Previous Page Next Page 
పధ విహీన పేజి 9

                      
                                    6
    జగన్నాధం చిట్టి ఇంటికి వెళ్లేసరికి వాకిట్లో ఒక బండి ఆగి ఉన్నది. ఈ పరిస్థితిలో చిట్టి ఇంటికి వచ్చే అతిధి మహాశయ లెవరో అతనికి అర్ధం కాలేదు. బెరుకు బెరుగ్గా లోపలికి వెళ్ళిన జగననాధం ఇక అందమైన అమ్మాయీ మురళీ కూర్చుని ఉండటం, వాళ్ళిద్దరికీ ఎదురుగా మనసులో నుంచి పొంగి వస్తున్న వ్యధను దాచుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తున్న చిట్టినీ చూశాడు.
    అతన్ని చూసేసరికి చిట్టికి ప్రాణాలు లేచి వచ్చినాయి. అతి ఆప్యాయంగా ఆహ్వానించి ఆ అమ్మాయిని వీరవాసరం వాసంతి గా పరిచయం చేసింది. మురళీ కూడా పరమానంద పడిపోతూ -----
    "వాసంతి ఈ అమ్మాయినే నాకు చెయ్యాలని మా నాన్న ఉద్దేశ్యం. కాని చిట్టి ని ప్రేమించిన విషయం, పెళ్లి చేసుకోబోతున్న విషయం ఈ అమ్మాయికి చెప్పేశాను. చాలా ఆనందించి చిట్టి ని చూస్తానని అంటే........." ఇంతవరకూ చెప్పి చటుక్కున ఆగిపోయాడు మురళీ.
    ఆశ్చర్యంగా అతను చూస్తున్న వైపే చూశాడు జగన్నాధం. చిట్టి మొహం తెల్లగా పాలిపోయి ఉంది. గోడ మీద పడిపోతుందే మో అనిపిస్తున్నది. అది చూసిన మురళీ గాభరా పడుతూ ---
    "చిట్టీ నీకేమయింది" అని లేచి రెండడుగులు ముందుకు వేశాడు.
    ఆమె మొహంలో నెత్తురు లేదు. ఎందుకో విపరీతంగా భయపడుతున్నట్లుంది. అది చూసిన వాసంతి లేచి నిలబడి------
    "మురళీ, నీవోకసారి అలా పోయిరా. ఈలోగా ఆవిడతో కొంచెం మాట్లాడాలి" అన్నది. ఆ ఆజ్ఞకు తిరుగులేదు. ఆ కంఠం లో ధ్వనించిన అధికార ఔన్నత్యానికి జగన్నాధం కూడా చకితుడైనాడు. మురళీ మెదలకుండా బయటికి వెళ్ళిపొయినాడు.
    వాసంతి దగ్గరగా వెళ్లి చిట్టి చేతులను తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ చాలాసేపు ఒకరి వంక ఒకరు బెదురు చూపులు చూసుకుంటూ అలా ఉండిపొయినారు. చివరికి వాసంతే ఆ నిశ్శబ్దాన్ని విడగొట్టింది.
    "నువ్వు..మీరు.......మురళీ ని చాలా అధికంగా ఆరాధిస్తున్నారు కదూ?" అని బెదురుతూ, బెదురుతూ ప్రశ్నించింది.
    చిట్టి అప్పటికి తేరుకుని అవునని తల ఊపింది. జగన్నాధానికి ఇందంతా చాలా చిత్రంగా కనిపిస్తున్నది. ఈఅడవాళ్ళు , వీళ్ళ ప్రేమలు, అసూయలు, అన్నీ కూడా అర్ధ రహితంగా కనిపిస్తున్నాయి. మురళీ అమాయకుడే. మంచివాడే. అయినా కూడా చాపల్యం వలన డబుల్ గేమ్ ఆడుతున్నా డనిపించింది. చిట్టిని కాదనలేడు. ప్రేమించ కుండా ఉండలేడు. కాని వాసంతి తో అదంతా సోదర ప్రేమ అని అర్ధం వచ్చేట్టు మాట్లాడి ఉండవచ్చును. కాని ఈ ఇద్దరు స్త్రీలూ ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా స్వార్ధరహితంగా మాత్రం ప్రయత్నించ లేకపొతున్నారు. చిట్టితో ఉన్నప్పుడు వాసంతి నీ, వాసంతి తో ఉన్నప్పుడు చిట్టీ ని తలుచుకుంటాడు. అందులో అతను తెలిసి చేస్తున్నది ఏమీ లేకపోవచ్చును. వాసంతి డబ్బూ తెలివీ గల స్త్రీ. అవివాహిత.
    చిట్టి అలా కాదు. లేచి రావటం వలన సంఘ బహిష్కృత అయింది. తనమీద ఆధారపడిన స్త్రీ భార్య కాకపొతే మగవాడు క్షణం భరించలేడు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే తెలుసు కుంటున్నది చిట్టి.
    ఇదివరకు అనేక తడవలు వాసంతి ని సోదరి లా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మురళి. నిజం చెప్పాలంటే అతని మనసులో ఏ దోషమూ లేకపోవచ్చును. అయినా కూడా ఆ ఇద్దరు ఆడవాళ్ళూ అతని తెలివి తక్కువకు బలి అవుతున్నారనే అనిపిస్తున్నది. ఇద్దరూ ఒకసారి అవరు. ఒకరి తరువాత ఒకరు. కాని తను చేసిన తప్పేమిటో కూడా అర్ధం చేసుకోలేని అతి స్వచ్చమైన వాడు మురళీ. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.
    వాసంతి కొంచెం ధైర్యం తెచ్చుకుని సంభాషణ ప్రారంభించింది.
    "అయితే, మీరతన్ని అంతగా ఆరాధిస్తున్నప్పుడు అతని ఆనందం కోసం కొంత త్యాగం చెయ్యాలి."
    "ఏమిటా త్యాగం?"
    "అతన్ని మీతో పంచుకోవటం నావల్ల కాదు. అయినా ఒక ప్రశ్న. ఒక ప్రక్క మీనుంచి అతన్ని వేరుచేస్తూ అలా అడిగే హక్కు నాకు లేదు. లేదా మీతోనే అతను ఆనందంగా ఉంటాడని తోస్తే..... అది తేల్చుకుందాం."
    చిట్టి చిరునవ్వు నవ్వాలని ప్రయత్నిస్తూ---"అదంతా ఏనాడో నిర్ణయం అయిపొయింది వాసంతి గారూ" అన్నది. ఆ సంభాషణ అసహ్యంగా ఉంది ఆమెకు.
    ఆ విషయం మీదే సుదీర్ఘ చర్చ చెయ్యాలనే ఉద్దేశ్యం వాసంతి ది. చిట్టి జవాబుతో ఆ చర్చ అనవసరం అనిపించింది ఆమెకు. చిట్టి ఆమె వంక దీనంగా విషాదం గా చూస్తూ------
    "మీరతడిని అమితంగా ప్రేమిస్తున్నారు కదూ" అన్నది.
    వాసంతి తల ఊపి "మిమ్మల్ని మరో విషయం గా ఆడగా లను కుంటున్నాను, చిట్టి గారూ. మురళీ లో ఏ గుణాన్ని మీరు ఆరాధిస్తున్నారు?' అన్నది చీర కొంగు చేతికి మెలివేస్తూ.
    "నాకు అర్ధం కాలేదు ఆ విషయం. "చిట్టి గొంతుక లో విరక్తి విషాదం ధ్వనించాయి. అయినా వాసంతి వదలలేదు.
    అతను మేధావి అనుకుంటే మీరు భ్రమించారని చెప్పవచ్చును."
    "లేదు, మామూలుగానే అనుకున్నాను."
    "నాకూ అంతే చిట్టి గారూ. అతన్ని చూస్తె జాలిగా ఉంటుంది" అని నిట్టూర్చింది వాసంతి.
    చిట్టి కిటికీ నుంచి బయటికి చూస్తూ జవబియ్య లేదు. వాసంతి కూడా కళ్ళనీళ్ళు తుడుచు కుని--
    "మనిద్దరం ఒకరినొకరు ద్వేషించు కోవద్దు." అన్నది. చిట్టి చిరునవ్వు నవ్వి -- "బహుశా వచ్చే నెలలో మా పెళ్లి అని మీకు చెప్పి ఉంటాడు" అన్నది.
    "అవును. మీరు అతన్ని అనునయించడానికి అవునని ఉంటారు-- అదంతా అసంభవమని తెలిసీ కూడా."
    "నిజం."
    "నేనూ అదే అనుకున్నాను. ఒకటి మాత్రం చెప్పగలను. అతన్ని మీరెంత గాడంగా అరాదిస్తున్నారో నేనూ అంత గాడంగానే అరాదిస్తున్నాను. కొద్ది రోజుల్లోనే మాకు పెళ్లి అవుతుంది. ఆ క్షణం దాకా మిమ్మల్నే పెళ్లి చేసుకుందామనే తన నిర్ణయాన్ని అనుక్షణం జ్ఞాపకం తెచ్చుకుంటూ సంతృప్తి పడతాడు. పోనీ, మీరు మీ ఇంటికి వెళ్ళరాదూ?' చిట్టి జవాబివ్వకుండా నిట్టూర్చి "నువ్వయినా సుఖంగా ఉంటె అంతే చాలు సోదరీ" అన్నది.
    ఆ మాట పూర్తి కాకమునుపే మురళీ లోపలికి వచ్చాడు. చిట్టి రెండు కళ్ళు నీళ్ళతో నిండి ఉండటం కనిపించింది అతనికి.
    "చిట్టీ, ఎందుకు విచారం? రేపు వీరవాసరం వెడుతున్నా ననేనా? ఇంత మాత్రానికే? పది హేనురోజుల్లో రానూ?' అన్నాడు అనునయిస్తూ.
    "మరే....అప్పుడొచ్చి పెళ్లి చేసుకుంటావు "-- వ్యంగ్యంగా అంది వాసంతి. మురళీ నీళ్ళు కారకుండా ఉండటానికే ఈ వాక్యాలు.
    "మరే నిన్ను వదిలి అట్టే రోజులు ఉండలేను, చిట్టి, నువ్వు లేకపోతె నాకు బ్రతుకే శూన్యం. మురళీ మనసులో చిట్టి కి అంత విలువ" అన్నాడు. ఆ మాటలకు చిట్టి వాసంతి కూడా బాధపడ్డారు. కొంచెం సేపట్లోనే వెళ్ళిపోయారు వాసంతీ, మురళీ.
    చిట్టి చాలా శూన్యంగా ఉంది. జగన్నాధం అక్కడే ఉన్నాడన్న సంగతి కూడా ఆమె మరిచిపోయింది.
    చిట్టీ" అన్నాడు జగన్నాధం.
    'అంతా అంతరించి పోయింది జగ్గూ" అన్నది. ఆ మాటలో వ్యధకు అవధులు లేవు.
    "మా ప్రేమ అంతరించి పోయింది. యిహ మిగతా బ్రతుకు........." రెండు చేతులలో మొగం దాచుకుని బారువుమంది చిట్టి.
    "మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో చిట్టీ" అన్నాడు జగన్నాధం అంతకంటే ఏమనాలో తెలియక.
    "నన్ను మాట్లాడనియ్యి జగ్గూ. లేకపోతె గుండె పగిలి పోతుంది" అని వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడటం ప్రారంభించింది చిట్టి. జగన్నాధం స్తబ్ధుడై వింటూ ఉండిపొయినాడు. చిట్టి దుఃఖం అలలు అలలుగా పొంగి వస్తున్నది. ఆమె అంతర్యం లోని వేదన చాచిన అగ్ని నాలుకలలా వెలికి వస్తున్నది. జగన్నాధం అనిమేషుడై దుఖిత అయిన ఆ స్త్రీ మూర్తిని అలాగే చూస్తూ ఉండిపొయినాడు. కొంచెం సేపయినాక చిట్టి తనను తనే ఓదార్చు కుని------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS