Previous Page Next Page 
లోకం పోకడ పేజి 9


    "ఏరా రమేష్ , పెద్ద కోట్లల్లో కన్నా ఈ పేవ్ మెంటు కొట్ల లోనే జనం విపరీతంగా కొంటూ ఉంటారే? పెద్ద కోట్లల్లో ఇంకా రకాలు ఉంటయ్యిగా?" అన్నాడు సురేంద్ర.
    "పెద్ద కోట్లకు అద్దెలు కట్టాలి. అద్దాల బీరువాలు, కుర్చీలూ , ఫర్నిచరూ , కరెంటు ఖర్చూ అవుతయ్యి. వాటన్నింటి విలువా వాటిలో రాబట్టాలి. పేవ్ మెంటు కొట్ల కి ఈ హంగామా అక్కర్లేదు. వాళ్లకి కొద్ది లాభాలు మిగుల్తే చాలు!" అన్నాడు రమేష్.
    ఇద్దరూ సినిమా హాలుకు బయల్దేరారు. రకరకాల చీరెలూ, బట్టలు కట్టుకుని ఎంతో చక్కగా ముస్తాబై పోతున్నారు. కొందరు సినిమాకు, కొందరు షికారు కు. కొందరు వచ్చే పోయే జనాన్ని చూడటానికి. కొందరు ప్రయాణమై పోయేవాళ్ళు. ఎవళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియదు. అంతా ఏదో నిజంగా కొంప మునిగేపని ఉన్నట్లే , తాము వెళ్ళకపొతే అ పని కానట్లు గానే భావిస్తారు. కొంతమంది అంతా తమతోనే ఉందను కుంటారు.
    తోవ లో సురేంద్ర దృష్టి ఒక జంట మీద పడ్డది. వాళ్ళు రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఏమిటో కబుర్లు చెప్పుకుంటూ వికవికలూ , పకపకలూ ఆడుతూ, పెద్ద "స్టైలిష్ గా ' గొంతు పెట్టి మాట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళ ప్రత్యేకత ఏమిటో? అసలు రోడ్డు మీద ఎంతో మంది జనం పోతున్నారే అనే ధ్యాస కూడా వాళ్లకు లేదు.
    "ఆ భార్య భర్తల్ని చూడరా రమేష్" అన్నాడు సురేంద్ర.
    "ఏం, బావున్నారా?' అన్నాడు రమేష్ అటు చూసి.
    "దేవలోకం లో నుంచి దిగివచ్చినట్లుగా ఉన్నది వాళ్ళ ప్రాణానికి."
    "నీకూ అట్లాంటి భార్య కావాలని ఉందా?"
    "నాకేం లేదు."
    "వాళ్ళిద్దరూ ప్రేమికులు కావచ్చు . ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కావచ్చు. వాళ్ళ మాటల్లో ఎంత ఆప్యాయత, ప్రేమ, అనురాగము మిళితమై ఉన్నాయో నీకేం తెలుసు?"
    ఇంతలోనే ఓ కారు వెనక నుంచి వస్తున్నది. ఎంత హారన్ కొట్టినా ఆ భార్యభర్తలు తప్పుకోలేదు. వాళ్ళ మాటలే వాళ్ళవి. వాళ్ళ మానసిక ప్రపంచం లో వాళ్ళున్నారు. కారు డ్రైవరు 'స్లో' చేసి తప్పుకుని మెల్లిగా వెళ్ళిపోయాడు. ఆ దంపతులకు చీమ కుట్టినట్లు లేదు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే వెళ్లుతున్నారు.
    సినిమాకు వెళ్ళారు స్నేహితులిద్దరూ. అది ఇంగ్లీషు సినిమా. ఇద్దరూ పెద్ద టిక్కెట్టు కే వెళ్ళారు. అంతా 'క్లాస్' జనం. కాకపోయినా ఇంగ్లీషు పిక్చరు. ఆడా మగా విచక్షణ లేకుండా అన్ని సీట్లూ జనం క్రిక్కిరిసి పోయి ఉన్నారు.
    పిక్చరు మొదలు పెట్టారు. అంతా ఊపిరి బిగపట్టి నిశ్శబ్దంగా చూస్తున్నారు. సురేంద్ర కు ఎదురు వరస కుర్చీల్లో యిద్దరు యువ దంపతులు కూర్చున్నారు. ఆవిడ, భర్త భుజం మీద తలపెట్టి జార్లబడి కూర్చుంది. సినిమా చూస్తున్నంత సేపూ ఒకటే నవ్వు. మధ్య మధ్య చేత్తో చేమంతి పూల చెండు చూసుకోవటం, మళ్ళీ భర్త భుజం మీద తలపెట్టి అనుకుని కూర్చోవటం. పాపం ఇంగ్లీషు రాదు కాబోలు . సినిమా లో ప్రేయసీ ప్రియులు మాట్లాడుకుంటూ, నవ్వుతూ ఉంటె, ముద్దులు పెట్టుకుంటుంటే, "ఏమిటండీ అంటున్నారు వాళ్లు?" అని భర్తను అడుగుతుంది. పిక్చరు లో సంభాషణ లు ఆ భర్తకు తెలిసినా తెలీక పోయినా అందరితో బాటు తనూ నవ్వీ మళ్ళీ భార్య అడిగిండానికి సమాధానం చెప్పాలని, ఆవిడతో మెల్లగా "నిన్ను ఎంతో గాడంగా ప్రేమిస్తున్నాను , లూసీమా అంటున్నాడు" అని చెప్పేవాడు. ఆ భార్య ఆ మాట విని యింకాస్త గట్టిగా తలను భర్త భుజానికి ఆనించి అయన వైపు చూసేది నవ్వుతూ.
    సురేంద్ర కు అసలు పిక్చరు కన్నా వాళ్ళను చూడటం సరిపోయింది.
    ఇంటర్ వల్ అయింది. లైట్లు వెలిగాయి. అంతా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళారు. సురేంద్ర , రమేష్ కూడా హాలు వెలుపలికి వచ్చేశారు.
    "పిక్చర్ అర్ధమవుతున్నదిరా?' అన్నాడు రమేష్.
    "కొంచెం కొంచెం . అసలు పిక్చరు కన్న మన ముందు కూర్చున్న దంపతుల సినిమా బావుంది. వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. ఆవిడ అట్లా కిలకిలా నవ్వుతూ అయన భుజాల మీద వాలిపోతున్నది గదా! అంత ప్రాణ ప్రదంగా ఇరవై నాలుగ్గంటలు ప్రేమించుకుంటూ ఉంటారన్న మాట. కాకపోతే సినిమా హల్లో అంతమంది ఉన్నారని కూడా లేకుండా ఆ వాలి పొవట మేమిటిరా?' అన్నాడు సురేంద్ర.
    'అదే ఆదర్శ దాంపత్యం. దాంపత్యాల్లో ముఖ్యమైనవి రెండు రకాలు. సినిమా హాలు వరకూ భార్యాభర్తలు కలిసి వచ్చి ఆవిడ ఆడవాళ్ళ లో , ఈయన మగ వాళ్ళల్లో కూర్చుని చక్కగా సినిమా చూసి, మళ్ళీ సినిమా వదిలాక ఆడవాళ్ళ గేటు వద్ద నిలబడి భార్యని కలుసుకుని చక్కగా కలిసి యింటికి పొతే ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నట్లు: అట్లాగాక ఇంట్లో మూతి విరుపులూ, సరస, విరసాలూ ఉండి చక్కగా ముస్తాబై సినిమా కొచ్చి , ఇద్దరూ పక్క పక్క కుర్చీల్లో కూర్చుని కిలకిల లాడుతూ, పకపక నవ్వుతూ, నువ్వన్నట్లుగా ఆ భర్త గారి భుజాల మీద వాలిపోయి సినిమా చూస్తుంటే వాళ్ళు ఆదర్శ దంపతుల క్రింద లెక్క" అన్నాడు రమేష్.
    "బాగుందిరా నీ విమర్శ!"
    "సరే. మీరపకాయ పకోడీ లు, మసాలా పప్పులూ తిందామా?"
    "ఛా, ఛా. ఆ నూనె సరుకు ఎందుకురా , దుమ్ము కొట్టుకుని?"
    "ఎంతమాట ! నీకసలు ఎటికేసీ తెలీదురా! చక్కగా టకప్ చేసుకుని, నున్నగా తల దువ్వుకుని  స్టైలిష్ గా వెళ్లి ఇంగ్లీషు సినిమా అర్ధం అయినా కాకపోయినా సినిమా చూసిన వాళ్ళు ఇంటర్ వల్ లో ఈ మిరపకాయ బజ్జీలూ, పిడత కింద పప్పూ తినాలి. ఆ చేతులు జేబురు గుడ్డకో, పాంటు జేబులకో తుడుచుకోవాలి. అప్పటికి గాని ఇంటర్ వల్ తరవాత ఇంగ్లీషు సినిమా అర్ధం కాదు. అసలు ఇంగ్లీషు పిక్చరు చూచినట్లే కాదు. తెలిసిందా? పదిమందితో చావు పెళ్ళితో సమాన మన్నారు . రా! ఓ అణా మిరపకాయ బజ్జీలు, తిందువు గాని, మసాలా , ఉల్లిపాయలూ వేయించుకుని" అన్నాడు రమేష్.
    ఇద్దరూ తినటం పూర్తీ చేసి, సోడా త్రాగి హల్లో కి వెళ్ళారు. యధాస్థానం లో కూర్చుందామని వెళ్లితే ఇద్దరి సీట్ల లో ఇంకో ఇద్దరు కూర్చుని పొట్లాలు చేత్తో పట్టుకుని ఉల్లిపాయ వేసిన మసాల పప్పు తింటున్నారు. సురేంద్ర కు ఆశ్చర్యం కలిగింది.
    "మేమిద్దరం ఇంతకూ ముందు ఇక్కడ కూర్చున్నామండీ" అన్నాడు రమేష్.
    "సారీ! పొరపాటు " అని పప్పు నోట్లో వేసుకుంటూనే వెళ్లి అవతల ఉన్న తమ సీట్ల లో కూర్చున్నారు.
    "చూశావురా, సురేంద్రా? ఇదే ఇంగ్లీషు సినిమా కీ, తెలుగు సినిమా కీ ఉన్న తేడా. ఇంగ్లీషు సినిమా కొచ్చి పిడత కింద పప్పు తింటున్నా చెప్పగానే "సారీ" అంటూ వెళ్ళిపోయారు. అదే తెలుగు సినిమా అయితే "ఏం, నీ పేరు యిక్కడ రాసుందా! నేనూ డబ్బిచ్చి టిక్కెట్టు కొన్నా' అనేవాళ్ళు. అదే ఇంగ్లీషు సినిమాకి, తెలుగు సినిమా కీ తేడా" అన్నాడు రమేష్.
    సురేంద్ర నవ్వి కుర్చీ లో కూర్చున్నాడు. సినిమా మొదలు పెట్టారు. సురేంద్ర ఎదురుగా కూర్చున్న దంపతులు మళ్ళీ యధాస్థానం లో యదా స్థితిలోనే కూర్చున్నారు.
    సినిమా వదిలారు, అంతా నిశ్శబ్దంగా జేబుల్లో చేతులు పెట్టుకుని బయటికి వచ్చేశారు.
    "సినిమా ను గురించి కామెంటరీ ఏం లేదేం రా? ఎవరూ మాట్లాడరేం" అన్నాడు సురేంద్ర.
    "అదే మరి. అందరికీ ఈ సినిమా అర్ధమయిందంటావా? లేదు. సినిమా ను గురించి ఏం మాట్లాడితే ఏం అవకతవకగా ఉంటుందో నని వీడికి పిక్చరు సరిగ్గా అర్ధం కాలేదల్లె ఉంది అని ఎవరయినా నవ్వి పోతారేమోనని ఇంగ్లీషి సినిమా చూసి బయటకు వచ్చాక ఎవ్వరూ మాట్లాడరు. ఎవరి మనస్సుల్లో సందేహాలు, అర్ధం కాని విషయాలు వాళ్ళ మనస్సుల్లోనే సరి పెట్టుకుని నిబ్బరంగా వెళ్ళిపోతారు . అదే సినిమా నాగరికత" అన్నాడు రమేష్.
    "అంటే అంతా 'ఫాల్స్ ప్రిస్టేజి' అంతేనా?
    "గ్రహించావు రా . కాస్త నువ్వూ దార్న  పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది."
    దారి లోనే హోటళ్ళ లో నాలుగు మెతుకులు తిని గదికి వెళ్ళిపోయారు ఇద్దరూ.

                               *    *    *    *
    నాలుగు రోజులు గడిచినాయి. వసుంధర దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది. అప్పుడు సురేంద్ర కూడా గదిలోనే ఉన్నాడు. చదువుకుంటున్నాడు. ఎంతో సంతోషంతో ఆత్రంగా ఉత్తరం విప్పి చదివాడు రమేష్.
    "సరోజా--
    "నీ ఉత్తరం చేరింది. మనం కలం స్నేహం ద్వారా చాలా సన్నిహితులమవుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాల ద్వారా మనం మాట్లాడు కుంటున్నా నిన్ను చూట్టానికి వీలులేక పోతున్నదే అని బాధగానూ ఉంది. ఇట్లా దాగుడు మూతలు ఎన్నాళ్ళు ఆడాలో అర్ధం కావడం లేదు. సాటి ఆడవాళ్ళ తో కూడా మీరు మాట్లాడ కూడదని మీ వారు  శాసించారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చదువు కుంటున్న విద్యార్ధినిని గాని వివాహితను కాడు గదా! భార్యాభర్తల మనస్తత్వాలు, మగవారి మనస్తత్వాలూ నాకు తెలియవు. కాని నీ ఉత్తరాల ద్వారా, ఆడదానికి ఎంత తెలివి తేటలూ, చదువు సంధ్యలూ ఉన్నా, కట్టుకున్న భర్త కి సర్వదా విదేయురాలు గా ఉండి వారి అడుగులకు మడుగు లోత్తుతూ సహజ వ్యక్తిత్వాన్ని చంపుకోవాలనే అర్ధం నాకు కలుగుతున్నది. కాని ఇది సబబైన మాట కాదు. ఎందుకంటె నాకు యిద్దరు అక్కయ్యలు ఉన్నారు. మా బావలకు వారు దాసీలు కారు. అట్లా అని మా బావలను  మా అక్కయ్యలు కొంగు కట్టుకుని తిరగటమూ లేదు. సంసార పక్షంగా ఏ అభిప్రాయ భేదాలు లేకుండా, మాట పట్టింపు లేకుండా, చక్కగా, అన్యోన్యంగా నే , కులాసా గానే వారి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను చూసినంత వరకూ నీదే విచిత్రమైన జీవితం లా ఉంది. నీ జీవితం లోకి తొంగి చూసి అలాంటి జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావో చూడాలని ఉంది. నువ్వు వద్దన్నా త్వరలోనే హటాత్తుగా కలుసుకుంటాను. మీవారేం నన్ను కొట్టరు కదా!
    "మీ మరిది విషయం వ్రాశావు. నీవు వ్రాసిన విషయాలన్నీ నిజమే. అతనితో మాట్లాడిన కాస్సేపట్లో నే ఒక విధమైన సదభిప్రాయమే నాకు కలిగింది. అతను చాలా మంచి వాడులాగే కనిపించాడు. మనస్సులోని ఆలోచనలు మనం అర్ధం చేసుకోలేం కదా!
    "రిహార్సల్సు ప్రారంభించాము. బాగానే సాగుతున్నాయి. కామేశ్వరి పాత్ర నాకు యిచ్చినందుకు సర్వదా కృతజ్ఞురాల్ని.
    "జాబు నాకు నాలుగు రోజుల్లో రావాలి సుమా!
                                                                                                నీ వసుంధర."
    ఉత్తరం చదవగానే అతని మనస్సు పరవళ్ళు తొక్కింది. సురేంద్ర ను కూడా ఉత్తరం చదవ మని యిచ్చాడు. సురేంద్ర ఉత్తరం చదివి, "నీ రొట్టె విరిగి నేతిలో పడ్డదిరా" అన్నాడు నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS