Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 10


    'అమ్మ దొంగా...! నన్ను ఉడికించాలని పన్నిన పన్నాగమా...?' అని చిరునవ్వు చిందిస్తూ, శాంత బుగ్గపై ఒక చిన్నదెబ్బ వేసింది శారద.
    ఇద్దరూ తనివితీరా నవ్వుకున్నారు -
    
                                               *    *    *

    ఆ నాటి కొలువు చాలించిన సూర్యుడు తన దినచర్య ముగించుకొని గంటపైగా గడిచింది. ఆరోజు పౌర్ణిమ. పగలంతా తీక్ష సూర్యరశ్మికి తపిస్తూన్న ప్రాణులకు తమ హేమజ్యోత్స్నలను ప్రసాదించే నిమిత్తం, చనుబాలకోసం తల్లిపై కెగబ్రాకుతూన్న పసిపాపలా క్రమంగా చంద్రుడు ఆకసానికి ఎగబ్రాకు తున్నాడు. అలా ఎగబ్రాకుతూ మధ్య మధ్య మేఘాలతో దోబూచు లాడుకుంటున్నాడు. అది వసంత ఋతువు. చల్లగాలి వీస్తూ ప్రాణులకు హాయిని కలిగిస్తూ ఉంది. తాజ్ మహల్ ప్రక్కగా ప్రవహిస్తూన్న యమునా నది పైనుండి వీస్తూన్న పిల్ల తెమ్మెరలు ఆ యిద్దరు యువతులకు ఎంతో హాయిని, ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది.
    'శాంతీ....!' అని నాలిక కరుచుకొని ఏదో చెప్పబోయి ఊరుకుంది శారద.
    'ఏమిటే శారూ? మధ్యలో ఆపేశావ్?'
    'ఏమీలేదు అనుకోకుండా నా నోటి నుండి 'శాంతీ' అనే పదంవచ్చింది. అలా పిలుస్తే నీకేమైనా బాధ కలుగుతుందేమోనని భయపడ్డాను' అంది శారద.
    'ఎందుకే భయం ... ? అలా పిలుస్తే నీవు నాకు మరీ సన్నిహితురాల వైన ట్లుగా భావించుకుంటాను' మెరుస్తూన్న కళ్ళను త్రిప్పుతూ అంది శాంత.
    'ఎంత మంచిదానవే శాంతీ! నీచల్లని నీడలో నా శేషజీవితాన్ని నిశ్చింతగా గడుపుతాను.' ఆప్యాయతను వ్యక్తం చేస్తూ అంది శారద.
    'నీ కేమైనా పిచ్చెక్కలేదు కద...? నా చల్లని నీడలో జీవితాంతం నీవు గడపడ మేమిటి? నేనేమైనా మగవాన్నిటే ...? జీవితాంతం నిన్ను భరించడానికి? అందుకు ఎవరో ఒకరు పుట్టి ఉండే ఉంటారు. ఒకవేళ నేను మగవాన్న యినట్లైతే నిన్ను ఒదలకపోయేదాన్ని' చిలిపిగా శారద కళ్ళల్లోకి చూస్తూ ఆమె బుగ్గగిల్లి, లేచి పరుగెత్తింది శాంత. ఆమె ననుసరించి పదినిముషాలలో పట్టుకుంది శారద. ఇద్దరూ రొప్పుతూ, రోజుతూ అక్కడ ఉన్న పచ్చికబయలుపై కూలబడ్డారు.
    'నీ కెంతపొగరే శాంతీ...? ఉండు. మా అన్నయ్యతో చెప్పి భరతం పట్టిస్తాను. నీవు మగవాడవౌతావూ...? నా వెంట పడతావూ....?'
    'చెప్పుకోలే....! నాకేమన్నా భయమా...?'
    'ఏం...? భయంలేకుండా అంత గారాబంగా చూస్తాడా మా అన్నయ్య...."
    'అవును.... గారాబంగానే చూస్తాడు. నీకు అసూయ కలుగుతూ ఉందా...?
    'ఎంత మాటన్నావే శాంతీ? ఈసారి అంటే అన్నావు కాని మరోసారి అంటే సహించలేను నీవు నీ బావను పెళ్ళాడి కలకాలం పసుపుకుంకుమలతో కళకళ లాడుతూ కనుపించాలి. జీవితంలో నాకిక మిగిలి ఉన్న కోరిక యిదొక్కటే....!' కళ్ళల్లో నీరు నింపుకొని. దీనంగా ముఖం మార్చుకొని శాంతను చూస్తూ అంది శారద.
    'ఏమిటే యిది...? పరిహాసానికి అంటే కంట తడిపెడుతున్నావా...? మాట జారి పోయింది. నీమనసు నాకు తెలియదటే....! అయినా ఆరోజుచేసిన ప్రమాణాన్ని తప్పు తానంటావా? అలా ఎప్పటికీ జరగదు. నీ వివాహం జరిగినతర్వాతే నా వివాహం. ఈ విషయం బావతో కూడా నొక్కి చెబుతాడు.'
    'వద్దు శాంతా....! నన్నెవరని వివాహ మాడతారు...? కులగోత్రాలు తెలియనిదాన్ని.'    
    'అలా అనకు. బావ తలచుకుంటే అసాధ్యమేదీ ఉండదు. నాకు తెలుసు నీ హృదయం ప్రభాకరానికి అంకితమైంది. అదైనా అంత సాధ్యంకాని పనేమీ కాదు. కాని....శారూ! ఆ మూర్కుడిని చేసుకొని ఏం సుఖపడతావు?' ప్రభాకరం ప్రసక్తి రావడంతో శారద బుగ్గలు ఎరుపెక్కాయి. శారద ప్రభాకరంపైన మమతను పెంచుకున్నదని ఏనాడో అర్ధం చేసుకుంది శాంత!
    'అతను మూర్కుడుకాదు శాంతి! అతని చుట్టూచేరి అతనిని నాశనంచేయాలని చూస్తున్నారు కొందరు స్వార్ధపరులు. ఆ విషజాలంనుండి ఎలా బయట పడతాడో ఏమో? అతను సానపెట్టని వజ్రంలాంటివాడు. సానపెడితే వజ్రం మెరిసే విధంగా అతనిని సక్రమమార్గంలో పెట్టగలిగినవారుంటే రాణిస్తాడు. అదెవరికి సాధ్యం...? ఏదెలా ఉన్న ప్రభాకరాన్ని నా ప్రక్కన ఊహించుకొనేంత మూర్కులాలనుకాను. నీవద్ద నాకు దాపరికమేముంది? ప్రభాకరాన్ని ప్రేమిస్తూన్న మాట వాస్తవమే! కాని ఆ ప్రేమ ఈ జన్మలో ఫలించదు. అంతస్తులు, కుల గోత్రాలు అడ్డువస్తాయి. అంతేకాకుండా నా పుట్టుపూర్వోత్తరాలు నాకె తెలియవు. అటువంటి ప్రమాణం చేయవద్దని నీకు యిదివరకే చెప్పేను. నా జీవితం ఎండుటాకువంటిది. గట్టిగా గాలి వీస్తే ఎటు కొట్టుకు పోతుందో ఎవరికీ తెలియదు.'
    'శారూ...! మనం మానవులం మానవులకు అసాధ్యమేదీ లేదంటారు! మన ప్రయత్న లోపంలేకుండా చూద్దాం! ప్రభాకరమేమిటి? డబ్బు కుమ్మరిస్తే కొండ మీది కోతైనా దిగివస్తుంది.'
    'ఏమో ..... శాంతీ....! మీరు డబ్బు మాత్రం కుమ్మరించగలరు. కాని నాకు లేని అర్ హతల నెక్కడి నుండి తేగలుగుతారు? సరే....! ఈ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మనం యిక్కడ ఎందుకు ఆగి ఉన్నామో, ఆ విషయమే మరిచిపోయి కబుర్లలో పడ్డాం'. ధవళ కాంతులతో పట్టు తీవాచీలా రమచుట్టూ నలుప్రక్కలా ఆవరించిన వెన్నెలను చూస్తూ అంది శారద.
    'కలిసొచ్చే కాలంవస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట! అన్నీ శుభంగా జరగాలని ఆశిద్దాం....! మంచిది. ఇక వెడదాం. పద. ముంతాజ్, షాజహానుల ప్రేమచిహ్నాన్ని ఈ వెన్నెలలో చూద్దాం."
    ఇద్దరూ లేచి తాజ్ మహల్ వైపు నడిచారు. ఆ పండువెన్నెలలో ఆ పాలరాయి కట్టడం వింతకాంతులీనుతూ యెంతో అందంగా ఉంది.
    "శారూ...! ఆ మొఘలు చక్రవర్తి ఎంత రసహృదయుడై ఉండాలి? తన ప్రియురాలి అంతిమకోరికను తీర్చడానికి ఎంత ధన వ్యయం చేశాడు? ప్రపంచంలో గల ఏడువింతలలో ఒకటిగా పరిగణించబడుతూన్న తాజ్ మహలు మనదేశంలో ఉండడం మనకు ఎంత గర్వకారణం? అయినా ఒక సమాధికోసం అన్నికోట్ల రూపాయలు వ్యయపరచడం వృధా అనినా ఉద్దేశ్యం. అదే డబ్బు ప్రజోపయోగ కార్యాలకు వినియోగపరచినట్లయితే ఎంతో బాగుండేది.'
    'నీ వంటున్నమాట వాస్తవమైనదే! కాని లలితకళ, శిల్పకళ, యివన్నీ మరుగున పడిపోవవలసిందేనా...? ప్రజోపయోగకార్యాలతోపాటు యివి కూడా ముఖ్యమే!'    
    'అబ్బ....! ఈ తాజ్ మహల్ ను ఒదిలి వెళ్ళ బుద్ధి వేయడంలేదు. ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది.
    'పిచ్చి శాంతీ! మొదటిసారి చూశావు కాబట్టి నీకలా అనిపిస్తూ ఉంది. అదెలా సాధ్యమే! ఇక్కడే ఉండిపోతే నాలుగు రోజులలో అన్నయ్య నిన్ను వెదుక్కుంటూ వస్తాడు. అంతపని మాత్రం చేయకు' నవ్వుతూ అంది శారద.
    'విదేశస్థులు కూడా దీన్ని ఎంతో పొగిడారు. ఎవరైనా శాశ్వితకీర్తి సంపాదించుకోవాలంటే యిలాంటి అద్బుత కట్టడాలను నిర్మించడ మొక్కటే మార్గము. తాజ్ మహల్ పుడమి పై సురక్షితంగా ఉన్నంతకాలం షాజహాన్, ముంజాబ్ లు అమరులై ఉంటారు. వారి పవిత్రప్రేమ ఆ చంద్రతారార్కం ఈ కట్టడం ద్వారా భావితరం వారికి సందేశాన్నిస్తుంది.'
    'అవును!'
    తృప్తి తీరా మళ్ళీ తోట, తాజ్ మహల్ కట్టడమూ, అన్నీ తిరిగి చూశారు. ఆ తర్వాత వారు బసచేసిన సత్రానికి వెళ్ళి పోయారు.
    మరురోజు అంతా ఆగ్రాకోట చూడడానికి వెళ్ళారు. అక్కడఉన్న వింతలలో ఒకటిమాత్రం జాగ్రత్తగా గమనించదగినది. అక్కడికి మూడుమైళ్ళ దూరంలో ఉన్నటువంటి తాజ్' మధ్యలో ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ ఒకచోట అమర్చబడి ఉన్న కుంకుమబొట్టంత అద్దంలో దాన్ని చూసి వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అంత చిన్న అద్దం ముక్కలో ఎంతో పెద్దదైన తాజ్ మహల్ యొక్క ప్రతిబింబం కనుపించే విధంగా అమర్చిన ఆ శిల్పకారుల గొప్పతనం శ్లాఘనీయమైనదని తలపోశారు.
    ఆ విధంగా ఆగ్రా లో చూడవలసిన వన్నీ చూసి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కుతుబ్ మీనార్, ఎర్రకోట, జంతర్ మంతర్, పార్లమెంటు భవనం, రాష్ట్ర పతిభవనం, తదితర చూడవలసిన ముఖ్య స్థలాలన్నీ చూసి హైద్రాబాదు తిరిగి వచ్చారు. ఈ ఎక్స్ కర్షన్ కారణంగా శాంత, శారదలు మునుపటికన్న సన్నిహితులైనారు.

                          *    *    *

    పిక్నిక్ కు వెళ్ళి వచ్చిన రోజు రాత్రి ప్రభాకరం భోజనం చేయలేదు. మొదట శ్రీపతిగారు ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు వెళ్ళి అతనిని భోజనానికి పిలిచి వచ్చారు. తను త్రాగిన విషయం ఎక్కడ బయటపడుతుందోననో భయపడ్డాడు ప్రభాకరం. అతను ఎంత జాగ్రత్త పడినా శ్రీపతిగారు ఆ విషయాన్ని పసిగట్టారు. బాధపడ్డారు. తనలోనే దాచుకున్నారు. ఈ విషయం భార్యకు తెలుస్తే కుమిలి, కుమిలి ఏడుస్తుందని వారికి తెలుసు. విచారంలో ఆలోచనలో పడ్డారు. ఏమిటిది? వీడి ప్రవర్తన రోజు రోజుకు శ్రుతిమించి రాగాన పడుతూఉంది. తొండముదిరి ఊసరవెల్లిగా మారినట్లు నేనేం చేయాలి...? నామాట బొత్తిగా వినడం లేదు. చదువు ఆపుచేయించి వివాహంచేస్తే దారికిరావచ్చు. వీడి వ్యవహారం యిప్పటికే చాలామందికి తెలిసింది. చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు తమ పిల్లనిస్తారు? ఏ అమ్మాయి వీడిని చేసుకుంటుంది. చదువు ఆపమంటే అపుతాడో లేదో? అంతా నా ఖర్మ ...! నాతోటి వ్యాపారస్తుల పిల్లలు ఈ పాటికి చదువులు పూర్తిచేసి ఎవరి వ్యవహారాలు వారు చూసుకుంటున్నారు. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ...? ఇంతకూ నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో నన్ను ఈ జన్మలో పట్టి బాధిస్తూ ఉంది. శారద! ఆ అమ్మాయికి నిలువ నీడలేదు. చదువుల సరస్వతి. ఆ అమ్మాయి అలా దొంగతనం చేసిందంటే నమ్మ శక్యంకాకుండా ఉంది. బహుశా యిది ప్రభాకరం పన్నాగమే ఐ ఉంటుంది. ఏమో ...? ఆ అమ్మాయే చేసిందో ఏమో...? కనీసం ఒక్క మాటైనా తాను నిర్దోషినని చెప్పుకోలేదు. పైగా తెల్లవారేసారికీ మాయమైంది. ఏమని నిర్ణయించుకోను? తను ఏ నేరమూ చేయకపోతే అలా వెళ్ళి పోవలసిన అవసరమేముంది? ఇక్కడే ఉండి తను నిర్దోషి నని నిరూపించుకోవచ్చు గద! ఒకవేళ ఆ అమ్మాయి నిర్దోషిఅవుతే దోషి ఎవరు? ప్రభాకరమా....? అదెలా సాధ్యం? ప్రభాకరం యిటువంటి నీచమైనపని చేస్తాడా. వాడిని చిన్నప్పటినుండీ చూస్తున్నాను. ఎంత దుడుకువాడైనా దొంగబుద్ది మాత్రం లేదు. నిస్సందేహంగా ఆ అమ్మాయే చేసి ఉంటుంది. దొంగతనం బయటపడేసరికి ముఖంచెల్లక యింట్లో నుండి వెళ్ళిపోయింది. ఏమిటో ...? రామా కృష్ణా అంటూ కాలం వెల్లబుచ్చవలసిన ఈ రోజులలో నాకు ప్రభాకరం ఒక సమస్యగా తయారయ్యాడు. వాడు ఎలా బాగుపడతాడో ఏమో?
    అన్నపూరమ్మగారు తమ వంటింటి పనులు పూర్తిచేసుకొని హాలులోకి వచ్చారు. ఆ అలికిడికి శ్రీపతిగారు ఆలోచనలనుండి తేరుకొని బాహ్య ప్రపంచంలో పడ్డారు. శారద వెళ్ళిపోయి నప్పటినుండి అన్న పూర్ణమ్మగారికి పనిలో వెసులుబాటు కావడంలేదు. పైగా ప్రభాకరం అలా ప్రవర్తిస్తున్నాడని శ్రీపతిగారికన్న అన్నపూర్ణమ్మగారే ఎక్కువ కుమిలిపోతున్నారు.
    'ఏమండీ...! ఇలా అవుతే ఎలా? వాడు ప్రొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు. అక్కడ ఏం తిన్నాడో? వచ్చిన వాడు భోంచేసి పడుకుంటే నాకు బాధ ఉండేదికాదు!' ఆ కన్నతల్లి ప్రాణం తల్లడిల్లింది.
    'చూడు....మన వాడిని కన్నాంగాని వాడిరాతను కనలేదు గదా! భారమంతా ఆ భగవంతుడిమీదవేసి వాడిలో మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడడం తప్ప మనం చేయదలిగేదేముంది?'
    'ఏమోనండీ...వాడు కుదురుగా ఉండి, కోడలితో యిల్లు కళకళలాడే అదృశ్యాన్ని నా కొనప్రాణాలతోనైనా చూస్తానో లేదో? అనుమానంగా ఉంది' అని కంట తడి పెట్టాడు అన్నపూర్ణమ్మగారు, రోలు వెళ్ళి మద్దెలతో మొరబెట్టుకున్నట్టు శ్రీపతిగారు తమ బాధను బయటపెట్టకుండా అన్నపూర్ణమ్మగారిని వోదార్చలేక నిలువునా కృంగిపోయారు వీరిద్దరి మనస్తాపానికి కారకుడైన ప్రభాకరం మేడమీది గదిలో ఒళ్ళు మరచి నిద్రపోతున్నాడు.

                             *    *    *

    ఉదయం పెందలకడనే లేచి స్నానం పూజ ముగించారు శ్రీపతిగారు. హాల్లో కూర్చొని ఆనాటి పేపరు చూస్తున్నారు. ఇంతలో గుమ్మంలో ఏదో అలికిడై పేపరు చూస్తున్నవారల్లా తమ దృష్టిని అటు మళ్ళించారు. ఆ వచ్చినవారిని చూసి, సంతోషంతో లేచి, లోపలికి ఆహ్వానించారు. ఆ వచ్చినది సుందరరామయ్యగారు, ఆయన కూతురు. కూతురిని ఇదే మొదటి సారిగా తీసుకువచ్చాడు. వారు అన్న పూర్ణమ్మగారి అన్న. ఆయనకు ఒక్కతే కూతురు, కూతురికి ఐదవ ఏడు నడుస్తూ ఉండగా వారి భార్య అకస్మాత్తుగా హృద్రోగంవల్ల మరణించింది. ఆమె హఠాత్తుగా మరణించడంతో సుందర రామయ్యగారు ఎంతగానో కృంగిపోయాడు. ఎంతో మానసికవ్యధ ననుభవించారు. ఎంతమంది ఎన్నివిధాల నచ్చజెప్పినా ద్వితీయానికి మాత్రం ఒప్పుకోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS