Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 10

     "ఎన్నాళ్ళ కు కనబడ్డారు...!  ఆరోజు ట్రాన్సి స్టర్ తెచ్చేలోగా వెనక్కి తిరిగి చూడకుండా ఉడాయించారేం? మళ్ళా ఎప్పుడొస్తారు మా ఇంటికి?"
    "ఆ ముసలాయన మీ ఇంట్లో ఉన్నంత వరకు అటు తిరిగి చూడమన్న చూడను!' అని జవాబిచ్చాడు మోహన్.
    "ఏ ముసలాయన....?"
    "పొట్టిగా.... లావుగా....కోపంగా...."
    "ఆ ముసలాయనా? ఇంట్లో నుంచి వెళ్ళమంటే అయన ఎక్కడి కెళ్తాడు? అయన మా నాన్నగారు...."
    మోహన్ కెవ్వున కేకవేశాడు.
    "మైగాడ్! మీకు అలాంటి నాన్న ఉంటారనుకోలేదు సుమండీ! మీ పొదుగులో సగం అయన, అయన అడ్డం లో సగం మీరు ఉన్నారు.... ఇంకా మీ చుట్టమేమో అనుకున్నాను.....
    "అయన మా నన్నగారైతే మాత్రం కొంప ముంచుకు పొయిందేమిటి?"
    మోహన్ నిస్సహాయంగా నిట్టూర్చాడు.
    'అంతా మించి పోయింది లెండి ... ఇంక చేసేదేమీ లేదు-- బస్సులో ఒక మాటు ఆయనకి, నాకూ ఎంత తగువయిందనుకున్నారు? 'ఎక్కడి కేళ్తున్నారు?' అని మర్యాదగా అడిగితె మంచీ, చెడు లేకుండా 'ఎక్కడో అక్కడ దిగుతాను నీకెందుకయ్యా?' అంటూ ఎగిరి పడ్డాడు. ముసలాయనకు కాస్త వెర్రి కాని ఉన్నదేమో అనుకుని మరి మాట్లాడకుండా కూర్చుంటే మళ్ళా సిగ్గు లేకుండా నన్ను పట్టుకుని "ఫలానా చోటికి వెళ్ళాలంటే ఎక్కడ దిగాలి?" అని ఎంక్వయిరీ? నాకు వళ్ళు మండుతుందా , మండదా చెప్పండి? అందుకే గంగలో దిగమన్నాను. ఆ ముక్క పట్టుకుని అయన అర్ధగంట సేపు తైతక్క లాడాడు...."
    గీత అయోమయంగా చూసింది.
    "మీరు మర్యాదగా అడిగితె ఆయనెందుకలా గసురుకున్నారు చెప్మా?"
    "ఎందుకేమిటి? లైక్ పోల్స్ రిపెల్, అన్ లైక్ ఫోల్స్ ఎట్రాక్ట్ అని ఫిజిక్స్ లో ఒక పాఠం ఉంది లెండి...."
    "అంటే ఏమిటి?"
    'అంటే ఆడా, మగ మధ్య ఆకర్షణ , మగ, మగ మధ్య సంఘర్షణ అని...."
    గీత ఆశ్చర్యపోయింది.
    "ఇదేమిటండి ఇలా ఉంది మీ పాఠం! అడ  వాళ్ళు ఒక చోటుకి చేరితే జుట్టూ జుట్టూ పట్టుకుంటారని అంటారు కాని మగవాళ్ళు కాట్లాడుకుంటారని నేను ఎప్పుడూ వినలేదే? కనీసం అలా ఏ సామెత లోనూ లేదే....?"
    "సామెతలు ఇప్పటివా ఏమిటి లేస్తురూ? అని కలియుగాని కేలా పనికొస్తాయి?"
    గీత సాలోచనగా చూసింది.
    "అదేం కాదు....ఆరోజు మీరు ఏ చొక్కా వేసుకున్నారు?"
    "చొక్కాను బట్టి మీ నాన్నగారికి తిక్క పుట్టుకోస్తుందా?"
    "అలోచించి చెప్పండి ఏ చొక్కా వేసుకున్నారో?"
    "ఆలోచించాల్సిన అవసరం లేదు లెండి..... నేను సాధారణంగా ఎప్పుడు బైటి కెళ్ళినా ఈ చొక్కా వేసుకుంటాను.... ఈ బుష్ కోటంటే నాకు చాలా ఇష్టం....."
    "గీత అంతా బోధపడినట్టు తలూపింది.
    "అలాచేప్పండి! ఇందాక మీరన్న మాటే కరెక్టు....!'
    "ఏ మాట?"
    "చొక్కాను బట్టి తిక్క.. మా నాన్నగారికి ఇలాంటి బొమ్మల చొక్కాలంటే బొత్తిగా ఇష్టం ఉండదు.... ఇలాంటివి ఎవరన్నా వేసుకుంటే వాళ్ళు మా నాన్నగారి దృష్టి లో పోకిరి వెధవలు. రౌడీ వెధవలు... జులాయి వెధవలు....
    మోహన్ వినలేక చెవులు మూసుకున్నాడు.
    "తెలిసింది! మీ నాన్నగారు లక్షర్చన చేయగలరన్న మాట....? అయినా మీ నాన్నగారి కోసం నేను గా పంచా గుడ్డలు కట్టుకోలేను సుమండీ!"
    "పోనీయండి.. సినిమా కొచ్చి అయన గొడవేమిటి? అంది గీత అయిష్టంగా.
    "మరే ! రామేశ్వరాని కెళ్ళినా ఏలినాటి శని తప్పనట్టు.... అందుకే నేను మొదటే చెప్పాను లోపలి కెళ్దాం రమ్మని...."
    "ఏం ధైర్యం?"
    "దేనికి?"
    "కాకపోతే మీతో పక్కన కూర్చుంటానని ఎలా అనుకున్నారు?"
    "మరి ఎవరి పక్కన కూర్చుంటారు?.... కొంపదీసి మీ నాన్నగారిని వెంటేసుకుని రాలేదు కదా...?' అంటూ గాభరాగా అటూ ఇటూ చూస్తూ అడిగాడు మోహన్.
    గీత నవ్వు పట్టలేక పోయింది.
    "మళ్ళా మీరు పరుగు పుచ్చుకో నక్కర్లేదు లెండి.... నాన్నగారు వూళ్ళో లేరు... ఆయనుంటే సినిమాలకే వెళ్ళనివ్వరు అయితే అయన లేనప్పుడల్లా నేనిలా వచ్చి ఆ వంతూ ఈ వంతూ చూస్తూనే ఉంటాను లెండి...."
    "వద్దంటే వంద మాట్లు వెళ్ళ బుద్దేస్తుంది... వెళ్ళమంటే ఒక్కసారితో సరదా వదిలి పోతుంది కాని.... ఏమన్నా మీ నాన్నగారు ఆ జడ్జీ లాంటాయనే లెండి."
    గీతకు అర్ధం కాక "ఏ జడ్జి ?" అనడిగింది.
    "సంగీతం పోటీలో జడ్జి .... అయన గురించి మీరనుకోలేదూ ఆ ముక్క మీ నాన్నగారికి కూడా సరిపోతుంది...."    
    "నేనేమనుకున్నానండి...? నాకు జ్ఞాపకమే లేదు....."
    "కర్కోటకుడు?"
    గీత మూతి ముడుచుకుంది.
    "మా నాన్నగారి నెందుకండి అలా ఆడి పోసుకుంటారు?"
    గీత కోపం చూసి మోహన్ కంగారు పడ్డాడు. మాట తప్పిస్తూ 'ఆటకు టైమయినట్టుంది మీరిక్కడే నిలబడి చూడాలనుకుంటున్నారా?" అనడిగాడు.
    "తెలిసిన వాళ్లెవరైనా చూస్తె....?"
    మోహన్ మెల్లిగా నచ్చ జెప్పాడు.
    'అందుకే బాక్సు లో కెళ్ళి కూర్చుందాం రమ్మంటున్నాను.... బాక్సు లో కూర్చుని కర్టెన్ వేసుకున్నా మంటే తెలిసిన వాళ్ళూ చూడరు. తెలియని వాళ్ళూ చూడరు. అట జరుగుతున్నంత సేపూ అందరూ ఆ ధ్యాస లో ఉంటారు. కాకపోయినా చీకట్లో మనల్ని ఎవరానవాలు కడతారు లెద్దురూ? అయినా ఇదేం అపురూపమైన విషయమని. ఎన్నో జంటలు వస్తూనే ఉంటాయి. అందులో మనం ఒకళ్ళం. మనల్ని ఎవరు తేరిపార చూస్తారు? నలుగురితో పాటు నారాయణ అన్నారు పెద్దలు.
    గీత మోహన్ వెంట వెళ్ళింది. బాక్సు లో కూర్చుంటూ గీత నవ్వింది.
    "చిన్నప్పుడు సినిమాల్లో బాక్సు లంటే ఏమిటో అర్ధమయ్యేది కాదు.... ఇంట్లో బట్టలు పెట్టుకునే పెట్టె లాంటివే అనుకునేదాన్ని. అందులో ఎలా కూర్చుంటారో అర్ధం కాక తికమక పడిపోయేదాన్ని."
    "నేనేం అనుకునే వాడినో తెలుసునాండి? బాక్స్ అంటే అందులో కుస్తీ పట్టేవాళ్ళు మాత్రమే కూర్చోవాలి కాబోలు అనుకునేవాడిని..."
    "నానార్ధాలతో నానా గొడవ.... పదాల వాడకంలో కూడా ఈ పొదుపేమిటో....?"
    "మాటలే కరువైనట్టూ పదింటిని పట్టుకొచ్చి ఒక్క మాటతోనే మూట కట్టేశారు మహాత్ములు. ఇంట్లో బాక్సు, సినిమాల్లో బాక్సు, ప్రతికల్లో బాక్సు-- "మధ్యలో మోహన్ కెవ్వుమంటూ అరచి" ఇంతసేపు మార్చే పోయాను సుమండీ.... 'సినీ రధం' లో నా ఫోటో పడింది...." అని చెప్పాడు.
    గీత ఆశ్చర్యపోతూ అడిగింది. "ఏం ఘనకార్యం చేశారని?" అంటూ.
    మోహన్ జేబులో నుంచి 'సినీరధం' పత్రిక తీసి గబగబా పేజీలు  తిప్పాడు. ఒక పేజీ దగ్గర పుస్తకాన్ని మడిచి పట్టుకుని "ఇదే నా ఫోటో.... క్రింద ఏం ఉందొ చదవండి!" అన్నాడు.
    గీత చదివింది.
    "సినిమాల్లో చేరటానికి ఉత్సాహ పడుతున్న యువకుడు . 5.6 " ఎత్తు. బరువు 120 పౌన్లు. స్పుర ద్రూపి. నాటకానుభవం ఉన్నది. కొత్త హీరో కోసం ప్రేక్షకులు కలవరిస్తున్న ఈ రోజుల్లో ఇతడు వెండి తెరకు వర ప్రసాదం కాగలడు."
    పైన మోహన్ పాస్ పోర్టు సైజు ఫోటో ఉన్నది.
    చక్కని వాడు అనుకున్నది గీత మోహన్ వంక ప్రేమగా చూస్తూ.
    "ఇదివరకు సినిమాలో వేసినట్టే చెప్పారు.... అంతా వట్టిదే అన్నమాట!"
    "నన్ను నమ్మండి. నేను వెయ్యటమైతే వేశాను. హీరోయిన్ నాట్యం చేస్తుంటే ఆవిడ వెనకాతల 'హై,హై !' అంటూ పదిమంది మగవాళ్ళు డాన్సు చేస్తారు. వాళ్ళలో ముందు నించున్న వాడిని నేనే.... అయితే ఆ సీను కాస్తా సెన్సారు వాళ్ళ కత్తెరకు ఎర అయిపొయింది. అందువల్ల నాకు ప్రేక్షకుల కటాక్షం చూరగొనే అవకాశం లేకపోయింది. అందుకని....."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS