Previous Page Next Page 
రామ్ శాస్త్రి పేజి 8


                                                         8
    శ్యామా , చంఫాజీ ళ పేర్లని పిలవగానే న్యాయా స్థానాన్ని నిశ్శబ్దం ఆవరించింది. ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత ముఖ వైఖరి , ముద్దాయిలుగా నుంచున్న జంట సాహస గదా చూపరుల మనస్సులకి హత్తుకు పోయాయి. వారి జాలి గాఢ ప్రేక్షకులలో వారి పట్ల సానుభూతి కలిగేట్లు చేసింది.
    న్యాయస్థానం నిర్వాహకుడు ఇలా వాదించటం మొదలు పెట్టాడు. "శ్యామా మోర్ భట్ ఆస్థి లో ఒక భాగం. తన ఇంట్లో దాసీ పిల్లని అమ్మేందుకని మోర్ భట్ శ్యామాని పూనా నగరం లోని బజారు కి తీసుకు వెళ్ళినప్పుడు చంఫాజీ బలవంతంగా ఆమెని ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఆమె కూడా అతనితో పారిపోవటానికి ఇష్టపదినట్లు స్పష్టం అయింది. రెండు రోజుల తర్వాత వారు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంతలో మోర్ భట్ పూనా నగరంలో ఠాణా లో ఫిర్యాదు చెయ్యటం వల్ల రక్షక భటులు వారి కోసం వెతకటం ప్రారంభించారు. వారిద్దరిని ఒక చిన్న గ్రామంలో ఉంటున్నట్లు తెలిసి పట్టుకుని నిర్భందించారు. ఇప్పుడు మోర్ భట్ న్యాయా స్టానాదిపతులని ప్రార్ధించే దేమంటే , తన ఆస్థిల భాగం అయిన శ్యామాని తనకి తిరిగి ఇప్పించవలసినదనీ, దొంగతనం చేసిన చంఫాజీ కి తగిన శిక్ష విధించవలిసినదనీ...... ..........."
    నిర్వాహకుని ప్రసంగం ముగిసిన తర్వాత మోర్ భట్ ని సాక్ష్యానికి పిలిచారు. అతను ప్రధాన  న్యాయమూర్తి కి అతివినయంగా వంగి నమస్కరించి తన ఫిర్యాదు ని సవివరంగా మనవి చేసుకున్నాడు. శ్యామాని తనకి తిరిగి ఇప్పించట మె కాక అతి దుర్మార్గుడయిన చంఫాజీ కి వీలయినంత కఠిన శిక్ష విధించమని కోరుకున్నాడు. చంఫాజీ వంటివారు సంఘానికే శత్రువు లన్నాడు.
    ఆ పైన శ్యామా చంఫాజీ లు తమ కధని చెప్పుకున్నారు, నిర్వహుకుడు వారిని పరీక్షించాడు. విచారణ పూర్తి అయింది-- ఇక ప్రధాన న్యాయమూర్తి తన నిర్ణయం చెప్పటమే తరువాయి. న్యాయస్థానం లోని వారందరి కళ్ళూ రామ్ శాస్త్రి మీదనే ఉన్నాయి. '"ఈ జంట మీద ఎంత జా;లి వున్నా ప్రధాన న్యాయమూర్తి వారికి తగిన శిక్ష వెయ్యకుండా వుంటాడా?' అనుకున్నారు ఎందరో.
    "బానిస పిల్లని తిరిగి మోర్ భట్ కి ఇచ్చేస్తారు కాని ఈ శీలే దార్ పాపం మంచి వాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని తేలిగ్గా వదిలెయ్యాడూ?" అనుకున్నారు కొందరు.
    "సుబేదార్ నే వదిలి పెట్టని వాడు కేవలం ఒక శీలేదార్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడా ?" అని అనుకున్నారు మళ్లీ.
    ---"అవునవును -- ఈ బట్టుని వదిలి పెట్టడు! రాజమాత మాటలే లెక్క చెయ్యడే ఈ రామ్ శాస్త్రి
    --కనీసం ఇరవయిసంవత్సరాల కఠిన శిక్ష తప్పదు!"
    సాధారణంగా విచారణ పూర్తీ అయిన కొంత సేపటి లోనే తన నిర్ణయం చెప్పే రామ్ శాస్త్రి చాలా సేపు మవునంగా ఉండటం ప్రేక్షకుల '' ఆశ్చర్యం కలిగించింది. అతని తీర్పు ఎలా వుంటుందో అని ఎదురుచూసే వారి కుతూహలం బాగా అధికం అయింది.
    "రామ్ శాస్త్రి ఎంత గంభీరంగా ఉన్నాడో పాపం అయన ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు ...." అనిపించింది చూసేవారికి.
    చివరికి రామ్ శాస్త్రి దిగాలు పడిపోయి నుంచుని ఉన్న శ్యామా, చంపాజీ వైపు ఒకసారి చూసి, తర్వాత మోర్ భట్ ని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మోర్ భట్ పండిట్ జీ! మీ ఫిర్యాదు చాలా న్యాయమయినదే -- శ్యామా, చంఫాజీ లు నేరస్థులు కారని ఎవరూ అనలేరు! వారు చట్టాన్ని ఉల్లంఘించిన మాట నిజం. కాని, చంఫాజీ బజారు కి వచ్చింది శ్యామా ని ఎత్తుకు పోవటానికి కాదు కదా? మీరు ఈ బానిస పిల్లని ఒక మ్లేచ్చుడికి అమ్ముతున్నారని తెలిసినప్పుడే సాహసించి ఆమెని తీసుకు వెళ్ళిపోయాడు.
    "అందువల్ల మిమ్మల్ని, వీరి పై జాలి తలచి, మీ ఆరోపణ ని ఉపసంహరించు కొనవలసిందిగా కోరుతున్నాను! చంఫాజీ నిజాయితీ కల వ్యక్తీ. తనకి సాధ్యమయినంత త్వరలో ఈ బానిస పిల్లని విడిపించటానికి కావలసినంత మూల్యాన్ని చెల్లిస్తాడని నమ్మవచ్చు."
    "ఈ సంఘటన అసలు జరగవలసినది కాదు. ఈ దీనుల మీద కరుణించి, వారి జీవితాలని ఆనందమయం చెయ్య గలిగిన శక్తి మీకు ఉన్నది! మోస్టిన్ అనే ఆ మ్లేచ్చుడికి ఈ యువతిని అమ్మటం వల్ల వచ్చే మొహర్ల కన్నా ఎక్కువ ఫలమే లభిస్తుంది.
    "పేష్వా సాహెబ్ వారి ప్రధాన న్యాయమూర్తి గా వీరిని శిక్షించటం నా విధి కాదనలేను! అందుకనే ఈ యువతీ యువకులను కరుణించి సానుభూతితో ప్రవర్తించవలసినదిగా మిమ్ములను కోరు కుంటున్నాను........
    "ఈ యువతి తండ్రి దేశానికి ప్రాణాలు ధార పోసిన వీరుడు! భార్య బిడ్డలని గురించి ఆలోచించకుండా మన మరాఠా సామ్రాజ్య సేవలో వీరమరణం పొందాడు! అనాధ అయిపోయిన ఈ పిల్ల తల్లి పొట్ట గడవటం కోసం కూతురిని అమ్ముకుంది. ఆమె హృదయ క్షోభ మనకేమీ అర్ధం అవుతుంది? దేశం కోసం అశువులు విడిచిన వీరుడికి ఇదా బహుమతి?
    "మోర్ భట్ పండిట్ జీ, బానిసత్వం మానవుడు సృష్టించిన చట్టం ప్రకారం అమలులో వున్నప్పటికీ భగవంతుడి దృష్టి లో అది మహాపాపం అని గ్రహించాలి! దాస్యం మానవ సమాజానికే ద్రోహం ...........మీరు పండితులు . దర్మాధర్మాలని ఎరిగిన వారు. మీ చేతులారా ఎన్నో వివాహాలు జరిపించి వుంటారు. కళ్యాణ మంత్రాలు ఎంత పవిత్ర మయినవో ఆలోచించండి! ఆ పవిత్రమయిన అటువంటి మంత్రాలతో జరిగిన వీరి వివాహ బంధాన్ని తెంపటం బావ్యమేనా?
    మోర్ భట్ పండిట్ జీ! ఈ న్యాయస్థానం పైన మరొక న్యాయ స్థానం ఉందని మీకు మనవి చేస్తున్నాను! మన మందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఆ న్యాయ స్థానంలో విచారణ కి నిలవ వలసిన వారమే! ఆ దివ్య న్యాయ స్థానం పేర ఈ దంపతులని కరుణించవలసినదిగా మరొకసారి ప్రార్ధిస్తున్నాను....."
    రామ్ శాస్త్రి ఉద్ఘాటన విన్న వారందరూ పులకితులయ్యారు. మోర్ భట్ రామ్ శాస్త్రి పాదాలకి వంగి నమస్కరించాడు.
    "ప్రధాన న్యాయమూర్తీ నీ అజ్ఞాని శిరసా వహిస్తున్నాను! ఇదిగో తక్షణం నా ఆరోపణ ని ఉపసంహరించు కుంటున్నాను. అంతేకాదు, ఈ అమ్మాయి శ్యామా కోసం చంఫాజీ నాకు ఏమీ ఇవ్వనక్కర లేదు!' వారిద్దరూ సుఖంగా బ్రతకాలని ఆశీర్వదిస్తూ అలా దీవించమని భగవంతుడి ని ప్రార్ధిస్తున్నాను. "
    -----"రామ్ శాస్త్రి ఈ న్యాయ స్థానాన్ని దేవాలయంగా మార్చేశారు!"
    -----"రామ్ శాస్త్రి న్యాయమూర్తి మాత్రమె కాదు, మనందరికీ గురుతుల్యులు!"
    --"మరాఠా సామ్రాజ్యం నిజంగా రామరాజ్యం అయిపొయింది!"
    సభికుల సంభ్రశ్చర్యలకి అంతులేదు. న్యాయస్థానం రామ్ శాస్త్రి ప్రశంసలతో నిండిపోయింది. ఈ వింతని ఇంతరులకి చెప్పాలని అత్రపడే వారు బయటికి వచ్చేసి అక్కడ వేచి ఉన్నవారికి జరిగిన దంతా చెప్పారు. ఇక ఆ ప్రదేశంలో బయలుదేరిన ఆనంద కోలాహలానికి అంతులేదు.
    "హోషియార్! హోషియార్!" ఇంతలో ఈ అలజడి మీద వినిపించాయి రాజభవన ప్రతిహారుల హెచ్చరికలు. "హోషియార్!' దారినంతా ఆక్రమించిన జనం నిశ్శబ్దం అయిపోయి వారికి దారి కల్పించారు. ప్రతీహారుల వెనుక పెష్వావారి సతీమణి రమాబాయి సాహెబ్ పల్లకీ వచ్చింది. ఆమె దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తోంది. దారిలో సందడిని గమనించి దాని కారణం ఏమిటని తన పరివారం లో వారిని అడిగింది. వారు జరిగినదంతా తెలుసుకుని ఆమెకి విన్నవించారు.
    "రామ్ శాస్త్రి గారినే కదిలించి వెయ్యగలిగిన ఈ జంట ఎవరు? ఏదీ వారిని మా ముందుకి తీసుకు రండి!" అని ఆజ్ఞాపించింది రామాబాయీ సాహెబ్.
    ఇంచుమించు తన వయస్సే కల శ్యామ ముగ్ధ సౌందర్యం పేష్వా సతీమణి ని ఇట్టే ఆకర్షించింది. ఆమె పట్ల అనిర్వచనీయమైన సానుభూతి కలిగింది. కొన్ని క్షణాలు ఆమె ముఖం వంకనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. చివరికి చిరునవ్వుతో , "శీలేదారినీ భాయి! నువ్వు అంతః పురం లో మా చెలి కత్తేగా చేర్తావా? శీలే దార్ ని కూడా పీష్వా సాహెబ్ వారి పరివార గణంలో వెయిస్తాము-- మీరిద్దరూ కలిసే రాజభవనం లో ఉండి పోవచ్చు...... .........' అన్నది నెమ్మదిగా.
    ఆశ్చర్య చకిత అయిన శ్యామా నిరుత్తురాలయి రమాబాయి సాహెబ్ పాదాలకి నమస్కరించింది.
    ------'అంతా భగవంతుడి కృప!"
    ---"వాళ్ళ అదృష్టం అలా వుంది!"
    అనుకున్నారు ఈ సంఘటనని చూసిన వారు.

                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS