"ఎవర్రా ఆ అమ్మాయి? కాలేజీ లో చదివే మీ క్లాస్ మేటా?"
"కాదు. హైస్కూల్లో చదువుతున్నది. స్కూలు ఫైనలు. అదొక విచిత్రమైన పరిచయం. అనుకోని సంఘటనలు. కాని ఎవ్వరం కాలు జారలేదు."
"పోనీలే. జీవితంలో విచిత్రమైన సంఘటనలు మనకు తెలియకుండానే తగులుతూ ఉంటయ్యి. అంతమాత్రం చేత కాలు జారామని, ఇతరులు అనుకున్నా మన మనస్సు కు మనస్సే సాక్షి. మనస్సాక్షి కి మించిన సాక్ష్యం ఏ కోర్టు లోనూ దొరకదు. సరే! ఇంతకీ పరిచయం ప్రేమగా మారిందా?' ముభావంగానే అడిగింది కామాక్షి.
"మారినా తప్పేం లేదుగా అక్కయ్యా! ఎన్నో భావాలు నాలో ఉన్నాయి. ఎన్నో కబుర్లు చెప్పగలను. ఎన్నో కధలు రాయగలను. ఎన్నో పుస్తకాలు చదివాను. అన్నీ నాకు తెలుసు. అమ్మ లేనే లేదు. నీ దగ్గర నేను పసివాడినే. నీతో అబద్దం చెప్పలేను. కాని నీ యందు నాకు గల గౌరవాన్ని ఏ వయస్సు మళ్ళిన వృద్దుడి కీ యివ్వలేను. నన్ను క్షమించు" అన్నాడు మనస్సులోనే ఆవేదన పడుతూ.
"కాదు, తమ్ముడూ. ఎంతయినా నాన్న తరువాతనే నేను. ఈ వృద్దాప్యం లో అయన మనస్సు కష్టపెట్టటం మట్టుకు మంచి దంటావా?"
"అక్కయ్యా! నాన్న మనస్సు నేనెప్పుడూ నొప్పించను. నాన్న మీద నాకు అభిమానమూ, గౌరవమూ, ప్రేమా అన్నీ ఉన్నాయి. కాని చనువు తక్కువ. నీ దగ్గర ఉన్న చనువు నాన్న దగ్గర నాకు లేదు. అందుకనే అన్ని విషయాలూ నీతోనే మాట్లాడదామని నిశ్చయించు కున్నాను." అన్నాడు ఏదో ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా.
"ఆ పిల్లనే చేసుకుంటా నంటావా?" అన్నది కామాక్షి తమ్ముడి ఉద్దేశం గ్రహించి.
"ఇంకా అంతవరకూ రాలేదు. కాని ఆ రోజు వస్తే తప్పుతుందా అక్కయ్యా? వసుంధర రూప రేఖా విలసాలూ, చదువూ, సంస్కృతీ మాట తీరూ నడవడీ అన్నీ నాకు నచ్చినయి. పెళ్లి విషయాలు మేం మాట్లాడుకోలేదు. మేం స్నేహితులమే గాని ప్రేమికుల ధోరణి లో యింకా పడలేదు. కాముకులం మాత్రం కాదు. మేం చేడిపోలేదు."
ఈ మాటలకు కామాక్షి ఏం సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తమ్ముడి హృదయ స్పందన కామాక్షి కి అర్ధమయింది.
"నా మాటలు నీకు బాధ కలిగిస్తున్నాయా?"
"లేదురా."
"పోనీలే , యిక చెప్పను. కానీ ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. నేను వసుంధర నే చేసుకుంటే ముందుగా వసుంధర ను నీకు చూపించి నాన్న అనుమతి తీసుకుని, అంతా యిష్ట పడ్డాకనే తతిమ్మా విషయాలు ఆలోచిద్దాం. ఈ మాటలు నాన్నతో చెప్పి అయన మనస్సులోని ఆందోళనని అరికట్ట గలిగితే నేను తృప్తి పడి ప్రయాణ మవుతాను. ఆయన మనస్సు లో బాధ పడుతుంటే చూస్తూ వూరుకోటానికి నేను అన్నయ్య ల లాంటి వాడిని కాదమ్మా." అంటూ కామాక్షి చేతులు పట్టుకున్నాడు రమేష్. ఆమె అరచేతులు కన్నీటితో తడిసినాయి.
కామాక్షి మనస్సులో అంతవరకూ ఏర్పడి ఉన్న భావాలు, అనుమానాలూ ఒక్కొక్కటీ కారుమబ్బులు విడిపోయినట్లు విడిపోయినాయి. వాన కురిసి వెలిసిన నిర్మలా కాశం లా ఉన్నదామే మనస్సు. తమ్ముడు తప్పు దారిని పడుతున్నాడని యిప్పుడామే అనుకోవటం లేదు. అతని మనస్సు పూర్తిగా అర్ధమయింది.
"ఇంకా నా మాట నమ్మవా , అక్కయ్యా?"
"నీమీద నాకేమీ అపనమ్మకం లేదురా. నాకు గాని, నాన్న కు గాని కష్టం కలిగించే పని నువ్వేప్పుడూ చెయ్యవని నాకు తెలుసు. కాని నాన్న మనోవేదన చూసి నేనూ అనుమానించక తప్పలేదు. నాన్నకు నేను నచ్చ చెపుతాను. నువ్వు సుఖంగా వెళ్లిరా" అన్నది కామాక్షి తమ్ముడి తల నిమురుతూ. పసివాడిలా అయిపోయాడు రమేష్.
మర్నాడే తండ్రి నడిగి డబ్బు తీసుకుని గుంటూరు వెళ్ళిపోయాడు రమేష్.
కామాక్షి ద్వారా అన్ని సంగతులూ తెలుసుకున్నాక నాగభూషణానికి కొంత మనశ్శాంతి కలిగింది.
* * * *
రమేష్ గుంటూరు వెళ్లేసరికి సురేంద్ర గదిలో లేడు. అతనూ యింటి వద్ద నుంచి యింకా రాలేదు. ఆరోజునే ఒక ఉత్తరం వ్రాసి వసుంధర కు పోస్టు చేశాడు రమేష్.
"వసుంధరా,
"నేను ఊళ్ళో లేనప్పుడు నువ్వు వచ్చి వెళ్ళావనీ, తనతో చాలాసేపు మాట్లాడవనీ మా మరిది చెప్పాడు. నువ్వు చాలా మాటకారి వనీ, వినయ విదేయతలు కలదాని వనీ, మా మరిది చెప్పాడు. నువ్వు చాలా నచ్చావుట అతనికి. నిన్ను నేను చూడకపోయినా మా మరిది చెప్పిన మాటల్ని బట్టి అన్నీ నేనూ ఒప్పుకోక తప్పింది కాదు. ఎంతయినా ఆడది ఆడదే. నేను ఎంత తెలివి గల దానినయినా, రచయిత్రి నైనా , ఎన్ని కబుర్లు చెప్పగలిగినా , మావారి భావాలకు అనుగుణం గా నడుచు కోవలసిందే. వారి మనస్సు నొప్పించ కుండా, వారి ప్రేమ, ఆదరాభిమానాలు పొందటానికి ఎంతో ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం లో చాలా వరకు కృతకృత్యురాల్ని అయినాను. పోనీలే! ఏమిటో నా గొడవలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఎందుకు రాస్తున్నా నంటే , సాటి స్నేహితురాలి వనీ, నా యందు ఇష్టం చూపుతున్నావని పిచ్చాపాటి కబుర్లు రాస్తున్నాను. మగవార్ని గురించి మనం ఎన్నకుకున్నా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది కదా!
"స్త్రీ పాత్ర నాటిక రిహార్సల్సు వేస్తున్నారా! కామేశ్వరి పాత్ర ఎట్లా ఉన్నది? ఆ వేషం లో నిన్ను చూడాలని ఉంది. ఈలోగా నిన్ను చూట్టానికి నాకు వీలు పడక పోవచ్చు. ఏదయినా మనస్సులు విప్పి చెప్పుకోటానికి ఈ ఉత్తారాలూ చాలవూ!
"మా మరిది రమేష్ చాలా మంచివాడు. మంచి రచయిత. ఎన్నో కధలూ, నవలలూ రాశాడు. మంచి మాటకారి. మాటల సందర్భం లో అతనే మయినా నీకు బాధ కలిగించే మాటలంటే నువ్వేమీ అనుకోకు వసుంధరా.
"వెంటనే జాబు రాస్తావుగా!
నీ స్నేహితురాలు,
సరోజ."
ఆడవాళ్ళ దస్తూరి లో ఉత్తరం పూర్తీ చేసి పోస్టు చేశాడు రమేష్.
తను వ్రాసే ఉత్తరాలూ, వసుంధర వ్రాసే ఉత్తరాలూ తల్చుకుంటే రమేష్ మనస్సులో అనేక రకాల భావాలూ, ఆలోచనలూ దొర్లినాయి. వసుంధర మంచి చలాకీగా ఉంటుంది. కాని ఆ చలాకీతనమే ఆమె మనస్సును తనకు అర్పింప చేస్తుందా!
మర్నాడే తన ఊరి నుంచి వచ్చాడు సురేంద్ర.

7
సురేంద్ర ఊరి నుంచి వచ్చినప్పటి నుంచీ అదో మాదిరి గా ఉన్నాడు. ఏవో ఆలోచనలతో సతమత మైపోతున్నాడు. తన మనస్సులోని ఆలోచనల నూ,భావాలను తనంతట తానుగా చెప్పుకోలేడు. అతనికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఏవీ వెలుపలికి రానీయడు. ఏ యంత్రమయినా దానంతట అదే తిరగదు. అది తిరగటానికి ఏదో రకమైన ఇంకొక శక్తి కావాలి. అది విద్యుచ్చక్తి గాని, ఆవిరి శక్తి గాని ఏదయినా సరే. సురేంద్ర కూడా అలాంటి యంత్రం లాంటి వాడే. అతనిలోని భావాలనూ, అభిప్రాయాలనూ ఎదుటివారు వెలికి తీయాలి. అందుచేతనే అతను తెలివితేటలూన్నా సహజంగా రాణించలేడు. అతని భావాలను వెలుపలికి లాగాలి.
"ఏం, రా, మాట్లాడవే? కొత్త పెళ్లి కూతురులా అట్లా ఉన్నావెం?' అన్నాడు రమేష్.
"ఏం లేదురా, మావయ్య కూతురు శ్యామసుందర్నీ గురించి చెప్పానుగా? వట్టి ముదినాపసాని. డాన్ని నన్ను చేసుకోమని, మా మేనమామ రాయుడు గారు పట్టు బడుతున్నారు. చిన్నతనం లోనే ముచ్చటగా పెళ్లి చెయ్యాలట. అందుకని అమ్మా, నాన్నా నాకు తెలీకుండానే ఒప్పుకున్నారు. ఎంత బాదొచ్చి పడ్డదో ఆలోచించరా" అన్నాడు సురేంద్ర , గంబీరంగా ముఖం పెట్టి.
'ఓస్, అంతే కదరా! పెళ్లి చేసుకో మన్నారు గాని, బండ నేత్తుకో మానలేదుగా? అందులోనూ మేనమామ అసెంబ్లీ మెంబరు. పలుకుబడి కలవాడు. అంతోటి పెద్ద మనిషికి యింతోటి అల్లుడు దొరకడం అదృష్టం కదూ!" నవ్వుతూ అన్నాడు రమేష్.
"నాకీ పెళ్లి ఇష్టం లేదురా."
"ఏం , బాబూ, ఎవరినయినా ప్రేమించేశావా?"
"నేను రమేష్ ని కాను, ఉత్తరాలలో సంబంధం కుదుర్చు కోవటానికి."
"ఓరి అపర ప్రవరాఖ్యా! అసలు సంగతి చెప్పవోయ్ , చంపక!"
"చెప్తా విను. శ్యామసుందరి పొట్టిగా, లావుగా , దిబ్బసకుక్కలా ఉంటుంది. ఎర్రగా బుర్రగా బాగానే ఉంటుంది. దాని మనస్సులో బ్రహ్మాండమైన ఆలోచనలూ, తెలివితేటలూ గూడు కట్టుకుని ఉన్నయ్యి. అంచేత నా కిష్టం లేదు. అది నన్ను తినేస్తుంది. మా అమ్మ కేమో మేనకోడల్ని చేసుకోవాలని వుంది. మా నాన్నకేమో పార్టీ అభిప్రాయాలూ, పార్టీ సిద్దాంతాల రీత్యా చుక్కెదురు. కాని ఈ సిద్దాంత రీత్యా సంబంధం వదులుకోవటానికి యిష్టం లేదు. అందరి యిష్టమే అయన యిష్టం. రాజకీయాల్లో మాత్రం కత్తులు దూసుకుంటారు. అప్పుడు బావామరుదులు కారు. కాని ఒక్కటే సుగుణం. ఏమిటంటే యిద్దరిదీ ఒక నియోజక వర్గం కాదు. వేరు వేరు నియోజక వర్గాలు. అందుకని మర్యాదగానే ఉంటారు. శ్యామ సుందరికి నేనంటే యిష్టమే. కాని నాకే యిష్టం లేదు." అన్నాడు సురేంద్ర ఏదో పెద్ద బరువు దింపినట్లుగా తన మనస్సు తేలిక పడినట్లుగా భావిస్తూ.
"ఈ విషయాలు మీ వాళ్ళకి చెపితే ఏమన్నారు?"
"ఏ విషయాలు?"
"శ్యామ సుందరి దిబ్బిసకుక్కల్లె ఉంటుందని."
"అదేం కుదరదు. అంతా కలిసి మా పెళ్లి చేసేస్తారు."
"సరే, ఒక పని చెయ్యి. ఉత్తరాలు మీ మామయ్యకీ , మీ నాన్నకి రాసెయ్యి. ఏమనంటే శ్యామసుందర్ని చేసుకోవటానికి యిష్టమే, కాని చదువు సాంతం పూర్తయి ఉద్యోగం లో ప్రవేశిస్తేనే గాని చేసుకోనను. అట్లా ఓ నాలుగేళ్ళు వాయిదా వెయ్యి. తరవాత సంగతి చూడచ్చు. ఈలోగా శ్యామసుందరి పొడుగు ఎదుగుతుందేమో? అప్పటికి చిన్నతనం బుద్దులూ పోవచ్చు. ఏమంటావ్?" అన్నాడు రమేష్.
"సరే" అన్నాడు సురేంద్ర , ఒక నిశ్చయానికి వచ్చినట్లు.
వాన కురిసి వెలిసినట్లుగా ఉంది సురేంద్ర మనస్సు. చిన్నతనం లోనే ప్రేమించి బావను చేసుకోవాలను కుంది శ్యామసుందరి. 'నాకు శ్యామ సుందరి భార్య కావట మేమిటి? ఎట్లాగయినా వదిలించు కోవా'లనుకున్నాడు సురేంద్ర. ఎట్లాగయినా వలచి, వలపించుకుని ప్రేమ లతను పెంచి, పోషించి తనతో పెనవేసుకొవటానికి అత్ర పడుతున్నాడు రమేష్. వసుంధర విషయంలో. విభిన్న అభిప్రాయాలు కల ఈ స్నేహితులు అనుకోకుండా ఆరోజున సినిమాకు బయల్దేరారు.
సాయంత్రం ఆరు గంటలయింది. బ్రాడీ పేట సెంటరు లో ఉన్న హోటల్లో కాఫీ త్రాగి బయటికి వచ్చారు. హోటళ్ళ లో రేడియో లు గ్రామ ఫోను రికార్డులను వినిపిస్తున్నాయి. పేవ్ మెంట్ల మీద పాత పుస్తకాల కొట్లూ, పళ్ళ కొట్లూ , పూల కొట్లు తాత్కాలికంగా వేలుస్తుంటాయి. ఆ కొట్ల ముందే పది మంది పోగయి తమ క్కావలసిన వన్నీకొనుక్కుంటారు. ఈ చిన్న కొట్ల ముందున్న రద్దీ పెద్ద కొట్ల ముందు ఉండదు.
