ప్రభాకర్ గొంతుక తగ్గించి అన్నాడు.
"ఆ మాట గట్టిగా అనకండి-- సర్వర్ల చెవిలో పడ్డాయంటే గయ్యి మంటారు. అవి సర్వర్ల ఫోటోలు కావు.... దొంగతనం లో ఆరితేరిన వారి ఆకారాలు--"
"నిజం?"
"ముమ్మాటికి నిజం! అందరి జాగ్రత్త కోసం దొంగల ఫోటోలు అలా వ్రేలగడతారు!"
సర్వరు బల్ల దగ్గర కొచ్చి "ఏం కావాలి?" అని అడిగాడు.
"ఏం తెప్పించమంటారు?' అంటూ ప్రభాకర్ ఉష కేసి చూశాడు.
"ఇందాకటి నుంచో పెసరట్ల కోసం కలవరిస్తూ ఇప్పుడు వాటి మాటే మర్చిపోయారా ఏం?"
ప్రభాకర్ చెరొక పెసరట్టు తెమ్మని చెప్పాడు.....
"షీరో పుస్తకం ఈ కొస నుంచి ఆ కొస వరకు బట్టీ పట్టేశాను మీరు చెప్పినట్టు....." అన్నాడు ప్రభాకర్.
"గుడ్!" అని అభినందించింది ఉష.
"రేపు గండం గడిచినట్టే--' అంటూ తృప్తిగా నవ్వింది.
"గండమా! నా స్టడీ చూసి మీ నాన్నగారు డంగై పోరూ?"
ఉన్నట్టుండి ప్రభాకర్ కుర్చీలో నుంచి అమాంతం లేచి నిలబడి పోయాడు. 'అటు చూడండి ఉషారాణీ!" అంటూ చెయ్యి చూపుతూ.
ఉష వెనక్కి తిరిగి చూసి, నోటికి పమిట చెంగు అడ్డం పెట్టుకుని నవ్వింది.
'ఇందాక సరిగా చూడలేదు. ముసుగూ అదీ ఉంటె ఏ ఉత్తర హిందూస్తానీ ఆవిడో అనుకున్నాను. ఇప్పుడు చూద్దును కదా.....అసలు సిసలైన దక్షిణాది బోడమ్మ! మడి, ఆచారానికి మరో పేరైన బోడమ్మ....!!"
"గట్టిగా అనకండి! ఆవిడకు వినపడగలదు. ఆవిడ మాత్రం. మనిషి కాదా? .. .ఆవిడకు తినాలని ఉండదా?"
"ఆవిడ తినటం లోనే ఉంది లెండి.... మన మాటలెం వింటుంది? విన్నా తెలుగెం తెలుస్తుంది? తలలు బోడులైనా, తలవులు బోడులైనా....?"
"ఈ సర్వర్ ఎంతకీ రాడెం? పిండి దగ్గర్నించి ఇప్పుడే రుబ్బుతూ కూర్చుంటారో , ఏమో? అని విసుక్కుంది ఉష.
"ఆవిడ చెయ్యి నేను స్టడీ చెయ్యాలి! రకరకాల వాళ్ళ చేతులు చూస్తుంటేనే ప్రాక్టీసవుతుంది..."
ఉష తలూప లేదు.
"మీరు చూస్తానంటే ఆవిడ సరేనని చెయ్యి చాపుతుందా ఏమిటి?' అంది.

"వూరికే చూస్తామంటే ఎవరైనా ఎగబడతారు---"
"అయినా పోనిస్తురూ! మొదటే ఆవిడకు చూడ్డమేమిటి?"
"ఇందాక మీరేగా అన్నారు ఆవిడ మనిషి కాదా అని? మళ్ళా ఈ పట్టింపు లెందుకో? అదీ గాక ఈవిడే మొదటావిడని మీరు ఎందు'కనుకుంటున్నారు? పుస్తకం చదవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి వంద మంది చేతులు చూశాను. నా చేతులు లక్షసార్లు చూసుకున్నాను. ఒక వ్యాసం చదవటం, నాచేతిలో ఆ లక్షణాలు న్నాయో, లేవో చూసుకోవటం ... భలే సరదాగా ఉంది లెండి! మొదట ఏమో అనుకుని బెంగ పెట్టుకున్నాను గాని....."
"ఇంతకీ ఆవిడ చెయ్యి చూడక తప్పదంటారు! ఆవిడ వప్పు కుంటుందా అని నా అనుమానం...."
ప్రభాకర్ విసుక్కున్నాడు.
"అనుమానం ముందు, తర్వాత మీరు పుట్టారు. ఇందాకల్లా ఇడ్లీలో తేలంటూ హైరానా పడి పోయారు. ఇప్పుడు ఈవిడ గురించి సందేహంతో సతమతమైపోతున్నారు....జంకుతూ ఉంటె ఏ పనులూ జరగవండీ!"
ఉష బిత్తరి చూపులు చూసింది.
"ఏమో! ఆవిడ వేసే చీవట్లన్నీ తినటానికి నేను సిద్దంగా లేను. మీకంత సరదాగా ఉంటె అవిడిచ్చినవన్నీ పుచ్చుకోండి...."
'ఆడవాళ్ళకు ఆదికి ముందే భయం అన్నిటికీ... అవిడేదురుగా ఖాళీ కుర్చీలున్నాయి . అక్కడకు పోయి కూర్చుందాం , వస్తారా?"
"నేను రాను...."
"రానంటే వూరుకుంటాననుకున్నారా?"
"వూరుకోక..?"
"ఆ మాట మీదే ఉండండి.... రేపు మీ నాన్న గారి చెయ్యి చూడకపోతే నాకు గడవ దనుకున్నారా?'
ఉష మెత్తబడింది.
"చెప్తే వినిపించుకోరండి-- ఒకటే మొండి పట్టు.... పదండి!" అంతో లేచింది.
ఇద్దరూ వెళ్ళి ఆవిడ కెదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. ఆవిడ చిరాగ్గా ఒక మాటు ఇద్దరి కేసి చూసింది. ఆవిడ వయస్సు నలబై అయిదు, ఏబై ఏళ్ళ లోపు ఉంటుంది.
ఎలా పలకరించాలా అని ఒక క్షణం మనస్సులో ఆలోచించుకున్నాడు ప్రభాకర్.
"నన్ను మర్చిపోయావా మామీ?' అంటూ వచ్చీ రానీ అరవం లో సంభాషణకుపక్రమించాడు.
ఆవిడ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది.
"ఎవరు?" అనడిగింది అరవం లో.
"నేను....నేను.... మీ వాడితో కలిసి చదువు కున్నాను...."
"మా వాడితో చదువుకున్నావా నాయనా?"
ఆవిడ ఆప్యాయంగా పలకరించేసరికి ప్రభాకర్ ఉబ్బితబ్బిబై పోయాడు.
'అవును మామీ! వాడూ, నేను ప్రాణానికి ప్రాణంగా ఉండే వాళ్ళం. ఒకటి, రెండు సార్లు మీ ఇంటి కొచ్చాను కూడా-- మీరు బొత్తిగా మర్చిపోయారు. వాడు ఎప్పుడూ గొడవ చేస్తూ ఉండేవాడు మీ చెయ్యి చూడమని -- నాక్కాస్త సాముద్రికం వచ్చులెండి అందుకని-- అయినా నేను వచ్చినప్పుడల్లా మీరు మడి కట్టుకుని ఏ వంట లోనో ఉండేవారు. నిన్న కూడా వాడు మరీ చెప్పాడు మీ చెయ్యి చూడమని....ఏదీ? మీ చేయి చాపండి!"
ప్రభాకర్ అనుకున్నట్టు ఆవిడ సంబర పడిపోలేదు. సరికదా బడబడా లాడుతూ అరగంట సేపు ఆపకుండా మాటలు దోర్లించింది. ప్రభాకర్ కు అరవం సరిగా రాదు కాబట్టి సరిపోయింది కాని లేకపోతే ఆ మాటలకు తల దిమ్మేత్తి పోయి ఉండేది....
"వెధవ పోకిరీ వేషాలు! ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను.... నాకు చెయ్యి చూస్తాడట రౌడీ వెధవ ! వీడి జాతకం ఎవడిక్కావాలి? అంత చేతులు చూడాలని ఉబలాటంగా ఉంటె ఏ చెట్టు కిందో బిచాణా పరచుకుని కూర్చోక పోయాడా?.... మా వాడితో చదువుకున్నాడట. ఎవడో వాడు? పదో ఏట పసుపు, కుంకుమ పోగొట్టుకుని, ఆ ఇంటా వంట చేసుకుని నా తంటాలు నేను పడుతుంటే వీడెవడికో నేను దొరికాను చెయ్యి చూడ్డానికి... వీడి ఆటలన్నీ నా ముందా? ఇలాంటి వాళ్ళను సవాలక్ష మందిని చూశాను.... వీడి నోరు పడిపోను.... వీడి శార్ధం బెట్టా...."
ఇదీ ఆవిడ తిట్టిన తిట్ల సారంశమని తర్వాత ఉషను బ్రతిమాలుకోగా బ్రతిమాలుకోగా తెలిసింది.
సర్వర్ పెసరట్లతో వచ్చాడు.
"ఇక్కడకోచ్చారా? నేను మీరింకా ఎమయ్యారా అని వెతుకుతున్నాను--' అన్నాడు.
ప్రభాకర్ "తిందాం పట్టండి!" అన్నాడు ఉషతో.
'ఇంకా పెసరట్లెం తింటాం లెండి? తిన్న తిట్లు చాలు!' అంటూ నీరసంగా లేచింది ఉష.
దారిలో ప్రభాకర్ అన్నాడు.
"మీరు జోస్యం బాగా చెప్పగలరు సుమండీ? ఆ బోడమ్మ చీవట్లేస్తుందని మీరు ముందే చెప్పారు. నేను విన్పించుకుంటేనా? మీ జోస్యం ముందు నా హస్త సాముద్రికం ఏపాటి? నేనింకా ఆవిడ చెయ్యి చూసి ఫలితం చెప్పాననుకున్నాను కాని మీరు ముందుగానే ఫలితం చెప్పేశారు.....!"
5
టిక్కెట్టు కొనుక్కోవటానికి గీత క్యూలో నించున్నది.
"కాళ్ళు నొప్పెట్టేలా ఎంతసేపు నించుంటారు కాని బాక్స్ లో కూర్చుందాం రండి. టిక్కెట్లు కొన్నాను....'
గీత ఉలిక్కిపడి అటు తిరిగింది.
"మీరా?" అంటూ క్యూ లోంచి ఇవతల కొచ్చి నిలబడింది.
