Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 8

 

    గీత కాస్సేపు మవునంగా నిలబడి గిరుక్కున తిరిగి లోపలి కెళ్ళింది. మోహన్ తల చేత్తో పట్టుకున్నాడు. గీత మరో క్షణం లో మంచి నీళ్ళ గ్లాసుతో తిరిగొచ్చింది.
    'అసలే దాహంతో వచ్చారు. దానికి తోడు ఇంత సేపూ ముసలాయన సోది చెబుతూ కూర్చున్నారు.... చాలా అలసిపోయారు కాని కాసిని మంచినీళ్ళు తాగుతారా?" అని గీత గ్లాసు అందించింది.
    మోహన్ "థాంక్స్!" అంటూ నిమిషం లో గ్లాసు ఖాళీ చేశాడు.
    గీత ఒక్క క్షణం మౌనంగా వూరుకుని "ముసలాయన చాలా కర్కోటకుడిలా ఉన్నాడు సుమండీ!" అంది.
    "కర్కోటకుడని మెల్లిగా అంటారేమిటి? మార్కు లివ్వటానికి ఎలా గిలగిలలాడి పోయాడని? స్వంత సొమ్మేదో ధారపోస్తున్నట్టు....! నిజంగా జడ్జీ పని చేసి ఉన్నట్టయితే అందరికీ వరస పెట్టి అమాంతం ఉరిశిక్షలు వేసి ఉండేవాడు మహానుభావుడు!"
    గీత బుగ్గలు లోత్తలుపడ్డాయి.
    "కొందరంతే లెండి. చాలా క్రూరంగా ఉంటారు."
    "ఉంటె ఉన్నాడు. అలాంటాయన్ని పెద్ద చెసి పెత్తనం ఇవ్వటమేమిటి? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందట!"
    "మీరు మాత్రం ఏం తీసి పోయారు లెండి.... అతన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించారుగా? తగిన శాస్తి చేశారు లెండి....మీరెక్కడ ఉంటున్నారు?"
    "ఇక్కడికి దగ్గరే నా రూం. ఒక్కడినే ఉంటున్నాను.... ఏం తోచదు.... రేడియో ఉంటె నిక్షేపంలా కాలక్షేపం చెయ్యొచ్చు కాని నా దగ్గర లేదు...."
    గీత అర్ధం కానట్టు చూసింది.
    "లేకపోతె మించిపోయిందేముంది? ఇప్పుడు కొనుక్కోవచ్చుగా?"
    "కొనుక్కుంటే తీరిపోతుంది కాని వినటానికి తీరికేది?"
    "తీరిక లేకపోతె రేడియో ఎందుకు?"
    "ఐమీన్ ....! ఇన్నాళ్ళు తీరిక లేదు కాని ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను.... మళ్ళా బుక్కింగు లు వచ్చేదాకా విశ్రాంతే....తీరా వందలకు వందలకు పోసి రేడియో కొంటె కొన్న మర్నాటి నుండి నేను స్టూడియో ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.."
    గీత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది.
    "మీరు నటిస్తారా?"
    "ఏదో కొంచెం...."
    "మంచివారే ఇంతవరకు ఆ సంగతి చెప్పారు కాదేం?"
    సంభాషణ చెయ్యి జారిపోతున్నందుకు మోహన్ తల గోక్కున్నాడు.
    "చెప్తే ఏం చేసేవారు?" అన్నాడు నిస్పృహగా.
    "ఏం చేయను. భయపడి పోకండి.... మీరు నాకు స్టూడియో లు చూపిస్తారా....?"
    'అలాగే....! ఈసారి నేను స్టూడియో కు వెళ్ళినప్పుడు మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాను.... అంతవరకూ రూం లో బోరెత్తి పోకుండా రేడియో ఒక మారిస్తారా?" తెగించి అడిగేశాడు మోహన్.
    "మా ఇంట్లో రేడియో ఎక్కడుంది?"
    "ఇందాక పాట వినిపిస్తే మీ రేడియో ఏమో అనుకున్నాను? మీరేనేమిటి?"
    "అది సుధాకర్ గారిది.... మాది కాదు... అయన కభ్యంతరం లేకపోతె మీరు నిక్షేపం లా తీసుకెళ్లచ్చు..."
    మోహన్ సంభాషణ ఒకదారిని పడినందుకు ఉత్సాహంతో ఉప్పొంగి పోయాడు. "వాడు ఎప్పుడో పర్మిషనిచ్చాడు. మీకేం ఇబ్బంది లేకపోతె...."
    'అయన నాతొ చెప్పలేదు....తీరా ఎందుకిచ్చావని నన్నడిగితే.....?"
    "అదా మీ సందేహం? " అంటూ మోహన్ బైట కొచ్చి సుధాకర్ ను లాక్కొచ్చాడు.
    సుధాకర్ "మీ ఇష్టం మీరేం చేసుకున్నా సరే..." అన్నాను ఈ గొడవతో తనకేం సంబంధం లేనట్టు అంత భారాన్ని గీత మీద వదిలేసి.
    గీత ట్రాన్సి స్టర్ తెచ్చిస్తానంటూ లోపలి కెళ్ళింది.... మోహన్ కిటికీ దగ్గరకెళ్ళి చువ్వలు పట్టుకుని బైటికి చూస్తూ నిలబడ్డాడు....
    "అదేమిటిరా? ఎక్కడికి?"
    సుధాకర్ మాటలు వినిపించుకోకుండా గేటు తలుపులు తీసుకుని వస్తున్న రామయ్య గారిని దూసుకుంటూ వెళ్ళిపోయాడు మోహన్. రామయ్య గారు కాస్తలో పడేవారే? గీత రేడియో తీసుకొచ్చి "ఆయనేరి?' అనడిగింది వీధిలో నించున్న సుధాకర్ దగ్గర కోస్తూ.
    రామయ్య గారు 'ఆ అబ్బాఎవరు?" అనడిగారు.
    "నా ఫ్రెండ్....!" అని నీరసంగా జవాబిచ్చాడు సుధాకర్.
    "మీ ఫ్రెండేమైనా రన్నింగు రేసుకు ప్రాక్టీసు చేస్తున్నాడా?"
    "నిజమే సుమండీ....! నాకు ఇంతసేపూ తట్టలేదు.... వాడికి ఆటలంటే చాలా ఇష్టం. ఒకవేళ పోటీకి కట్టాడేమో....?" అన్నాడు సుధాకర్ సాలోచనగా చూస్తూ.
    రామయ్య గారు లోపలి కెళ్ళారు.
    గీత కూడా లోపలి కెళ్ళబోతుంటే ఆ రేడియో ఇటివ్వండి అంటూ చెయ్యి సాచాడు సుధాకర్.
    గీత నవ్వింది.
    'ఆయనతో మీరేం పోటీ చేయగలరు లెండి? పోటీ చేసినా నెగ్గుతారనే నమ్మకం నాకు లేదు.... ఎంచక్కా రివటలా రయ్యిమని ఎలా దూసుకు పోయారో!"
    సుధాకర్ దిగులుగా చూశాడు.
    "వాడి రూం లో పడేసి వస్తాను....."
    "రూం లో పడేసి రావట మెందుకు బలవంతంగా. అంతగా కావాలంటే ఆయనే వచ్చి తీసు కేల్తారు లెండి.......!"
    గీత రేడియోతో సహా లోపలి కెళ్ళింది.
    "రావు హోటల్ పెసరెట్లకు ప్రసిద్ది..... వెళ్దామా.....?' అనడిగాడు గళ్ళ చొక్కా తొడుక్కున్న ప్రభాకర్ ఉష సరసన నడుస్తూ.
    ఉష కన్నా జానెడు పొడుగు...... అందమైన విగ్రహం.... చల్లని వేళ ఇద్దరూ కలిసి నడుస్తుంటే చూసే వాళ్ళకి అసూయ కలుగుతున్నది.
    "ఏ హోటల్ దేనికి ప్రసిద్దో మీకు కంఠతా వచ్చను కుంటాను---!' అంది ఉష నిండుగా నవ్వుతూ.
    "ఊళ్ళో హోటలన్నీ మనవేగా? ఏ హోట లేక్కడున్నది , ఏ రోజు దేనికి సెలవో, ఏ హోటల్లో ఇడ్లీ బాగుంటుందో, ఏ హోటల్లో ఊతప్పం బాగుంటుందో మున్నగు విషయాలన్నిటి తో మీబోటి వాళ్ళకు ఒక విజ్ఞాన సర్వస్వం అచ్చేయిస్తే క్షణం లో లక్షాధికారినై వూరుకుందును. అయితే ఏం లాభం? చేతిలో చిల్లి గవ్వ లేక నా ఆశలన్నీ కల్లలై పోయాయి. ఇంతకీ నాకు మీ అందరికీ సేవ చేసే అవకాశం లేకపోయింది....."
    ఉష మందలిస్తున్నట్లుగా అంది.
    "హోటళ్ళలో పడి తింటే వంటికి మంచిది కాదు....జబ్బు చేస్తుంది....."
    "జబ్బులు రాకపోతే వైద్యులేందుకు?' అంటూ ఆశ్చర్య పోయాడు ప్రభాకర్.
    "మందుల ఖర్చు తగ్గుతుందనే వైద్యం నేర్చు కుంటున్నారా?"
    'చంపేశారు! నేను ఎం.బి.బి.ఎస్ . వెలిగించటం నాకోసమే అనుకుంటున్నట్టున్నారు...!"
    "మరెవరి కోసం--?" అంటూ విస్మయం వెలిబుచ్చింది ఉష.
    "మూడొంతులు మా నాన్నగారి కోసం.... మిగిలిన ఒకోంతు పై వారి కోసం -- అంటే లోక కళ్యాణార్ధం....."    
    ఉష నిట్టూర్చింది.
    "వైద్యం నేర్చుకుంటే మంచిదే లెండి.... మా ఇంట్లో డాక్టర్ కోసం బోలేడంత ఖర్చవుతుంది.... స్వంతంగా చేస్తే ఆ తిప్పలెం ఉండవు.... డబ్బు మిగులుతుంది--"
    "మిగులా, తగులా? మీకు అసలు సంగతి తెలీయదు.... స్వంత మందు తింటే వున్న జలుబు, జ్వరం కాస్తా ఏ టైఫాయిడ్ లోకో దించుతుంది. కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడి పోయినట్టు -- వైద్యం పరోపకారార్ధం కాని స్వంతానికి పనికి రాదు. పైవాడైతే జ్వరం టైఫాయిడ్ లోకి దించినా, చివరకు గోతి లోకి దించినా మన ఫీజు మనకు చేతిలో పడుతుంది-"
    "వూరుకుందురూ! ఇక్కడికి మీకేం చేత గానట్టు.....!"
    "రావు హోటల్ దగ్గర కొచ్చేశాం .....వెళ్దామంటారా?"
    "హోటల్ కెళ్ళాలంటే నాకదోలా ఉంది...."
    "అదేం? మీకేమైనా మడియా?"
    "మడికి నాకూ ఆమడ దూరం....."
    "మరి?"
    "నిన్న ఒక న్యూస్ పేపర్లో చదివాను. ఒక హోటల్లో ఎవరో ఇడ్లీ తింటుంటే అందులో తేలు వచ్చిందిట..... అక్కడి నుంచి నాకు హోటల్ పేరు చెప్తేనే అసహ్యం!"
    "సరి సరి! పత్రికల మాటే నమ్మారూ? ఈరోజు ఇడ్లీలో తేలు వచ్చిందని వేస్తె మర్నాడు అది తేలు కాదట పుల్ల ముక్కట అంటూ సవరణ వేస్తారు....మీరు తేలు సంగతే పట్టించుకుంటారు కాని పుల్ల ముక్క సంగతి చూసుకోరు....'
    ఉష మూతి వంకరగా తిప్పింది.
    >మీరు మరీనండి..... పత్రికలో పడింది అబద్ద మెందుకవుతుంది? మాకాలేజీ హాస్టల్లో సాంబారు లో చిమ్మెట వచ్చిందని మా వనజ రెండు రోజుల వరకు అన్నం కళ్ళ చూడలేదు......."
    ప్రభాకర్ పిడికిలి గ్రుద్దుతూ అన్నాడు.
    'అదేగా ప్రభుత్వం గోల పెడుతున్నది? అన్నం తగ్గించుకుని గోధుమలు వాడమని..... మీ వనజ మంచిపనే చేసింది--"
    "కడుపు మాడ్చుకుని పడుకోవటం మంచి పని కాదూ? .... ఇంతకీ హాస్టల్ సాంబారు లో చిమ్మెట వస్తే హోటల్ ఇడ్లీ లో తెలు రాకుండా ఉంటుందా చెప్పండి?" అంటూ నిలవేసింది ఉష.
    "వస్తే వచ్చింది లెద్దురూ... వెధవది సీలేసిన మందు సీసాలోనే చచ్చిన ఈగ వచ్చింది.... ఇడ్లీ ఏం ఎక్కువ? స్మశాన వైరాగ్యం లా కాస్సేపు విచారించి వూరుకోవాలే గాని శాశ్వతంగా హోటళ్ళ ను వెలివేస్తానంటే ఎలాగ? అదీగాక నా మాట నమ్మండి--- ఈ హోటల్ శుచీ శుభ్రానికి పేరు మోసింది...."
    ఉష నమ్మకం లేనట్టు ముఖం పెట్టింది.
    "ఎప్పుడన్నా మీరు-- కంపెనీ ఊరగాయలు చూశారా?"
    "చూడకేం? తిన్నాను కూడా.... వాటికేం?"
    "వూరగాయ సీసా మీద లేబులుంటుంది....చూశారూ? ఆ కంపెనీ శుచీ శుభ్రానికి గవర్నమెంటు సర్టిఫికేట్ ఇచ్చిందట. మా వనజ ఆవకాయ కొనుక్కుంటే ఆ సీసా మీద చూశాను.... అదిచూసి ఆ కంపెనీదే దోసె పౌడరు కొన్నాం. పేకెట్ విప్పితే అందులో పురుగులు లుకలుకలాడుతున్నాయి! అలా తీసుకెళ్ళి వీధిలో పారేశాను... శుచీ శుభ్రానికి పేరంటే జ్ఞాపకం వచ్చింది....."
    "అది కంపెనీ తప్పయి ఉండదు లెద్దురూ కొట్టువాడు ఏ ముక్కి పోయిన సరుకో మీకు అంటగట్టి ఉంటాడు.... ఇంతకీ ఈ హోటల్లో తేలు కాదు కదా కనీసం ఈగ కూడా రాదని నేను హామీ ఇస్తున్నాను. నా మాట నమ్మండి!"
    "సరే పదండి!' అంటూ తలాడించింది ఉష.
    'అమ్మయ్య! మిమ్మల్ని వప్పించేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది....." అంటూ నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు ప్రభాకర్.
    లోపలి కేల్తూ ఉష కాస్త ఆగింది. ప్రభాకర్ ఉషను తొందర చేస్తూ ఫామిలీ రూమ్ లోకి దారి తీశాడు. ఉష వెనకాతలే వెళ్ళింది.
    ప్రభాకర్ కు ఎదురుగ్గా ఉన్న సీట్లో కూర్చుంటూ "ఈ ప్రోప్రయిటర్ ఎంత మంచివాడండీ! స్వర్గస్థ ఫొటోలన్నీ ఫ్రేం కట్టించి పెట్టుకున్నాడు....." అంది ఉష.
    "ఏమిటి....?! ఆ పాస్ పోర్టు సైజు ఫోటోల సంగతేనా మీరనేది? ఇందాక కదలకుండా నిలబడి పోయారు అవి చూసేందుకెనా ఏమిటి?"
    "ఒక క్షణమైనా చూడనియ్యలేదు కాని కదలకుండా నిలబడి పోయినట్టు ఎందుకో లేనిపోని అపవాదు....? ప్రోప్రయిటర్ , సర్వర్లు ఇంత ఆపేక్షగా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు సుమండీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS