Previous Page Next Page 
లోకం పోకడ పేజి 10


                                                                8
    వారం రోజుల వరకూ రమేష్ ఉత్తరం వ్రాయలేదు. ఉత్తరం వ్రాయక పొతే వసుంధర వచ్చేస్తుందేమో , ఇంక ఈ దాగుడు మూతల్నుంచీ బయటపడి, సన్నిహిత స్నేహం ఏర్పరచు కోవాలని అనుకున్నాడు. తను కధలూ, నవలలూ నాటకాలూ వ్రాసేవాడు. నాయికా నాయకులనూ, ప్రేమికుల నూ, ప్రణయ కలాపాన్ని, సాగించే యువతీ యువకులనూ, రకరకాలుగా , పలు తీరులుగా, విభిన్న మనస్తత్వాలు గల పాత్రలను సృష్టించి రచనలు చేశాడు. విచిత్ర పరిస్థితుల్లో నాయికా నాయకులను సమాగ్రను పరిచేవాడు. అటువంటి రచనా చాతుర్యం గల తను, స్వానుభవం లోకి వచ్చేసరికి తికమక పడుతున్నాడు రమేష్.
    వసుంధర కనిపించింది. తనతో సతోజ మరిదిగా మాట్లాడింది. చక్కగా, తీయని కబుర్లు చెప్పింది. అంతకు మించి ఉత్తరాలు వ్రాస్తున్నది. ఆమె మనస్తత్వాన్న , మనో భావాలనూ అర్ధం చేసుకున్నాడు. కాని ఎదుట పడి సన్నిహిత స్నేహం ఏర్పరచు కోవాలంటే మనస్సు లో రమేష్ కు బెరుకు గానే ఉంది. ఎదుట పడితే ఇంతవరకూ వ్రాసిన ఉత్తరాలన్నీ అబద్దాలేగా! అప్పుడు వసుంధర తననొక వంచకుడుగా భావించి తిరకస్కరిస్తే? అప్పుడు కధ అడ్డం తిరిగినట్లే.
    ఇంతవరకూ జరిగిన దానికీ క్షమాపణ చెప్పుకుని ఎదుట పడటమే మంచిదిగా భావించాడు.
    ఆ రోజున ఒంట్లో అస్వస్థత గా ఉండటం మంచి మధ్యాహ్నం సెలవు పెట్టి గదిలోనే ఉన్నాడు. రమేష్. సురేంద్ర కాలేజీ కి వెళ్ళాడు.
    సాయంత్రం మూడు గంటలకు వసుంధర చక్కని పట్టుచీరే కట్టుకుని, చుక్కగా ముస్తాబై తల్లో చేమంతులు పెట్టుకుని, కుంకం బరిణే తీసుకుని వచ్చింది. "సరోజా, ఏమండీ సరోజా దేవి గారూ, తలుపు తీయండి' అంటూ తలుపు కొట్టింది. గదిలో పడుకున్న రమేష్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తి నాయి. మెల్లిగా లేచి తలుపు తీశాడు. రమేష్ ను చూడగానే వసుంధర కొంచెం నవ్వు ముఖంతో "మీ వదినె సరోజ గారు లేరాండీ?" అంటూనే గదిలోనికి వచ్చి, "ఎక్కడున్నావమ్మా, సరోజా?" అన్నది. అప్పటికి గదంతా కలయ జూసింది. ఆ గది ఒక్కటే. ఇంకో గది గాని, వంట గది కాని కనుపించలేదు. అసలు ఆడవాళ్లు ఎవరూ ఉన్నట్లు గా కనబడలేదు.
    "ఏమండీ , సరోజ లేరా? మళ్ళీ వూరికి వెళ్ళారా? అయినా ఇదేం కాపరాలుండే ఇల్లుగా లేదే? స్టూడెంట్స్ గదిలా ఉంది. అసలు సరోజ గారి ఇల్లు ఇదా? లేక అవతలిల్లా?" అన్నది కంగారుగా వసుంధర.
    బయటికి పోదామంటే గది గుమ్మానికి అడ్డంగా రమేష్ నిల్చున్నాడు. రమేష్ కు ఏం సమాధానం చెప్పటానికీ తోచలేదు. మనస్సు లో మోసం చేశానే అనే బాధతో కూడిన కంగారు, ఎట్లాగో నోరు పెగుల్చుకుని "వసుంధరా! క్షమించు . నువ్వు కోపగించు కోకుండా ఉంటె అన్ని విషయాలూ చెప్తాను. నీకిక్కడ ఏ అపకారమూ జరగదు. దైవసాక్షి గా చెపుతున్నాను. కంగారు పడక ఆ చాప మీద కూర్చో. నేనిక్కడే ఈ కుర్చీలో కూర్చుంటా" అన్నాడు.
    వసుంధర కు ఏమీ తోచలేదు. కట్టుకున్న గాలి మేడలు ఒక్కసారి కూలినట్లనిపించింది. నిజంగా సరోజ లేదా అనిపించింది. సరోజ చచ్చి పోయిందా అనిపించింది. మనస్సు పరిపరి విధాల పోయింది. ఏ ప్రమాదమూ జరక్క మునుపే బయట పడాలని పించింది. కాని మాట పెగిలి రాలేదు నిర్విన్నురాలైపోయింది. గుండె దడదడ కొట్టుకోసాగింది. తలవంచుకుని నిల్చుంది. వెళ్ళటానికి వీల్లేకుండా గుమ్మం వద్ద రమేష్ కుర్చీలో కూర్చున్నాడు. దెబ్బతిన్న లేడిలా బెదిరిపోయింది.
    "నేను కూర్చొను. వెళ్ళిపోతాను. దార్లో లేవండి. నన్ను పోనివ్వండి. నేను మోసపోయాను. ఇంకా మోసపోకుండా ఇంటికి పోవడం మంచిది" అన్నది కంగారుగా మాట్లాడుతూ. ఆప్రయట్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.
    "వసుంధరా! ఇట్లా చూడు. నేను మోసకార్ని కాదు. మీరు అనుకున్నట్లుగా దుష్టుడి ని కాదు. నాకు ఏ నీచమైన ఉద్దేశ్యమూ లేదు. నేనూ గౌరవ కుటుంబంలో పుట్టి పెరిగి గౌరవ ప్రదమైన జీవితం గడుపుతున్న వాడినే. చేసిన తప్పు చెపితే, నన్ను తప్పక క్షమిస్తావనే ఆశ నాకుంది. నువ్వు క్షమించానంటే కాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ చాప మీద కూర్చో ఎవ్వరూ చూడరు. కూర్చోమని ప్రార్ధిస్తున్నాను" అన్నాడు రమేష్ ప్రాదేయపూర్వకంగా.
    వసుంధర కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది.
    "వసుంధరా! ఇన్నాళ్ళుగా నీకు ఉత్తరాలు రాస్తూ, నీ మనస్సులో జొరబడి , నీ హృదయంలో ముద్ర వేసుకున్న నీ ప్రియ స్నేహితురాలు సరోజ ను నేనే" అన్నాడు రమేష్, వసుంధర వైపు చూస్తూ. వణుకుతున్న పెదవులతో "మీరా? మీరు సరోజ మరిది కదూ? అంటే సరోజ అనే పేరుతొ మీరే నాకు ఉత్తరాలు వ్రాస్తున్నారా" అన్నది ఎంతో ఆశ్చర్య పడుతూ.
    "అవును. సరోజను నేనే. సరోజ మరిది రమేష్ ని నేనే. నేనిక్కడ కాలేజీ లో ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్నా. ఇప్పటికయినా నన్ను క్షమిస్తావా?" అన్నాడు రమేష్ నవ్వు ముఖంతో.
    ఒక్కసారి ప్రాణం నిర్జీవయి పోయినట్లయింది. నిట్టుర్పు విడుస్తూ "అయితే మీరెవరో కూడా నాకు తెలీదే? ఎందుకింత నాటక మాడారు? మీ ఉత్తరాలన్నీ ఆడవాళ్ళ దస్తూరీ లోనే ఉన్నయ్యి. అంచేతనే సరోజ అనే వ్యక్తీ ఉన్నట్లుగానే నమ్మాను. నన్ను దగా చేసి, మోసం చేశారు" అన్నది వసుంధర , ఉక్రోషం తో ఉచ్చ్వాస నిస్శ్వాసాలు విడుస్తూ.
    "కోప్పడకండి. మీమీద నాకేమీ కోపం గాని వంచన చేయాలనే భావం గానీ లేదు" అన్నాడు రమేష్.
    "మీరు' అనగానే కొంచెం కింద పడ్డది వసుంధర. "అయితే అట్లా ఎందుకు ఉత్తరాలు వ్రాశారు?" అన్నది ప్రశ్నార్ధకంగా . ఈసారి అన్నమాటల్లో కోపం ధ్వనించలేదు.
    "మొట్టమొదటి సారిగా వాణీ విలాస్ లో పాట కచ్చేరీ లో నిన్ను చూశాను. ఎంతో ఆనంద పడ్డాను. తరువాత స్నేహితురాలితో మాట్లాడుతుండగా మీ ఇంటి వద్ద చూశాను. ఏదో ఒక ప్రత్యేకత నన్ను కట్టివేసింది. తరువాత జనతా కేఫ్ లో మీ స్నేహితురాలతో , టీ పార్టీ సందర్భం లో చూశాను. నా హృదయం లో ఒక స్థానం ఏర్పడ్డది. వ్యక్తిగతంగా గుణగుణాలూ, భావాలూ తెలుసుకోవాలని ఆడవాళ్ళ దస్తూరి తో ఉత్తరాలు రాశాను. నువ్వు యీ సరోజ కు జవాబులు రాశావు. తతిమ్మా విషయాలు తెలిసినవే. నేనే సరోజని. నేనే రమేష్ ని. పాపం! పేరంటం పిలవటానికి వచ్చినట్లు న్నావు. బొట్టు పెట్టు. నేనూ చీరే కట్టుకో గలను. పేరంటానికి రమ్మంటావా? ఇంతకీ ఏం పేరంటం?' నవ్వుతూ అడిగాడు రమేష్.  
     వసుంధర హృదయం తేలిక పడ్డది. జీవితంలో అనుకోని సంఘటనలు అనేకం జరుగుతాయి. కొన్ని తాత్కాలిక మైనవి, కొన్ని క్షణిక మైనవి, కొన్ని జీవితాంతం నిలువ గలిగేవి. ఉద్వేగం లో కోపం కలుగుతుంది. మోసపోయానని తెలుసుకుంటే కోపం కలుగుతుంది. ఎదుటివారి దృష్టి లో చులకనగా చూడబడ్డామని తెలుసుకుంటే ఈర్ష్య తో కూడిన కోపం కలుగుతుంది. అప్పుడే ఉడుకుబోతుతనమూ కలుగుతుంది. నిజానిజాలు తెలుసుకుంటే కోపం పోతుంది. ఈ కోపం లోనే ఏదో ఒక రకమైన మేలు జరిగిందని తెలుసుకున్నప్పుడు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం కలిగినప్పుడు మానసిక పదంలో మణి పూసలాంటి మధుర స్మ్రుతి కలుగుతుంది. అలాంటి భావన మనస్సు లో కలిగినప్పుడు సహజామైన సిగ్గు ముంచుకు వస్తుంది. తప్పు తెలుసుకున్నప్పుడూ , పశ్చాత్తాపంతో కుమిలి పోయే టప్పుడూ కలిగే సిగ్గు వేరు. న్యూనత కలిగించే విషయాలు మాట్లాడినప్పుడు అభిమానంతో పడే సిగ్గు వేరు. తప్పు ఒప్పు కునేటప్పుడు కలిగే సిగ్గు వేరు.
    మనస్సులో ఏదో ఒక స్త్రీ రూపం లో ఈ తీరుగా సరోజ ఉండవచ్చునని ఊహించు కున్నది వసుంధర. ఆ సరోజ మాటకారి. స్నేహపాత్రురాలు. సన్నిహితమైన ఆదర్శ భావాలు కలది. మనస్సులో ఏ సంకోచమూ లేకుండా సూటిగా అన్ని విషయాలు చెప్పే నిష్కపటి. వయస్సులో తన కన్న పెద్దది. భర్తతో కాపురం చేస్తున్న ఆదర్శ మహిళ. చక్కగా, సరళం గా, సరసంగా నవ్విస్తూ, కవ్విస్తూ మాట్లాడుతుంది. ఊహాలోకం లో చిత్రించుకున్న అలాంటి సరోజ ను చూద్దామనుకుని ఎంతో ఆశ తో వచ్చింది వసుంధర. కాని తను చూద్దామనుకున్న సరోజ ఈ రమేష్ అని తెలుసుకోగానే సిగ్గుతో కుంచించుకు పోయింది. ఈ సిగ్గు తో వసుంధర బుగ్గలు ఎరుపెక్కి నాయి. చిరునవ్వుతో బుగ్గలు సొట్టలు పడ్డాయి. విప్పారిత నయనద్వయాంలో ఆనందోత్సహాలు వెల్లివిరిసి బెదురూ చూపులతో ప్రకశించినాయి. కుంకుమ బరిణే అటూ యిటూ తిప్పుతూ మనస్సులోనే నవ్వుతూ కూర్చుంది వసుంధర.
    "నన్ను క్షమించినట్లే నా, వసుంధరా?"
    "తప్పు తెలుసుకున్నప్పుడు క్షమించక చేసేదే ముంది? సరే, యింక వెళతాను" అంటూనే లేచి నిల్చుంది వసుంధర.
    "మళ్ళీ యీ సరోజ ను చూట్టానికి రావటం ఎప్పుడు?" అన్నాడు రమేష్ నవ్వు ముఖంతో.
    "ఇంక రాకపోవచ్చు."
    "పోనీ ఉత్తరాలు వ్రాస్తారా?"
    "ఆలోచిస్తాను."
    "ఏమని?"
    "రాయాలా, వద్దా అని."
    "ఎప్పుడు వ్రాస్తావు?"
    "రేపే ఒక ఉత్తరం వ్రాసి పోస్టులో వేస్తాను . ఎల్లుండి చేరుతుంది గా?"
    "నీ యిష్టం . సరే, మీ ఇంట్లో ఏం పేరంటం? మరి నీ స్నేహితురాలు సరోజ రాలేదని మీ వాళ్ళడిగి తే ఏం చెబుతావు?"
    "మా రెండో అక్కయ్య వచ్చింది అక్కయ్య కొడుకు పుట్టిన రోజు. అదీ పేరంటం. సరోజ రాలేదేమని అక్కయ్య అడిగితె ఏం చెప్పనూ?"
    "ఆలోచించు."
    "చెప్పమంటారా. ఆవిడ వాకిట ఉన్నారు, అని చెప్తా . సరేనా?' అంటూనే వచ్చే నవ్వు ఆపుకుంటూ వెళ్ళిపోయింది వసుంధర.
    వసుంధర వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తూ నిల్చున్నాడు రమేష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS