Previous Page Next Page 
రామ్ శాస్త్రి పేజి 10


                                 11
    అశ్వశాలలో మామూలు రక్షక భటదళం కూడా లేదు. శ్యామా ఒక గుర్రానికి జీను వేసి ధైర్యంగా రాజ భవన ద్వారం వైపు స్వారీ చేసుకుంటూ వెళ్లి పోయింది. "ఆనంద్ -- రఘో! అనే మాటలు బాగా పనిచేశాయి. ఈమె ఎవరో కుట్రలో ముఖ్యమయిన వ్యక్తీ అయి వుండవచ్చునని వూహించిన కాపలావాడు అడ్డు పెట్టలేదు. శ్యామా రాజభవనం బయట పడింది.

                       *    *    *    *
    పది రోజులు గడిచాయి. ఆనాడు స్మశానం లో తమ పేష్వా అంతిమ క్రియల్ని చూసి పోదామని ఎందరో పోగయ్యారు. "తిలాంజలి' క్రియలు జరిపించటానికి పూనా నుంచి ఇరవయి మంది పురోహితులు వచ్చారు. వారందరూ మంచి పండితులు. కర్మకాండ క్షుణ్ణంగా ఎరిగినవారు. కాని, చివరికి పిండాలని వేసినప్పుడు కాకులు వచ్చి వాటిని ముట్టుకోలేదు ! తమ మంత్ర పఠనం లో ఏదో లోపం ఉందేమోనని బ్రాహ్మణులూ వాటిని తిరిగి చదివినా చెట్ల మీద ఉన్న కకులలో ఒకటి ఒకటి కూడా వాటి వద్దకి రాలేదు.
    "పేష్వా వారి ఆత్మకి సంతృప్తి కలగలేదన్న మాట!"
    "ఇదేమి వింత!"------
    ఇంకా కొంతసేపు ఆగి చూద్దాము!"---
    అందరూ పరిపరి విధాల అనుకున్నారు. సూర్యుడు పైకి ఎక్కిన కొద్ది ఆ ప్రదేశంలో ఎండ తీక్షణం అధికం అయిందే కాని కాకులు పిండాలని భక్షించ లేదు. సాయంకాలం కూడా కావచ్చింది కాని కాకులు ముందుకి రాలేదు.
    "కాకులు తినే ముందు వెళ్ళిపోతే మహాపాపం!"
    "మన పేష్వా వారికి రక్షించు కోలేని పాపం కన్నానా!"
    "ఇంత ఘోరమయిన హత్య జరుగుతుందని తెలిసే మనమంతా ఏమి చెయ్య గలిగాము?"-----
    అక్కడ పోగయిన వారిలో అధికులు తమని మొదటి నుంచీ బాధించిన ఆలోచనలని బయట పెట్టారు. ఇక కేవలం మర్యాద కోసం వచ్చిన వారు 'ఈపని ముగిస్తే రేపు కొత్త పేష్వా అధిష్టానానికి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి. వాటిని చూసుకోవాలి కదా?" అని విసుక్కున్నారు.
    "ఈ కాకులు పిండాన్ని స్పృశించెట్లు కనిపించవు! పిండాలని స్వీకరించమని పితురులని ప్రార్ధించాలి........ డానికి తగిన మార్గాలు ఉన్నాయి......" అని ఒకరు సూచించారు.
    మరాఠా సామ్రాజ్యం ముఖ్యమంత్రి నానా పర్ననీస్ ఈ సూచనని వెంటనే ఆమోదించాడు.
    "ప్రభూ! నారాయణరావ్ సాహెబ్ !" అన్నాడు విచారంతో బరువయిన గొంతుకతో . "మీ సతీమణి గంగా బాయి సాహెబ్ వారు "శన్ వర్ వాడ' లో ఇక ఉండలేమన్నారు. ఈ విషయమయి తమరు చింతించకండి -- ఈ సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి గా వారికి మరొక భవనం నిర్మించి అందులో సురక్షితమయిన నివాసం ఏర్పరిచే బాధ్యత నాది"
    అందరూ ఆత్రంగా కాకుల వైపు చూశారు. ఈ ప్రతిజ్ఞ కూడా వాటిని కదిలించినట్లు లేవు.
    "ప్రభూ ! గంగాభాయి సాహెబ్ వారికి జన్మించపోయే శిశువుకి తగిన జాగీర్ వచ్చేట్లు చూసే బాధ్యత ఈ తమ భ్రుత్యుడిది! నా మాట నమ్మండి!" ఈసారి సభా రామ్ బాపూ ప్రార్ధించాడు. అతని ప్రార్ధన సయితం దుష్ఫలితం అయింది.
    మరాఠా సామ్రాజ్య సేనాధిపతి హరిపంత్ ఫడ్క్ ఇలా అన్నాడు : "ప్రభూ , నా ఈ ఖడ్గం తమరి ప్రాణాల్ని కాపాడలేక పోయింది! కాని, ఇక మీదట అప్రమత్తుడనయి గంగాభాయి సాహెబ్ గారికి గాని, ఆమెకి జన్మించాపోయే శిశువు కి గా ని హాని రాకుండా చూసే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. నామాట నమ్మండి!' కాకులు కదలలేదు. సూర్యుడు కూడా అస్తమించే వేళ అవుతోంది.
    "ఇక రామ్ శాస్త్రి గారే ఈ సమస్య పరుష్కరించలి!" అన్నారు ఎవరో. వెంటనే ఇతరులు దానిని ఆమోదించారు.
    "ప్రధాన న్యాయమూర్తే మనకొక మార్గం  చూపించాలి!"అనే మాటలు అక్కడ ప్రతిధ్వనించాయి. పెద్దలందరూ ఒక మూల నుంచుని ఉన్న రామ్ శాస్త్రిని కాకులు పిండాన్ని స్వీకరించేట్లు చెయ్యమని అర్ధించారు.
    రామ్ శాస్త్రి మవునంగా ముందుకి వచ్చి , అంజలి ఘటించి, దుఃఖంతో గద్గదమయిన కంఠం తో ఇలా ప్రార్ధించాడు: "ప్రభూ! ఈ భ్రుతుడి ప్రార్ధన ఆలకించు! మేమందరం ఈ మరాఠా రాజ్య సేవకులమే! ఈ ఘోరమయిన నేరానికి కారణభూతులయిన వారెవరో తెలుసుకుని శిక్షించే దాకా వూరుకోనని మీకు తెలుసు! ఇదే నా ప్రతిజ్ఞ!"
    రామ్ శాస్త్రి ఈ మాటలు అన్నాడో లేదో రెక్కల రెపరెపలతో చెట్ల మీది కాకులు నేల మీదకి ఎగిరి వచ్చి వాలాయి. త్వరలోనే పిండాలని భక్షించటం ప్రారంభించాయి.
    "ఆహా! రామ్ శాస్త్రి గారి వాక్ బుద్దికి ఇది మరొక నిదర్శనం!"--
    "పేష్వా వారి ఆత్మ ఇక శాంతిస్తుంది!"-- అనుకున్నారు అందరూ. అందరి హృదయాలు తేలిక పడ్డాయి-- ఒక్క రామ్ శాస్త్రి తప్ప. తన ప్రతిజ్ఞ నెరవేర్చే బాధ్యత అతని హృదయంలో ఒక పెద్ద బరువుగా నిల్చి పోయింది.
    పెద్దలు ఒక్కొక్కరూ తమ తమ పల్లకీలు ఎక్కి వెళ్ళిపోయారు. రామ్ శాస్త్రి ఒకడే కాలినడక మీద ఇంటికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పటికే సంధ్య వేళ అయింది. కాగడా పాట్టుకుని వున్న ఒక సేవకుడు మాత్రం దారి చూపించటానికి ముందు నడచి వెళ్ళగా రామ్ శాస్త్రి అతన్ని అనుసరించాడు.
    "రఘో బా ఈ హత్యకి కారకుడని అందరికీ తెలుసు...కాని రుజువు చెయ్యటం ఎలా?..... ఈ పది రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయే?....' ఇటువంటి ఆలోచనలు అతని తలలో ముసురుకున్నాయి. పరధ్యానంగా నడుస్తున్న అతను తన వైపుకి పరుగెత్తుకు వస్తున్న ఒక స్త్రీ ఆకారాన్ని గమనించనే లేదు.
    "అర్జీ! ఈ దీనురాలి అర్జీని మరాఠా ప్రధాన న్యాయమూర్తి వినాలి!" అంటూ ఆమె తన పాదాల మీద పడటంతో ఉలిక్కి పడ్డాడు. ఆశ్చర్యానికి తోడు మరొక ఆశ్చర్యం , ఆ స్త్రీ ఎవరో కాదు శ్యామా!
    చంపాజీ చెప్పినట్లే శ్యామా జోహార్ సింగ్ ని అనుసరించి ఘర్దీల రహస్య స్థలాన్ని కనుక్కుంది. కాని భర్త చెప్పిన మాట దాటి నేరుగా రామ్ శాస్త్రి వద్దకి వెళ్ళే బదులు చంపాజీ ఎలా ఉన్నాడో చూడటానికి తిరిగి రాజభవనం వైపు వెళ్ళింది. రాజభవన ద్వారం ప్రవేశించ గానే తులాజీ ఆమెని పట్టుకుని ఒక కారా గృహం లో పడవేశాడు. "ఈమె ఈ భవనం బయటికి ఎలా వెళ్ళింది. ఎందుకు తిరిగి వచ్చింది?' అనే సందేహం అతన్ని పీడించింది. కాని శ్యామా అతని సందేహం తీర్చలేదు. ఎంత ప్రశ్నించినా అసలు సంగతి బయట పెట్టలేదు.
    కారా గృహంలో శ్యామా పరిస్థితి అతి దీనం అయిపొయింది. తను చంఫాజీ కర్మలు చేయించ లేకపోయింది! అతని ప్రధానా దేశాన్ని పాటించ లేకపోయింది. ఘర్దీల రహస్య స్థలం తెలిసి కూడా రామ్ శాస్త్రి కి చెప్పలేక పోతున్నది! ఈ కారా గృహం నుంచి బయట పడటం తనకి సాధ్యమయిన పని కాదు. కోట బురుజు ఒకదాని కింద కట్టిన ఆ గది కిటికీ లో నుంచి చూస్తె కింద ఎక్కడో కనిపించే కందకం చాలా లోతయినది........
    ఇలా ఆలోచిస్తూ కుమిలిపోతూ వున్న శ్యామాకి ఆనాడు మెల్లిగా కదులుతూ వెడుతున్న కాగడాకాంతి లో ఒక సుపరిచిత స్వరూపం కనిపించింది. అది రామ్ శాస్త్రి , సందేహం లేదు! ముందు వెనుకలు ఆలోచించకుండా శ్యామా కిటికీ లో నుంచి కందకం లోకి దూకింది. ఎలాగో దానిని ఈది రక్షక భటుల కంట పడకుండా అవతల గట్టు చేరింది. ఇటువంటి సాహస కృత్యాన్ని వారు కూడా ఎదురు చూడలేరు. కేవలం ఒక స్త్రీ, అని కారా గృహ పరిసరాలని అంత జాగ్రత్తగా కాపలా కాయలేదు. క్షణాలలో వచ్చి రామ్ శాస్త్రి పాదాల మీద వాలింది.
    "శ్యామా! నువ్వామ్మా! ఎక్కడి నుంచి వచ్చావిలా? ఏమిటి నీ అర్జీ? చెప్పు!" అన్నాడు రామ్ శాస్త్రి.
    శ్యామా వెక్కిళ్ళ మధ్య తన కధనంతా చెప్పింది. తను రాజభవనం కందకాన్ని ఎలా దాటి వచ్చిందో చెప్తుండగా పెద్ద డెక్కల శబ్దంతో అక్కడికి ఒక అశ్వదళం వచ్చింది. అది రాత్రిపూట వూరు చుట్టూ తిరిగే రక్షక దళాలలో ఒకటి. రామ్ శాస్త్రిని చూడగానే కొట్వాల్ గుర్రం దిగి వచ్చి నమస్కరించాడు.
    "మేము చెయ్యగలిగిన దేమయినా వుంటే సెలవిప్పించండి!" అన్నాడు వినయంగా.
    సాధారణంగా రామ్ శాస్త్రి అజ్ఞ ఏమీ లేదని చిరునవ్వుతో అతన్ని సాగనంపే వాడే కాని ఈసారి మాత్రం ఒక క్షణం నిరుత్తడయి నిలిచాడు. తర్వాత నిదానంగా అన్నాడు: "కొట్వాల్ , పది సంవత్సరాలుగా ఎప్పుడు కలిసినా నన్నీవిధంగా అభిమానంతో ఏమి చెయ్యగలనని అడుగుతూ వచ్చారు మీరు! ఒకసారయినా మిమ్మల్ని, ఇది చెయ్యమని నేను కోరలేదు. కాని ఈనాడు మిమ్మల్ని ఒక పెద్ద కోరిక కోరుతున్నాను. ప్రధాన న్యాయమూర్తి గా నేను మిమ్మల్ని కోరేది ఇదే! రేపు నేను ఈ పదవిలో వుంటానో ఉండనో చెప్పలేను.....కొట్వాల్ సాహెబ్! రాజసేవకుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు కొనమని అర్ధిస్తున్నాను."

                 
    "సెలవివ్వండి!" అన్నాడు కొట్వాల్ ఉత్సాహంతో.
    "నాకు రెండు అశ్వాలు అవసరం! ఇద్దరు ఆశ్వికులని దింపి వారి గుర్రాలని నాకు ఇప్పించండి!"
    కొట్వాల్ వెంటనే రెండు గుర్రాలని రామ్ శాస్త్రికి ఇప్పించాడు.
    రామ్ శాస్త్రి శ్యామాని ఒక గుర్రాన్ని ఎక్కమని , తనూ ఆశ్వారూడుడయ్యాడు. "కొట్వాల్ సాహెబ్ మనమంతా ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వెళ్ళా!" అన్నాడు.

                            *    *    *    *
    గంటలో ఆశ్వీకదళం ఘర్దీల రహస్య స్థలం చేరుకుంది. ఘర్దీలు వారితో కలియ బడ్డారు. కాని కొట్వాల్ దళం ధాటికి ఆగలేక పోయారు.ఆ తర్వాత జోహార్ సింగ్ దాచిన రఘో బా అజ్ఞాపత్రం వెతకటానికి ఎంతో సేపు పట్టలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS