Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 9


    నిషా పూర్తిగా తలకెక్కిన రోజా 'డియర్.....అ....లా......దా...రి....కి....రా....! చూడు....నే... ను గాలిలో....ఎ....లా.....తే....లి.....పోతు....న్నానో...?' తడబడుతూన్న మాటలతో ప్రభాకరంపై తూలిపడుతూ ఆ ద్రవాన్ని అతనిచేత త్రాగించింది. కొరబోగా ఉక్కిరిబిక్కిరౌతూ ఎంతో బాధ పడుతూ త్రాగాడు. పదిహేను నిముషాలలో ఇద్దరూ ఒకే స్థితికి వచ్చారు.
    వీరి చర్యలకు మండిపడుతూ పగలంతా గడిపిన భాస్కరుడు నీరసంగా, బనిస్సహాయుడుగా మాతృగర్భం లోపలికి జొరబడుతున్నాడు. సాయంకాలమవడం వల్ల చల్లగాలి వీస్తూ ఉంది. ఆ సమయంలో ఆతోట ఎంతో అందంగా ఉంది.
    త్రాగుడు ఒక ప్రమాదకరమైన అభ్యాసం. దానికి లోబడి, దాని కఠోర విషజ్వాలలనుండి బయటపడినవారు చాలా అరుదు. లోబడడం ఎంతో తేలికైన పని. కాని బయటపడడం మాత్రం అతి క్లిష్ట మైన సమస్య. ఇలా ఎన్ని కుటుంబాలో నాశనమయ్యాయి. ఎందరి జీవితాలో రోగ గ్రస్తమయ్యాయి.
    స్నేహితులంతా రోజా, ప్రభాకరంల కోసం తోటంతా వెదికి, వెదికి చివరకు నీరున్న ప్రాంతానికి వచ్చి వీరిని తీసుకువెళ్ళారు.
    రాత్రి ఎనిమిదిగంటలకు అంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం ఉన్న ఉత్సాహం ఆనందం ఎవరి ముఖాలలో చూసినా మచ్చుకు కూడా కనుపించడం లేదు. ఏ వ్యక్తికైనా ఒక మంచికార్యం చేసిన తర్వాత కలిగే ఆ తృప్తి, ఆ ఆనందం చెడుకార్యం చేసినప్పుడు కలుగదు. అది చెడ్డపని అని ఆ వ్యక్తికి తెలిసినప్పటికీ, పరిస్థితుల ప్రభావం అతని వివేచనాశక్తిని జయించి అతని మెడలు వంచి చేయిస్తుంది. అందువల్ల మానసికంగా ఎంతో బాధపడుతూనైనా, చేయరాని కార్యాన్ని చేస్తాడు. ఆ పని చేసినందుకు మనసులో బాధపడుతూ ఉంటాడు.

                           *    *    *

                                   4

    శాంత శారదలు ఎక్స్ కర్షన్ పార్టీతో వెళ్ళారు. ప్రస్తుతం వారి పార్టీ ఆగ్రాలో ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు తాజ్ మహల్ చూడడానికి వెళ్ళారు. శాంత, శారదలు. ప్రత్యేకంగా ఒక గైడును మాట్లాడుకున్నారు. మిగతా వారంతా ముందుకు వెళ్ళిన తర్వాత వీరిద్దరూ బయలుదేరారు. ఆ గైడు హిందీలో ప్రారంభించాడు. శారదకు హిందీ సరిగా రాదు. కొద్దిగామాత్రమే తెలుస్తుంది. ఆ కారణంగా ఆ గైడును యింగ్లీషులో చెప్పవలసిందిగా కోరారు. అతను ప్ర్రారంభించాడు.
    తాజ్ మహల్ ప్రవేశద్వారంపై యిరువది మూడు చిన్న చిన్న ఋజువులున్నాయి. ఆ తాజ్ మహల్ నిర్మాణానికి ఇరువది మూడుసంవత్సరాలు పట్టాయట! ఇరువది మూడుకోట్లు ఖర్చయ్యాయట! దాని నిర్మాణసమయంలో యిరువది ముగ్గురు మరణించారట.....! ఈ మూడు రకాల సంఖ్యలు ఒకటిగా ఉండడంవల్ల ఆద్వారం పై వాటి చిహ్నాలుగా యిరువది మూడు బురుజులు నిర్మింపజేశాడట ఆ మొఘలు పాదుషా షాజహాను. ఈ విషయాన్ని చెప్పి లోపలికి త్రోవతీశాడు గైడు. అతనిని అనుసరించారు శాంత. శారదలు తాజ్ మహల్ చుట్టూ ఉన్న తోట చూసిన శారద ఎంతో ఆశ్చర్యపోయింది. కొన్ని ఎకరాల వైశాల్యంలో చక్కగా కత్తిరించబడిన చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ తోట. ఆ విశాలమైన తోటను చూస్తూ నడుస్తున్నారు. తాజ్ మహల్ ఎదురుగా పొడుగై నమౌజు ఉండి దానిలో ఫౌంటెన్లు అమర్చచబడి యున్నాయి. అందులోనుండి చిమ్మబడుతూన్న నీరు, సూర్యకిరణాలు ఆ నీటినుండి చొచ్చుకు పోవడంవల్ల ఏర్పడుతూన్న చిన్నసైజు యింద్ర ధనుస్సులు చూడముచ్చటగా ఉండి ఎంతో అందంగా కనుపిస్తున్నాయి. ఆ తాజ్ మహల్ ముందు ఉన్న ఒక నలుచదరపు నీటి మౌజులో పూర్తి తాజ్ మహలు ప్రతిబింబిస్తూ ఉంది. అంత చిన్నమౌజులో ఎంతో పెద్దగా, ఎత్తుగా ఉన్న తాజ్ మహలు ప్రతిబింబం పూర్తిగా కనుపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది వారికి. అప్పటివారి విజ్ఞానము. శాస్త్రము ఎంత అభివృద్దిలో ఉండేవో తెలుసుకోవడానికి నిదర్శనమాదృశ్యము. ఆ వింత దృశ్యాలు చూస్తూ తాజ్ మహల్ ముందుకు వెళ్ళారు. మెడఎత్తి చూస్తేగాని దాని శిఖరం కనుపించలేదు వారికి. పూర్వము తలపాగాలు ధరించి వెళ్ళేవారట! వారు ఆ శిఖరాన్ని చూడడంతో ఆ తలపాగాలు క్రిందపడిపోయేవట! అంత ఎత్తయిన కట్టడమది.
    దూరంనుండి చూస్తే తెల్లగా, హిమ శిఖరంలా ధగధగ లాడుతూ కనుపించే ఆ ప్రేమదంపతులం గోరీ దగ్గరకు వెళ్ళుతున్న కొద్దీ వింతకాంతులీనుతూ చిత్రవిచిత్ర మైన రంగులు కనుపించడం ఆశ్చర్యకరమైన విషయం. చాలా దగ్గరకు వెళ్ళి చూసి వారు ఆశ్చర్యపోయారు ఒక్కొక్క పువ్వులో రకరకాలైన రంగురాళ్ళు పొదిగారు. గులాబీపువ్వులు, లతలు, ఎంతో మనోహరంగా ఉన్నాయి. మన స్వర్ణ కారులు తమ కళాకౌశలంతో నెక్లెసులలో రాళ్లనెలా పొదుగుతారో అలాగే ఆనాటి శిల్పులు తమ ఆత్యద్భుత ప్రావీణ్యంతో రంగురాళ్ళను పొదిగారు. కనీసం వాటిని అతికించినట్లుకూడా కనుపించనంత నేర్పును ప్రదర్శించారు. ఆ శిల్పచాతుర్యాన్ని ఉత్సాహంగా తిలకిస్తూ లోపలికి. వెళ్ళారు. వెనుకభాగంలో ఉన్న గదులలో ఒకచోట నున్నం ఊడిపోయి యిటుకలు బయటపడ్డాయి. శాంత శారదలకు వివరాలన్నీ పూసగ్రుచ్చినట్లు చెబుతూన్న ఆ గైడు తన చేతిలోఉన్న యినుపముక్కతో ఆ యిటుకలను కొట్టాడు. ఇనుము యినుముతో కొట్టినపుడు వచ్చే శబ్దంలా వచ్చింది. ఇద్దరూ విస్తుపోయారు. అంత గట్టితనం యిటుకలలో ఉండబట్టే కొన్ని వందల ఏండ్లు గడిచినా అ కట్టడము చెక్కుచెదరకుండా ఉంది.
    ఆనాటి శిల్పకారుల కళానైపుణ్యానికి ముగ్ధులౌతూ తదేక ధ్యానంతో వాటిని పరిశీలించసాగారు.
    'ఈ రోజులలోని కట్టడాలు, ఒక వర్షాకాలంలో తడుస్తే మరొక వర్షాకాలాన్ని చూడలేవు'  అంది శారద. ఆ మాట విన్న శాంత తనకు ఈ మధ్య పత్రికలో చదివిన ఒక సంఘటన స్ఫురణకు రాగా 'అవునే శారూ...! ఈమధ్య ఒక కంట్రాక్టరు ఫాస్టు ఏరియాలో ఒక ట్రావెలర్సు బంగాళా కట్టాడట! దాని ప్రారంభోత్సవం ఒక మంత్రిగారు చేయాలి. ఆయనకు తీరిక చిక్కి ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసరికి వర్షాకాలం గడిచిపోయి శీతాకాలం వచ్చింది. ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురిశాయి. మంత్రిగారితో అతని సిబ్బంది, బలగమూ అంతా ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆ ట్రావెలర్సు బంగళా ఉండవలసిన స్థలంలో శిధిలాలు కనిపించాయట! విచారణ జరుపగా వర్షాకాలంలో పడిన వర్షాలకు ఆ యిల్లు కూలిపోయిందని తేలిందట! కంట్రాక్టరు బిల్లు ప్యాసు చేయించుకొని మూడు మాసాలైందట! ప్రారంభోత్సవానికి వెళ్ళిన మంత్రి గారు ఆ శిధిలాలను చూసి ఆశ్చర్యంతో తికమకపడి తిరుగుముఖం పట్టారట! ఆ తర్వాత ఆ విషయాలను కూలంకషంగా చర్చించి విచారణ జరపడానికి ఒక కమిటీని నిర్ణయించిందట ప్రభుత్వం!' అంది శాంత. ఇద్దరూ నవ్వుకున్నారు, ఒకరి ముఖంలోకి మరొకరు చూస్తూ-
    స్వార్ధం మోసం, అన్యాయం, అవినీతి తాండవంచేస్తున్న ఈ రోజులకు, నిస్వార్ధంగా తఃమ పని అని చేసుకుపోయిన ఆ రోజులకు గల తారతమ్యాన్ని నిరూపించడానికి పై రెండు ఉదాహరణలు చాలు. కొన్ని వందలయేండ్లు గడిచినా చెక్కుచెదరని అప్పటి ఈ కట్టడ మెక్కడ? వసంతఋతువులో కట్టినవి శిశిరరుతువులో నామరూపాలు లేకుండా పోతున్న యిప్పటి ఈ కట్టడాలెక్కడ? దీనికి కారణమేమిటి? శాస్త్రం అభివృద్ధి చెందకనా? అప్పుడున్న నిపుణులు యిప్పుడు లేకనా? ఈ రెండూ కావు. మనుష్యులలో దినదినం క్షీణించిపోతున్న నైతికవిలువలే యిటువంటి అనర్ధాలకు మూలకారణం.
    శాంత శారద లిద్దరూ గైడును అనుసరిస్తూ అసలు గోరీలున్న క్రిందిభాగం లోపలికి వచ్చారు. పై భాగంలో కన్న క్రింది భాగంలో వున్న పనితనం, నగిషీలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అరబ్బీ, పారసీక భాషలలో ఖురాను నందలి పవిత్రవాక్యాలను మలచిన రాళ్ళను పొదిగారు. గోరీలపైగల లతలు, పూలు కూడా ఎంతో బాగున్నాయి. అవన్నీ వివరంగా చూసి బయటికి వచ్చారు. మిగతా స్నేహితులంతా వార్డెను వెంట బస్సు నిల బడి ఉన్నవైపు నడుస్తున్నారు. గైడుకు డబ్బులిచ్చి వారికి పది, పదిహేను గజాల వెనుకగా అనుసరించసాగారు.
    'శాంతా...! నాకు తాజ్ అందం వెన్నెలరాత్రి చూడాలని ఉంది. నేను కలలో కూడా ఊహించని ఈ ప్రయాణం నీ వల్ల సాధ్యపడింది. ఈ కోరిక కూడానీవల్లే తీరాలి. వాళ్ళంతా వెడితే వెళ్ళారు. మనం ఏ టాక్స్ లోనో వెడదాం! నీవెలాగైనా వార్డెన్ కు చెప్పి ఒప్పించాలి' తన అభిలాషను వెల్లడించింది శారద.
    'అలాగే...! అడిగి ఒప్పిస్తాను' అని త్వర త్వరగా నడిచి వార్డెనును కలుసుకొని, ఆమెతో మాట్లాడి, తిరిగివచ్చి శారదను కలుసుకుంది.
    'వార్డెను వద్దందే....!' అంది శాంత. శాంతమాట విన్న శారద ముఖం చిన్నబోయింది-
    'పోనీలే-! అనవసరంగా నిన్ను శ్రమ పెట్టాను.' విచారంతో అంది శారద.

                       
    శారద ముఖంలోని ఆ ధైర్యాన్ని చూసిన శాంత 'లేదు లేదే....ఒప్పుకుంది కాని జాగ్రత్తగా రమ్మని ఒకటికి రెండు సార్లు హెచ్చరించింది. 'సరే....!' పని వచ్చేశాను', అని మునిపళ్ళతో క్రింది పెదిమను అదుముతూ ఉబికివస్తూన్న నవ్వును ఆపుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS