యం 'కేశవ' జీవితంతో ముడిపడివుందని తెలియకనేనా ఆ పిల్లది తనని అల్లా శూలలావంటి వాగ్భాణాలతో వేధించటం! కామేశ్వరి కళ్ళు నిండుకునేవి! భర్తతో నళిని మాటల ఈటెలు గురించి చెప్పుదామన్నా సంకోచం కలిగేది. అల్లా సవతికూతురు తన్నేదో వేధించుతూందనుకోవటం సవతి తల్లి లక్షణాలలో ప్రధానమైంది అనుకుంటారేమో అని భయపడేది! ఇల్లా లజ్జాసంకోచాలతోనే కాలం దొర్లించుతోంది కామేశ్వరి!
* * *
