'ఎంత విషాదగాధే నీది...? ఒక చిన్నసందేహం! అప్పుడెప్పుడో జరిగిన సంభాషణలనన్నీ పొల్లుపోకుండా అంత జాగ్రత్తగా చెప్పుకు వచ్చావు. అవన్నీ నీకెలా గుర్తున్నాయే...? నీ జ్ఞాపకశక్తిని మెచ్చుకోవాలి. సరే...! జరిగిందేదో జరిగింది. ఇకముందు నీవేమీ బాధపడకు. ఎక్స్ కర్షనుకు వెళ్ళివచ్చిన తర్వాత మనమిద్ధరమూ మా ఊరు వెడదాం. అక్కడ మా బావ నీ కరుణామయగాధనంతా విని తప్పక సాయం చేస్తాడు.'
'శాంతా! నా జీవితంలో జరిగిన సంఘటనలన్ని ఎంతో విషాదకరామైనవి. వాటిని మరచి పోలేక పోతున్నాను. పేదరాలిగా పుట్టించిన ఆ భగవంతుడు నన్ను అభిమానవతిగా రూపొందించకపోతే ఎంతో బాగుండేది మాట పడలేను పడిన మాట మరిచిపోలేను. ఎప్పుడూ జరిగిన సంఘటనలకు బాధ పడుతూ ఉంటాను. ఎక్స్ కర్షన్ కు, ఆ తర్వాత మీ ఊరికి రావడానికి నా కెందుకో భయం ఉందే...!'
'ఎందుకే భయం...? అన్నీ నే చక్కబరుస్తాగా! మరొక్క సందేహం! ప్రభాకరమే దొంగతనం చేశాడని నీవు తేలికగా ఋజువు చేయగల అవకాశాలున్నా ఆ భారాన్ని నీ నెత్తిన ఎందుకు వేసుకున్నావు?'
'అవన్నీ నాకు తెలియక కాదు శాంతా...! అప్పటికే అతని ప్రవర్తనకు బాధపడుతూన్న ఆ దంపతులను మరీ మనిషి సాయంతో కృంగతీయించబుద్ది పుట్టక ఆ నేరాన్ని నా నెత్తిన వేసుకున్నాను. ఆ పుణ్యదంపతులు ఏమాత్రం బాధపడినా నా మనసు వికలావికలమై పోతుంది. దొంగ అనే మచ్చ రాకూడదని యిలా చేశారు. నేను ఆ యింటినుండి మౌనంగా బయట పడడంలో నాపై మోపబడిన అ నేరం ఇంకా బలపడుతూందని నాకు తెలుసు. అయినా వారికింక నా ముఖం చూపించడం యిష్టంలేక, కనీసం వారివద్ద చివరిసారి శెలవు తీసుకోకుండానే యింటి నుండి వచ్చేశాను అంతకాలం వారింట్లో ఉండి, వారి ఉప్పుతింటూ ఆ విధంగా రావడం నాది పొరపాటే! అయినా గత్యంతరంలేక అలా చేయవలసి వచ్చింది. తర్వాత మనసులో ఎంతో బాధ పడ్డాను.'
'సరే! ఇక పడుకుందాం...! చాలా ప్రొద్దుపోయింది.....ఓ....మైగాడ్.....నాలుగు దాటింది.' అని తన చేతిగడియారాన్ని చూసుకుంటూ బెడ్ మీద పడుకుంది శాంత. శారదకూడా అలసటతో నిట్టూరుస్తూ నిద్ర కుపక్రమించింది.
* * *
అది శ్రీపతిగారి ద్రాక్షతోట. హైద్రాబాద్ నగరానికి ఐదుమైళ్ళ దూరంలో ఉంది. ఒకరోజు ప్రభాకరం తన స్నేహితులతో ఆ తోటకు వెళ్ళాడు. వారి రాకతో ఆ తోట కళకళలాడుతూ సందడిగా ఉంది. రిజల్స్టు వచ్చాయి. గత సంవత్సరం అన్ని సబ్జక్ట్సులో తప్పిన ప్రభాకరం ఈ సంవత్సరం థర్డ్ క్లాసులో ప్యాసయ్యాడు. అందుకు కారణం పరోక్షంగా శారద శారద ఎంతో ఘనంగా రాష్ట్రానికంతటికి ప్రధమురాలిగా ప్యాసవడం ప్రభాకరానికి చురకలాగా తగిలి అతనిలో మంచి ప్రోత్సాహాన్ని కలిగించింది. కులాసా కాలక్షేపాలు మానకున్నా రోజుకు గంటా రెండు గంటలు చదువుమీద శ్రద్ధ చూపుతున్నాడు, కనుక రెండుసార్లే ప్యాసు కాగలిగాడు. ఆ విషయం అతనిలో ఎంతో ఉత్సాహన్ని రేకెత్తించింది. తండ్రిని ఒప్పించి డబ్బు తీసుకొని తమ ద్రాక్షతోటలో పిక్నిక్ ఏర్పాటు చేయించాడు. తన కారులో కొందరు, మరొక స్నేహితుని కారులో కొందరు ఉదయం ఏడు గంటలవరకే తోట చేరుకున్నారు.
ప్రభాకరం గర్ల్ ఫ్రండ్ మిస్ రోజా. ప్రభాకరం స్నేహితులంతా విచ్చలవిడిగా ప్రవర్తించేవారే! సిగ్గు, పవిత్రత, వినయ విధేయతలు మొదలైన వాటి విలువలు తెలియనివారు. పాశ్చాత్య నాగరికత పూర్తిగా జీర్ణించుకోలేక, ఇటు భారతీయ సాంప్రదాయాలను పాటించడం ఏమాత్రం యిష్టం లేక రెంటికీ చెడ్డ రేవళ్ళలా త్రిశంకు స్వర్గంలో వ్రేళ్ళాడుతుంటాడు.
వారి వేషధారణ, ప్రవర్తన ఎంతో అసహ్యంగా ఉంది. మనం జన్మించినగడ్డ ఎటువంటిది? మన సంస్కృతి సభ్యతలు ఎలాంటివి ...? అనే విషయాన్ని ఆలోచించకుండా వారు ఎంతో ఉన్నతస్థాయి నుండి అధః పాతాళానికి దిగజారి పోతున్నారు.
ఉదయం ఎనిమిదన్నరవరకు అంతా ఫలహారాలు చేశారు. కొద్ధిసేపు సమిష్టిగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆడ, మగ జంటలుగా విడిపోయి కబుర్లలో పడ్డారు.
ఇది మన సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. వయసులో ఉన్నవారు, ఎటువంటి రక్త సంబంధం లేనివారు, అవివాహితులైన స్త్రీపురుషు లిద్దరు కలిసి ఏడడుగులు వేస్తే వారు జీవిత భాగస్వాము లౌతారని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటువంటి పవిత్రదేశంలో జన్మించినవారు ఇటువంటి నీచకార్యాలు చేయడానికి ఎందుకు బిడియంపడడం లేదో, ఎవరికీ అర్ధంకాని ఎవరూ మార్పు తీసుకురాలేని గడ్డుసమస్యగా తయారైంది. నేటి నాగరికత విష వాతావరణాన్ని సృష్టించుకొని దానికి నవ్య నాగరికత అనే ముసుగును చాటుచేసుకొని యిటువంటి అప్రాచ్యపు పనులు చేయడం పరిపాటైంది. నాగరికత....! ఎవరి నాగరికతలు వారిని. మన భారతీయ నాగరికతకు ఏ యితర దేశస్తులైనా పాటిస్తున్నారా? పాటించడం లేదు ఆటువంటప్పుడు మన నాగరికతను మరిచిపోయి పాశ్చాత్య నాగరిక తను పాటించడంలో అర్ధమేమిటి? ధ్యేయ మేమిటి? అర్ధం, ధ్యేయం లేకుండా మనం గుడ్డిగా అనుసరిస్తూన్న ఆ నాగరికతకు తుది ఎప్పుడో?
జట్లు జట్లుగా విడిపోయిన ఆ జంటలు తమకు తోచిన కులాసా కాలక్షేపాలలో మునిగి తేలుతున్నారు. కొందరు కేరమ్సు ఆడుతున్నారు. మరికొందరు రింగ్ ను ఒకరిచేతినుండి మరొకరికి విసురు తున్నారు. వేరే కొందరు జట్లుగాచేరి రాక్ అండ్ రోల్ నృత్యం ప్రారంభించారు. ఒకటే గోల. ఒకరిమాటలు మరొకరికి వినిపించడం లేదు. ఒకరిమీద వేరొకరు పడుతూ, ఒకరినవ్వులో మరొకరు అకారణంగా పాలు పంచుకుంటూ అర్ధంలేని కబుర్లు చెప్పుకుంటూ అసభ్యతతో ప్రవర్తిస్తున్నారు.
మెల్లిగా రోజా ప్రభాకరం లు ఆ నృత్యంలో పాల్గొన్నారు. కుప్పిగంతులు వేస్తూ, అర్ధంలేని పాటలతో గొంతు చించుకుంటూ అంతా ఒకగంట నృత్యం చేశారు. అలసిపోయారు. పదకొండైంది. అది ఎంతకాలం వీరి చేష్టలకు చిటపట లాడుతూ, యివన్నీ చూడలేక మబ్బులను చాటుచేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు రవి. ఎక్కడా మేఘాలు కనుపించకపోవడంతో ఎటో తోచక మండిపడుతున్నాడు. అందరికీ ఒళ్లంతా చెమటలు కారిపోయాయి. రొప్పుతూ, రోజుతూ, టవల్సుతో చెమటలు తుడుచుకుంటూ తోటలో ఉన్న చిన్న బంగళాలోకి చేరారు వారంతా. వారు ధరించిన ఆ దుస్తులు వారినే చీకాకు పరుస్తున్నాయి.
మిత్రులంతా విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత భోజనం ఏర్పాట్లు జరిగాయి. టేబులు మీల్సు. స్పూన్సు, ఫోర్క్సు, నైవ్స్, తినే వస్తువులు తక్కువ, ప్రక్కన ఉండే ఆడంబరాలు ఎక్కువ. నాగరికత పేరుతో అర్ధాకలితో లేవడం. ఇన్ని యిబ్బందులున్న ఆ ఆచారాలను పాటించకపోతే ఏం?
సందడితో భోజనాలు ముగించారు. ఒకటే కబుర్లు ఎక్కడెక్కడ జరిగే వ్యవహారాలన్నీ భోజనాలవద్దే చర్చకు వస్తాయి. భోజనం చేసేటప్పుడు మనం భుజించే ఆ ఆహారాన్ని ప్రకృతి ద్వారామనకు లభింపజేస్తున్న ఆ సర్వేశ్వరార్ప ణంగావించి ఆ అర్పణ తర్వాత భుజించడం హిందువులమైన మన ఆచారం. తీసుకునే ఆహారం ఒంటబట్టాలంటే మౌనాన్ని పాటించడం చాలా అవసరం. కాని అవన్నీ పాత ఆచారాలుగా, పనికిరాని అనాగరికపు పాత అలవాట్లుగా నేటి యువకులకు తోస్తున్నాయి.
భోజనాల తర్వాత అంతా రెండు మూడుగంటలు ఒళ్ళు మరిచి నిద్రపోయారు. షుమారు నాలుగింటికి మెల్లిగా ఒక్క రొక్కరు మేల్కున్నారు. రోజా ప్రభాకరంలు మిగతావారి నందరినీ వదిలి చాలాదూరం వెళ్ళారు. ఆ ద్రాక్షతోట చాలా పెద్దది. కొంత భాగంలో పూల మొక్కలు, వేరే పండ్లచెట్లు వేయించారు శ్రీపతి గారు. ఎవరికీ కనుపించకుండా ఒక పూల పొద చాటుగా విశ్రాంతిగా కూర్చున్నారు యిద్దరూ. తన వెంట వైటుహార్సు బ్రాందీ యితర రకాల డ్రింక్సూ తెచ్చింది రోజా. తను త్రాగింది. వాటిని ప్రభాకరానికి చూపిస్తూ 'డియర్! నీవు కూడా త్రాగు. ఎంతో మజాగా ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఊహాలోకాలలో హాయిగా విహరించవచ్చు. వోహ్! ఆ ఆనందాన్ని అనుభవించాలేగాని మాటలతో ఎంతని చెప్పగలను...?' అంది.
'వద్దు రోజా...! నా కలవాటు లేదు.'
'డియర్...మనం చేస్తున్నవన్నీ ఒకప్పుడు మనకలవాటు లేనివే...! ఏ వయసు కవి, ఏ సందర్భాన్ని కవి అలవరచుకోవడం బుద్ధిమంతుల లక్షణం. డియర్...! నీ వింకా పసివాడివి కాదు పాలు త్రాగడానికి ఈ వయసులో యిలాంటిదే త్రాగాలి. జీవిత మాధుర్యాన్ని చవిచూచి తరించాలి. ఈ తరుణం దాటిపోతే ఆ తర్వాత మనం చేయగలిగిందేమీ ఉండదు. ఇప్పుడున్న ఈ ఉత్సాహం అంతకన్నా ఉండదు. ఉమర్ ఖయ్యాం శిష్యుడవుగా నీవు యింకెప్పుడు మారుతావ్ ....? మధువు.....మగువ.... ఈ రెండూ జీవితాదర్శాలుగా ఉండేవి ఆ మహాపురుషుడికి?' అంటూ బ్రాందీ కలిపిన కూల్ డ్రింకు ప్రభాకరం నోటికి అందించబోయింది.
'ప్లీజ్....వద్దు. ఆ వాసనకే నా వళ్ళంతా జలదరిస్తూ ఉంది. నేను భరించలేను. ప్లీజ్....ప్లీజ్ వద్దు. దయచేసి ఈ విషయంలో మాత్రం బలవంతం చేయకు,' జాలిగా రోజా కళ్ళల్లోకి చూస్తూ ప్రాధేయపడుతూ అన్నాడు ప్రభాకరం.
'వోస్...! ఇంతేనా ప్రభాకర్....నా కోరికలన్నీ చెల్లిస్తానని మాటిచ్చావ్! ఇంత చిన్న కోరికకు వెనుకకు పోతున్నవ్...! నీ మాట లన్నీ నీళ్ళ మీది వ్రాతల్లా ఉన్నాయి. ఇక నిన్ను జీవితాంతం నమ్మేదెలా?' మూతి బిగించి, చిరుకోపం ప్రదర్శిస్తూ ముఖం వేరే ప్రక్కకు త్రిప్పుకొని కూర్చుంది.
బ్రాందీ తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది రోజాలో. కైపెక్కి ఎర్రబడిన కళ్ళు, కోపంతో రాగరంజితమై తాజా కమలా ఫలాల్లా మెరిసిపోతున్న ఆ బుగ్గలు, కమలాఫలాల తొనలను గుర్తుకు తెస్తున్న ఆ పెదిమలు ప్రభాకరంలో ఉద్రేకాన్ని ఉత్సాహాన్ని రెచ్చగొట్టాయి. గత్యంతరం లేక 'డియర్...! నీవలా అలిగితే నేను భరించగలనా? సరే! అలాగే కానివ్వు. నీ యిష్టప్రకారమే సేవిస్తాను' అని రోజాను సంతోషపరుస్తూ తనవైపుకు త్రిప్పుకున్నాడు.
