Previous Page Next Page 
రామ్ శాస్త్రి పేజి 9


                                  10
    "ఘర్దానీ ! ...ఘర్దానీ!...."
    పేష్వా రాజభవనం లో శ్యామా వెర్రిగా పరిగెత్తుతూ ఆవేదనతో కూడిన కంఠస్వరంతో చంపాజీ ని పిలుస్తోంది. ఆమె దేహమంతా వణికి పోతోంది.
    శ్యామా అరుపులు విన్న ఇతర రాజభవన సేవకుల ఆశ్చర్యానికి అంతులేదు. ఎంతో అణకువగా, మర్యాదగా నడుచుకునే ఆమెని చూస్తె వారందరికీ ఎంతో గౌరవ భావం ఉండేది. అటువంటి శ్యామా ఇప్పుడు మొగవారి మధ్య ఇలా భర్త కోసం అరుస్తూ పరిగెత్తుతోందంటే వారికి నమ్మ శక్యం కాకుండా ఉంది. కాని శ్యామా మాత్రం వీరేవేవరిని గమనించే స్థితిలో లేదు.
    "ఘర్దానీ! ఘర్దానీ!" అని అరిచే శ్యామా కంఠం రుద్దమయి పోయింది. కాళ్ళు తడబడ్తున్నాయి. కన్నీరు ధారలుగా ప్రవహిస్తోంది. ఎలాగో తన అన్వేషణ కొనసాగించింది. చివరికి చంఫాజీ ఉన్న ప్రదేశానికి చేరుకుంది. అతను కోట బురుజులలో ఒకదాని వద్ద నుంచుని ఉన్నాడు. చంఫాజీ వాలకం కూడా సంతోషంగా లేదు. లోపలి కలవరపాటు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతకి ముందే అతనొక పుకారు విన్నాడు. అది విన్నప్పటి నుంచీ అతని మనస్సు మనస్సు లో లేదు. ఆ పుకారులో నిజమేమయినా ఉంటె ఏవిధంగా నడుచుకోవాలో పేష్వా సంరక్షక దళం వారితో చెప్తున్నాడు.
    "ఘర్దానీ౧ అయ్యో ఘర్దానీ వాళ్ళోచ్చేస్తున్నారు. ఆ రాక్షసులు....' శ్యామా ఇక చెప్పలేకపోయింది. ఆయాసపడుతూ వారిని బురుజు పై భాగానికి తీసుకు వెళ్ళింది. వణుకుతున్న తర్జని తో ఆకాశం లో దూరంగా చెలరేగుతున్న దుమ్ము వంక చూపించింది.
    "మన అనుమానాలు నిజమయ్యాయి!' చంపాజీ గొంతుక కూడా వణికింది. "ఆ జంతువులూ ఇక్కడికే వస్తున్నాయి! ఆ కసాయి వారి ఉద్దేశం ఇప్పుడు బాగా బయట పడిపోయింది! వారంతా ఘర్దీలే!" (ఘర్దీలే అంటే పేష్వా సైనిక దళం లోని కాలి బంట్లు.)
    "శ్యామా, మన ప్రభువు పట్ల మన విశ్వాసం రుజువు చేసుకునే రోజు ఇదే! మన సర్వస్వం అర్పించి మన యజమానినీ యజమానురాలినీ రక్షించు కోవాలి! నా సంగతంటావా మన పేష్వా నారాయణ్ రావ్ సాహెబ్ వారి అడుగు పడే చోటే నా తల పడుతుంది! నువ్వెటువంటి దానివో నాకు తెలుసు! గంగాబాయి సాహెబ్ వారిని కాపాడే బాధ్యత నీది..." చంఫాజీ మాటలు శ్యామాకి కొత్త బలం తెచ్చాయి. ప్రేమ పూర్వకంగా అతనికి నమస్కరించి కన్నీరు తుడుచుకుని అంతః పురం వైపు పరుగెత్తింది.
    చంఫాజీ క్షణం ఆలస్యం చెయ్యకుండా రాజభవన ద్వారం వద్దకి పరిగెత్తి అక్కడి కాపలా వారితో తలుపు ముయ్యమని చెప్పాడు. కొందరిని వాటిని కాపలా కాస్తూ ఉండమని చెప్పి రాజమందిరం లోపలికి పరిగెత్తాడు. ఒక్కొక్క గది కీ వెళ్లి రాజసేవకులందరినీ హెచ్చరించాడు. వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు. తను ప్రాణాలనయినా ధారపోసి తమ ప్రభువుని కాపాడాలన్నారు.
    "నర్భా ఫటక్! నువ్వు నాతొ రా! తక్షణం పేష్వా వారి శయన మందిరానికి పోదాం!" అని రక్షక దళం లో కెళ్ళా వీరుడిని పేరు పొందిన ఫటక్ ని తన వెంట తీసుకు వెళ్ళాడు.
    "నర్భా! మన పేష్వా వారికి ఈ సంగతేమీ తెలీదు! వారు భోజనం చేసి నిద్ర పోతున్నారు....రఘోబా వారు సింహాసనం మీద కన్ను వేసిన సంగతి నీకు తెలుసు. వారి భార్య ఆయన్ని మించింది.... ఇద్దరూ తులాజీ ని కొందరు ఘర్దీలతో ఒక్కడికి పంపుతున్నారు. ఏదో ఘోరమైన కుతంత్రం పన్ని ఉంటారు.....' దారిలో చంపాజీ పరిస్థితిని వివరించాడు.
    "అవును. ఇదంతా కొన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్నదే గా చంఫాజీ! నువ్వు చెప్పినట్లే మేమూ మేలుకునే ఉన్నాము కదా!"
    "మీ విశ్వాసం నాకు తెలియదా! అయినా మరొక విషయం చెప్తాను విను....గంగా భాయి సాహెబ్ వారు త్వరలో తల్లి కాబోతున్నారు కదా? ఆ అడ్డు కూడా తీసి పారేయ్యాలని ఆ రాక్షసుల పన్నాగం! సింహాసనానికి మన ప్రభువుల సంతతి మిగల కూడదని వాళ్ళను కుంటున్నారు..."
    "ఈ అనుమానాలన్నీ మన పీష్వా వారికి మనమెలా చెప్పగలం చంఫాజీ?" కొన్ని రోజులుగా వారందరినీ బాధించిన ప్రశ్ననే ఫటక్ వేశాడు.
    చంఫాజీ సమాధానం ఇవ్వలేక తన వేగాన్ని మరి కొంత అధికం చేశాడు.
    "ఘర్దీలు వచ్చేశారు!"
    "రాజభవనాన్ని చుట్టేస్తున్నారు!"
    అంతః పురం అప్పటికే ఈ కేకలతో ప్రతిధ్వనించింది.
    "సిద్దంగా ఉండండి ! లోపలికి వచ్చిన ఘర్దీ తల కొట్టేయ్యండి!"
    "మరాఠా వీరులంతా సిద్దంగా ఉండండి!"
    రాజభవన ద్వారం వద్ద పై నినాదాలు వినిపించాయి. ఇంచుమించు ఒక వందమంది భటులు అక్కడ పోగయ్యారు. అందరూ యుద్దానికి సిద్దంగా ఉన్నారు. స్త్రీలు కూడా కొందరు కత్తులు చేత పట్టుకుని అక్కడికి వచ్చారు.
    ఇంతలో శ్యామా గంగా భాయి ని అంతః పురంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక అంతర్ భౌమ మందిరం లోకి తీసుకు వెళ్లి ఆమెకి సాయుధ రక్షణ కూడా ఏర్పాటు చేసింది. తనూ కొందరు పరిచారికలతో అంతః పుర ద్వారం మెట్ల వద్ద కత్తులుపట్టుకుని నుంచుంది.
    దూరంగా సైనికుల అరుపులతో బాటు ఆయుధాల తుముల ధ్వనులు వినిపించాయి.
    "చంఫాజీ ఉండగా మనకేమీ భయం లేదు!" అన్నది శ్యామా పక్కనే నుంచున్న ఒక అమ్మాయి.
    "ఈ ఘర్దీలు తోక ముడిచి పారిపోతారు చూస్తూ ఉండండి ,' అన్నది కత్తి పట్టుకున్న మరొక యువతి. అంటూ ఉండగానే రాజభవన ద్వారం వద్ద కోలాహలం అధికం అయింది. ఆయుధాల అఘాతాల శబ్దాలతో బాటు గాయాలు తిన్న వారి ఆర్తనాదాలు మిన్ను ముట్టాయి. విజయం ఎదురు చూస్తున్న అంతం పుర స్త్రీ జనం ఆశలు అడియశలే అయ్యాయి.
    తమ అధిక సంఖ్యల వల్ల ద్వారా రక్షకులని వోడించిన ఘర్దీలలో కొందరు అక్కడికి వచ్చారు.
    "భగవంతుడా మా యజమాను రాలిని రక్షించే శక్తిని మాకు ప్రసాదించు!" అంటూ శ్యామా వారి మీదకి వెళ్ళింది. అనుకోకుండా ఆడవారితో యుద్ధం చెయ్యవలసి వచ్చినందుకు ఘర్దీలు ముందు కొంచెం వెనక్కి తగ్గారు. శ్యామా వారిలో ఒకరిని గాయపరిచింది కూడా. కాని వారు త్వరలోనే కోలుకుని ఆమెని నిరాయుధురా;లిని చేశారు. ఘర్దీలలో ఒకడు శ్యామాని అవతలగా తోసి వేశాడు. ఆ తోపుకి ఆమె నేల కూలి తల మీద దెబ్బ తగలటంతో స్పృహ కోల్పోయింది. తమ నాయకురాలి దుస్థితిని చూసిన ఇతర పరిచారికలు రోషంతో పోట్లాడినా ఘర్దీల ధాటికి తట్టుకోలేక పోయారు. కొందరు ఆ హన్కతుల ఖద్గాలకి బలి అయ్యారు.
    "గంగాభాయి ని పట్టుకు రమ్మన్నాడు తులాజీ, రండి! " అంటూ ఘర్దీ నాయకుడు ఒకడు అంతః పురంలోనికి చొచ్చాడు. అయితే, ఎంత వెతికినా ఆమె వారికి కనిపించలేదు.
    ఇంతలో "జయ్ రఘో! జయ్ రఘో" అన్న నినాదాలు దూరంగా వినిపించాయి. వాటిని విన్న ఈ ఘర్దీ నాయకుడు క్రూరంగా నవ్వాడు.
    "మనవాళ్ళు తమ పని ముగించారన్న మాట! రండి పోదాము....నారాయణరావు రక్తాన్ని మన కళ్ళతో చూద్దాము. " అంటూ వెళ్ళిపోయాడు.
    పేష్వా నారాయణ్ హత్య వార్తా రాజభవనం అంతా పాకిపోయింది. అక్కడి వారి శోకాలు ఘర్దీల విజయ నినాదాలతో మునిగి పోయాయి.
    అప్పుడే స్పృహ వస్తున్న శ్యామా కి సయితం, ఈ కోలాహలం యొక్క అర్ధం తెలిసిపోయింది. ఆ ఘోష ఒక సునిశిత దీర్ఘ ఖడ్గంగా మారి తన గుండెల్లో కి దిగి పోయినట్లయింది. పేష్వా నారాయణ రావ్ మరణించి నప్పుడు తన చంఫాజీ ప్రాణాలతో ఉంటాడా. అన్న భయంకరమయిన అనుమానం ఆమెని ఆవరించింది. వేటగాడి దెబ్బ తగిలిన కపోతం లాగ వణికిపోతూ నారాయణ రావ్ మందిరం వైపుకి పరిగెత్తింది. దారిలో ఎక్కడ చూసినా మృత కళేబరాలు కనిపించాయి. నారాయణ రావ్ పడక గదిలో ఆమెకి ఒక భయంకర దృశ్యం ఎదురయింది. ఘర్దీ, రక్షక భటుల శవాల మధ్య చంఫాజీ, పేష్వా నారాయణ్ రావ్ దేహాలు కూడా కనిపించాయి. శ్యామా ఒక్క కేక వేసి తమ ప్రభువయిన నారాయణ రావ్ కాళ్ళ వద్ద కూలిపోయింది. భక్తీ పూర్వకంగా వాటిని స్పృశించి చంఫాజీ దేహం పక్కనే మోకరిల్లి అతన్ని చేతుల్లోకి తీసుకుంది. అదే సమయంలో చంపాజీ కళ్ళు తెరిచాడు. "ఘర్దానీ!" అంటూ శ్యామా అతన్ని తన గుండెలకి హత్తుకుంది. మళ్ళీ అతన్ని నెమ్మదిగా నేల మీద పడుకో పెట్టి , పక్కనే ఉన్న జలపాత్రం తెచ్చి అతని ముఖం మీద నీరు చల్లింది.
    "తల్లీ జగదాంబా! నానోసటి కుంకుమని చెరిపి వెయ్యకు! నాకీ వరం ప్రసాదించు ....' అంటూ మనస్సు లోనే ప్రార్ధించు కుంటూ అతని ముఖాన్ని మృదువుగా తుడిచి జలపాత్ర నోటికి అందించింది.
    "శ్యా....మా ...శ్యామా" అస్పష్టంగా , బలహీనంగా వెలువడ్డాయి చంఫాజీ ఈ మాటలు.
    "ఘర్దానీ!' శ్యామాకి ఏడుపు ఆగలేదు.
    "శ్యామా....ఏడవకు ...చెప్పేది విను....నేను చెప్పినట్టు చెయ్యి. " అని ఆయాస పడుతూ ఆగిపోయాడు చంఫాజీ.
    "ఘర్దానీ!ఘర్దానీ.....నువ్వు చెప్పినట్లు నేనేప్పుడు చెయ్యలేదు! నీ అజ్ఞాని నేనెప్పుడు కాదన్నాను?" శ్యామా వెక్కిళ్ళ మధ్య అడిగింది.
    "శ్యామా! మన పేష్వా వారిని చంపింది సుమేర్ సింగ్, ఖరగ్ సింగ్ లు...నాకు ...నాకు బలమయిన గాయాలు తగలడంతో నేను చచ్చి పోయాననుకుని వాళ్ళు ఈ గదిలోనే తమ రహస్యాలు గట్టిగా మాట్లాడుకున్నారు. "చంఫాజీ కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. "వాళ్లతో జోహార్ సింగ అనే వాడొకడు కూడా వచ్చాడు... అవిటి కాలివాడు.... పచ్చ తలపాగా చుట్టుకున్నాడు. రఘోబా హత్య చెయ్యమని రాసి ఇచ్చిన అజ్ఞా పత్రం వాళ్ళ దగ్గిరే ఉంది! ఆ రాక్షసుడి దుష్టబుద్ది తెలిసిన వాళ్ళు.... అతను  మళ్ళీ ఏమి ద్రోహం చేస్తాడో అని జోహార్ సింగ్ కి దాన్ని ఇచ్చి దాచమన్నాడు. చివరికి రఘోబా ఈ హత్యలో తనకి సంబంధం లేదని రుజువు చెయ్యటానికి దాన్ని చేజిక్కించు కుంటే వాళ్ళ గతి ఏమి కావాలి?...."
    ఇంతసేపు మాట్లాడటం తో చంఫాజీ కి బాగా ఆయాసం వచ్చింది. శ్యామా మృదువుగా అతని ముఖం తుడిచి మరికొన్ని చుక్కల నీరు తాగించింది.
    "ఈ రాత్రి ఎవరూ రాజభవనం లోకి రావటానికి వీల్లెదుట. వదలటానికే వీల్లెదుట! ఇదీ ఘర్దీ నాయకుని ఉత్తరువు...కాని' 'అనందీ - రఘో " అన్న రహస్య పడాలని అన్న వారిని మాత్రం వదులుతారుట! జోహార్ సింగ్ వీటిని వాడి బయట పడ్తాడు..."
    "ఘర్దానీ ఇక మాట్లాడక.....ఆయాసం వస్తోంది." అని శ్యామా అతన్ని వారించ పోయింది.
    "శ్యామా , నే చెప్పేది విను! ఇది నా చివరి అజ్ఞా అనుకో....!"
    "ఘర్దానీ అంతమాట అనకు! నేనింకా నీ ఆజ్ఞలు ఎన్నో తీసుకుంటాను! నా కుంకుమ చెరిగిపోకుండా చూడమని జగదాంబ కి మొక్కుకున్నాను. ఆ తల్లి నా మొర ఆలకించి తీరుతుంది. నేనీ లోకాన్ని పునీ స్త్రీగా నే వదిలి వెళ్ళిపోతాను."
    చంఫాజీ ముఖంలో చిరునవ్వు సన్నగా మెరిసి మాయమయిపోయింది. "శ్యామా, నీ కుంకుమ కన్నా ఎన్నో లక్షల రెట్లు పవిత్రమయినది మన మరాఠా సామ్రాజ్య సింహాసనం ప్రతిష్ట ! దానిని నిలబెట్ట గలిగిన దానిని నీవకర్తేవే..."
    శ్యామా మాట్లాడలేక అతన్ని మరింత దగ్గరగా హత్తుకుంది.
    "శ్యామా , నే చెప్పేది జాగ్రత్తగా విను! నేచేప్పిన మాటల సహాయంతో రాజభవనం బయటపడు.... ఆ జోహార్ సింగ్ వెంటే రహస్యంగా వెళ్లి ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకుని రామ్ శాస్త్రి గారితో చెప్పు....జరిగినదంతా వారికి చెప్పు....!"
    "ఘర్దానీ! నిన్నిలా వదిలి వెళ్ళ మనకు! ఈ స్థితిలో నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగలను!" అన్నది శ్యామా గద్గదంగా "నాతోటి పరిచారికల సాయంతో నిన్నిక్కడ నుంచి తీసుకు వెళ్ళిపోతాను" నిన్ను రక్షించు కుంటాను!...."
    చంఫాజీ ముఖంలో ఆవేశ రేఖలు వెలిశాయి. "దేవుడా! నేనెప్పుడూ నా దేశానికి గాని, తోటి మానడికి గాని ద్రోహం చెయ్యలేదు! నా మొర ఆలకించి నా భార్య స్వార్ధాన్ని పోగొట్టి స్వామి సేవకి మించిన కర్తవ్యం లేదని ఆమెకి తెలిసేట్లు చెయ్యి! నా ఈ దేహం శాశ్వతమయినది కాదని ఆమెకీ తెలుసు .... తను కనక ఈ సమయంలో , మరాఠా సింహాసనం కోసం, నేను చెప్పిన పనిచేస్తే శాశ్వతమయిన కీర్తీ మిగులుతుంది కదా!"
    చంఫాజీ మాటలు శ్యామా మీద మంత్రం లాగ పని చేశాయి. ఒక క్షణం ఏదో ఆలోచనలో మునిగి పోయింది. వెనువెంటనే చేతుల్లోని భర్తని నేల మీదకి దించి అతని పాదాలకి నమస్కరించింది. కన్నీరు తుడిచి చివరి సారిగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అశ్వశాల వైపు పరుగెత్తింది.

                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS